గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-
39-నైషద కర్త -శ్రీ హర్షుడు
గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు ముందుకు దూకి శ్రీ హర్షుడి గురించి రాస్తున్నాను .దీనికి కారణం ఇద్దరూ ఒకే కాలానికి చెందిన వారుకాకపోయినా ఇద్దరూ వేరు వేరు వ్యక్తులని చాలా మందికి తెలియదు ఒక్కరే అని చాలామంది భ్రమ పడుతున్నారు ..చక్రవర్తి హర్షుడు నాగానందం మొదలైన మూడు నాటకాలు రాస్తే , శ్రీ హర్షుడు సంస్కృత పంచకావ్యాలలో ముఖ్యమైన నైషద చరిత్ర అంటే మన శ్రీనాధుడు అనువాదం చేసిన శృంగార నైషధంరాశాడు .దీన్ని రాస్తూ ‘’హర్ష నైషద కావ్యమాంధ్ర భాష’’అన్నాడు . విద్వాంసులకే ఔషధం అనిపించుకొన్న మహా కావ్యం నైషధం .శ్రీహర్షుడు మహా మేధావి .కనిపించిన ప్రతి దానిపై అమోఘం గా కవితలల్లెవాడట .అవి అర్ధం చేసుకోవటం సామాన్యులకు అలవి అయ్యేది కాదట .పండితులే ముక్కున వేలేసుకొనే వారట .బుర్రలు బద్దలు కొట్టుకొన్నా మింగుడు పడేవికాదట .ఆ తెలివి తేటలు అనితర సాధ్యం గా ఉండేవట .తల్లికి భయం వేసేదట .అతని మేనమామను పిలిపించి గోడు వెళ్ళ బోసుకోనేదట .ఆయన దీనికి విరుగుడుగా అతని మేధస్సు తగ్గించటానికి రెండు కిటుకులు చెప్పి చేయిం చాడట .ఒకటి కాకర పాదు కింద రోజు వేడినీళ్ళతో స్నానం చేయించటం ,రెండవది బుద్దిమాంద్యం కలిగించే మినప పప్పుతో రోజూ కుడుములు లేక గారెలు వేసి తినిపించటం ఈ రెండూ ఆమె క్రమం తప్పకుండా చేసిందట .వీటి ప్రభావం వలన వెయ్యోవంతు మేధ మాత్రమె తగ్గిందట .’’మాష పూపాలపై ‘’(గారెలు )అలవోకగా అప్పుడు శ్లోకం చెప్పి వాళ్ళమ్మను మేనమామను సంభ్రమాశ్చర్యాలతో ముంచేశాడట .అతని మేధస్సును ఎవరూ తగ్గించలేరని నిర్ణయించుకోన్నారట .అలాంటి శ్రీ హర్షుని గురించి ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .శ్రీనాధ కవి సార్వ భౌముడు రాసిన అన్ని గ్రందాలకంటే శృంగార నైషదానికే గొప్ప పేరు వచ్చింది .హర్షుని హృదయాన్ని వెతికి పట్టుకొని రాసిన మహా కావ్యం అది .’’సీసాల’’తో ఉయ్యాల లూగించాడు .అంతేకాదు సంస్కృత నైషధం లో శ్రీహర్షుడు మంత్రం శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప వ్యాఖ్యానం రాశారు .
శ్రీహర్ష చరితం
కనోజు పాలకుడైన జయ చంద్రుని ఆస్థానకవి శ్రీహర్షుడు .కాలం 1130-1190.తల్లి మామల్లాదేవి తండ్రి శ్రీ హీరుడు .’’నైషద చరిత’’రాసి ప్రసిద్ధుడు అవటం వలన ‘’నర భారతి ‘’అనే బిరుదు పొందాడని రాజశేఖరుడు ‘’ప్రబంధ కోశం ‘’లో రాశాడు .జీవితం లో చివరికాలం గంగా నదీ తీరం లోతండ్రి ఉపదేశించిన ‘’చింతామణి మంత్రం ‘’జపిస్తూ ఒక ఏడాది గడిపాడు అప్పుడు త్రిపుర సుందరీదేవి ప్రత్యక్షమై అపూర్వ శేముషిని ,ప్రతిభను అనుగ్రహిం చిందని ,ఆ ప్రభావం తో అలవోకగా నోటినుండి కొన్ని శ్లోకాలు బయటికి వచ్చాయి అవి పండితులకే అర్ధం కాలేదట .మళ్ళీ దేవి అనుగ్రహాన్నిపొంది అందరికి సులభం గా అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పే సామర్ధ్యాన్నిపొందాడట .పండిత సభలో ఉదయనాచార్య అనే పెద్ద పండితుడిని ఓడించాదట .
.1174లో నైషద చరితను గుజరాత్ కు వీర ధవళ రాజు వద్దకు శ్రీహరుడు తీసుకొచ్చాడని, చందూ పండితుడు ‘’దీపిక’’లో చెప్పాడట .దీనికి విద్యాధరుడు వ్యాఖ్యానం రాశాడట .శ్రీహర్షుడు ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాసిన దానికంటే ముందే నైషషదము రాశాడట .శ్రీ హర్షుడు రాసినట్లుగా చెప్పబడుతున్న విజయ ప్రసస్తి ,చంద్ర ప్రశస్తి ,గౌడీర్వికాసకుల ప్రశస్తి ,సాహసాంక చరిత , ఆర్ణవవర్ణన ,అమర ఖండన అలభ్యాలు .న్యాయ శాస్త్ర విశేషాలపై హర్షుడు వ్యాఖ్యానం గా ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాశాడని అంటారు .ఇవికాక స్థైర్య విచారం ,చింది ప్రశస్తి ,శివ శక్తి సిద్ధి ,ఈశ్వర త్రిసంది రాశాడని అంటారు .
శ్రీహర్షుడు కనోజు రాజు జయ చంద్రుని ఆస్థానకవి .జయచంద్రుడు పృధ్వీరాజ్ చౌహాన్ కు మామ .కూతురు రాణి సంయుక్త ప్రుద్వీరాజును ప్రేమించింది .జయ చంద్రుడికి ఇష్టం లేదు .ఆమెను పృధ్వీరాజు వీరోచితం గా తీసుకొని వెళ్లి వివాహం చేసుకోన్నాడని చరిత్ర .నైషధకావ్యాన్ని రాసి కాశ్మీర్ కు తీసుకు వెళ్లి అక్కడ సర్వజన పీఠ అధినేత్రి సరస్వతీ దేవి హస్తాలలో ఉంచాడని ,ఆమె ఆదరం తో స్వీకరించిందని ,తన కావ్యానికి సరస్వతి ఆమోదం తెలిపిందని కాశ్మీర రాజు మాధవ దేవుని నుండి రాజ ముద్రిక ను వేయించుకొని లేఖను తెచ్చాడని ఒక కధనం ఉంది .పృధ్వీ సంయుక్తల అమరప్రేమనే నైషధం లో ప్రతిబింబింప జేశాడని అంటారు .
నైషధం లో శ్రీహర్షణీయం
నైషద మహాకావ్యం ఇరవై రెండు సర్గలున్నది .నల దమయంతుల ప్రేమకధా పూర్ణం .కద మనకు తెలిసినదే .నలుడిని పరీక్షించటానికి ఇంద్ర వరుణ ,అగ్ని, యములు దమయంతి స్వయం వారానికి రావటం ,నలుడికి తిరస్కరినణీ విద్య నిచ్చి తమ దూతగా దమయంతి దగ్గరకు రాయ బారిగా పంపటం ,నలుడి వేషం లోనే దిక్పలకులు కూర్చోవటం ,సరస్వతీ దేవి స్వయం గా వచ్చి స్వయంవర రాజులను చమత్కారం గా పరిచయం చేయటం ,దేవతల అనుగ్రంహం తో నలుని దమయంతి గుర్తించటం ,నల దమయంతుల వివాహం ,కలి వవిజ్రు0భణ ,మొదలైనవి ఉన్నాయి .ఇది మహా భారత కధయే .కొంత కదా సరిత్సాగరం లోనూ ఉంది .వివాహం వరకు శృంగారకావ్యం గానే రాశాడు .ఔచితీ యుతమైన రచన చేశాడు .
ఆలంకారిక శైలి భారవి తో ప్రారంభమై ,మాఘునిలో పరిపక్వమై శ్రీహర్షునితో ఉత్కృష్ట స్థాయి పొందింది .తరువాత వచ్చినవన్నీ అంత గొప్పవికావు కనుక ‘’ఉదితే నైషధే కావ్యే క్వ మాఘః క్వచ భారవిః’’అన్న లోకోక్తి ప్రచారమైంది .విద్వాంసుల గర్వమనే రోగాన్ని పోగొట్టే ఔషధం నైషధం –అంటే ‘’నైషధం విద్యదౌషధం ‘’.అంతేకాదు ‘’అందమైన కన్య సౌందర్యం బాలుని మనస్సునుఎలా ఆకర్షించ లేదో అదేవిధం గా సరసం లేని అరసులకు నా కావ్యం అర్ధం కాదు ‘’అని చెప్పాడు హర్షుడు .గురువుదగ్గరైనా చదువుకోవాలి ,లేకపోతె వ్యాఖ్యానాలన్నా చదవాలి .అప్పుడే అర్ధమవుతుంది .
హర్షుని కవిత్వం లో ఒజో గుణం ఉంటుంది .నారికేళ పాకం .పగల గోట్టుకు తింటూ నమిలితేనే మాధుర్యం .శ్లేష తో చమక్కులు చేశాడు .దీర్ఘ సమాసాలతో ఊపిరి ఆడనీయడు .ఉక్తి వైచిత్రి కి అగ్రాసనం వేశాడు .ప్రతిశ్లోకం అలంకార శోభితం .భావ కల్పనా అనితర సాధ్యం ,అద్భుతం ఆశ్చర్యం .అంతమాత్రాన పదలాలిత్యం లేదనుకోరాదు .అదీ తగుమోతాదులో ఉంది .నైషదే పదలాలిత్యం అన్న పేరూ పొందింది .శైలి గాఢమైన బంధాలతో గౌడీ రీతిలో ఉంటుంది .ప్రతిశ్లోకం రామణీయమే .ప్రతిభావం అపూర్వమే .ప్రతి అలంకారం పరమ రామణీకమే .
ప్రబంధం లో ఉండే వర్ణనలన్నీ చేశాడు .ఒకే విషయాన్ని పలు చోట్ల పలురకాలుగా వర్ణిస్తేనేకాని హర్షుడికి తృప్తి ఉండదు .’’ఎకామత్యజతో నవార్ధ ఘటనాం ‘’అన్నాడు .ప్రతిదానిలో కొత్తదనాన్ని కల్పిస్తాడు ,కన్పించేట్లు చేస్తాడు .నైషదానికి 23వ్యాఖ్యానాలున్నా మల్లినాద సూరి రాసిన ‘’జీవాతువు ‘’ప్రముఖమైనది .తర్వాత నారాయణ భట్టు రాసిన ,,నైషద ప్రకాశం .హర్షుడు ,మహా పండితుడు ,మహాకవీ మహా వ్యాకరణ, వేత్త ,మహా దార్శనికుడు .షట్ దర్శన పాండిత్య విశేషుడు .అద్వైత సిద్ధాంతి .చార్వాకాది సిద్ధాంతాలనూ చదివాడు .ఇతర దర్శానాలు అవహేళన చేశాడు .అతని వ్యాకరణ పాండిత్యాన్ని తెలియ జేసే శ్లోకాలు అపరిమితం గా కనిపిస్తాయి .అతని కామ శాస్త్ర పారంగత్యమూజ్యోతకమవుతుంది . ఇందులో కొన్ని ప్రతీకలు కనిపిస్తాయి .నల దమయంతుల ప్రేమకు హంస రాయ బారం జరుపుతుంది .ఈ హంసను జీవాత్మ ,పరమాత్మలను కప్పి ఉంచే అజ్ఞానాని తొలగించి వాటి ఇద్దరి కలయిక కు తోడ్పడే గురువు కు ప్రతీక అని భావించారు .ఇలాంటి అద్వైత భావనలెన్నో ఇందులో ఉన్నాయనే శేషేంద్ర శర్మ గొప్పగా నిరూపించారు .హర్షుడి మేనమామయే ‘’కావ్య ప్రకాశం’’ అనే అలంకార గ్రంధం రాసిన ముమ్మటుడు అని ఒక అభిప్రాయం ఉన్దిలోకం లో .మేనల్లుడు రాసిన నైషధాన్ని ముందే చూసి ఉండి నట్లయితే తాను తన అలంకార శాస్త్రం లో దోష ప్రకర ణానికి వేరే చోట్ల వెతుక్కొనే పని ఉండేదికాదు కదా అని అను కోన్నాడట .
మరోకవిని తర్వాత కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు