గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35
33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు
భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య కావ్యాలు లు అంతగా ప్రాచుర్యం పొందలేదు కనుక వీటి సిద్ధాంతాలపై ఎవరి దృష్టీ పడలేదు .శ్రవ్య కావ్య లక్షణాలపై తొట్టతొలి రచన చేసిన వాడు భామహుడు .అందుకే చరిత్ర ప్రసిద్ధి పొందాడు .కావ్యాలంకారం లో భామహుడు శ్రవ్య కావ్యాలో ఉన్న తేడాలు ,వాటి స్వరూపాలు ,మహా కావ్య లక్షణాలు ,కావ్య గుణ దోషాలు ,కావ్య గతమైన అలంకారాలు మొదలైన వాటిని మొట్ట మొదటగా చర్చించిన వాడు భామహుడే .భరతుడి నాట్య శాస్త్రం తర్వాత అలంకార గ్రంధం భామహుదు రాసిన కావ్యాలంకారం .భామహుడి తండ్రి పేరు ‘’రుక్రిల గోమిన్ ‘’ఇది బౌద్ధ నామం అని ఊహించి అతడు బౌద్దుడన్నారు .కాని భామహుడు కావ్యారంభం లో ‘’ప్రణమ్య సర్వం సర్వజ్ఞం మనోవాక్కాయ కర్మభిః ‘’అని చెప్పటం వాళ్ళ అనుకొన్న పొరపాటు ఇది సర్వజ్ఞ నామం శివుడికే ఉంది –‘’సర్వజ్ననామము శర్వునికే గాక’’అన్న పద్యం మనకు గుర్తు ఉంది .అదీకాక రామాయణ మహా భారత ఉదాహరణలే భామహుడు ఇచ్చాడు .కనుక బౌద్దుడుకాడు .
‘’ కావ్యాలంకార ‘’శోభ
భామహుడు రచించిన కావ్యాలన్కారం లో ఆరు పరిచ్చేదాలున్నాయి .అలంకారం అనే శబ్దానికి ‘’సౌందర్యం ‘’అనే అర్ధం కూడా ఉంది .వీటిని ‘’ కారికలు’’ అన్నాడు .మొదటి పరిచ్చేదం లో కావ్య ప్రయోజనాలు ,కావ్యానికి హేతువులు ,కావ్య లక్షణాలు ,భేదాలు గురించి చెప్పాడు .రెండవ దానిలో కావ్య గుణాలు ,మూడు లో అలంకారాల చర్చ చేశాడు .చతుర్ధ పరిచ్చేడం లో పూర్వ పరిచ్చేదాలలో వదిలేసిన వాటిని వివరించాడు .పంచమం లో తర్క శాస్త్రాధారం గా దోషాలను ఆరులో వ్యాకరణ శాస్త్ర రీత్యా వచ్చే దోషాలను గురించి వివరణ ఉంది .అలంకారాలను దోషాలను విపులంగా భామహుడు చర్చించటం వలన కావ్యం అనేది శబ్ద శుద్ధికలిగి ఉండాలని ,అలంకారాలతో శోభించాలని భావించాడు .
భరతుడు చెప్పిన రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించ లేదు .అగ్నిపురాణ కర్త రసమే కావ్యానికి జీవం జవం అని అంగీకరించినట్లు గా భామహుడు అంగీకరించినట్లు కనిపించదు .భామహుడి దృష్టిలో శబ్దం అర్ధం ఉండేదేకావ్యం .కావ్యప్రయోజనానికి వైచిత్రి ,వక్రోక్తి తో కలిసిఉన్న అర్ధ సంయోజనం ముఖ్యమైన అవసరం అని చెప్పాడు .దీని తో బాటు కావ్యం దోష రహితం గా ఉండటమే కాకుండా గుణ సహితం గా ఉండాలని కోరాడు .రసాన్ని ‘’రసదలంకారాం’’గా భావించి భామహుడు వివరించాడు .మొత్తం మీద భామహుని దృష్టిలో అలంకారమే కావ్యానికి ప్రధానం .దృశ్యకావ్యం లో రసానికి ప్రాధాన్యం ఉన్నట్లు శ్రవ్య కావ్యం లో రస ప్రాధాన్యత అంత అవసరం లేదని భావించాడు .ముప్ఫై ఆరు అలంకారాలను ,రెండు శబ్దాలంకారాలను భామహుడు వివరించి చెప్పాడు .కావ్యం రాసేవారికి వ్యాకరణ పరిజ్ఞానం తో బాటు శబ్ద పరిచయం ఎక్కువగా ఉండాలని చెప్పాడు .ప్రసాదం మాధుర్యం ఓజో గుణాలను పేర్కొని భామహుడు ప్రసాద మాదుర్యగుణాలు శ్రేష్టమైనవి అని పేర్కొన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహుని నినాదం .
ఎనిమిదవ శతాబ్దికి చెందినా ఉద్భటుడుఅనే అలంకార శాస్త్ర వేత్త భామహునికావ్యాలంకార శాస్త్రానికి’’భామహ వివరణ ‘’లేక భామహ వ్రుత్తి ‘’అనే చక్కని వ్యాఖ్య రాశాడు .కాని దురదృష్ట వశాత్తు ఇది లభించటం లేదు .దీన్ని ‘’ప్రతిహా రేందు రాజు ,అభినవ గుప్తుడు, రుయ్యకుడు మాత్రం పేర్కొనటం వలన మాత్రమె తెలుస్తోంది .భామహుడు మరోరచన చేశాడని అదే వర రుచి రాసిన ‘’ప్రాకృత ప్రకాశం ‘’కు రాసిన ‘’మనోరమ ‘’అనే వ్యాఖ్యానం . నారాయణ భట్టు భామహుడు ‘’ఛందో గ్రంధం ‘’కూడా రాశాడని ,అందులో అనేక చందోరీతులున్నాయని తెలిపాడు ,కనుక రాసిఉండచ్చు అని అనుకో వచ్చు .భామహుడు తరువాతి ఆలన్కారికులపై గొప్ప ప్రభావాన్ని చూపాడు ఆ ప్రభావం పొందిన వారిలో ఉద్భటుడు ,ఆనంద వర్ధనుడు ,అభినవ గుప్తుడు, ముమ్మటుడు మొదలైన వారున్నారు .
వైదర్భి ,గౌడీ రీతులను పోలుస్తూ వైదర్భిని ‘’అవక్రోక్తి ‘’అన్నాడు భామహుడు .స్వభావోక్తి లో వైచిత్రి ఉండడుకనుక దాన్ని వదిలేశాడు .’’యుక్తం లోక స్వభావేన రసిక శకలైః ప్రుధక్ కావ్యాలంకారా’’అన్నాడు భామహుడు .దీని అర్ధం మహా కావ్యం లోసందర్భాన్ని బట్టి అనేక రసాలు ఉండాలి .రసం కంటే ఆలంకారాలకే ప్రాధాన్యత నిచ్చాడు .
నాగ నాద శాస్త్రి బటుక్ నాద శర్మలు ఆంగ్లం లో ఈ కావ్యాలంకారాన్ని వెలువరించారు .తాతాచారి 1934లో తెచ్చిన పుస్తకం ఈరెందిడిటికన్న శ్రేష్టమైనది .
మరో కవిని కలుసుకొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు