తుస్సు టపాసులు
వాలిపోయే అవ్వాయి చువ్వలాగా దూసుకొచ్చాడు మా బామ్మర్ది బ్రాహ్మి ‘’.బావా ఏటపాసులూ పేలటం లేదని అంటున్నారేమిటి బావా’’అన్నాడు బోల్డు ఆశ్చర పోతూ .’’అదేంటిరా .తుఫాను వచ్చింది విశాఖ ఇజీనగరం సికాకోలు జిల్లాలకేగా ?మనకేమీ వర్షం లేదు తడిసే పనీ లేదు ఎందుకు పేలవు ?’’అన్నా అమాయకం గా .’’లేదు బా.ఎప్పుడూ కొనే వాడికోట్లోనే కొట్టుకొచ్చా .కాలిస్తే ఒక్కటీ కాలలేదు పేలలేదు ‘’అన్నాడు ఏడుపు మొహం తో .’’ఎందుకిలా?’’అని పోజు పెట్టా సుబ్బరాయ శర్మలాగా .’’నువ్వు బ్రాండ్ లేబిల్ చూశావా?’’అని అడిగా ..’’చూసిన గుర్తు లేదు బా .అయినా మీ చెల్లికి ఫోన్ చేసి తెలుసు కొంటానుండు ‘’అని ఫోన్ చేసి సమాధానం రాగానే తెల్ల మొహం వేశాడు .’’ఇంతకీ ఏం చెప్పింది మీ ఆవిడ?’’నా కుతూహలం ఆగక అడిగా .’’చిచ్చుబుడ్లు సోనియా బ్రాండ్ వి ,నేలటపకాయలు రాహుల్ బ్రాండ్ వి ట బా ‘’అన్నాడు బారుమంటూ .’’హర్యానా మహారాష్ట్ర లలో ఇద్దరి ఇజ్జత్తు తుస్సుమందిగా మొన్న ఎన్నికల్లో .అందుకే ఆబ్రాండ్ వి కూడా తుస్సుమని ఉంటాయి ‘’అన్నాను ఊరడిస్తూ .’’సరేకానీ బాంబులూ ఔట్లూ బాగా పేలాయా?’’మళ్ళీ నాప్రశ్న.వాడు మళ్ళీ ఫోన్ లో ఎంక్వైరీ ,మరలా దిగాలు మొహమూ చూడలేక ‘’ఏమైందిరా?’’అన్నా ‘’మోసం బా .’’మళ్ళీ బావురు .’’పవార్ ఆటంబాంబులు ,చవాన్ ఔట్లూటబా ‘’అన్నాడు .నీళ్ళు రాకపోయినా అశ్రుపూర్ణు డనిపించినట్లున్నాడు.’’ఆహా !అదీ విషయం .ఇద్దరి గాలి మహారాష్ట్రలో తుస్సుమంది రా. దానిప్రభావమే’’ అన్నా .సరే బావా నరకచాతుర్దసి ఎట్లాగో అయిన్దనిపించాం .దీపావళికి ఏమి కొనాలో ఎక్కడ ఏ బ్రాండ్ వికోనాలో తోచటం లేదు బా ‘’అన్నాడు .’’మతాబాలు ,సీమ టపాకాయల సంగతేమిటి ?’’మళ్ళీ ప్రశ్నించా .పాపం మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకొని మళ్ళీ బావురుమన్నాడు .’’ఏమిటి సంగతి ?’’అడిగా .’’అవీ మోసమే బా .హుడా ,చౌతాలా బ్రాండ్ లట .అవీ వెలగలేదు ,పువ్వులు రాలలేదు .టపటప మనాల్సిన సీమ టపాకాయలు నీళ్ళు కాచే పొయ్యిలో వేసినా ఉలకా లేదు పగల లేదు శబ్దం ఒస్తే ఒట్టు ‘’అన్నాడు ఏడుపోక్కటే తక్కువ .’’అలా చెప్పు .హర్యానాలో ఇద్దరూ మట్టికరిచారుకదా .ఇంకేం పేల్తాయిరా .పదవులలో ఉండగా దర్జాగా వాళ్ళు వెలిగారు .జనం గోడు పట్టించుకోలేదు .అవినీతి మురుగులో కూరుకు పోయిన ఫలితం .అల్లుడుగారి మేహర్బానీకోసం హర్యానాను తాకట్టు పెట్టిన ఫలితమే ఇది .ఇక ఆబ్రాండ్ లకు కాలం చేల్లిపోయిన్దిరా .కొత్త బ్రాండ్ లు వచ్చాయని అందరూ అంటున్నారు .అవి ట్రై చెయ్యి ‘’అన్నా .
‘’బావా అందరూ మోడీ బ్రాండ్ వే కొంటున్నారట .నాబుద్ధి గడ్డి తిని నూరేళ్ళ పాత బ్రాండ్ కదా అని ఆశ పడి మోసపోయాను .అప్పటికీ మీ చెల్లెలు చెబుతూనే ఉంది ఈ బ్రాండ్ అంతా కల్తీ ,దగా మోసం అవినీతి తో కూరినవే .అందుకే తుస్సు బస్సు లే తప్ప ప్రతాపం చూపి పేలలేక పోయాయి ,కాల లేక పోయాయి వేలుగులివ్వలేక పోయాయి ,తిరగ లేక పోయాయి ఎగర లేక చతికిల పడ్డాయి .’’అన్నాడు జ్ఞాన నేత్రం తెరుచుకున్నఅజ్ఞాని లా .’’బావా !ఇక ఇప్పుడు చెలామణి లో ఉన్నది ఒకే ఒక్క బ్రాండ్ మోడీ బ్రాండ్ .కావలసిన టపాకాయలన్నీ ఆ బ్రాండ్ వే కొంటా .మోతమోగిస్తా .వెలుగులు నింపేస్తా .దూసుకేల్తా ఇక తిరుగే లేదు .’’అంటూ ‘’మోడీ-అమిత్ షా అవ్వయిచువ్వాయి’’లాగా రెట్టించిన వేగం తో, కాంతితో, మోతలతో, ఇంటికి దూసుకు వెళ్ళాడు బ్రహ్మి బామ్మర్ది,
దీపావళి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు