గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-
49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు
జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి అద్వైతాన్ని జ్ఞానేంద్ర భిక్షువు వద్ద ,న్యాయ వైశేషికాలను మహేన్ద్రుని దగ్గర ,వ్యాకరణ శాస్త్రాన్ని వీరేశ్వరుని వద్దా అభ్యసించి మహా పండితుడని పించుకొన్నాడు అలాంటి సర్వ సమర్ధుడైన తండ్రి వద్ద విద్య నేర్వటం జగన్నాధుని అదృష్టం అందుకే తండ్రిని కీర్తిస్తూ ‘’మహా గురుం ‘’అన్నాడు .పండితుడు రాసిన ‘’మనోరమా కుచమర్దనం లో తన గురువు శేష వీరేశ్వరుడనీ చెప్పుకొన్నాడు .అంటే తండ్రికి కుమారుడికి వీరేశ్వరుడు గురువు అన్నమాట .ఇతనికాలం1590-1667గా లెక్కిస్తున్నారు .రస గంగాధరం అనే ముఖ్య మైన అలంకార గ్రంధం రాశాడు .అందులో అతడు కావ్యానికి చెప్పిన ‘’ రామణీయార్ధ ప్రతిపాదక శబ్దః కావ్యం’’ అన్న నిర్వచనం ప్రతివారి నాలుకలపైనా నర్తించిన వాక్యం .
ఏదోకారణం వల్లకాని లేక అక్కడ తనను సమర్ధుడుగా సాటి వారు గుర్తించ నందు వల్లకాని జగన్నాధుడు స్వగ్రామం వదిలి యవ్వనం లో ఢిల్లీ చేరాడు ..అక్కడ ఒక రోజున ఇద్దరి మధ్య తగాదా జరుగుతుంటే చూశాడు వారు రాజుగారి కొలువులో ఫిర్యాదు చేసుకొంటే సాక్షిగా వెళ్ళిన జగన్నాధుడుతనకు వారి భాష రాక పోయినా తూ చా తప్పకుండా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను చెప్పాడు .అంతటి ఏక సంతాగ్రాహి .చక్రవర్తి ఆశ్చర్య పడి నిజానిజాలు నిర్ణయించి జగన్నాదునిని ప్రతిభకు మెచ్చి ఆస్థాన పండితుని చేశాడట .ఆయనే షాజహాన్ చక్రవర్తి .షాజహాన్ పాదుషా పండితుని సమాదరించాడు .షాజహాన్ తండ్రి జహంగీర్ కొలువులోను జగన్నాధుడు పండితుడుగా చలామణి అవటం విశేషం .జహంగీర్ చనిపోయిన తర్వాత ఉదయపూర్ రాజు జగత్ సింగు ఆశ్రయం పొంది ఆయనపై ‘’జగదాభరణ ‘’కావ్యం చెప్పాడు .1628లో దిల్లీ సింహాసనాన్ని షాజహాన్ అధిస్టించగానే జగన్నాధుడు వచ్చి చేరాడు అని ఆరవిందశర్మ రాసిన ‘’పండిత రాజ కావ్య సంగ్రహ పీఠిక ‘’లో ఉంది .జగన్నాధుడు ఇక్కడి కొలువులో చేరటానికి ప్రోత్సహించింది షాజహాన్ మామ ,ముంతాజమహల్ తండ్రి అయిన ఆసిఫ్ ఖాన్ .దానికి కృతజ్ఞతగా పండితుడు ఆయనపై ‘’ఆసిఫా విలాసం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు .జగన్నాధుని పాండిత్యాన్ని కవిత్వ ప్రాభవాన్ని గుర్తించిన షాజహాన్ జగన్నాదుడిని గొప్పగా సన్మానించి ‘’పండిత రాజు ‘’బిరుద ప్రదానం చేశాడు .సువర్ణాభిషేకమూ చేశాడు .
షాజహాన్ కొడుకు దారా కు బాల్య గురువు జగన్నాదుడే .అందుకే దారా సంస్కృతం లో పేరుపొందిన కవి అయ్యాడు .ఔరంగ జేబు షాజహాన్ ను కారాగారం లో బంధించి , దారా మొదలైన అన్నదమ్ములని క్రూరంగా చంపించి పాదుషా అయ్యాడు 1666లో .ఈ రాజకీయ సంక్షోభానికి క్షోభ పడి జగన్నాధుడు అక్కడ ఉండలేక ఈ నాడు అస్సాం అని పిలువ బడే కామరూప దేశం చేరి రాజు ప్రాణ నాధుని ఆస్థానం లో చేరి ,అతని పై ‘’ప్రాణాభారణ కావ్యం ‘’రాసి ఉంటాడని భావిస్తారు .ముసలితనం లో కాశీ చేరి ,తర్వాత మధుర వచ్చి యమునా నదీ తీరం లో కాలం గడిపాడని అంటారు .
ఢిల్లీ లో ఉండగా జగన్నాధుడు ‘’లవంగి ‘’అనే ముస్లిం కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోన్నాడని ఆమె షాజహాన్ ఆస్థానం లో చెలికత్తె అని ,ఆమెను తనకు ఇవ్వమని పాదు షాను కోరాడని ఇస్లాం మతం తీసుకొంటే ఇస్తానని చెప్పి స్వీకారానంతరం లవంగిని కట్ట బెట్టాడని కద ప్రచారం లో ఉంది .కాని మతం మారాడని ఎవరూ నిర్ధారించలేదు .లవంగిపై’’ భామినీ విలాస ‘’కావ్యం రాశాడు .కాశీలో గంగా నది ఒడ్డున భార్య లవంగితో కూర్చుని ‘’గంగా లహరి ‘’రచించాడని యాభై రెండవ శ్లోకం పూర్తీ అయ్యేసరికి గంగ క్రమంగా పైకి వచ్చి వారిద్దరిని తనలో కలుపుకోందని అంటారు .వృద్ధాప్యం లో ఉండగా మధుర లోశ్రీ కృష్ణ సన్నిధి లో జగన్నాధుడు జీవించాడని చెప్పటానికి అతడు రాసిన ఒక శ్లోకం ఆధారం గా కని పిస్తోంది .
‘’శాస్త్రాణ్యా కలితాని నిత్య విధయః సర్వేపి సంభావితా –డిల్లీ వల్లభ పాణి పల్లవ తలే నీతనం నవీనం వయః
సంప్రత్యు జ్ఘిత వాసనమ్మదుపురీ మధ్యే హరిహ్ సేవ్యతే –సర్వం పండిత రాజ రాజి తలకే నాకారి లోకాధికం ‘’.
జగన్నాధ పాండి తీయం
జగన్నాధ పండిత రాయలు రస గంగాధరం అనే అలంకార శాస్త్రాన్ని రాశాడు .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశం తర్వాత దీనికే ప్రసిద్ధి ఎక్కువ ఇందు లోని విభాగాలను ‘’ఆననాలు ‘’అన్నాడు ..దీన్ని ఒక ఉద్గ్రంధం గా రాయాలని ప్రణాళిక తయారు చేసుకోన్నాడుకాని రాయలేక పోయాడని అంటారు .ఇప్పుడున్న రసగంగాధారం లో రెండే రెండు ఆననాలు ఉన్నాయి .జగన్నాధుడు చెప్పిన ‘’రమణీయార్ధ ప్రతి పాదకః శబ్దం కావ్యం ‘’అన్న రమణీయ మైన నూతన నిర్వచనం చెప్పాడు .దీనికి విపరీతమైన వ్యాప్తి కలిగింది .దీనికి మించిన నిర్వచనం లేదని విశ్లేషకుల భావన .ముందుగా కావ్య లక్షణాలు చెప్పి తర్వాతే కావ్య భేదాలను చెప్పాడు .కావ్యాలను ఉత్తమోత్తమ ,ఉత్తమ ,మధ్యమ ,అధమ అని నాలుగు రకాలు గా పేర్కొన్నాడు ధ్వని తోకూడింది ఉత్తమోత్తమ కావ్యమని ,వ్యంగ్య ప్రధానమైంది ఉత్తమ కావ్యమని ,గుణీ భూత వ్యంగ్యం ఉన్నది మధ్యమం అని, చిత్ర కావ్యం అధమ కావ్యమని విభజించాడు .మొదటిది జగన్నాధుడు స్వంతం గా చెప్పిన మాట .
జగన్నాధుడు రస గంగాధరం లో రసం గూర్చి విపులంగా చర్చించాడు .రస చర్చ ఉత్క్రుస్టం గా ఉంటుంది .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాంతానికి గొప్ప వత్తాసు పలికాడు .ధ్వని సిద్ధాంతాన్ని భరతుడి రస సిద్ధాంతం లోకి లాక్కొచ్చాడు .ధ్వనిని మెచ్చినా జగన్నాధుడు రస వాది అనే అనిపించుకొన్నాడు .రుయ్యకుడి మార్గాన్ని కొంత వరకు అనుసరించాడు .అలంకారాలలో ‘’తిరస్కారం ‘’అనే కొత్త అలంకారాన్ని వివరించాడు జగన్నాధుడు .సూత్రాలలోనే రసగంగాధారం రాశాడు తానె స్వయం గా విపులమైన వ్యాఖ్యనూ రాసుకొన్నాడు పండితుడు .మౌలికమైన తన భావనలు ప్రకటించాడు .అవసరమైన చోట్ల ఆనంద వర్ధన, ముమ్మటు లను విమర్శించ టానికి వెనుకాడ లేదు .జగన్నాధుని పాండితీ గరిమ ప్రతి దశలోనూ ప్రస్పుటం గా దర్శనమిస్తుంది .ప్రాచీన పండితులలో చివరివాడుగా జగన్నాధుడు పరిగణింప బడుతున్నాడు .అతనిది ప్రవాహ శైలి .తన కవిత్వం గురించి గర్వం గా –‘
‘’కవయతి పండిత రాజే కావ్యం త్వంఎపి విద్వాంసః –నృత్యతి పినాక పాణౌ నృత్యంత్యన్యే పి భూత భేతాళాః’’దీని భావం –పండిత రాజు కవిత్వం రాశాడు ఇతరకవులూ రాశారు .శివుడు నృత్యం చేస్తున్నాడు .భూత భేతాళాలూ నాట్యం చేస్తున్నాయి ‘’అని తక్కిన కవులను ఈసడించాడు .
జగన్నాధుడు అనేక చిన్న కృతులను రచించాడు .అందులో గంగాలహరి ఒకటి దీనికి పీయూష లహరి అనే పేరూ ఉంది. యాభై మూడు శిఖరిణీ వృత్తాల తో కమనీయ మనోహరం గా రాశాడు .రెండవది అమ్రుతలహరి .యమునా లహరీ అని కూడా పిలుస్తారు శార్దూల శ్లోకాలతో రాసిన యమునా నదీ స్తుతి .గంభీరం గా సరసం గా ఉంటుంది .మూడవది కరుణాలహరి .ఇందులో విష్ణు మూర్తి ను వంశస్త ,సుందరీ మాల భారిణి వృత్తాలలో స్తుతించాడు .విష్ణు లహరి అంటారు .నాలుగవది లక్ష్మీ లహరి –నలభై ఒక్క శిఖరిణీ వృత్తాల తో లక్ష్మీ స్తుతి చేశాడు .అయిదవది సుధాలహరి ముప్ఫై స్రగ్ధరా వృత్తాలతో ఉన్న సూర్య స్తుతి ఇది .వీటిని ‘’పంచ లహరి ‘’అంటారు ఆరవది యమునా వర్ణన –తన రసగంగాధరం లో చెప్పిన మధ్యమ కావ్యానికి ఉదాహరణ గా దీన్ని రాశాడు .మిగిలినవి ఆసఫ్ విలాసం ,ప్రాణాభరణం ,జగాదాభరణం గురించి ముందే చెప్పుకొన్నాం .
జగన్నాధుని రసగంగాధరం తర్వాత ఎక్కువ ప్రాచుర్యమైనది భార్య లవంగిపై చెప్పిన ‘’భామినీ విలాస కావ్యం ‘’.ఇది ముక్తక కావ్య విభాగానికి చెందింది.ఇందులో నాలుగు విలాసాలున్నాయి ప్రాస్తావిక విలాసం ,శృంగార విలాసం ,కరుణ విలాసం ,శాంత విలాసం .మొదటి విలాసం లో నూట ఇరవై తొమ్మిది, రెండులో నూట ఎనభై నాలుగు, మూడులో పందొమ్మిది ,నాల్గవ విలాసం లో నలభై ఆరు శ్లోకాలున్నాయి .వివిధ వృత్తాలలో దీన్ని రచించాడు. కోపించిన స్త్స్త్రీని భామిని అంటారు .అన్యోక్తులతో కూడి ఉన్న ముక్తకాలు మొదటి విలాసం లో ,స్త్రీ వర్ణన ,ప్రణయం రెండవ విలాసం లో మూడవ దానిలో వియోగ దుఖం ,నాల్గవ విలాసం లో వైరాగ్య, శాంత భావాలతో బాటు జగన్నాధుని శ్రీకృష్ణ భక్తికూడా ఉంటుంది .
పండిత జగన్నాధ రాయలు ఏదిరాసినా హృదయానికి తాకేట్లు రాసే నేర్పున్న మహా కవి .చదివి ప్రేరణ పొందుతాం తన ప్రియురాలి అమృత విలాసమే కవిత్వం గా పరిణమించిందని చెప్పుకొన్నాడు
‘’కావ్యాత్మనా మనసి పర్యమణన్ పురామే –పీయూష సార సద్రుశాస్తవ ఏ విలాసాః
తానంత రేణ రమణీ రమణీయ శీలా –చేతో హరా సుకవితా కవితా కధన్నః ‘’
శబ్దాలంకారాలు వాడినా రస సౌందర్యం దెబ్బ తిన కుండా ఔచిత్యం పాటించాడు ‘’మధువు ,ద్రాక్ష ,అమృతం ఆధర సుధా అందరికీ ఆనందాన్ని ఇవ్వక పోవచ్చు కాని తన కవిత్వం మాత్రం అందరికి ఆనందాన్నిస్తుందని జబ్బ చరఛి చెప్పాడు .అలా ఆనందం పొందని వాడు జీవచ్చవం అని శాపనార్ధాలూ పెట్టాడు మహాను భావుడు .
‘’మధు ద్రాక్షా సాక్షా దమృత మధ వామాధరసుధా –కదాచిత్ కేషాం చిన్న ఖలు విదదీరన్నపి ముదం
ధృవం తే జీవంతో ప్యాహహ మ్రుతకా మంద మతయో –నఎశా మానందం జనయతి జగన్నాధ భణితిః’’’
ఈ దర్పం ,అహంకారం శాస్త్ర రచనలలోనే చూపించాడు పండితుడు .కావ్యాలలో చాలా సౌమ్యం గానే ఉన్నాడు. అతని శాస్త్ర పాండిత్యం అంత ధిషణాహంకారం తో ఉండేదన్న మాట .కవిత్వం పాండిత్యం మౌలికత త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన వాడు జగన్నాధ పండిత రాయలు .తెలుగు వారికి గర్వకారణమైన వాడు .మహోన్నత సంస్కృత సాహిత్యంయుగం జగన్నాధ పండితుని తో ముగిసింది .అలాంటి మౌలిక పాండిత్యం ఉన్న కవి శ్రేష్టుడు మళ్ళీ జన్మించనే లేదు .
మరో కవిని తర్వాత కలుద్దాం
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో –
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-14-ఉయ్యూరు
–