గీర్వాణకవుల కవితా గీర్వాణం -28
26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు
అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య భదంతాఆశ్వ ఘోషశ్యా మహా కవేర్మహా వాడినః క్రుతిరిహస్య ‘’అని చెప్పుకొన్నాడు .దీనిని బట్టి సువర్నాక్షి తండ్రి అని ,అయోధ్యా నగర వాసి అని ,బౌద్ధ ఆచార్య పదవి అందుకోన్నాడని ,అప్పటికే ప్రసిద్ధి చెందాడని తెలుస్తోంది .వేద ధర్మాచరణ చేసే బ్రాహ్మణుడని అర్ధమవుతోంది .తర్వాత బౌద్ధానికి ఆకర్షితుడై వసుమిత్రాచార్యుల వద్ద దీక్ష తీసుకోన్నాడని మహాయాన శాఖకు చెందిన వాడని అవగతం అవుతుంది .తన పాండిత్య ,కవిత్వాలను బౌద్ధ మత వ్యాప్తికే వెచ్చించాడు. గొప్ప ప్రచారమూ చేశాడు .గొప్ప సంగీతజ్ఞుడు కనుక మాధుర్య గానం తో జనాలను పరవశులను చేసేవాడట .
అశ్వ ఘోషుడు బుద్ధ చరిత రాశాడు .దీనికి చైనా అనువాదం ధర్మ రక్ష అనే భారతీయ పండితుడుక్రీ శ.414-421 లో చేశాడట .కనుక అంతకు ముందు వాడే నని భావించాలి. మధ్య ఆసియాలో బుద్ధ చరిత్రలోని శారీపుత్ర ప్రకరణ వ్రాత ప్రతులు దొరికాయి .దీన్ని బట్టి కుషానులకాలానికి కనిష్కుడి కాలానికి చెందిన వాడని పాశ్చాత్య పండితుడు లూదర్స్ అభిప్రాయ పడ్డాడు .బౌద్ధ అభిధర్మానికి ‘’విభాష ‘’అనే వ్యాఖ్య అశ్వ ఘోషుడు కనిష్కుని బౌద్ధ ధర్మ మహాసభల సమయం లో రాశాడు కనుక కనిష్కుని సమకాలీనుడే కాని క్రీ పూ ఒకటవ శతాబ్ది అంటే 80-150అని నిర్ణయించారు .ఒక ఐతిహ్యం ప్రకారం కనిష్కుడు పాటలీ పుత్రం మీదికి దండెత్తి ,ఆ రాజును జయించి ఆరుకోట్ల డబ్బును పరిహారం గా అడిగాడని ,రాజు దానికి మూడుకోట్ల విలువ అని భావించే బదులు బుద్ధుని భిక్షా పాత్రను మరో మూడుకోట్లకు బదులు అశ్వ ఘోశుడిని సమర్పించాడట .ఇలా కనిష్కుడు అశ్వ ఘోషుడిని దక్కించుకొని రాజధాని పెషావర్ అని పిలువ బడే పురుష పురానికి తీసుకు వెళ్లి ,అతని ప్రేరణ చేత బౌద్ధాన్ని స్వీకరించాడని తెలుస్తోంది .తర్వాతే కనిష్కుడు బౌద్ధమత వ్యాప్తికి పూనుకోన్నాడట .చైనా ,టిబెట్ ,జపాన్ మధ్య ఆసియా మొదలైన చోట్లకు బౌద్ధ భిక్షువులను పంపి ప్రచారం చేయించాడు.
ఘోషుని కవితా ఘోష
అశ్వ ఘోశుడిని బౌద్ధులు మహా దార్శనికునిగా ఆరాధిస్తారు .అనేక దార్శనిక గ్రంధాలు రాశాడు .కనుక కవి గా మరీ గుర్తింపు తెచ్చుకొన్నాడు .ఆతను రాసినవి బుద్ధ చరిత్ర తోబాటు ,సౌందర నందం సూత్రాలంకారం ,మహాయాన శ్రద్దోత్సవం ,వజ్ర సూచీ మొదలైనవిరాశాడని అంటారు .ఇందులో బుద్ధ చరిత్ర, సౌన్దరనందాలకు విశ్వ వ్యాప్తి ఉంది .శారీపుత్ర అనే ప్రకరణాన్నీ రాశాడు .ఇరవై స్రగ్ధరా వృత్తాలతో ‘’గాండీ స్తోత్రం ‘’రాశాడు .ఇది బుద్ధ స్తుతి .రాష్ట్ర పాలుడు అనే గేయ నాటకమూ రాశాడని’’ సిల్వీ లేవి’’ భావించాడు
సంస్కృత బుద్ధ చరిత్రలో పది హేడు సర్గాలున్నాయి .చివరి నాలుగు సర్గాల్ని పందొమ్మిదో శతాబ్దం లో అమ్రుతానందుడు రాశాడని అంటారు .చైనా భాషలో అనువాదానికి ఇరవై ఎనిమిది సర్గ లున్నాయట .బుద్ధుడు జన్మించినది మొదలు చివరిదాకా ఉన్నకధ అశోకుడికాలం లో జరిగిన యుద్ధాలు బౌద్ధ సభా వర్ణనలూ ఉన్నాయి .బుద్ధ చరిత కు ఆధారం ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు .’’లలితా వర్తనం’’ నుంచి మూల కద తీసుకొని మార్పులు చేశాడని ఊహ .శృంగారాన్ని రమ్యం గ వర్ణించాడు .సభ్యత మీరలేదు .బుద్ధుడు తపస్సు చేస్తుండగా మన్మధుడు వేసిన బాణం నిష్ఫలం అయిన సందర్భం లో
‘’శాలేంద్ర పుత్రీం ప్రతి ఏవ ద్దో దేవో పి శంభు స్చలితో బభూవ –నచిన్తయత్యష తమేవ బాణం కిం స్యా దచిత్తో న శరః స ఏషః ‘’-దీని అర్ధం –‘’ఏ బాణం చేత శివుడు పార్వతిని చూసి చలించి విచాల్మనస్కుడైనాడో ఆ బాణాన్నే బుద్ధుడు లెక్క చెయ్యలేదు ఏమిటి ?ఇతనికి హృదయమే లేదా?లేక పొతే ఈ బాణం బాణమే కాదా’’?ప్రక్రుతి వర్ణనలూ బాగానే రాశాడు బుద్ధుడు శాక్య వంశానికి చెందిన వాడు .శాక్యులు శ్రీరాముని ఇక్ష్వాకు వంశస్తులు .అశ్వ ఘోషుడు శ్రీరాముని అయోధ్య వాసి కనుక వాల్మీకి నే అనుసరించి బుద్ధ చర్తిత్రలో వర్ణనలు చేశాడు .బుద్ధుడు మారుని అంటే మన్మధుని జయించే ఘట్టాలు చాలా మనోజ్ఞం గా ఉంటాయి
సౌందరనందం లో కవిత్వ సౌందర్యం
బుద్ధుడు సోదరుడు నందుడు బౌద్ధమతాన్ని తీసుకోవటమే ఇందులో కద .ఇది ప్రౌఢ రచన .బద్ధ చరిత లోనివే ఇందులోనూ కొన్ని పునరా వ్రుత్తమైనాయి. నందుడు సుఖాభిలాషి .సంసార జీవితం పై మోజున్న వాడు. భార్య సుందరి అంటే ప్రాణం .అలాంటి వాడిమనసు మార్చి బుద్ధుడు దీక్ష నిస్తాడు .ఇది మహా కావ్యాల సరసన చేరింది సుందరీనందుల శృంగారాన్ని రమణీయం గా వర్ణించాడు .రస రమ్య కావ్యం గా చిరకీర్తి నందుకొన్నది సౌందర నందం .తెలుగులో దీనినే పింగళి లక్ష్మీ కాంతం గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు సుమధుర కావ్యం గా తీర్చి దిద్దారు …ఘోషుడు మంచి ఉపమానాలు వాడాడు. అన్ని రసాలను పోషించి కావ్యానికి శోభ చేకూర్చాడు. కవిత్వం హృదయాన్ని ఆకర్షిస్తుంది .అశ్వ ఘోషుడి భావాలను కాళిదాసు అనుకరించాడని అంటారు .సుందరీ నందుల వియోగాన్ని అశ్వ ఘోషుడు రాత్రికి చంద్రునికి మధ్య వియోగం తోపోల్చటం విచిత్రమని పిస్తుంది .
‘’తాం సుందరీం చేన్నలభేతనన్దః సా వా నిషేవేతే న తమ్ నత భ్రూః –ద్వంద్వం ధృవం తద్వికలం న శోబేదన్యోన్య హీనా వివ రాత్రి చంద్రౌ .
వేదాంత భావనలనూ సరళం గా అర్ధమయ్యే రీతిగా వర్ణించాడు .శాంత ,కరుణ రసాలనూ అద్భుతం గా పోషించాడు అయితే ‘’సిమెట్రీ’’ ఘోషునిలో కాళిదాసు కంటే తక్కువేమో ననిపిస్తుంది. మానవ హితంకోసం ఈ రెండు గ్రంధాలూ రాశాడు కనుక కావ్య సౌందర్యం కంటే ప్రజా ప్రయోజాన కోసం రాశాడు .బుద్ధ ధర్మ ప్రచారమే ధ్యేయం .హైందవ ధర్మంపై ద్వేషం లేనివాడు .కారణం మొదట్లో ఆ సంస్కారం లో పెరిగిన వాడేకనుక .అందుకే బుద్ధ కధల్లో రామాయణ భారత కధలను జోడించాడు .
అశ్వ ఘోషుడి తర్వాత గుప్తుల కాలం వరకునాలుగు వందలేళ్ళు సంస్కృత కవులు కనపడటం లేదు .అప్పటిదాకా ప్రసిద్ధ కవులు కావ్యాలు లేకపోయి ఉండచ్చు .గుప్తులకాలం వైదికమతం పునరుద్ధానం చెంది స్వర్ణయుగం అనిపించుకొన్నది .క్రీ శ 345అలహాబాదు శాసనం లో సముద్ర గుప్తుని ప్రశస్తి కనిపించింది. ఈ శాసనాన్ని హరి శేనుడు అనేకవి రచించాడు .శైలి వైదర్భీ రీతిలో రమ్యం గా ఉంటుంది .గద్యమూ ఉన్నది. సముద్రగుప్తుడి ఆస్థానం లో యితడు ఏదైనా కావ్యాలు రాసి ఉంటాడని ఊహిస్తున్నారు .క్రీ శ.472మందసర్ శాసనాన్ని వత్స భట్టికవి గౌడీ శైలిలో రాశాడు .ఇతనిపై మేఘ సందేశ ,రుతుసంహార కావ్య ప్రభావం ఉందని భావన .
మరో కవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-14-ఉయ్యూరు