గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36
34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు
‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం 779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు .’’విద్వాన్ దీనార లక్షేణ ప్రత్యహం కృత వేతనః –భట్టో భూ దుద్భటస్తస్య భూమి భర్తుః సభా పతిః ‘’
కవితోద్బటం
ఉద్భటుని ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అలంకార రచన .ఇదికాక’’ భామఃహ వివరణ ‘’అనే గ్రంధమూ రాశాడు .ఇది భామహుడు రాసిన కావ్యాలంకారానికి వ్యాఖ్యానమే .కాని ఇది లభించటం లేదని చెప్పుకొన్నాం .భరతుడి నాట్య శాస్త్రానికి ఉద్భటుడు టీక కూడా రాశాడు .ఇవికాక ‘’కుమార సంభవం ‘’అనే కావ్యం రాసినట్లుంది ..ఈ కావ్య శ్లోకాలను తన అలంకార గ్రంధం లో ఉదాహరణలుగా ఇచ్చాడు .
కావ్యాలంకార సార సంగ్రహం కూడా ఆరు పరిచ్చేదాలల్తో ఉన్న గ్రంధం .మొత్తం 79కారికలున్నాయి .భామహుడు నడిచిన బాటలోనే దీన్ని రాసినా అతనికంటే భిన్నమైన అలంకార వివేచన చేశాడు .భిన్నం గా అలంకార భేదాలనూ చెప్పాడు .మొత్తం మీద నలభై ఒక్క అలంకారాలను ఉద్భటుడు వివరించాడు .ఇతని ఉపమ ,ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి లను తరువాత అలంకారికులైన ముమ్మటుడు రుయ్యకుడు గ్రహిం చారు .కావ్య సౌందర్యానికి గుణాలతో బాటు అలంకారాలు అవసరమే నని ఉద్భటుడు చెప్పిన దానితో రుయ్యకుడు ఏకీభవించాడు .ఉద్భటుడు శాంత రసాన్ని తొమ్మిదవ రసం గా నాట్య శాస్త్రం లో చెప్పాడని పండితాభిప్రాయం .
రీతులను దేశ పరం గా కాకుండా ఉపనాగరక ,గ్రామ్య ,పరుష అనే పేర్లతో పిలిచాడు .ఇది శబ్ద సంయోజనం పై ఆధార పడి ఉండేట్లు చెప్పాడు .ఉపనాగరిక రీతి పరిష్కృతం అయిన పధ్ధతి .గ్రామ్య రీతి సాధారణ మైంది .పరుష రీతి అంటే కఠినమైనది .క్రీ శ .తొమ్మిది వందల యాభై ప్రాంతం వాడైన‘’ప్రతిహా రేందు రాజు’’ ఉద్భటుని కావ్యాలంకార సార సంగ్రహానికి విపుల మైన వ్యాఖ్యానం రాశాడు .ఉద్భటుడి శిష్య పరంపర రాజశేఖరుడి వరకు వ్యాపించి ఉంది అని ‘’ఇతి ఔదంభరాఃఉద్భట మతానుయాయినః ‘’అని రాజ శేఖరుడు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది .ఉద్భటుని సంప్రదాయం ‘’ఔద్భట సంప్రదాయం ‘’అని పిలువ బడుతోంది .శ్రవ్య కావ్యం లో రసమే ‘’జీవద్రూపం ‘’అని ఉద్భటుడుఅంగీక రిం చాడని తెలుస్తోంది .ప్రాచీన ఆలంకారుల్లో ఉద్భటునిదిమూడవ స్థానం .మొదటివాడు భరతుడు రెండవ వాడు భామహుడు ,మూడవ వాడు ఉద్భటుడు .రసభావ అలంకార సంయోజనం గురించి చెప్పిన వాడు ఉద్భటుడు
—
35- సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాసి కావ్యాత్మను చెప్పిన -వామనుడు
ఇప్పటికి వరకు మనం చెప్పుకొన్న అలంకారికులు తమ గ్రంధాలను పద్యాలకారికల్లో రాస్తే వామనుడు మాత్రం సూత్ర పద్ధతిలో అలంకార గ్రంధం రాశాడు .ఈయనా ఉద్భటుడిలాగే కాశ్మీర రాజు జయా పీడుని ఆస్థాన కవే కాకుండా మంత్రికూడా .ఇతని అలంకార గ్రంధం పేరు ‘’కావ్యాలంకార సూత్ర వ్రుత్తి ‘’.ఏదైనా సూత్రాలుగా చెబితేనే అది శాస్త్రం అవుతుందని నమ్మి అలా రాశాడని భావిస్తారు .ఈగ్రంధం లో మూడు వందల పందొమ్మిది సూత్రాలు ఉన్నాయి .అయిదు అధికరణాల్లో ,పన్నెండు అధ్యాయాలుగా రచించాడు .తన సూత్రాలకు అర్ధాలను కూడా వామనుడే రాసుకొన్నాడు .అదొక ప్రత్యేకత .సూత్రాలను వివరించే వాటికి ‘’వ్రుత్తి ‘’అని పేరు పెట్టాడు .ఇతనికి ముందున్న అలంకారికులు లక్షణాలకు ఉదాహరణలను తమ స్వంత కావ్యాలనుంచే ఇచ్చారు .కాని దీనికి భిన్నం గా వామనుడు ఇతరకవుల కావ్యాలనుంచి ఉదాహరణలు సేకరించి అందజేసి తన సిద్ధాంత వ్యాప్తి చేసుకొన్నాడు . ఇదీ రెండో ప్రత్యేకత.
వామన విశ్వ రూపం
వామనుడు రాసిన కావ్యాలంకార సూత్ర వృతి లోకావ్య పరిభాష ,కావ్య ప్రయోజనం కావ్య హేతువులు ,కావ్య రీతులు ,కావ్య అంగాల నిరూపణ చేశాడు .రెండు మూడు నాలుగుల్లో దోష ,గుణ ,అలంకార నిరూపణ చేశాడు .అయిదులో శబ్ద శుద్ధి గురించి చెప్పాడు .ఇది భామహుని కావ్యాలంకారం లోని చివరిపరిచ్చేదాన్ని తలపింప జేస్తుంది .ముప్ఫై మూడు అలమ్కరాలనువామనుడు చెప్పాడు అందులో వక్రోక్తికి ,వ్యాజోక్తికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చాడు .
కావ్యం యొక్క ‘’ఆత్మ ‘’ను గురించి మొదట చెప్పిన వాడు వామనుడే .ఆతను అన్నమాట ‘’రీతి రాత్మా కావ్యస్య ‘’అనేది అందరికి నోట నానిన సూత్రమే .అంటే కావ్యానికి ప్రాణం రీతి .అది ఆత్మ వంటిది అన్నాడు .’’కావ్య శోభాకరాన్ ధర్మాలంకారాన్ ప్రచక్షతే’’అని దండి అభిప్రాయపడ్డాడు .కాని వామనుడు కావ్య శోభ గుణాల వలననే కలుగుతుందని చెప్పాడు –అదే ‘’కావ్య శోభాయాః కర్తారో ధర్మా గుణాః’’అని సూత్రీకరించాడు ఖచ్చితం గా .గుణాల వలననే కావ్యానికి సౌందర్యం కలుగుతుందని ,ఆ సౌందర్యాన్ని ఇనుమడింప జేసేది అలంకారం అని స్పష్టం గా చెప్పాడు .అలంకారాలు లేక పోయినా కావ్యం యొక్క సహజ సౌందర్యానికి ఏ విధమైన లోపమూ రాదనీ వామన మతం .వ్యక్తి గుణాల వల్ల ఆత్మ సౌందర్యం పొందినట్లుగానే ,కావ్యానికి కూడా సౌందర్యం గుణాల వల్ల ఏర్పడుతుంది అన్నాడు .కనుక వామనుడు ‘’సౌందర్య వాది’’ అని పిలవ బడ్డాడు .
వామన ఉద్భట అలమ్కారికులిద్దరూ ఒకే రాజాస్థానం లో ఉన్నారు .కాని ఒకరు రాసిన దానిలో రెండవ వారిని పేర్కొనక పోవటమే అమితఆశ్చర్యం కలిగిస్తోందని విశ్లేషకులు అంటారు .ఇద్దరివి భిన్నమార్గాలు కూడా అని మనకు తెలిసిన విషయమే .ఉద్భటుడు భామహుని అనుసరిస్తే ,వామనుడు దండి ని అనుసరరించి రీతి సిద్ధాంత కర్త అయ్యాడు .దండి కావ్యాన్ని వ్యక్తీ తో పోల్చగా వామనుడు వ్యక్తికీ ఆత్మ ఉన్నట్లు కావ్యానికీ ఆత్మ ఉంటుంది అన్నాడు .కాశిక రాసిన వామనుడు ,కావ్యాలంకార సూత్ర వ్రుత్తి కర్త వామనుడు ఒకరే అని పండితుడు పి వి కాణేనిర్ణయిస్తే ,బూల్యర్ పరిశోధకుడూ దాన్ని సమర్ధించాడు . వామనుడు రీతి అంటే శైలి కావ్యానికి ఆత్మ అన్నాడు .పాంచాలి రీతి మాధుర్యం గా ఉంటుందని ,గౌడీరీతిలో వేగం శక్తి ఉంటాయని వైదర్భీ రీతిలో ఇవన్నీ సమపాళ్ళలో కలిసిఉంటాయని చెప్పాడు .
వామనుడు మహా మేధావిగా పరిగణింప బడ్డాడు .’’కావ్యం గ్రాహ్య మాలాన్కారాత్ –సౌందర్య మాలకారః ‘’అని తన గ్రంధాన్ని ప్రారంభించాడు .అలంకారం అంటే సౌన్దర్యమేనన్నాడు ‘’కావ్య శోభాకారాణ్ ధర్మన్ అలంకారాన్ ప్రచక్షతే ‘’అని దండి అంటే –వామనుడు ‘’కావ్యా శోభయా కర్తారో ధర్మాః గుణాః-తదతిస్య హీత్వాః-అలమ్కారః ‘’అన్నాడు .సహజ సౌందర్యం గుణాలవలన ,కృత్రిమ సౌందర్యం అలంకారాల వలన లభిస్తుందని గుణాలకే ఎక్కువ మార్కులు వేశాడు .గుణాలు చక్కని బంధాన్ని ఏర్పరుస్తాయన్నాడు –‘’ఓజః ప్రసాద శ్లేష సమతా సమాధి మాధుర్య సౌకుమార్య –ఉదారతా అర్ధ వ్యక్తీ కాన్తయో బంధుగుణాః’’.అలాగే ‘’విశిష్ట పద రచన రీతి –విశిష్ట గుణాత్మా ‘’అని అన్నాడు .పదరచన విశిష్టం గా ఉంటె నిర్మాణం బాగుంటుంది ..కానీ రీతి ఆత్మ.విశిస్టపదరచన వ్యన్జకం అయితే రీతి వ్యంగ్యం అని వివరించాడు .విశిష్ట పదరచనతో రీతి పుష్టి చెంది అలౌకిక సౌన్దర్యాన్నిస్తుందని భావం .పాకం సహ్రుదయుడిని ఆకర్షించి ఆనందింప జేస్తుందని చెప్పాడు –‘’ఉదయితి హై సా తాద్రిక్ క్వాపి వైదర్భ రీతౌ సహృదయ హృదయాననం –రంజకః కూపీ పాకః ‘’’’అని అన్నాడు రీతిని పాకాన్ని ఎలా సరిగ్గా నిర్వచింప లేమో అలానే కూపీ పాకం కూడా అనిర్వచనీయం అన్నారు .శబ్ద పాకం అర్ధ పాకం సమపాళ్ళలో సంయోజనం చెందితే సహృదయ రంజకం జరుగుతుందని భావం .
మరొకరితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-14-ఉయ్యూరు