
వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. భారతీయులంతా ఒకే కుటుంబ పరివారమనే విధంగా అందరి మనసుల్లో కొలువైనది- దివ్వెల పండగ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. చెడు నిర్మూలనం జరిగినపుడు జీవకోటికి కలిగే ఆనందానికి అవధులుండవన్న విషయం అందరికీ తెలిసిందే. పేరులోనే దీపాల వరుసను స్ఫురింపజేసే ఈ పండుగ మరే పండుగకూ లేని విశేషోత్సవాలు, సంబరాలను సొంతం చేసుకుంది. పురాణ కథనాల మేరకు దక్షిణ భారతీయులకిది మూడునాళ్ల ముచ్చటైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతర్దశిగాను, అమావాస్యను దీపావళి పండుగ గాను, కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది.
చీకటి విశ్వరూపాన్ని దర్శించిన మన జ్ఞానులు జ్యోతి స్వరూపాన్ని కూడా దర్శించి తద్వారా మనకు దిగ్దర్శనం గావించి ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ ప్రార్థన చేయించారు. నిజం చెప్పాలంటే ఏడాదికొకసారి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు అనగా- అమావాస్య నాడు మాత్రమే దీపం వెలిగించి నమస్కరించే మొక్కుబడి కాదు మనది. ప్రతి సాయంత్రం ఇల్లు తుడిచి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని స్ర్తిలు దీపం వెలిగిస్తూ…
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే’’
– అంటూ శ్లోకం పఠించి, మెడలోని మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకొని ఆ వెంటనే దీప జ్యోతికి నమస్కరించుకొనే సత్ సాంప్రదాయం. ఇందుకు కారణం లేకపోలేదు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ జ్ఞాన సమారాధన, జ్ఞాన ఉపాసనే ‘దీపారాధన’ అని పలు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ప్రాచీన ఆర్ష వాక్యంలోని ఆత్మీయతతో పండుగలు గీటురాళ్ళని మన రుషులు నొక్కి పలికారు. దీపాన్ని మన జీవన గమనానికి పోల్చుకొంటే చీకటి వెలుగుల గురించి విశ్వమంత విషయంగా విపులంగా తెలుసుకునే వీలవుతుంది.
చెడు చీకటైతే, మంచి వెలుగై నిలుస్తుంది. అలాగే అజ్ఞానం చీకటి- జ్ఞానం వెలుగు. బతుకేమో వెలుగు- మృత్యువు చీకటి. అదేకోవలో బాధ-చీకటి, సంతోషం- వెలుగు. ఆకలి చీకటి- ఆహారం వెలుగు. స్వార్థం చీకటిగా ఉంటుంది, త్యాగం వెలుగవుతుంది. హింస చీకటి, అహింస వెలుగు. కామం చీకటి- ప్రేమ వెలుగు. ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వంటి పరమయోగులు పలు సందర్భాల్లో ఉటంకించారు. అపకారం చీకటి, ఉపకారం వెలుగు. మోసం చీకటి, నిజాయితీ వెలుగు. ఇలా ఒకటొక్కటిగా పోల్చుకొంటూపోతే చీకటి, వెలుగుల విషయాలు ఎనె్నన్నో మనకు తెలుస్తాయి.
చీకటి విడిపోవాలంటే వెలుగు తప్పనిసరి. జగానికే జ్యోతి అయిన సూర్యభగవానుడు పగటి పూట తన వెలుగులతో జీవకోటిని ముందుకు నడిపిస్తూ ఆరోగ్య ప్రదాతగా ఉంటున్నాడు. సూర్యాస్తమయం కాగానే చీకటి కమ్ముకొస్తుంది. మన కార్యకలాపాలకు కొంతవరకు అవరోధం కలుగుతుంది. అలా కాకుండా ఉండేందుకై ఇంట దీపం వెలిగించుకొని పనులు చక్కబెట్టుకొంటున్నాము. చీకట్లోంచి వెలుగుబాటలో పయనించాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఇది సహజం. ధర్మసమ్మతం కూడా. మరింత లోతులకు వెళ్లి తరచి చూస్తే దీపం మానవాళికి ఐశ్వర్యం ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అని పలు పురాణాలు ప్రవచిస్తున్నాయి. నిలువెల్లా పవిత్రతను రంగరించుకున్న దీపాన్ని జ్ఞానచిహ్నంగా, ఐశ్వర్యమునకు సంకేతంగా, సంపద, ఆనందాలకు ప్రతీకగా భావించడంలో తప్పులేదంటూ జ్ఞానులు చెప్పిన మాటలతో మనం ఏకీభవించక తప్పదు.
నరక చతుర్దశి నాటి రాత్రి ఇంటిలో అష్టదిశలయందు అనగా నాల్గు దిక్కులు, నాల్గు మూలల్లో దీపాలను వెలిగించి చీకట్లను తరిమివేసే ఆచారం పలు ప్రాంతాల్లో ఉంది. దీపావళి నాటి ఉదయం తైలాభ్యంగనం చేసుకొని, తెల్లటి బట్టలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూవులతో పూజిస్తే ఆ తల్లి కృప మనపై తప్పక ప్రసరిస్తుందన్న జ్ఞాన జనవాక్యంలో నిజముందనక తప్పదు. క్షీర సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవికి ఆ రోజున ధవళవర్ణం చాలా ఇష్టమని పురాణాల్లో అనేక ఆధారాలు న్నాయి.
దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని తెల్లటి పూలతోనే ఎందుకు పూజించాలి? అనే ప్రశ్నకు లభించిన సమాధానం ఇలా ఉంది. రాక్షస రాజైన బలి చక్రవర్తి సమస్త భూమండలాన్ని స్వాధీనం చేసుకోడమే కాక మహాలక్ష్మిని సైతం బంధించేశాడు. ఇలా చేయడంతో చరాచర విశ్వమంతా జ్యేష్టాదేవి వశమైపోయింది. ఫలితంగా యజ్ఞయాగాదులు నిలచిపోయాయి. ఎటుచూసినా చీకటి, అయోమయం. అప్పుడు దేవతా గణమంతా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపమని ప్రార్థించారు. కశ్యపుడు,అదితి దంపతులకు వామనమూర్తి అవతారంగా విష్ణుమూర్తి జన్మించాడు. బలి దురాగతాలను అణచివేసేందుకై అతని వద్దకు వెళ్లి తన నిత్యానుష్ఠాన కార్యకలాపాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొనేందుకు మూడడుగుల నేల దానమీయవలసిందిగా కోరాడు. అందుకు బలి అంగీకరించాడు. వామనమూర్తి త్రివిక్రమ రూపధారియై భూమ్యాకాశాలు రెండడుగుల్లో ఆక్రమించుకొని, బలి చెప్పిన మేరకు మూడవ అడుగు అతని నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కివేసి దేవతలతోపాటు తన దేవేరిని కూడా బంధ విముక్తను గావించాడు. దాంతో అసుర రాజ్యం అంతరించింది. చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరించింది. జనావళి ఆనందోత్సాహాలతో అమావాస్య నాడు పున్నమి వెనె్నలను చూశారు. అప్పటి నుండి పున్నమి వెనె్నలను పోలిన తెల్లటి పూవులతో శ్రీ మహాలక్ష్మిని దీపావళి నాడు పూజించడం ఆచారమైనట్లు పురాం కథనం.
మరో కథనం మేరకు పురాణాల్లో చెప్పిన వామనుని మూడడుగులే విష్ణువు త్రిపాదములని తెలుస్తోంది. విష్ణువు అంటే సూర్యభగవానుడే. అందుకే సూర్యుణ్ణి ‘సూర్యనారాయణ మూర్తి’ అని కీర్తిస్తారు. సూర్యుడి ఉదయం, మధ్యాహ్నం, అస్తమయాలే ఆయన మూడు పాదాలని పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్యాస్తమయం తర్వాత వచ్చేది చీకటి. ఉత్తర ధృవవాసులు తులా సంక్రమణంతో ఆరంభమైన ఆరు నెలలు దీర్ఘరాత్రిలో దీపోత్సవం చేసి, ‘నిశాచర రాజైన బలి చక్రవర్తి అనే శత్రువును పాతాళానికి అణగదొక్కి సూర్యుడు మాకు మళ్లీ కనబడుగాక’ అని ప్రార్థించడానికి ఏర్పాటుచేసిన వెలుగుల పండుగ దినమే దీపావళి అని కూడా బుధులు చెప్పినట్టు తెలుస్తోంది.
భారతీయులంతా ఆనందమయంగా జరుపుకునే ఈ పండుగ వేడుకలు, ఆచార వ్యవహారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కర్నాటకకు చెందిన కొన్ని పల్లె ప్రాంతాల్లో వివిధ పదార్థాలతో తయారు చేసిన ప్రమిదల్లో నువ్వుల నూనె నింపి దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మికి హారతులిస్తూ పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం ముచ్చటగా మూడు రోజులపాటు ఉదయం, సాయంకాలం సాగుతుంది. దీనిని ‘ఆరతిబాన’ అంటారు. కర్నాటకలోని పలు పల్లెటూళ్లల్లో పాటు రాయలసీమ సరిహద్దుల్లోని పల్లెల్లో కనె్నపిల్లలు తేలికపాటి చిన్న చిన్న అట్టముక్కల్ని తీసుకొని వాటిని గుండ్రంగా కత్తిరించి ఆ బిళ్ళలపై రంగుల ముగ్గులు దిద్ది బియ్యపుపిండితో ప్రమిదల్ని తయారుచేసి, అందులో నేయి వేసి దీపాలు వెలిగించి అమావాస్య నాటి సాయంవేళ గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుకొంటూ వాటిని నదుల్లోగానీ లేదా చెరువులు, కుంటల్లోగానీ వదలిపెట్టుతారు. ఇలా వేడుకగా పూజించే ఆ దీప దేవతను ‘సీగెమ్మ’ అని పిలుచుకొంటారు. సీగెమ్మ అమ్మవారి పూజల ద్వారా గౌరీదేవి ఆ కనె్నపిల్లలకు మంచి భర్తతోపాటు సుసంతానం, దీర్ఘసౌభాగ్యత్వం ప్రసాదిస్తుందని పండు ముత్తయిదువలు చెబుతారు.
మొత్తంమీద ఈ పండుగ ఆశాకిరణాల తోరణం. దుర్భరమైన దైనందిన జీవితాన్ని తలచుకొంటూ, పండుగలు దండుగ అనుకునేవారు కూడా నేటి ఆధునిక కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరేమనుకున్నా, కనీసం పండుగ రోజైనా అన్నీ మరచిపోయి, భగవంతుడు మనకు ప్రసాదించినంతలో శుచిగా వండుకుని, తృప్తిగా తిని హాయిగా కాలక్షేపం చేయడం ఉత్తమం. అంధకార బంధురాన్ని పక్కకు తోసి, వెలుగు పుంజాలను చూపే దీపావళిని గూర్చి ‘జ్యోతిషాం జ్యోతి రుత్తమం’ అంటూ నిత్య సత్యమైన పలుకులు పలికిన మన జ్ఞాన యోగులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం మన కనీస కర్తవ్యం.