ధన్వంతరి జయంతి
ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని అనుగ్రహించాడు ఆ విష్ణుమూర్తి. ఈ అబ్జుడే – పుత్రార్థి అయ దీర్ఘతపుడు చేస్తున్న తపస్సుకు మెచ్చి కొడుకుగా జన్మనెత్తాడు. అతడే దివోదాసుగా కాశీరాజ్యానికి రాజు అయ్యాడు. ఈ దివోదాసు భరద్వాజునకు శిష్యునిగా ఆయుర్వేదాన్ని నేర్చుకొన్నాడని బ్రహ్మాండపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ధన్వంతరి చేతినున్న అమృతకలశంలోని అమృతంతోనే దేవతలు మృత్యుం జయులు అయ్యారు. ఈ ధన్వంతరిని కొలిచిన వారికి సర్వరోగాలు దూరం అయ్య సంపూర్ణఆయురారోగ్యాలు లభిస్తాయ. ఆరోగ్యమే మహాభాగ్యము కనుక సర్వులూ ఈ ధన్వంతరి పూజచేయడం సనాతనంగా వస్తోంది. ఆయుర్వేదాన్ని వృత్తిగా గ్రహించిన వారు ధన్వంతరి జయంతిని వైభవంగా జరుపుతారు. ప్రపంచంలోని ప్రతి చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధన్వంతరికి కేరళ రాష్ట్రంలో త్రిశూర్వద్ద ఓ ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
ఈ ధన్వంతరినే ఒకచేత్తో అమృతకలశాన్ని, రెండవ చేతిలో జలగను పట్టుకొని ఉంటాడని ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఆశ్వీయుజ బహుళ ద్వాదశిన ఆవిర్భవించిన ధన్వంతరిని స్మరిస్తూ ధన్వంతరి ప్రతిమనుగాని, లేకుంటే విష్ణుమూర్తి పటాన్ని లేక ప్రతిమను పువ్వులతో అలంకరించి తెల్లటి అక్షతలు, తెల్లని పూవులతో స్వామి సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో పూజచేస్తారు. ఈ ధన్వంతరికి పాల పాయసాన్ని నివేదన చేసి దాన్ని ముందుగా ఇంట్లో వారు స్వీకరించి తదుపరి తమ చుట్టు పక్కల ఉన్న వారిలో కనీసం ఐదుగురికి పంచుతారు. ఇలా చేయడం వల్ల ధన్వంతరి ప్రీతి చెందుతాడనే ఐతిహ్యం. ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేసినా సకల రోగాలు పటాపంచలవుతాయి. ఈ ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలే లభించడమే కాక భవరోగాలు దూరం అవుతాయ. కనుక ఈ ధన్వంతరిని
నమామి ధన్వంతరి మాదిదైవం సురాసురైర్వందితపాదపద్మం
లోకేజరారుగ్భయమృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానం
అని ప్రార్థించాలి. కలియుగంలోనూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, వాతావరణాన్ని కలుషితం చేసే పనులను దూరం చేసుకొంటూ – ఈ ధన్వంతరిని పూజిస్తే అందరికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ద్వాదశి తరువాత వచ్చే త్రయోదశి కూడా దీపావళి పండుగలో భాగమే. ఇది గుజరాతీలకు సంవత్సరాది. దీనే్న ధనత్రయోదశి గాను ధన్ తేరాస్గాను అంటుంటారు. ఈరోజు కూడా దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజను చేస్తారు. 13 సంఖ్య పాశ్చాత్యులకు మంచిది కాదనే అభిప్రాయం ఉన్నా మనం మాత్రం త్రయోదశి తిథి శుభదినంగానే భావిస్తాం. అన్ని పుణ్యకార్యాలను చేస్తుంటాం. అలాంటి ఈ రోజున చేసే లక్ష్మీదేవి పూజ సకల శుభాలను కలిగిస్తుంది. మహారాష్ట్రులు కూడా ఈ ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. వర్తకులు ఈ త్రయోదశినాడు పద్దులు చూచుకొని కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఇల్లంతా దీపతోరణాలతో అలంకరిస్తారు.
శివతత్వం
- – వేదగిరి రామకృష్ణ
- 19/10/2014

శివ సాయుజ్యం పొందుట అనేది మన కర్మ ఆచరణలపై ఆధారపడి ఉంటుంది అనేది సత్యం. ఎవరైతే శివుని తత్వం గ్రహించి అనుసరించి ఆచరిస్తారో వారు శివ సన్నిధిని సులువుగా చేరగలుగుతారు.
పంచవిశంతి తత్వంతో సకల చరాచరములు సృష్టిస్తాను అని విష్ణురూపుడినై పోషించి కాల స్వరూపుడినై లయ చేస్తున్నాను అని శివుడు తన తత్వమును తానే తెలుపుకున్నాడు. సాక్షాత్ అన్నపూర్ణను సతిగా కలిగియున్నప్పటికి తన సహజ శైలిలో యావార వృత్తిలో భిక్ష పాత్ర నుంచుకుని కాలం గడుపుతున్నాడు. దీని ద్వారా జీవి తన స్వంత సంపాదన ద్వారా జీవితం గడపాలి అని తెలియచేయుచున్నాడు. శివుడు స్వయంగా నాట్యం చేస్తూ నటరాజుగా పేరు గాంచినాడు. ఈ జీవితం అనేది నాటకం లాంటిది. ఇందులో ఒక పాత్ర మనది. నిర్జీవమే నాట్య విరమణకు ఆఖరు దశ లాంటిది అని చెప్పినాడు.
మహాదేవుడు సాధారణమైన పూలతో చేసిన మాలలు ధరించడు. ఎందుకంటే అవి నశ్వరమైనవి. కపాల మాలలు, రుద్రాక్ష మాలలు ధరించుచున్నాడు. దీని ద్వారా మనకు బోధపడే తత్త్వము ఏమిటంటే లౌకిక వాసనలు పూలు వంటివి. అవి పునరావృతములు. వాటిని నివారింపచేసుకోవాలని తన తత్వం ద్వారా ముక్కంటి సూచించుచున్నాడు.
మహాదేవుడు తాను భస్మధారణ చేయుట ద్వారా ఏమి తత్వం బోధిస్తున్నాడు అంటే మానవుడు ఈ భూమి మీదకు వస్తూ తెచ్చినది ఏమీ లేదు. మరణానంతరం తీసుకొనిపోయేది ఏమీ లేదు. పుట్టుక మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది భస్మముగానే అనే తత్వం తెలుపుతున్నాడు. బతికినంతకాలం మంచిగా జీవిస్తూ అందరికి ఆదర్శప్రాయంగా యుండాలి.
శివుడు గరళం స్వీకరించుట ద్వారా మానవునికి ఏమి తత్వం ఉపదేశించినాడు అంటే జీవితం అంటే కష్టము నష్టముల భూయిష్టము. సుఖములను మాత్రమే ఆనందంగా అనుభవించుటగాదు. కష్టములు ఎదురైనప్పుడు తాను ఒక్కడే కష్టము ఎదుర్కొనుట ద్వారా పదిమందికి మేలు జరుగుతుంది అని భావిస్తే ఆ పనిని నిరాటంకంగా నిర్భయంగా ఆనందంగా చేయమనే తత్వమును బోధించుచున్నాడు.
శివుడిని శ్మశానవాసిగా చెప్పుకుంటాము. శివుడు శ్మశానవాసి ఎందుకైనాడో పరిశీలిద్దాం. శ్మశానమునకు రాజు-పేద అనే తరతమ భేదములేదు. ఎంతటివారు అయినా ఏదో ఒక రోజు అచటికి చేరవలసిదే. పార్థివ దేహంతో పాటు సూక్ష్మప్రాణి కూడా శ్మశానికి చేరుతుంది. తనతో వచ్చిన వారందరు వెళ్లగా బెరుగ్గాయుంటూ తన వారందరు వెనక్కి వెళ్లిపోయినారే అని దుఃఖిస్తూ యుంటుంది. అటువంటి సూక్ష్మప్రాణికి నీవారందరు వెనక్కి మరలినా ఒంటరి అయిన నీకు ఈ శ్మశానములో నేనున్నాను అని భరోసా ఇస్తాడు ఆ మహాదేవుడు. జీవన్మరణముల యందు తానే అయియున్నానని మనకు తన తత్వం తెలియచేయుచున్నాడు. అందుకే భూత గణములు ఆయన వెన్నంటే యుంటాయి. కామ, క్రోధ అరిషడ్వర్గాలు వాటి పరిధి దాటితే ఎలా యుంటుంది అనే అంశమును మన్మథుని భస్మీపటలం చేయుట ద్వారా మనకు తన తత్వమును తెలియజేసాడు. కామం, క్రోధం వంటివి అదుపు దాటితే మన్మథుని గతే ఎవరికైనా పడుతుంది అనే తత్వాన్ని మనం గ్రహించగలగాలి. శివుడు స్వయంగా ఢమరుకం మ్రోగిస్తున్నాడు అంటే మాయ అనబడే తిమిరం ఈ జగత్తు అంతా వ్యాపించి యుంది. దానిపట్ల నువ్వు అప్రమత్తంగా యుండు అని జీవిని హెచ్చరించుచున్నాడు.
వినాయకుడు- తండ్రీ ఈ జగమంతా నేను చుట్టిరాలేను అని విన్నవించుకుంటే ‘‘కుమారా తల్లి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త జగత్తును చుట్టివచ్చినట్లేయని తెలుపుతాడు. దీని ద్వారా మానవుడికి తల్లిదండ్రిని తప్పక జీవితపర్యంతం ఆదరించాలి అనే తత్వం అంతర్నిగూఢంగా దాగియుంది. ఒక్కమాటలో మాతా పిత సేవలో తరించువాడు ముల్లోకముల యందు పూజనీయుడు అని అర్థం.
—
ధర్మము
- -వంగూరి వెంకట్రామయ్య
- 20/10/2014
ధర్మమనే పదమునకు అనేక అర్థములున్నవి. ఏ వస్తువుకు ఉన్న సహజ గుణములన ఆ వస్తువు ధర్మమంటారు. నీరు పల్లమునకు ప్రవహించును. ఇది దాని ధర్మము. నిప్పు పైకి ఎగిసిపడుట దాని ధర్మము. ఇదిగాకుండా మానవుల విషయములో మనిషి చేయవలసిన కర్తవ్యములను ధర్మమంటారు. వృత్తి ధర్మములు, ఆశ్రమ ధర్మములు వగైరా ప్రత్యేక ధర్మములుగాక, అందరి మానవులకు వర్తించే సామాన్య ధర్మములు కొన్ని ఉన్నాయి. ఇవి సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహణము, విచక్షణారహిత జీవితము, పరమత సహనం- ఈ ధర్మములను అన్ని మతాలు అంగీకరించినవి.
హిందూ మతములోని యోగ సిద్ధాంతము, బౌద్ధ జైన మతములు, వీటిలో ముందు ఐదింటిని యమ నియమములన్నారు. ఇది పాటించకపోయినా, ఏ సాధకుడు యోగ ధ్యానములో ముందుకు వెళ్లలేడు. పై ధర్మములకు ఆ పేరు దృతి అను శబ్దమునుంచి వచ్చినది. దృతి అనగా నిలబెట్టునది. అనగా సృష్టి, మానవ సమాజమును నిలబెట్టునవి. ఈ ధర్మములు మానవ సమాజం ఆచరింపకపోయినా కలహములు, కొట్లాటలు పెరుగును. సమాజం అల్లకల్లోలమవును. వీటిని ఆచరించునపుడు అనేక దుష్కార్యములు చేయుట మానవుడు మానుకోవలెను. తద్వారా కోర్కెలు నిగ్రహింపబడి మానవుడు దైవానే్వషణలో ముందుకు వెళ్ళుటకు సులువు ఏర్పడును. పై ధర్మములాచరించుట వలన ఇతరులకు, సమాజమునకు ఉపకారములు సుఖశాంతులు ఏర్పడును. అందుచే ఇవి నైతిక సూత్రములు, పుణ్యకార్యములు కూడా అయివున్నవి. ఇవి పుణ్యకార్యములగుటచే ఆచరించేవారికి పుణ్యము లభించి వారి సుఖ సౌఖ్యములు, సంపదలు అంతిమ విజయములు వచ్చును. భగవంతుడు ధర్మము నిలబెట్టుటకు కృషి చేయును. అవతారములెత్తును. ఆయన కర్మ సిద్ధాంతము ఏర్పాటుచేసి ధర్మములు పాటించువారికి కష్టములు తొలగించి, సుఖములిచ్చును.
సత్యము అంటే అబద్ధమాడకపోవుటేగాక ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుటే. ఇది లేకపోయినా సమాజము విచ్ఛిన్నమగును. సత్యవాక్కును ఆచరించువాడు అవినీతి లంచగొండితనం, మోసము చేయలేడు. అప్పుడు సమాజము పవిత్రముగా ఉండి సుఖ శాంతులతో ఉండును. హరిశ్చంద్రుడు, ధర్మరాజు, శ్రీరాములవారు, సత్యవాక్కు పరిపాలకులు. శ్రీరాముడు తండ్రి యొక్క వాగ్దానములు నెరవేర్చుటకు చేతికి వచ్చిన రాజ్యము వదలి అడవికి వెళ్ళెను.
అహింసయంటే నాడీమండల వ్యవస్థ ఉన్న ఓ జీవిని అనగా మనుష్యులు, జంతువులను శారీరకంగాను, మానసికంగానూ హింసించకపోవుట. దీనిని ఆచరించే వారు శాఖాహారమునే తినవలెను. వృక్షములకు ప్రాణమయ కోశమే గాని మనోమయ కోశము అనగా నాడీ మండల వ్యవస్థ లేదు. అందుచే వాటికి బాధ సుఖము తెలియదు.
బ్రహ్మచర్యము అంటే వివాహము లేకుండా యుండుట అని అర్థమయినా, అందరూ బ్రహ్మచారులయితే సృష్టి ఆగిపోవును. పక్వము కానివాడు ఆచరించిన అది విఫలమగును. అందుచే వివాహేతర సంబంధములు పెట్టుకోకుండా ఏకపత్నీవ్రతము, పాతివ్రత్యము పాటించినా, వివాహము చేసుకొన్నా అది బ్రహ్మచర్యమునకు సమానమని ఋషులు చెప్పిరి. శ్రీరాముడు, సీతాదేవి ఈ విషయంలో ఆదర్శవంతులు. దీనివలన కుటుంబ వ్యవస్థ నిలబడును. ఆస్తేయమంటే ఇతరుల సొత్తును అపహరించకపోవుట. అది జరిగిన అవినీతి, దొంగతనము, దోపిడీ సమాజంలో యుండవు. అపరిగ్రహమంటే మన సొత్తును కూడా ఎదుటివారికి హాని లేకుండా మంచి కలిగించునట్లు వాడుకొనుట. అంటే మన సొత్తుకు మనము సమాజము తరఫున ధర్మకర్తలమన్నమాట.మనం ఆచరించే అనేక కర్తవ్యములు పై ధర్మములలో జేరిపోవును. ఏ పుణ్యకార్యమయినా ధర్మమే. అహింసతో కూడిన భగవతీ ఆరాధనలన్నీ ధర్మములే. అవి దైవచింతన పెంచునని, చిత్తశుద్ధిని కలిగించును. వాటిని ఎవ్వరూ మానకూడదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇదియే ధర్మసూక్ష్మము.