గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26
24- యమక చక్ర వర్తి -ఘటకర్పకుడు (పగిలిన కుండ)
విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానం లోని నవ రత్న కవులలో ఘట కర్పకుడు ఒకడు .కాళిదాస మహాకవి సమకాలికుడు .నీళ్ళు మోసే కులం లో పుట్టాడు కనుక ఘట కర్పకుడు అని పిలువ బడ్డాడు .కనుక క్రీ పూ .ఒకటవ శతాబ్దికి చెందిన వాడుగా అనుకోవచ్చు .భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారమూ ఉంది .భాసుడు కూడా నీళ్ళు మోసే వాడు కనుక అతన్ని పరిహాసం చేయటానికి ఘటకర్పకుడు అని పిలిచేవారనే మాట వాడుకలో ఉందికాని ఇది సమ్మతం కాదు .ఇద్దరూ వేరువేరు .భాసుడులాగా శూద్రకులం లో జన్మించాడని భావిస్తారు .ఈ పేరు రావటానికి ఆయనే తన కావ్యం లో కారణం చెప్పుకొన్నాడు .
‘’ఆలంబ్య చాంబు త్రుషితః కరకశ పేయం –భావాను రక్త వనితా సురతైః శపేయం
జీయేయ యేన కవినా యమకైః పరేన –తస్మై వహేయముదకం ఘట కర్పరేణ ‘’ అంటే ‘’ఎవరు యమకాన్ని ప్రయోగించటం లో నన్ను మించిపోతారో వారికి ఘట కర్పరం తో-పగిలిన కుండ తో నీళ్ళు మోస్తాను ‘’అని చాలెంజి చేసిన యమక చక్రవర్తి ఘటుడు .ఇతనికి కాళిదాసు తో స్పర్ధ ఉన్నదట .కుమార సంభవం లో కాళిదాసు ‘’ఏకోహి దోషో గుణ సన్నిపాతేనిమజ్జ తోందోః కిరణే ష్వివాన్కః ‘’అన్న శ్లోకం లోని అనౌచిత్యాన్ని ఎత్తి చూపాడు కర్పకుడు .యమకాన్ని కాళిదాసు తక్కువగా వాడితే కర్పకుడు యమకం తో కావ్యాన్నే రాసిపారేశాడు .కాళిదాస మేఘ సందేశం లో యక్షుడు భార్యకు మేఘం ద్వారా సందేశం పంపిస్తే కర్పకుడు భార్య భర్తకు మేఘ సందేశం పంపుతుంది.భర్త ఆమెను ఎప్పుడూ వర్షాకాలం లో వంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు అందుకే ఈ సందేశం . అదీ ముఖ్యమైన తేడా .రెండు కావ్యాలు వర్ష రుతువులోనే ఆరంభమౌతాయి .యక్షుడి విరహం ఎదాడిది అయితే కర్పర కావ్య నాయిక విరహం మూడే నెలలు .మేఘం ఎలా ప్రయాణం చేయాలో యక్షుడి చేత కాళిదాసు చెప్పిస్తాడు. కాని కర్పరకావ్యం లో భార్య రూట్ మాప్ ఇవ్వలేదు .
ఘట కర్పరుని కవితా గీర్వాణం
ఘట కర్పరకుని కావ్యం లో లభించినవి కేవలం 23 శ్లోకాలే .అందులో ఇరవై రెండవ శ్లోకం ప్రక్షిప్తం అని తేల్చారు .దీనికి అభినవ గుప్తుడు వ్యాఖ్య రాయలేదు .దివాకరుడు ఇరవైకి మాత్రమె వ్యాఖ్యానం చేశాడు .కనుక ఇరవై ఒక్క శ్లోకాల యమక కావ్యం ‘’యమహా కావ్యం’’ .ఇది సందేశ కావ్యాలలో మొదటిది అని విమర్శకాభిప్రాయం .అంటే మేఘ సందేశం కంటే ముందుది అని అనుకోవాలి .ఈ కావ్యానికి పేరు కూడా లేదు .అందరూ ‘’ఘట కర్పర కావ్యం ‘’అనే పిలుస్తున్నారు .మొట్టమొదటి సారిగా జర్మనీ దేశం లో ‘’దుర్సే ‘’అనే ఆయన సంపాదకత్వం లో 1828లో ప్రచురింప బడింది .అంతకు ముందు ఏ భారతీయ రచయితా ,కవి ,ముద్రాపకుల ద్రుష్టి దీనిపై పడక పోవటం దురదృష్టం .1959లో డా.జతీంద్ర విమల్ చౌదరి ఆధ్వర్యం లో వ్యాఖ్యానం తో కలకత్తా నుంచి ‘’సంస్కృత రూప సంగ్రహ ‘’సిరీస్ లో ప్రచురితమైంది .సంస్కృతం లో ఘట కర్పర కావ్యానికి వ్యాఖ్యానాలు రాసిన ప్రముఖులలో అభినవ గుప్తుడు ,భారత మల్లికా ,శంకర ,తారా చంద్ర ,గోవర్ధన ,రంనాపతి మిశ్ర ,దివాకర వైద్యనాదాదులున్నారు .అభినవ గుప్తుడు దీన్ని కాళిదాస కావ్యం గా భావించాడు .వృత్తిక అనే పేరుతొ వ్యాఖ్యానం రాశాడు .’’’poem of the broken jug ‘’‘’అని ఇంగ్లీష్ లోఘటకర్పర కావ్యాన్ని పిలుస్తారు .
ఘటకర్పకుడు యమక చక్ర వర్తి అన్నాంకదా. యమకం మహా యమహాగా సుందరం గా చెవులకు ఇంపుగా హృదయోల్లాసం గా ఉంటుంది .సహజ సుందరమైన యమకాలను ప్రయోగించాడు కర్పక కవి .అప్రయత్నం గా మహా ఆశువుగా యమకం కర్పకునిలో ఊరి కర్పూర సువాసనలనీను తుంది .అది అతని ప్రత్యేకత .మచ్చుకి ఒకటి
‘’మేఘావృతం నిశి న భాతి నభో వితారం –నిద్రాభ్యుపైతి చ హరిం సుఖ సేవితారం
సేంద్రాయుధశ్చజలదోద్యర సన్నీ భానాం –సంరంభ మావహతి భూధర సన్నిభానాం ‘’’’
ఈకావ్యం లో అయిదు రకాల ఛందస్సులను వాడాడు .కాళిదాసు మేఘ సందేశం అంత ప్రచారం దీనికి రాకపోయినా తర్వాత కవులపై ప్రభావం చూపింది .మదనుడు అనేకవి ఆకర్షితుడై తనకృష్ణ లీల కావ్యం లో కర్పరకుని ఒక్కొక్క శ్లోకం లోని మొదటి పాదాన్ని తీసుకొని మిగిలిన మూడు పాదాలు తానూ చేర్చి రాశాడు .అలాగే రెండవ పాదాన్ని తన శ్లోకం లో రెండవ పాదం గా గ్రహించి మిగిలిన పాదాలు అల్లాడు .మొత్తం ఎనభై నాలుగు శ్లోకాలతో మదనుడు కృష్ణ లీల కావ్యం రాశాడు .ఇలా ఇంతవరకు ఏకవి కావ్యానికి ఆ గౌరవం అబ్బలేదు .ఘటకర్పకుడికే ఆ గౌరవం దక్కించాడు మదన కవి యమకాన్ని కూడా కర్పక కవి వాడినట్లే దట్టించి వదిలాడు .కృష్ణ జననం ,లీలలు గోపికా విరహం ,రాసలీలలనుఅత్యద్భుతం గా మదనుడు మదన మనోహరం గా సుందరం గా మనోహరమైన శైలిలో రాసిఒక రకం గా కర్పకునికి అంకితం చేశాడా అన్నట్లు ఉంటున్దికావ్యం .మర్దనుడు పరహారవ శతాబ్ది దక్షిణ దేశ కవిగా భావిస్తారు
సశేషం
మరోకవితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు