గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

గీర్వణకవుల కవితా గీర్వాణం -23

21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

కేరళ రాజు  కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు  .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం లో జన్మించాడు .శ్రీహరి యొక్క కౌస్తుభాంశ లో జన్మించాడు .రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి సంపదలను ,వినోదాలను విసర్జించాడు .తమిళదేశం లోని పన్నెండుమంది అఝావర మునులలో ఏడవ వానిగా  భావిస్తారు .ఈ పన్నెండు మంది మునులు రాసిన మహా గ్రంధాన్ని ‘’నాలాయిర దివ్య ప్రబంధం ‘’అంటారు .నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలను దివ్య దేశం అంటారు .ముకుందమాల అనే స్తోత్ర గీతాలను సంస్కృతం లో రాశాడు కుల శేఖరుడు .భక్తీ జ్ఞానానికి పరాకాష్టగా నిలిచే పుస్తకం ఇది .తమిళం లో ‘’పెరుమాళ్ తిరుమోఘి ‘’రాశాడు .ఇది దివ్యప్రబంధం లో ఒక భాగం .సంస్కృతంలో కులశేఖరుడు ‘’తపతి సంవర్ణం ‘’,సుభద్రా ధననంజయం,’’విచ్చిన్నాభి షేకం ‘’రాశాడని తెలుస్తోంది .వైష్ణవ క్షేత్రాలలో ముకున్దమాలను సామూహికం గా గానం చేస్తారు .

కులశేఖరుడు కేరళలోని పెరియార్ లో అన్మించాడు .తండ్రి దృఢ వర్మ.ఆయన క్రీ .పూ 3102కలి యుగం ప్రారంభ మైన 27వ సంవత్సరం లో అవతరించాడని నమ్మకం .కనుక ఆయన జన్మించినది క్రీ పూ.3075అవుతుంది .కులశేఖరుడు కేరళ రాజు .కొల్లి ,ఊదార్ ,కొంగు అనే ప్రాంతాలను పాలించాడు వీటినే ఇప్పుడు ఉదైయూర్ మదురై ,ట్రావెంకూర్ అంటున్నారు .ఆధునిక చరిత్రకారులు ఆయన చేరరాజు అని కాలం క్రీ శ .800-820అంటున్నారు దీనినతో ఎవరూ ఏకీభవించటం లేదు .వైష్ణవ సంప్రదాయాన్ని పటిష్టం గా పాటించిన వేదాంత దేశిక మహా రాజు .దక్షిణ భారతం లో భక్తీ ఉద్యమ సారధిగా కీర్తిపొందాడు .సామాన్య ప్రజలకు భక్తిని అందించి తరిమ్పజేసిన పుణ్యాత్ముడు కుల శేఖరుడు .

కవితా గీర్వాణం

ఆళ్వార్ర్ దివ్య ప్రబంధం లో నాలుగు వేల శ్లోకాలు ఉంటె అందులో కులషేఖరునివి నూట అయిదున్నాయి .శ్రీరామ శ్రీకృష్ణుల పై చ సంస్కృతం లో చెప్పిన ముకుందమాల నలభై  శ్లోకాల రస గుళికలు కలిగిఉన్నది .అద్వైత మతస్తాపకుడు ఆది శంకరాచార్యులు కులశేఖరులకు సమకాలికులు. ఆయనకంటే చిన్న వారు .కులశేఖరులు మహా శ్రీరామ భక్తులు , రాముడు అనుభవించిన కష్టాలన్నీ తనకు ఆపాదిన్చుకొన్నాడు . ఆయన్నుఅందుకే  ‘’పెరుమాళ్ ‘’అంటారు .అంటే గొప్పవాడు అని అర్ధం .పెరుమాళ్ అనే పేరు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉందన్న సంగతిమనకు తెలుసు .విష్ణు భక్తులను సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపం గా భావించి పూజించేవాడు కులశేఖరాల్వార్ .రామ ,కృష్ణ చరిత్రలను స్మరించుకొని తన్మయత్వం తో ఇద్దరినీ ఒకే శ్లోకం లో వర్ణించాడు .శ్రీ కృష్ణుని తల్లి దేవకిగా తనను భావించుకొని రచన చేశాడు కొన్ని శ్లోకాలలో .కుమారుడు కృష్ణుడు తనను వదిలి వ్రేపల్లెలో నంద యశోదల వద్ద పెరగటాన్ని దేవకీ భరించలేకపోయినట్లు ,ఎప్పుడు తన బాల కృష్ణుడు తన ముందు వచ్చి వాలుతాడా అని ఎదురు చూస్తున్నట్లూ రాశాడు .

శ్రీరంగం లో ఉండి శ్రీ రంగ నాద స్వామిని సేవించే వాడు కుల శేఖరుడు .శ్రీ వెంకటేశ్వరుడిని ఆయన ద్వారం వద్ద గడప గా పడి ఉండే భాగ్యాన్ని కలిగించమని వేడుకోన్నాడట .తధాస్తు అని వరమిచ్చాడు బాలాజీ .అందుకే తిరుమలలో గర్భ గుడి ద్వారానికి ఉన్న గడపను ‘’కులశేఖర పడి’’అంటారు .కుల శేఖరుడు రాసిన ‘’తిరు మొఘి ‘’లో ‘’గోవింద రాజ శ్రీపాద పద్మాలను తప్ప మరిదేనిని రాచరికం గా భావించను .’’అని చెప్పుకొన్న పరమ భక్తా గ్రేసరుడు .ఆయన ‘’గడప ప్రార్ధన’’ చూద్దాం –‘’శేదియాయ సేల్వినైగల్ ,తీర్కుం తిరుమాలే –నేదియానే వేంగడవా నిన్ కోయిల్ వాశేల్

అడియారుం వారరువం అరంబై యెరుం కిడందు ఇంగల్ –ప్పడియాయ్ కిడందు ఉన్ పవళ వాయ్ కాన్ బెనే’’  ‘’ అంటే ‘’వేంకటేశా !అనాదిగా ఆర్జించిన పాపాలను తొలగించేవాడివై ,తిరుమల లో వేంచేసి ఉండే నీ భక్తులు, దేవతలు కలిసి సంచరించేట్లు నీ దివ్య సన్నిధి వాకిలి లో అందరూ కాలితో తొక్కే గడప గా పడిఉండి,పగడం లాగా ఉండే నీ కిందిపెదవిని ఎప్పుడూ సేవించే భాగ్యాన్ని ప్రసాదించు ‘’.కులశేఖరుడు ప్రతి రోజు రామాయణాన్ని వింటూ ప్రవచనం చేస్తూ తన్మయత్వం చెంది భక్తులను తన్మయులను చేసేవాడు .

కులశేఖరుని ముకుందమాలలో మొదటి శ్లోకం –ఘుష్యతే యత్ర నగరే రంగ యాత్రా దినే దినే తమహం వందే రాజానం కుల శేఖరం ‘’అని చెప్పుకొన్నాడు .పరమాత్మను గురించి చెబుతూ ‘’హరి సరస్సవి గాహ్య ఆపీయ తేజో జలౌఘం –భవ మరు పరిఖిన్నః ఖేదమద్యచ్చజామి ‘’’భావం –‘’హరి అనే దివ్య సరస్సు సంసార తాపాన్ని తొలగిస్తుంది .తాపం తగ్గించుకోవటానికి మనమే అందులో మునగాలి. వీరు వారు అనే భేదం అక్కర్లేదు .ఉన్నది అదొక్కటే సరస్సు .మునిగి పాప ప్రక్షాళనం చేసుకోవాలి .’’నాలుకా !ఇది వరకు ఎన్నో రుచులు చూశావు .ఇప్పుడు శ్రీకృష్ణ నామ రుచి చూడు .దానికి మించిన మాధుర్యం ఉండదు .నువ్వు నన్ను అడగాల్సినది పోయి నేనే నిన్ను అడగాల్సి వస్తోందం’’టారు ‘’మరో శ్లోకం లో .

విష్ణు భక్తులపై కులశేఖర మహారాజుకున్న విశ్వాసాన్ని తెలియ జెప్పే కద ఒకటి ఉంది .విష్ణువును ,విష్ణు భక్తులను సేవించటం కులశేఖరులకు నిత్య విధి .వారికి అందుబాటులో అన్నీ ఉంచేవాడు .ఒకసారి విష్ణు భక్తులు అంతఃపురానికి వస్తారు .వారిని సేవించేందుకు కులశేఖరుడు వచ్చాడు .ఈ విష్ణు భక్తుల బాధ తప్పించాలని అనుకోని కాపలా అధికారులు అక్కడ పెట్టిఉన్న విలువైన ఆభరణాలను తీసి దాచేసి రాజుకు వైష్ణవ భక్తులే కాజేశారని ఫిర్యాదు చేస్తారు .ఆయనకు భక్తులపై అచంచలవిశ్వాసం, నమ్మకం ఉన్నాయి వారీపని చెసిఉండరని  భావించాడు .ఏమైనా నిజం తేల్చాలికనుక ఒక గంగాళం తెప్పించి అందులో కాల నాగుల్ని వేయించి దానిలో తన ఉంగరాన్ని జార విడుస్తాడు .అందులో పడేసిన తన ఉంగరాన్ని చేతులు పెట్టి తీసీవ్వమని తన పర్య వేక్షకులను ఆదేశిస్తాడు .వాళ్ళు భయపడి చేయిపెట్టలేదు .అప్పుడు రాజు విష్ణు భక్తులకు విష్ణువుపై భక్తీ విశ్వాసాలుంటే విష జంతువు లు కూడా ఏమీ చేయలేవని హరినామం చేస్తూ తానే మిన్నాగుల మధ్య  చెయ్యిపెట్టి తన ఉంగరాన్ని తీస్తాడు .అధికారుల మొహాలు మాడి నిజం చెప్పేస్తారు .తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకొన్నారు. అదీ కుల శేఖరాల్వారులకు విష్ణు భక్తీ , భక్తులపై ఉన్న నమ్మకం .

ముకుందమాలలోని మరిన్ని భక్తీ స్తోత్రాలు చూద్దాం –

‘’జయతు జయతు దేవో దేవకీ నందనోయం –జయతు  జయతు కృష్ణో వృష్ణి వంశః ప్రదీపః

జయతు జయతు  మేఘశ్యామో కొమలాన్గః –జయతు జయతు పృధ్వీ భారనాశో ముకున్దః ‘’

‘’కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతమ్-అద్వైవ మే విశతు మానస రాజ హంసః

ప్రాణ ప్రయాణ సమయే కఫా వాత పిత్తౌ-కంఠావ రోదన విధౌ స్మరణం కుతస్తే ‘’

‘’హే గోపాలక హే కృపాజలనిదే హే సింధు కన్యాపతే –హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ

హే రామానుజ హే జగత్రయ గురో హే పున్దరీక్ష మాం –హే గోపీ జననాధ పాలయ పరం జానామి నత్వాం వినా ‘’-

‘’నమామి నారాయణ పాద పంకజం –కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం –స్మరామి నారాయణ తత్వ మవ్యయం ‘’

‘’యస్య ప్రియౌ శ్రతి ధరౌ కవిలోక వీరౌ –మిత్రే ద్విజన్మ పదపద్మ శరావ భూతాం

తేనామ్బుజాక్ష చరణాంబుజ ష ట్ పదేన  -రాజ్నాకృతా కృతి రియం కుల శేఖరేణ’’

మరోకవి పరిచయం లో కలుద్దాం

Kulasekhara Alwar.png

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.