గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32
30-సూర్య శతక కర్త –మయూరుడు
సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ శేఖరుడు- మయూరుడు, బాణుడు హర్షుని ఆస్థాన కవులని పేర్కొన్నాడు .నిడద వోలు వెంకట రావు గారు తమ పరిశోధనలో’’మయూరుడు –ఆంద్ర వాజ్మయం ‘’లో మయూరుడు భోజుని ఆస్థానకవి అన్నారు .
‘’అహో ప్రభావో వాగ్దేవ్యాయన్మాతంగా దివాకరః –శ్రీహర్షస్యా భవద్ సభ్యః సమో బాణ మయోరయోః’’అని రాశాడు .మయూరుడు, బాణులతో బాటు హర్షుని ఆస్థానం లో ‘’మాతంగ దివాకరుడు’’ కూడా ఉన్నట్లు చెప్పాడు .బాణుడికి మయూరుడికి కవితా స్పర్ధ ఉన్నట్లూచెప్పాడు . మన వాళ్లకు పుకార్ల షికార్లు చేయటం బాగా అలవాటేకదా .ఈ పుకారు షికారులో విలసిల్లిన మరో కట్టుకధ కూడా లోకం లో కనిపిస్తుంది .అదేమిటంటే –మయూరుడు తన కుమార్తెను బాణుడికిచ్చి పెళ్లి చేశాడు .అంటే బాణుడిని అల్లుడుగా చేసుకోన్నాడన్నమాట .ఒక రోజు నవ దంపతులు శృంగార క్రీడలో ఉండగా మయూరుడు చాటుగా చూసి కూతురు అందానికి ముగ్ధుడై ఎనిమిది శ్లోకాలు చెప్పాడట .అదే ‘’మయూరాస్టకం’’.దీన్ని విన్న మయూరుని కూతురు తండ్రిని కుష్టు వ్యాధి గ్రస్తుడుకమ్మని శపించిందిట .ఆ వ్యాధితో తీసుకొంటూ సూర్యోపాసన చేస్తూ సూర్య శతక రచన ప్రారంభించాడట .ఆరవ శ్లోకం రాసేసరికి పూర్తిగా కుష్టు తొలగిపోయిందట .మయూరుని పేర లోకం లో కొన్ని చాటువులు వ్యాపించాయి .ఇవి స్రగ్ధరా వృత్తాలు .
మయూర శతక ప్రఖ్యాతి
మయూరుడికి ఒకప్పుడు కుష్టు వ్యాధి సోకింది .ఆ దుఖం లో ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ అనే దాన్ని నమ్మి సూర్య ఉపాసన చేస్తూ సూర్య శతకాన్ని రాసినట్లు కధలు ప్రచారం లో ఉన్నాయి .ఈశతకం పూర్తీ అయ్యేసరికి వ్యాధి పూర్తిగా నయమైనదట .బాణుడి శాపం వాళ్ళ ఈ వ్యాదివచ్చిందనే ప్రచారమూ ఉంది కాని ,జగన్నాధుడు పూర్వ జన్మ వల్లనే వచ్చిందని తెలియ జేశాడు .సూర్య శతకం లో వంద శ్లోకాలున్నాయి .స్రగ్ధరా వృత్తం లో మయూరుడు ఈశతకం రాశాడు .చదువుతుంటే మహానందం కలుగుతుంది .రచన గౌడీరీతిలో ఓజో గుణ ప్రధానం గా ఉంది .యమక పంట పండించాడు ఈ శతకం లో అనేక అర్దాలంకార సంయోజనం తో రచించాడు .ప్రౌఢ రీతిలో నడిచింది .
మొదటి నుంచి నలభై మూడవ శ్లోకం వరకు సూర్య కిరణాల వర్ణన ,సూర్య స్తుతి ఉంది .తర్వాత అయిదు శ్లోకాలలో సూర్యుని రధం ,సూర్యాశ్వాల వర్ణన చేశాడు .పిమ్మట పన్నెండు శ్లోకాలలో సూర్య రధ సారధి అరుణుడిని (అనూరుడు )వర్ణించాడు .సూర్యుని రధాన్ని పదకొండు శ్లోకాలలో చెప్పాడు .ఏడు శ్లోకాలలో సూర్య బింబాన్ని ,మూడు శ్లోకాలలో శివ విష్ణు ,బ్రహ్మ స్వరూపుడుగా సూర్యుని స్తుతించాడు .మరొక శ్లోకం లో సమస్త దేవతలా కంటే సూర్యుడు సర్వ శ్రేస్టుడని వివరించాడు .సూర్యుడు ప్రకాశించేటప్పుడు భూమి పై జరిగే పరిణామాన్ని వర్ణించి చెప్పాడు .మరొక్క శ్లోకం లో సూర్యుడు సమస్త చరా చర జగత్తుకు సార్వ భౌముడు అని నిరూపిస్తూ వర్ణించాడు .మయూరకవి రాసింది ఒకే ఒక్క టి అదే మయూర శతకం దీనితోనే కవుల్లో అగ్రభాగాన నిలిచాడు అంటే అంతటి ప్రశస్తిని ఈశతకం ద్వారా సాధించాడని గ్రహించాలి .ఒక్క శతకం తో ‘’జాక్ పాట్’’కొట్టి సాహితీ ఉద్యానవనం లో కవితా మయూర నృత్యం చేశాడు సప్తవర్ణ శోభ కల్పించాడు అంతేకాదు –సాహిత్య నభోమండలం లోసూర్య శతకం తో శతసహస్ర భాను కిరణ పుంజాలను వెదజల్లి ఆరోగ్యం తో బాటు ,ఆనందాన్నీ ,హ్రుదయాహ్లాదాన్ని కల్గించి నభోమండల సావిత్రు నారాయణ మూర్తి యై భాసించాడు .
మయూరుని చాటువుల్లో ఒకటి –అర్ధ నారీశ్వరుడైన పార్వతీ పతికి సంధ్యాదేవి వలన జన్మించిన సంధ్య ,పై ప్రేమ కల్గిందట .అప్పటికే నెత్తిమీద గంగ సవితిగా ఉంది .ఒక రోజు శివుడు నాట్యం చేసే సమయం వచ్చింది .పార్వతి గంగను దించను ,సంధ్యను వదించను అన్నదట.శివుని శరీరం నుండి వేరైపోవాలనీ అనుకొందిట .ఆమెను ఆపే ప్రయత్నం లో శివుడి హస్తం సర్వ మంగళ కుచాన్ని తాకిందట .అలాంటి మంగళ కరమైన చేయి మనల్ని రక్షించాలి అని కవి శ్లోకం చెప్పాడు –
‘’అన్యన్యా సంప్రతీమం కురు మదన రిపో –స్వాంగ దాన ప్రదానం –నాహం సోఢుం సమర్దా శిరసి సురనదీం-నాపి సంధ్యాం ప్రణతుం –ఇత్యుక్త్వా కోప విద్దాం విఘట యితు ముమా –మాత్మ దేహం ప్రవృత్తాం –రుంధానః పాతు శంభోఃకుఛ కలశ హఠ క్రుస్తో భుజోవా’’
మయూర శతకానికి పద్నాలుగు వ్యాఖ్యానాలున్నట్లు తెలుస్తోంది .ఈ శతకానికి ఖండాంతర ఖ్యాతి ఉన్నది .ఆనంద వర్ధనుడు మయూర శ్లోకాలను ఉదాహరించాడు జగన్నాధ పండిత రాయలు మయూరుని అనుసరించి ‘’సుధా లహరి ‘’ని స్రగ్ధరా వృత్తాలలో రచించాడు .మయూరుని కవితా శక్తి కి ఆకర్షితులైన వారిలో పింగళి లక్ష్మీకాంతం, దాసు శ్రీరాములు ,వడ్డాది సుబ్బారాయకవులేకాక పూర్వకవులలో శ్రీనాధ ,పోతన ,పెద్దన ,రామ రాజ భూషనాదులూ ఉన్నారు .ఇందులో శ్రీనాధుడు మయూరుని పది హేను శ్లోకాలను అనువదించి కాశీఖండం, శివ రాత్రి మహాత్మ్యం లలో చేర్చాడు .అంటే తెలుగు వారికి మొదటగా మయూరుని పరిచయం చేసిన ఘనత శ్రీనాదుడిదేనన్న మాట .’’భట్ట బాణ మయూర భవ భూతి ,శివ భద్ర కాళిదాసు ల’’సరసన మయూరుని నిలిపి గౌరవించాడు . .మయూరుని కవితా వేగం అతన్ని బాగా ఆకర్షించి ఆ ధోరణిలో పద్యాలు అల్లాడు .దాసు శ్రీరాములుగారు 1902 లో సూర్య శతకాన్ని అనువదించారు .ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి గారూ తెనుగు చేశారు .రాజ శేఖరుడు మయూరుని –
‘’దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం –విష విద్యేవ మయూరీ మయూరీ వాజ్ని కృతం తతి’’అని మెచ్చుకొన్నాడు దీని అర్ధం –నెమలి చేసే క్రేంకారం లాంటి మయూరకవి వాక్కు నీచ కవులు అనే విష సర్పాల చెవి సోకగానే వాళ్ళ గర్వాన్ని నశింప జేస్తుంది ‘’’మయూర శతకం లో మొదటి శ్లోకం అందాన్ని చూద్దాం –
‘’జమ్భారీతివ కుమ్భోద్భావమివ దాదాస్సాంద్ర సింధూర రేణుం –రక్తా సిద్దా ఇవౌఘే రుదయ తటీ దారాద్రవస్య
ఆయాంత్యాతుల్యకాల కమల వన రుచే వారుణోవొ విభూత్యై –భూయాసుర్భా సయం తో భువన మభినవా భానవో భానఃవీయాః’’-
అర్ధం –సూర్య కిరణాలు దేవ గజం అయిన ఐరావతం కుంభ స్థలం నుండి పుట్టిన సింధూరపు ధూళి కమ్మినట్లు కమ్మాయి .అంటే దేవలోకం నుంచి బయల్దేరాయని చెప్పటం .తర్వాత తూర్పు కొండపై ఉన్న గైరికాది వన మూలిక ద్రవాలతో తడిసి యెర్ర బడ్డాయా అన్నట్లున్నాయి .సూర్యుని రాకతో పద్మాలు వికసించి పద్మవనం యొక్క యెర్రని కాంతిని సంతరించుకొన్నాయి .మూడులోకాలను ప్రభావితం చేస్తాయి అని అంతరార్ధం .
మయూరుని సూర్య శతకం సి డి లు లభిస్తున్నాయి .ఇంటర్ నెట్ లోనూ వినచ్చు .వింటే చాలు ఆనందాను భూతి లభిస్తుంది .నమ్మకం ఉంటె ఆరోగ్యమూ సిద్ధిస్తుంది .
మరో కవిని కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు