గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50
50- విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి -వామన భట్ట బాణుడు
పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం లో విరూపాక్ష స్వామి వసంతోత్సవాలలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది .1380లో విజయ నగర రాజు మొదటి దేవరాయల శాసనాన్ని వామన భట్టు రచించాడు .అందులో తాను కవీశ్వరుడనని వ్యాకరణ మీమాంసా శాస్త్రాలలో పండితుడనని చెప్పుకొన్నాడు .
భట్ట బాణ కవితా త్రివిక్రమం
వేమారెడ్డి ప్రభు జీవిత చరిత్రను ‘’వేమ భూపాల చరిత్ర ‘’గా వామన భట్టు రాశాడు .ఇదికాక ‘’హంస సందేశం ‘’అనే లఘుకావ్యం రాశాడు .ఇందులో రెండు భాగాలున్నాయి ,నూట ముప్ఫై ఒక్క శ్లోకాల గ్రంధం .కావ్యం అంతా మందా క్రాంత వృత్తం లోనే రాశాడు .కాళిదాసు మేఘ సందేశ చాయలు ఎక్కువగా ఇందులో గోచరిస్తాయి .ఇందులో వార్తాహరత్వం చేసింది హంస . –దక్షుడు అనే యక్షుడు ప్రియురాలిన కందర్ప లేఖ కు హంసద్వారా సందేశం పంపటమే కద.యక్షుడు నేరం చేయటం వలన కైలాసం నుండి పంపించి వేయ బడ్డాడు .మలయ పర్వతం మీద ఉంటున్నాడు .అతని ప్రవాస శిక్క్ష ఒక ఏడాదిమాత్రమే . అలకా నగరం లో ఉన్న తన ప్రియురాలికి ఇక్కడి నుండి సందేశం పంపుతాడు .యక్షుడు హంసకు అలకానగరం ఎలా వెళ్ళాలో రూట్ మాప్ తెలియ జేస్తాడు. తామ్రపర్ణి ,మధుర ,కావేరి ,శ్రీరంగం ,చిదంబరం ,కంచి ,కాళహస్తి కృష్ణా గోదావరి తుంగభద్రానదులు దాటి వింధ్య ను చుట్టి నర్మదా ,యమునా గంగా వారణాసి ,అయోధ్య ,సరయు గండకి నదులు చూసి కురుక్షేత్రం హిమాలయాలను క్రౌన్చాపర్వతాన్ని దర్శించి కైలాసం మీదుగా అలకా నగరం వెళ్ళమని చెబుతాడు .పర్వత నగర నదీ వర్ణనలను కాళిదాసు బాటలోనే చేశాడు .ఇదంతా మొదటి భాగం లో ఉన్నాయి రెండవ భాగం లో హంస అలకా నగరం చేరిన తర్వాత తన ఇంటి జాడలను గురించి చెబుతాడు .ప్రియురాలి వర్ణన, ఆమె విరహ వేదన, తర్వాత దక్ష యక్ష సందేశాన్ని హంస అతని ప్రియురాలు కందర్ప లేఖకు తెలియ జేయటం తో కావ్యం అయి పోతుంది .వర్ణనలు స్వారస్యం గా చేశాడు వామన భట్టు .భార్య విరహాన్ని వర్ణిస్తూ-
‘’చిత్రే కర్తుం వ్యవసితా మతిస్తూలికాయాం ద్రుతాయాం –భగ్నా రంభో .నాయన సలిలై స్చేతసి త్వాం లిఖామి
తత్రాపి ద్రాగరతి రదికోల్లాసినీ మే విహన్త్రీ –యత్ సత్యం నోవరతను విధిఃసంగామే సాభయ సూయః ‘’
వామనుడు ‘నలాభ్యుదయం ‘’,రఘు వీర చరిత్ర ‘’అనే రెండు మహాకావ్యాలు రాశాడు .ఇవికాక పార్వతీ పరిణయం ,కనక లేఖా కల్యాణం ,బాణాసుర విజయం అనే నాటక రచనా చేశాడు .ఉషాపరిణయం అనే నాటకాన్ని వామనుడు రాశాడని మల్లంపల్లి వారు చెప్పారు .బహుశా బాణాసుర విజయం ఉషాపరిణయం ఒకటే కావచ్చు .
వామన భట్టు ముఖ్యం గా గద్య కవి .బాణుడులాగానే చక్కని గద్య రచనా చేశాడు .ఇతని శృంగార భూషణం అనే భాణం లో ఒకే ఒక్క అంకం ఉంటుంది .విలాస శేఖరుడు అనే విటుడు అనంగ మంజరి ఇంటికి వెడుతూ ఉంటె దారిలో అతడు చూసిన వింతలు , విశేషాల వర్ణనే ఈ రూపకం .అందులో పేద ,ధనిక వర్గాల వారు ,విటులు వేశ్యలు శ్రుంగార కార్యకలాపాలు ,గొర్రె పొట్టేళ్ల పోట్లాటలు ,కోడి పందాలు ,జూదం ,మల్లయుద్ధం ,ఖడ్గ యుద్ధం స్త్రీల బంతులాట ,ఉయ్యాల లూగటం మొదలైనవి అన్నిటిని వామన భట్ట బాణుడు వర్ణిస్తాడు .
పార్వతీ పరిణయము అయిదు అంకాల నాటకం . .ఇందులో శివ పార్వతుల కల్యాణం వర్ణించాడు .కుమార సంభవ కధను చేర్చాడు .కవిత్వం గొప్పగామధురం గా సరసం గా ఉంటుంది .కనక లేఖా పరిణయం నాలుగు అంకాలున్న నాటకం .విజయ వర్మ అనే రాకుమారుడు వీరవర్మ కూతురు కనక లేఖను ప్ర్రేమించి పెళ్ళాడే కద.మధ్యలో అనేక చిక్కులు వాటిని అధిగమించటం చివరికి పెళ్ళితో తెర పడి సుఖాంతమవుతుంది .కొత్తదనం లేక పూర్వపు నాటకాల ధోరణిలోనే సాగింది .ఏనుగుల వేట ,ప్రియురాలి చిత్రపటం తో రాజు వినోదించటం నాయకురాలి ముగ్ధత్వం ఉంటాయి .శృంగారరస ప్రధాన నాటకం .హాస్యం అద్భుతరసాలు కూడా ఉండి కాలక్షేపానికి పని కొస్తాయి .
మరో కవిని కలుద్దాం –
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు