చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి

చీటీల స్వామి-అవధూత -శ్రీ  వెంకయ్య  స్వామి  -1

ఆయన చీటీ రాస్తే దానిప్రకారం పని అవ్వాల్సిందే .ఆయన నోట మాట రాలితే యదా ప్రకారం జరిగి తీర వలసిందే .ఆయన సమాధి చెందినా భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటానన్నమాట నిలబెట్టుకొన్న అతి సాధారణ జీవితం గడిపి ,షిర్డీ సాయి బాబాకు ఆప్తులైన అవధూత శ్రీ వెంకయ్య  స్వామి .ఆ మహాత్ముడు చూపిన అద్భుతాలు లెక్కలేనన్ని .ఆయన జీవితాన్ని పరిచయం చేసి తరించటమే నేను చేస్తున్న పని .avadhuta sri venasvami 002

వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరు లో జన్మించారు .తండ్రి సోంపల్లి పెంచలయ్య .తల్లి పిచ్చమ్మ .ధాత నామ సంవత్సరం వచ్చిన కరువు నాటికి ఆయనకు పదమూడు ఏళ్ళు .అంతకంటే పకడ్బందీ పుట్టిన తేదీ ఎవరికీ తెలియదు .చిన్నప్పుడు అందరిలాగే రాత్రిపూట బడిలో చదివారు .అన్నిపనులూ చేసేవాడు .కట్టెలు కొట్టి ఎడ్ల బండీమీద వేసుకొని  నెల్లూరు వెళ్లి అమ్ముకొని వచ్చేవాడు .ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవాడు .ఏపని అయినా కస్టపడి చేసి అందరినీ మెప్పించేవాడు .దుక్కి దున్నితే మాహా మహా మొనగాడు రైతులే ముక్కున వేలేసుకోనేవారట ఆశ్చర్యం తో .నాగటి చాలులో ఒక వైపు కోడి గుడ్డు పెట్టి ,రెండో వైపు నుంచి చూస్తె కనిపించేంత నైపుణ్యం తో చాళ్ళు వేసేవాడట .ఒక్కడే ఇద్దరు మనుషుల పనులు చేసేవాడు .కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలిపడి చేతనయినంత సాయం చేసేవాడు, చేయించేవాడు .చెల్లెలు పేరు పెట్టి పిలుస్తుంటే ‘’అన్నయ్యా ‘’అని పిలువు అని సౌమ్యంగా చెప్పిన సంస్కారి .అబద్ధం ఆడటం నచ్చేదికాదు .

ఇరవై వ ఏడు రాగానే స్వామి కి అనుకోకుండా వారం రోజులు జ్వరం వచ్చి మంచం మీదనుంచి లేవ లేకపోయాడు .ఒకరోజు తమ ఇల్లు వేలం వెయ బోతున్నారు అనే మాట ఆయన నోటి నుండి వచ్చింది .తగ్గిన తర్వాత ‘’చాకలి యోగం ‘’మంగలి యోగం ‘’,జక్కల యోగం ‘’అని అరుస్తూ ఊరంతా తిరిగేవాడు .పిచ్చిపట్టిందని ఇంట్లో కట్టి పడేశారు .అన్నం నీళ్ళు ముట్టుకోలేదు .చేసేది లేక వదిలేశారు .’’పిచ్చి వెంకయ్య ‘’అని ఊళ్ళో జనం పిలిచేవారు .ఒక రోజు పాము కాలిపై కాటేసింది .పడగా విప్పి ఆడింది .కానీ విషం ఎక్కలేదు .మామూలుగా నే తిరిగాడు .దీన్ని వింతగా చెప్పుకొన్నారు .మూడు నెలలు పెంచల కోన లో గడిపి నాగుల వెల్లటూరు చేరుకొన్నాడు .ఇంటికి మళ్ళీ వెళ్ళకుండా దొడ్లలో ,చేలల్లో తిరుగుతూ ఎవరు ఏది పెడితే అది తింటూ పిచ్చా ఫకీర్ లా గడిపాడు .చెల్లెలు మంగమ్మ ఇంట అన్నం తింటూ ఆ ప్రాంతం లో చాలాకాలం తిరిగాడు .ఎవరి జోలికీ  వెళ్లేవాడుకాడు .చెయ్యి చాపి ,ఏదైనా పడేస్తే తినేవాడు .

స్నేహితులు అతనిలో మహత్తులు గమనించారు .చెల్లెలు మంగమ్మ కొడుకు జ్వరం తో బాధ పడుతుంటే ఏడుస్తుంటే వాడిని చేతితో తాకగానే నాల్గవ రోజు జ్వరం తగ్గి పోయింది .పిచ్చి వెంకయ్య క్రమం గా ‘’ వెంకయ్య  స్వామి ‘’అయ్యాడు .పెంచల కొనలో ఉన్నప్పుడు ఒక సాధువు నాలుక పై ఏదో మంత్రం రాశాడని ,ఆయన షిర్డీ సాయి నాధుడే నని అందరి నమ్మకం .దీనితో వెంకయ్య హృదయం లో జ్ఞాన జ్యోతి వెలిగింది .ఇంకో కధనం ప్రకారం పెంచల కోన లో తిరుతున్నప్పుడు ఒక జంగం దేవర వచ్చి మనో వేగం తో  ఒక దేవాలయం దగ్గర బిలం లోకి తీసుకు వెళ్ళాడని అక్కడ తపస్సు చేసుకొంటున్న నూట ఒక్క మంది మహాను భావు లను  దర్శించాడని,వారిని మూడు రోజులు సేవిన్చాడని ,నాల్గవ రోజు స్పృహ వచ్చేసరికి మద్రాస్ హై కోర్ట్ మెట్ల మీద ఉన్నాడని తెలుస్తోంది .దేశ సంచారం చేస్తూ దుత్తలూరు ,నర్రవాడ గ్రామాలు తిరిగాడు .ఆయన సమాధి చెందేముందు ‘’సంపన్నత్వం ‘’,సాధారణత్వం ‘’,సద్గురు సేవ ‘’అని కేకలేశారట .అంటే ఇది వీరి సంప్రదాయం అన్నమాట .మానవాళికి స్వామి ఇచ్చిన చివరి సందేశం ఇదే .ఇందులోని అంతరార్ధాన్ని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు వెంకాస్వామి జీవితం పై రాసిన చరిత్రలో చక్కగా వివరించారు .మొదట దైవీ సంపద సాధించాలి .ఇదే సంపన్నత్వం .దైవీ సంపద అంటే నిర్భయం ,సాత్విక చిత్త శుద్ధి ,జ్ఞాన యోగం లో స్తిరత్వం ,దానం ,ఇంద్రియ నిగ్రహం ,నిష్కామ యజ్ఞం ,ఆత్మ విచారం ,గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాల మననం ,తపస్సు ,రుజుత్వం ,అహింస ,సత్యం ,క్రోధం లేక పోవటం ,త్యాగం ,శాంతి ,సర్వ భూత దయ ,ఇంద్రియ వ్యామోహం లేక పోవటం ధర్మ విరుద్ధమైన పనుల పై ఏవగింపు ,చాంచల్యం లేక పోవటం ,బ్రహ్మ తేజస్సు ,ద్వంద్వాలను సమానం గా చూడటం ,ధైర్యం ,శుచి, ద్రోహ, గర్వాలు లేకపోవటం, వలన  రజో తమోగుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది .ఈ విషయాలన్న్నీ భగవద్ గీత లో పరమాత్మ చెప్పాడు .

స్వామి చెప్పిన రెండవది ‘’సాధారణత్వం ‘’.దైవీ సంపద పొందిన తర్వాత సంపన్నత్వం పొంది అది నిజ జీవితం లో సాధారణం అవ్వాలి .గురూప దేశాన్ని నిరంతరం మననం చేయాలి .ఈ రెండు సద్గురు సేవ వలననే సాధ్యం .షిర్డీ  బాబా కూడా ‘’మహా రాజై  కూడా పేద వాడిగా జీవించిన వాడే గొప్ప వాడు ‘’అన్నాడు.అదే వెంకయ్య స్వామి చెప్పింది కూడా అలానే ఇద్దరూ జీవించారు .ఏదైనా బోధించమని శిష్యులు కోరితే ‘’బోధించటానికి ఏముందయ్యా అంతా చూసి నేర్చుకోవటమే ‘’అనేవాడు .వెంకయ్య స్వామికి గురువు ఒకసాధన మార్గాన్ని ఉపదేశించినట్లు దానిని ఆయన ఏకాంతం లో సాధన చేసినట్లు తెలుస్తోంది .’’మీ గురువు ఎవరు “?అనిఅడిగితే ‘’గురువు ఎందుకయ్యా నా నెత్తిన ?’’అన్నాడు .

అవధూత చర్యలు

ఎందరో మహాత్ములుంటారు వారిలో అవధూతలు ఉన్నత స్తితికి చెందిన వారు. నాశనం లేకపోవటం (అక్షరరత్వం )మహోన్నత స్తితి (వరేన్యత్వం),కొంచెమైనా పాపం లేకపోవటం (ధూత కల్మషత్వం ) బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండటం అవధూత లక్షణాలు .వీరు పసిపిల్లల్లా ,పిచ్చి వారుగా ,పిశాచ గ్రస్తుల్లా ఉంటారు అని అది శంకరులు చెప్పారు .అవధూత సంప్రదాయానికి ఆదిపురుషుడు దత్తాత్రేయుడు .ఆత్మ జ్ఞానమే ఆయన . అలాంటి అవధూత లక్షణాలున్న వారు వెంకయ్య స్వామి అవధూత .తల్లి స్వామి కోసం ఏదైనా ఆప్యాయం గా చేసి తీసుకొని వస్తే అక్కడ ఉన్న వారికందరికీ పెట్టించి తానూ తీసుకొని అందులో కొంత చీమలకు వేసి కొద్దిగా మాత్రమె తీసుకో నే వారు .ఒక రోజు ఉన్మాద స్తితిలో తిరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి రెండు రోజులు జైల్లో పెట్టారు .విడుదలైన తర్వాత రాజ పద్మాపురం లో ఉన్న చెల్లెలి దగ్గరకు వెళ్లి ,విషయం చెప్పి ఎడ్చేశారట .ఆమె అన్నను బంధించిన వారిని తీసుకొచ్చి కొట్టిస్టాలే అనగానే పసిపిల్లాడిలాగా హాయిగా నవ్వాడట.తల్లి చనిపోతే ‘’అమ్మ ఉండ్లా?చావలేదు ‘’అన్నారు .అన్న చనిపోయినా చావలేదని మళ్ళీ వస్తాడని నర్మ గర్భం గా చెప్పారు .

బద్వేలు వద్ద పెన్నా నదికి ఇసుక బస్తాలు మోసి కట్ట కట్టేవారు .ఒకరోజు ముదిగేడు లో ఒకఇల్లాలిని తానూ పచ్చోడినని ఇంతముద్దపెట్టమని అడిగాడు .నంచుకోటానికి ,పచ్చడి పైన నెయ్యి (ధార)వేయమని అడిగాడు .ఆమె కోపగించి లేదని అబద్దమాడితే దుత్త లో ఉంది వెయ్యమన్నాడు .ఆమె కసురుకోగానే అది తెగి కిందపడి నెయ్యి అంతాఒలికి పోయింది .కచేరి దేవరాయపల్లిలో వేణు గోపాల స్వామి ఆలయ సంకు స్థాపనకు చల్లా సుబ్బమ్మ అనే ఆవిడ జ్వరం తో వెళ్ళింది .దారిలో పుట్ట గోచీ పెట్టుకొని ఒళ్ళంతా మసి పూసుకొని పిచ్చివాడిలా ఉన్న వెంకయ్య స్వామి విభూతి చేతిలో పెట్టి నోట్లోవేసుకొని మెడకు బొడ్డుకు పూసుకోమని చెప్పాడు .అలా చేయగానే ఆమె జ్వరం మాయమైంది .ఆయన్ను ఎవరు నువ్వు అని అడిగితె తానూ అడవుల్లో ఉంటానని ఒళ్లోకి రానని వేణుగోపాల స్వామి జాబు రాస్తే  వచ్చానని చెప్పాడు.కావాలంటే కోటి తీర్ధం దేవాలయం లో శుక్రవారం వస్తే కనిపిస్తానని చెప్పాడు .ఆమె అలానే వెళ్ళింది .ఆ నాటి రాత్రి పార్వతీ దేవి కలలో కనిపించి అభయమిచ్చింది . అదిమొదలు మూడు నెలలు స్వామిని సేవించి ఆయన తో పాటు పెన్నానదికి ఇసుక కట్టలు  వేసే కూలీలకు భోజనాలు పెట్టేది .భక్తులిచ్చేకానుకలన్నీ స్వామి కూలి వారికిచ్చేసే వాడు .ఒక రోజు సుబ్బమ్మ తన దగ్గర బంగారం చాలా ఉంది .దానికి భద్రత లేదని చెప్పింది .దానికి స్వామి ‘’అమ్మా !దొంగలు రారు .వస్తే పోరు ‘అని ధైర్యం చెప్పారు ఆమె అక్కడే ధైర్యం గా పడుకొన్నది .అర్ధ రాత్రి మెలకువ వచ్చి చూస్తె వెంకయ్య స్వామి నిలు వెత్తు  మంటల్లో ఉన్నారు. దొంగలు కొట్టి మంటల్లో పడేశారని గ్రహించింది .భయ పడి దేవాలయం లో దాక్కోన్నది .స్వామి దగ్గరకు వచ్చి కాస్త పొగాకు పెట్టమని అడిగాడు .ఆమె ఆశ్చర్య పోయింది .ఇందాక  చూసిన మంటలూ స్వామి విషయం ఏమిటో అర్ధం కాలేదు .తనకేమీ కానట్లు స్వామి కనిపించారు .

తరచుగా స్వామి సోమశిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె లో నూనె దీపం వెలుగులో రాత్రి అంతా తంబూరా మీటుకుంటూ ఉండేవారు .ఒక రోజు సాయంకాలం సేవకుడు చలమయ్యను మరొఇద్దరికి భోజనం తీసుకొని రమ్మని చెప్పారు .ఆ రాత్రి ఇద్దరు భక్తులు దారితప్పి స్వామి దర్శనానికి వచ్చారు. వారికోసమే అ భోజనాలు తెప్పించారు .ముందే వారు వస్తారని గ్రహించారన్నమాట .నూతన వస్త్రాలు ఎవరైనా ఇస్తే తీసుకొనే వారు కాదు .పాతబతట్ట లిస్తేనే గ్రహించేవారు .ఒక ఆసామి కొత్త ఖరీదైన దుప్పటి ఇస్తే దాన్ని పీలికలుగా చింపి అవి ఎవరికైనా ఇస్తే జబ్బులు నయమవుతాయని చెప్పేవారు . తెలియ కుండా ఒకాయన  డబ్బు బాగ్ పెట్టి వెళ్ళిపోతే దాన్ని ధునిలో వేసి కాల్చిపారేశారు .భక్తీ శ్రద్ధలతో ఎవరైనా అడిగితె జవాబు చెప్పేవారు డబ్బు ఇస్తానంటే చెప్పేవాడు కాదు ..పండుగ రోజు కూడా భిక్షాన్నమే తినేవారు .అలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితె ఇవాళ ఎవరో పెట్టారని వెళ్ళక పొతే మర్నాడు భిక్షకు వెళ్ళినా ఎవరూ పెట్టరు అని చెప్పేవారు .

దీనికి ఆధారం –ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ రచించిన ‘’నేను దర్శించిన మహాత్ములు -4.’’

సశేషం

మీ- గబ్బిట డుర్గా ప్రసాద్-4-10-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.