గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27
25- అర్ధ శాస్త్ర రచయిత — కౌటిల్యుడు
క్రీ .పూ.350-283 కాలం వాడైనచాణక్యుడు భారత దేశం లోనే అతి విశాలమైన మౌర్య సామ్రాజ్యస్థాపకుడు చంద్ర గుప్తుని రాజ్యాభిషిక్తుడిని చేసి ,ప్రతిజ్ఞ చేసి నంద వంశ నిర్మూలనం చేసి పిలక ముడి వేసుకొన్న చాణక్యుడే అర్ధ శాస్త్రం అనే మహా గ్రంధాన్ని రాసిన కౌటిల్యుడు .విష్ణుగుప్తుడు అనే పేరుకూడా ఉంది .తక్షశిల విశ్వ విద్యాలయానికి అర్ధ శాస్త్ర విభాగానికి అధ్యక్షుడు .నందరాజ మంత్రి రాక్షసుడిని ఎన్నో మాయోపాయాలతో ఓడించి ప్రతిజ్ఞ నిలుపుకొన్నవాడు చివరికి రాక్షసుడినేశాంతి సమయం లో చంద్ర గుప్తుని మంత్రిని చేసి సుపరిపాలన ప్రజాక్షేమం కాంక్షించిన వాడు .నాలుగు పురుషార్దాలలో రెండవది అయిన అర్ధానికి ప్రాధాన్యం ఇచ్చి రాసి అన్ని ధర్మాలు అందులో నిక్షిప్తం చేశాడు కౌటిల్యం అని కీర్తించే రచన అది .చాణక్య ,రాక్షసమంత్రుల ఎత్తులపై శూద్రక కవి ముద్రా రాక్షస నాటకం లో చక్కగా వివరించాడు .
చణకుడు అనే బ్రాహ్మణుని కుమారుడు .తక్షశిల నివాసి .ఆయన జీవితం తక్షశిలా ,పాటలీ పుత్రలలోనే గడిచింది .చాణక్యుడు చిన్నతనం నుండి విద్యపై అభిరుచి ఉండటం వలన సకల శాస్త్రాలు కొద్దికాలం లోనే అభ్యసించి ఆర్ధిక ఆచార్యుడయ్యాడు .ఆ నాటికి ప్రపంచం లోనే అత్యున్నత అతి ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం తక్షశిల .అందులో ఆర్ధిక విభాగాధ్యక్షుడై విద్యా బోధన చేశాడు .ఇందులోనే అశోక చక్ర వర్తికూడా విద్యా భ్యాసం చేశాడు .మహోన్నతమైన పదవిలో ఉన్నా అతి సాధారణ జీవితం గడిపి అందరికి ఆదర్శం గా నిలిచాడు .చెప్పింది చేసి చూపించిన ఘనత ఆయనది ..రాజు రాజ్య భద్రత మీద ఎక్కువ ద్రుష్టి ఉండాలని చెప్పాడు .చంద్ర గుప్తుని చక్రవర్తిని చేసి రాక్షసుడిని అమాత్యుడిని చేసి రాజ భోగాలను త్యజించి అరణ్యాలకు చేరి ఒంటరి జీవితం గడిపాడు .ఆయన మరణం పై విభిన్న కధనాలు ఉన్నాయి .హేమ చంద్రుడు అనే బౌద్ధ రచయిత రాసిన దానిప్రకారం బిందుసారుని మంత్రి సుబందు కుట్ర వలన అడవిలో ఆహారం నీరు అందాక పస్తులతో గడిపి మరణించాడట .దీనికి కారణం బిందుసారుని తల్లిని హత్య చేయించింది చాణక్యుడే అని సుబందు రాజును నమ్మిం చటమే .బౌద్ధ రాజనీతి ప్రకారం హంతకుడికి నీరు ఆహారం అందకుండా మరణిం చేట్లు చేయటమే అతి కఠిన శిక్ష.తన తల్లి మరణం సహజమే అని ఆలస్యం గా తెలుసుకొన్న బిందుసారుడు సుబందు ను చాణక్య మరణాన్ని ఆపమని ఆజ్న చేసినా ,అమలు చేయకుండా తగల బెట్టి చంపించాడని కధనం .
కౌటిల్య గరిమ
కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అనే అర్ధం లోకం లో స్తిరపడిపోయింది .కాని మహోన్నత మానవతా వాదిగా కౌటిల్యుడు దర్శనమిస్తాడు .అర్ధశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రం అనీ పిలుస్తారు .ఇందులో ఆర్ధిక విషయాలు ఆదాయ వ్యయాలు ,రాజనీతి ,ప్రజా సంక్షేమం ,ఇతర దేశాలతో సత్సంబంధాలు ,వ్యాపార వాణిజ్య విషయాలు ,యుద్ధ తంత్రాలు అన్నీ చర్చించాడు .రాజ్య పాలన ఎలా ఉండాలో రాజులు తెలుసుకోనేట్లు రాశాడు .మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించాడు శిక్షా స్మృతిని తెలియ జేశాడు. రక్షణ వ్యవస్తను పటిష్ట పరచటం గూర్చి వివరించాడు .పన్నులు ,వసూళ్లు ,సైన్య విభాగం వాటి సద్వినియోగం ఒకటేమిటి అన్నిటినీ పేరుపేరునా చర్చించి వివరించాడు. సులభం గా అర్ధమయ్యే భాషలో రాసి అందరికి చేరువ అయ్యేట్లు చేశాడు .చాణక్య ప్రతిభ నిరుపమానం .ఎవరైనా ఏదైనా గొప్ప ఆలోచన చెబితే వారిని ‘’అపర చాణక్యుడు ‘’అనటం లోక రివాజు .కుటిల ఆలోచనలిస్తే’’ అబ్బో పెద్ద కౌటిల్యుడు రా’’అని ఆయన చెడు చెప్పక పోయినా ముద్ర వేయటమూ ఉంది .ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ఏమాత్రం ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు .అర్ధ శాస్త్రం అంటే రాకీయ యదార్ధ శాస్త్రం అని ,ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియ జేస్తూ ,ఎలా పని చేయాలో సూచిస్తూ ,రాజు విదులేమితో తెలియ బరుస్తూ ,ప్రజలకు పాలన దగ్గరకావాలని తెలుపుతూ ,ప్రజలు రాజ్య నిర్మాతలని అంటూ ,వారుకూడా హద్దుదాటితే తీవ్ర శిక్ష ఎలా అమలు చేయాలో తెలియ జేసింది అని పాశ్చాత్య పండితులు మెచ్చారు .రాజు నిరంకుశుడే ఆనాడు .అలాంటి కాలం లో ఆర్ధిక పరి పుష్టి కల్గించటం ఎలాగో చెప్పాడు .న్యాయ సంబంధమైన విషయాలను వివరిస్తూ అధికారుల విధి విధానాలు సూచిస్తూ ,సంస్కృతిని నిల బెడుతూ పురోగతికి మార్గాలు సూచించాడు .గనుల శాస్త్రాన్ని గని తవ్వకాలను ,లోహ శాస్త్రాన్ని ,వ్యవసాయం లాభ సాటిగా చేయటాన్ని ,పశువుల పెంపకం ,యాజమాన్య పద్ధతులు ,వనమూలికలు ,ఔషధాలు ,ఆయుధాల తయారీ ,అడవి జంతువుల సంరక్షణ ,కరువులు రాకుండా చేసే ఉపాయాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ,ప్రక్రుతి వైపరీత్యాలను ప్రజా సహకారం తో పరిష్కరించటం, గూఢ చారి వ్యవస్థ ,కోటలను స్వాధీనం చేసుకొనే విధానం ,సంస్థల నిర్వహణ విధానం ,యుద్ధ నీతి యుద్ధ ఖైదీలను చూడాల్సిన పద్ధతులు,క్రమశిక్షణ ,దండయాత్రా విధానాలు , సంధి విగ్రహాలు ,వ్యసనాలు నిర్మూలన ,ప్రభుత్వాధికారుల బాధ్యతలు విధులు వంటివి తెలియ జెప్పాడు .వీటిని పది హీను విభాగాలలో వివరించాడు .
పాశ్చాత్యులు అర్ధ శాస్త్రాన్ని మాక్ విల్లీ రాసిన ‘’ప్రిన్స్ ‘’తో పోలుస్తారు .అది సరైన పోలిక కాదు .కౌటిల్యుడు రాజు ‘’రాజర్షి ‘’కావటానికి కావలసిన సకల విషయాలు వివరించాడు .’’ప్రజల సుఖ సంతోషాలే రాజు సుఖ సంతోషాలు .వారి సౌభాగ్యమే తన సౌభాగ్యం వారి సంక్షేమమే తన సంక్షేమం .తనకు ఆనందాన్ని ,లాభాన్ని కలిగించేవికాడు .ప్రజలకు ఆనందాన్ని లాభాలను కలిగించేవే రాజు చేయాలి ‘’అని గొప్ప రాకీయ సూక్ష్మాన్ని బోధించాడు కౌటిల్యుడు .రాజర్షికి ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ –రాజు ఆత్మ నిగ్రహం కలిగిఉండాలి .విజ్ఞులైన పెద్దలతో ఉంటూ విజ్ఞానాన్ని పెంచుకోవాలి .వేగుల వారికన్నులే తన కన్నులుగా చూడాలి .రక్షణ ,సంక్షేమమమే ధ్యేయం గా ఉండాలి .తానూ ధర్మ బద్ధం గా ఉంటూ ప్రజలూ అనుసరించేట్లు చేయాలి .అన్ని శాస్త్రాలలోను అభినివేశం కలిగి ఉండాలి .ప్రజలకు సహాయ పడుతూ వారి ఆర్ధికాభి వృద్ధికి తోడ్పడాలి .క్రమ శిక్షణ తో ప్రవర్తిస్తూ ప్రజలను అదే దారిలో నడిచేట్లు చేయాలి .
రాజు ఇతరుల భార్యలపై వ్యామోహ పడరాదు .ఇతరుల సంపదను దోచుకోరాడు . అహింస నే అవలంబించాలి .ఆడంబరం అసత్యం ఉండరాదు .దుష్టులకుదూరం గా ఉండాలి .అని రాజులకు సూక్తి ముక్తావళి చెప్పాడు .పటిష్టమైనఆర్ధిక వ్యవస్థ రాజ్యానికి శ్రీరామ రక్ష అన్నాడు కౌటిల్యుడు .ధర్మం కర్మ దీనిపైనే ఆధార పడిఉంటాయి అన్నాడు .రాజు శక్తి వంతుడైతే పాలితులూ అలానే ఉంటారు .బద్ధకిస్స్టూడు రాజు అయితే శత్రువులు తేలిగ్గా రాజ్యాన్ని లోబరచుకొంటారు .కనుక రాజర్షి ఎల్లప్పుడూ చలాకీగా ఉండాలి .అప్పుడే రాజ్యానికి ప్రమాదం ఉండదు .పగలు,రాత్రి ని ఎనిమిది విభాగాలు చేసుకొని ఒక్కో విభాగానికి ఒకటిన్నర గంటలు కేటాయించి తన కార్యక్రమాలను అమలు చేయాలి .
పగలు మొదటి విభాగం లో –రక్షణ ,ఆర్ధిక ,ఖర్చుల పై నివేదికలపై దృష్టిపెట్టాలి .రెండవ విభాగం లో ప్రజా విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించాలి .మూడు లో అధికార నియామకాలు కానుకల స్వీకరణ ,వారికి పనులు పురమాయించటం చేయాలి .నాలుగవ భాగం లో ఉత్తర ప్రత్యుత్తరాలు మంత్రులతో సమావేశాలు చేయాలి .అయిదులో స్వీయ వినోద విషయాలలో పాల్గొనాలి .ఆరులో సైనిక విశేషాలు ,పర్య వేక్షణ నిర్వహించాలి .సాయంకాల ప్రార్ధన తో పగలు కార్యక్రమం పూర్తీ అవుతుంది .
సాయంత్రం మొదటి గంటన్నరలో –గూఢచారులతో సమావేశం నిర్వహించాలి .రెండవ భాగం లో –స్నానం పూజాదికాలు,చదువు .మూడు నాలుగు లో –నిద్రకు ఉపక్రమించి హాయిగా నిద్రపోవాలి .అర్ధ రాత్రి దాటినా గంటన్నరలో మంగళ ధ్వానాలతో మేల్కొనాలి .రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి . మూడవ భాగం లో మంత్రులతో సమావేశం వేగులను పంపటం చేయాలి .సూర్యోదయానికి గంటన్నర ముందు గృహ మత సంబంధ విధులు ,గురువు ల సందర్శనం ,పురోహిత హితులతో వైద్యులతో భేటీ ముఖ్యమైన వంట వాడితో ,వైద్యులతో సమావేశం నిర్వహించాలి
శత్రు రాజుల యెడ సామ దాన భేద దండ మాయ ,ఉపేక్ష ఇంద్రజాలాలను ప్రయోగించాలని చెప్పాడు కౌటిల్యుడు ..రాజ్య సరిహద్దుల్లో అరణ్యాలు పెంచి వాటికి కాపలాగా ఏనుగులను ,రక్షకులను నియోగించాలని చెప్పాడు .కౌటిల్యుడు ఆనాడు చెప్పినవన్నీ నేటికీ శిరోదార్యాలే అని ఆర్ధిక ధర్మ న్యాయ ,శిక్షాశాస్త్రజ్నులు చెబుతున్నారు .
మరో కవి తో మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు