గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37
36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు
హర విజయం అనే మహా కావ్యం రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు .హరవిజయం లో శివుడు అందకాసురుడిని సంహరించటం అనే కద ఉంది ఇది యాభై సర్గల బృహత్ కావ్యం .శ్లోకాల సంఖ్య 4320.
కవితా రత్నాకరుడు (కవి సముద్రుడు )
రాజానక ,వాగీశ్వర ,విద్యాధిపతి బిరుదులున్న రత్నాకరుడు వసంత తిలక వృత్తానికి సృష్టికర్త .దీనిని క్షేమేంద్రుడు రాజశేఖరుడూ పేర్కొని మెచ్చారు .హర విజయం లో శివ పార్వతులు కామ కళా కేళి లో ఉండగా అంధుడైన అంధకాసురుడు జన్మించాడు .శివుడిని స్తుతించి కను చూపు తెచ్చుకొన్నాడు వరగర్వం తో విర్రవీగి మూడు లోకాలను కల్లోల పరచాడు .దేవతలు అందకుని ఆగడాలు భరించ లేకఈశ్వరుని ప్రార్ధిస్తే వాడిని సంహరించటమే కద .యాభై సర్గ లున్న ఈ కావ్యం లో మొదటి పదమూడు సర్గలలో శివుడు అందకాసురుడిని సంహారం చేయటానికే చేసే మంత్రాంగమే వర్ణించాడుకవి .తర్వాత ఏడు సర్గలలో శివుడికి అందకాసురుడికి మధ్య సంవాదం ఉంటుంది సన్నివేశాలు సంవాదాలు బాగా పెంచి రాసిన కావ్యం ఇది .
రత్నాకరుడు సకల శాస్త్ర రత్నాకరుడు .అతనికి ప్రవేశం లేని విద్య లేదు .పురాణ ,ఇతిహాస ,నాట్య ,సంగీత ,నీతి,వేదాంత ,కామ శాస్త్ర ,అలమ్కారాది శాస్త్రాలలో నిష్ణాతుడు .దీనికి మించి చిత్రకావ్య రచనా సమర్ధుడు .మహా కావ్య లక్షణాలన్నీ హరవిజయం లో చొప్పించాడు .తన కావ్య మర్మాన్ని రాత్నాకురుడే –‘’లలిత మధురాఃసాలంకారాఃప్రసాద మనోహరాః –వికట యమక శ్లేషోద్గార ప్రబంధ నిరర్గలాః’’ఇన్ని కవితా లక్షణాలతో తన హర విజయం మనోహర విజయం సాధించిందని చెప్పాడన్నమాట .ప్రతి సర్గ చివర ‘’రత్న ‘’అనే శబ్దాన్ని వాడాడు .దీనికి స్పూర్తి భారవి వాడుకొన్న ‘’లక్ష్మి ,మాఘుడు ప్రయోగించిన శ్రీ ‘’,శ్రీహర్షుడు ఉపయోగించిన ‘’ఆనంద ‘’శబ్దాలే .రత్నాకరుడి కావ్యం ‘’చంద్రార్ధ చూడ చరితాశ్రయ చారు ‘’సుందరం అని తానే చెప్పుకొన్నాడు .
డేవిడ్ స్మిత్ ఈ కావ్యం లో మతవిషయాలతో బాటు సింబాలిజం కూడా ఉందన్నాడు భారతీయ సంస్కృతిని కావ్యం లో ప్రతిబింబింప జేశాడనీ చెప్పాడు .సంప్రదాయ ఆలంకారికులను విమర్శిస్తూ చెప్పిన గ్రంధమనీ అన్నాడు .రాజాస్థాన విధానాలు ,సమాజ వ్యవహారాలూ ఇందులో పొండుపరచాడని తెలియ జేశాడు .హరవిజయాన్ని పండిట్ దుర్గా ప్రసాద్ ,కాశీనాద్ పాండురంగ పరబ్ లు ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు .పుర ,నగర పర్వత సముద్ర వన సూర్యాస్తమయ ,అస్తమయ యుద్ధ ,ఋతు వర్ణాలతో కావ్యం సర్వాంగ సుందరం గా ఉంటుంది కద కంటే కధన వర్ణన విధానం బాగా ఆకర్షిస్తుంది .భారవి కిరాతార్జునీయాన్ని మాఘుడి శిశుపాల వధ కావ్యాలను మించిన కవితా సౌందర్యం ఇందులో ఉన్నది .
37- బాల కవి -రాజ శేఖరుడు
బాల్యం లోనే కవిత్వం లో అమోఘమైన ప్రతిభ చూపి’’ బాలకవి ‘’అనే బిరుదు పొందిన రాజ శేఖరుడు కనోజు పాలకుడు ఘూర్జర రాజు ప్రతీహార వంశస్తుడు మహేన్ద్రపాల రాజు ఆస్థానం లో విద్యా గురువు .అతనికొడుకు మహీ పాలుని వద్ద ,కేయూర వర్షుని ఆస్థానం లోను గౌరవ పదవులలో రాణించాడు .కనుక కాలం క్రీ శ .860-940గా నిర్ణయించారు .పండిత వంశం లో జన్మించిన ఇతని తండ్రి దుర్దకుడు స్వీయ ప్రతిభతో మంత్రి అయ్యాడు తల్లి శీలవతి .ముత్తాత అకాల జలదుడు కూడా గొప్ప కవి .ఇతన్ని మాయవర కుల సంజాతుడని అంటారు ఈ కులం బ్రాహ్మణ క్షత్రియ రెండుకులాల్లోనూ ఉందట .క్షత్రియుడేనని అందుకే చౌహాన్ క్షత్రియ కులానికి చెందిన అవంతీ సుందరిని పెళ్లి చేసుకోన్నాడని వాదించేవారూ ఉన్నారు .ఇది నిజం కాదని బ్రాహ్మణ కుల సంజాతుడేనని మెజార్టీ నమ్మకం .అవన్తీసుందరి గొప్ప పండితురాలు ,విదుషీమణి కాబట్టే ,రాజశేఖరుడు కులాంతర వివాహం చేసుకోన్నాడని అది ఆనాటి సంఘం లో ఉన్న ఆచారమే నని సమర్ధిస్తారు .ఆమె ప్రేరణ అతనికి బహువిధాల తోడ్పడిందని అనుకోవచ్చు .ఆనాటి చాలా రాజ్యాలతో రాజులతో అతనికి పరిచయాలున్నాయి .జీవిత చరమాంకాన్ని కాశీలో గడిపినట్లు తెలుస్తోంది .ప్రతీహార వంశం రాష్ట్ర కూట రాజు ఇంద్రుని చేతిలో నశించింది .అప్పుడు రాజశేఖరుడు త్రిపురకు వెళ్లి అక్కడ కాలచూరి రాజు కేయూర వర్షుని ఆస్థానం చేరాడు .శేఖరుడు పండిత కవి .అనేక రచనలు చేశాడు
కవితా రాజశేఖరం .
త్రిపురలో ‘’విద్ధ సాల భంజిక ‘’నాటకాన్ని రాజశేఖరుడు రాశాడు .అక్కడే ‘’కావ్య మీమాంస ‘’అనే అలంకార గ్రందాన్నీ రచించాడు .పాండిత్యం కవిత్వాలతో రాజుల మెప్పుపొంది అనేక ఘన సన్మానాలు అందుకొన్నాడు అతని సమకాలీన కవుల కృష్ణ శంకర వర్మ ,అపరాజితుడు మొదలైన వారు శేఖరుని గొప్ప తనాన్ని గుర్తించి కొనియాడారు .సాహిత్య కళల తో బాటు సాంస్కృతిక ,ధార్మిక విషయాలూ బాగా తెలిసిన వాడు .ఆకాలం లో మహిళా కవులైన భట్టారిక ,సుభద్ర లను మెచ్చుకొన్నాడు .స్త్రీ వలన సాహిత్య ప్రాచుర్యం పొందిన మొదటికవి రాజశేఖరుడు .ఎంత పాండిత్యం ఉన్నా హద్దుల్లో ఉందడి సాటి వారి యెడ గౌరవాదరాలు కలిగి ఉన్న సంస్కారి .ఇతరుల అభిప్రాయాలకు విలువ నిచ్చిన ప్రజాస్వామ్య వాది.
రాజ శేఖరుడు ఆరు కృతులను రచించాడని ‘’నః షట్ ప్రబందాన్ ‘’అని తన రామాయణ నాటక ప్రస్తావనలో తెలిపినదాన్ని బట్టి తెలుస్తోంది .కాని అయిదు రచనలే లభ్యం .అందులో నాలుగు నాటకాలు –అవి బాల రామాయణం ,బాల మహా భారతం ,కర్పూర మంజరి ,విద్ధ సాల భంజిక .అయిదవది అలంకార గ్రంధం అయిన ‘’కావ్య మీమాంస ‘’.భువన కోశం కూడా రాశానని చెప్పాడుకాని దొరక లేదు .
బాల రామాయణ నాటకం లో తాను వాల్మీకి అవతారాన్ని అని రాజ శేఖరుడు చెప్పుకొన్నాడు .సీతా స్వయం వరం తో ప్రారంభమై రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేదాకా కదనడుస్తుంది. పది అంకాలున్న నాటకం .కనుకనే మహా నాటకం అన్నారు .ప్రతి అంకానికి ప్రత్యేకమైన పేరు పెట్టి కొత్త దారి చూపాడు .అవే-ప్రతిజ్ఞా పౌలస్త్యం ,రామ రావణీయం ,విలక్ష లంకేశ్వరం భార్గవ భంగం ,ఉన్మత్త దశాననం ,నిర్దోష దశరధం ,అసమా పరాక్రమం ,వీర విలాసం ,రావణ వధ ,సానంద రాఘవం ‘’ఈపేర్లు చక్కగా ఆ అంకం లోని కధకు గొప్ప వివరణ గా ఉంది .నాటకానికి అవసరమైన మార్పులు చేశాడు. రావణ విరహానికి ప్రాముఖ్యం ఇచ్చాడు .మన యెన్ టి రామా రావు లాగా రావనణుడిమీద సానుభూతి పెరిగేట్లు చేశాడు .కధలో గమనం లో సన్నివేశాలలో .నాటకం లో కళా ద్రుష్టి పూజ్యం .బాపు గారి శ్రీరామ రాజ్యం లాగా సర్వం పూజ్యం అనిపిస్తుంది .కల్పనలకు ఎక్కువ విలువపొండాడు .
బాల భారత నాటకం కు ‘’ప్రచండ పాండవం ‘’అనే పేరుకూడా ఉంది .రెండు అన్కాలే లభించిన అసంపూర్తి నాటకం .ఇందులో ద్రౌపదీ స్వయం వరం ,జూదం వస్త్రాపహరణం ఉన్నాయి .కర్పూర మంజరి నాటకం ‘’సట్టకం ‘’అనే రూపక భేదానికి చెందింది .నృత్య ప్రధానమైంది .భార్య అవంతీ సుందరి ముద్దు కోరిక తీర్చ టానికే రాశాడు .మొదటి అంకం లో వసంతోత్సవ వేడుకలు ,చంద్రపాల రాజు రాణి విభ్రమ లేఖ ,విదూషక రంగ ప్రవేశం ఉంటాయి .విదూషకుడికి పరిచారిక విచక్షణ కు వసంత వర్ణన లో పోటీ ఏర్పడి కోపం వచ్చి భైరవానందుడు అనే సిద్ధుని తెస్తాడు విదూషకుడు .సిద్ధుడు మాయ జాలాన్ని చూపించి కర్పూర మంజరిని పరిచయం చేస్తాడు .రాజు ఆమె పై మరులు గొంటాడు .ఆమె రాణికి పిన్ని కూతురే .రెండవ రంగం లో మంజరి రాజు ను ప్రేమిస్తుంది .దూతిక ద్వారా తెలియ జేస్తుంది .రాజు మంజరిని చూస్తాడు .మూడవ అంకం లో మంజరి రాజుకు కలలో కన్పించిన విషయాన్ని విదూషకుడికి చెప్పటం విరహ వేదనతో మంజరి వచ్చి రాజును కలవటం ఈ వార్తా రాణి చెవిన పడటం .నాలుగులో-రాణి మంజరిని నిర్బంధం లో ఉంచటం సిద్ధుడికి కానుకగా ధన సార మంజరితో పెళ్లి చేయిస్తాననటం వార్త రాజుకు చేరవేయటం చివరికి ధనసారమంజరేకర్పూరమంజరి అని తేలటం ఇద్దరికీ వివాహం జరగటం తో సమాప్తం ఈ నాటకం రాజశేఖరుని నాటకాలలో గొప్పదని అభిప్రాయం. నాటక కళకు కవితా శోభ అద్దాడు .రీతి భేదం చూపి రక్తి కట్టించాడు .విదూషకుడు హుందాగా మాట్లాడటం ప్రత్యేకత .శౌరసేని ప్రాక్రుతాన్ని వాడి కొత్త దారి తొక్కాడు .
విద్ధ సాల భంజిక కూడా పైనాటకం లాంటిదే .’’నాటిక ‘’ అనే రూపక భేదానికి చెందింది .మొదటి అంకం లో రాజా చంద్ర వర్మ కూతురు’’ మృగాంక వతి’’ని ‘’ మృగాంక వర్మ’’ అనే పేరుతొ’’ కొడుకుగా’’ ప్రకటించటం ,ఆ వేషం లో ఆమె విద్యాధర మల్లుని రాణి దగ్గరకు చేరటం అతని మంత్రికి ఈ రహస్యం తెలిసిపోవటం ,ఆమెను పెళ్లి చేసుకొన్న వాడు చక్ర వర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పటం ,రాజు దగ్గరే ఆమెను ఉంచటం .ఒకసారి విద్యాధర మల్లుడికి ఆమె ముక్తాహారాన్ని విసిరిపోయినట్లుకల వచ్చి విదూషకుడికి చెబితే స్వప్నం లో చూసిన సుందరి బొమ్మను (విద్ధ సాల భంజిక )చిత్రశాలలో ప్రతిస్టిం చటం అప్పుడు మృగాంక వర్మ రావటం ,రాజుకు ఆమె స్త్రీ అని తెలియక పోవటం తో మొదటి అంకం పూర్తీ .రెండవ అంకం లో కుంతల రాకుమారి కువలయ మాల తో మృగాంక వర్మ వివాహం జరిపించటానికి రాణి ఆలోచించటం .ఒక రోజు నిజరూపం లో ఉద్యాన వనం లో విహరిస్తున్న ఆమెను రాజు చూడటం ఉంటుంది .మూడులో రాజు మృగాంకవతిని కలుసుకొంటాడు .ఇద్దరూ ప్రేమ బద్ధులౌతారు .నాలుగవ అంకం లో రాణికి ఈర్ష్య ఏర్పడి మృగాంక వర్మ పెళ్లి చేసేస్తుంది .ఇంతలో చంద్ర వర్మకు కొడుకు పుడతాడు. పుత్ర వేషం లో ఉన్న కూతురును రాజు కిచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు .చివరికి రాణి ఏమీ చేయలేక మృగాంక వతి బాటు కువలయ మాలను కూడా రాజు కిచ్చి పెళ్లి చేస్తుంది .
కదా సన్నివేశాలు బహు చమత్కారం గా తీర్చాడు. నాటకీయత లోపించి రక్తి కట్టలేదు .దీనిపై మాలవికాగ్నిమిత్ర ,రత్నావళి నాటక ప్రభావం బాగా ఉందనిపిస్తుంది .కవిత్వాపరం గా హిట్టే .నాటక కళ పరంగా ఫట్టే .ఇందులో సమకాలీన సామాజిక చరిత్ర ఉందని ఆనాటి ప్రజల మనోభావాలకు నిలువుటద్దమనీ భావిస్తారు .తన నాటకాలలో నాటక కళతక్కువే అని ఆయనే చెప్పుకొన్నాడు ..రస భావ అనుకూల భాషను ప్రయోగించటం లో రాజశేఖరుడి నేర్పు కన్పిస్తుంది .మాధుర్య గుణం తో ఉన్న సంగీత గుణం అతనికవిత్వం లో ఉంది .శబ్ద విన్యాస చతురుడు .పదలాలిత్యానికీ శేఖరుని ఉదహరిస్తారు .రాజ శేఖరుని రచనలు మునుల మనస్సుల్లాగా సమాధి గుణం కలవి ,ప్రసన్నం చేసేవి అని తిలక మంజరిలో ధనపాలుడు ప్రశంసించాడు –‘’సమాధి గుణ శాలిన్యః ప్రసన్న పరి పక్త్రియా –యాయా వర కవేర్వాచో మునీనామివ వృత్తయః ‘’
సంస్కృతం లోనే కాక ప్రాక్రుతభాషలైన శౌరసేని ,ప్రాకృత అపభ్రంసః భాషలమీదా ఆధారిటీఉన్నవాడు .బాల రామాయణం లో ‘’ప్రాకృతం సంస్కృతానికి జనని ‘’అని స్పష్టం గా చెప్పాడు .ప్రాకృత భాషలు చెవికి సోకితే ఇతర భాషలు రుచించవు అనీ చెప్పాడు .’’శుభస్య అపభ్రంశః ‘’అన్నాడు కావ్య రచనకు అపభ్రంశ భాషలు ఇతోధికం గా తోడ్పడతాయి అన్నాడు .భూత భాషను ‘’సరస రచనం భూత వచనం ‘’అని కీర్తించాడు .ఈ విధం గా అంతకు ముందు ఏ కవీ చేయని సాహసం చేసి ఆనాడు జన సామాన్యం లో వాడుకలో ఉన్న భాషలను సమాదరించి ,వాటికీ కావ్య గౌరవం ఉంది అని నిర్ద్వంద్వం గా తెలియ జెప్పిన వాడు రాజ శేఖరుడే .
కావ్య మీమాంస
రాజ శేఖరుడు రచించిన అలంకార శాస్త్రం ‘’కావ్య మీమాంస ‘’.ఇది క్షేమేంద్ర ,భోజ హేమచంద్రాదులకు ప్రేరణ గ్రంధం ఇందులో పద్దెనిమిది అద్యాయాలున్నాయి .కావ్య పురుషుడి ఉత్పత్తితో ప్రారంభించి ,అతడు అష్టాదశ శిష్యులకు కావ్య విద్యలు నేర్పటం శిష్యులు వాటిపై గ్రంధ రచన చేయటం, కావ్య భేదాలు ,సాహిత్య విద్యా కన్యను కావ్య పురుషుడు వివాహమాడటం,కవి భేదాలు ,భాష, శైలి వగైరాలు కవి సమయాలు ,కవిరహస్యాలు అలంకార సిద్ధాంత సమీక్ష మొదలైనవన్నీ శాస్త్రీయం గా రాశాడు .ఇలాంటివిషయ చర్చలు ఇంతకూ పూర్వం ఎవరూ చేయలేదు .అందుకే అపూర్వం అనిపిస్తాయి. కావ్యార్దాపహరణ లోముప్ఫై రెండు రకాలను తెలియ జేసి , చర్చించాడు .కవులకు అర్దాపహరణ తప్పదు అన్నాడు .గుణ రీతి ధ్వని సిద్ధాంతాలను స్పృశించాడు .కవుల దిన చర్యలు రాజ సభల్లో గోష్టి విధానం గొప్పగా చిత్రించాడు .రుద్రటుడి ప్రభావమ్ ఇతనిపై ఎక్కువ అంటారు .అలంకారాలు ,రీతులు కావ్యానికి ఉపయోగ సామగ్రి అన్నాడు .ఇవేవీ కావ్యాత్మకాదన్నాడు .ధ్వనిని గురించి ఎక్కడా స్పష్టం గా చెప్పలేదంటారు.అంటే అప్పటికి ధ్వని సిద్ధాంత వ్యాప్తి బాగా ఉండి ఉండక పోవచ్చు ఉక్తి వైచిత్రి అవసరం అన్నాడు .
భార్య అవంతీ సుందరికూడా సంస్కృత ప్రాకృత పండితురాలు .ఆమె అభిప్రాయాలకు విలువనిస్తూ చాలా సార్లు పేర్కొన్నాడు .’’రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యం గా పరిగ్రహిం చాలి ‘’అని అవంతీ సుందరి చెప్పినదానితో తానూ ఏకీభవిస్తున్నట్లు రాజశేఖరుడు చెప్పాడు .’’రసకవి యేఉత్తమ కవి ‘’అన్నాడు .కనుక రస సంప్రదాయానికి చెందిన వాడుగా రాజ శేఖరుని గుర్తించారు .కావ్య మీమాంసను ఆంగ్లం లో సి ఎస్ వెంకటేశ్వర న్ అనువదించి విపులమైన వివరణ చేశాడు .
మరో కవితో మళ్ళీ
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు