పాశ్చాత్యుల ప్రమేయం!
జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేధించకపోవడమే ఆశ్చర్యకరం. తమ దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విచ్ఛిన్న వాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ఐరోపాదేశాలు, అమెరికా, చైనా తదితరులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ దేశాలలో జరిగిపోతున్న ఉగ్రవాద చర్యలను పట్టించుకొనకపోవడం వైపరీత్యం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థను కాంక్షిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వాలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా జిహాదీ ఉగ్రవాదులు తమ దేశాలలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతించడం ఈ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు చిహ్నం. చైనా ప్రభుత్వం తమ దేశంలో విచ్ఛిన్న కలాపాలను నిర్వర్తిస్తున్న జిహాదీ దుండగులను కఠినంగా అణచివేస్తుండడం నడుస్తున్న చరిత్ర. కానీ చైనా మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న బీభత్సకాండను మాత్రం నిరసించడంలేదు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. మనకు వ్యతిరేకంగా దురాక్రమణ సాగిస్తున్న నియంతృత్వ దేశం. పాకిస్తాన్‌కు మిత్ర దేశం. అందువల్ల చైనా ప్రభుత్వంవారు భారత వ్యతిరేక బీభత్స చర్యలకు ఇంటా బయటా ప్రత్యక్ష, ప్రచ్ఛన్న సమర్ధన కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. కానీ బ్రిటన్ అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు కాశ్మీర్‌ను అంతర్జాతీయం చేస్తున్న పాకిస్తాన్‌ను నిరసించడం లేదు. తాము స్వయంగా అంతర్జాతీయం చేస్తున్నాయి. బ్రిటన్ నుండి స్కాట్‌లాండ్‌ను విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతుండిన సమయంలోనే మనదేశం నుండి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టడానికి జరిగిన యత్నాలకు బ్రిటన్ పార్లమెంట్ పరోక్షంగా మద్దతు తెలిపింది. స్కాట్‌లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగా ప్రచారం జరుగుతుండిన సమయంలో బ్రిటన్ పార్లమెంటు గత సెప్టెంబర్‌లో కాశ్మీర్ గురించి చర్చించడం ఇందుకు నిదర్శనం. స్కాట్‌లాండ్ వ్యవహారాన్ని భారత పార్లమెంట్‌లో చర్చించినట్టయితే బ్రిటన్ ఏమంటుంది?
జమ్మూ కాశ్మీర్ భారత దేశపు అవిభాద్య అంతర్భాగం. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించని పాకిస్తాన్ కాశ్మీర్ వివాదాన్ని సృష్టించింది. ఇలా సృష్టించడం భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకాండలో భాగం. ఈ బీభత్సకాండ కాశ్మీర్‌తో మొదలు కాదు. పాకిస్తాన్ ఏర్పాటుతో మొదలు కాలేదు…క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ మన దేశంలోకి చొరబడినప్పటినుంచీ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు జిహాదీ ఉగ్రవాదులు కాశ్మీర్‌లో భద్రతా దళాలతో తలపడి హతులు కావడం ఈ కొనసాగింపులో భాగం. బెంగాల్‌లో ఇటీవల బంగ్లాదేశీయ మతోన్మాదులు జరిపిన పేలుళ్లు ఈ కొనసాగింపులో భాగం. ఇలా కొనసాగడం వల్లనే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హంతకులు కాశ్మీర్‌లోకి చొరబడడం ఈ జిహాదీ ఉగ్రవాదంలో భాగం. అందువల్ల కథాకథిత జమ్మూ కాశ్మీర్ సమస్య నిజానికి జిహాదీ మతోన్మాదంలో భాగం మాత్రమే. జిహాదీ టెర్రరిజాన్ని నిర్మూలించినట్టయితే కాశ్మీర్‌లో ఎలాంటి సమస్య ఉండబోదు. ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ ఒప్పుకోదు. కానీ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు కూడ గుర్తించనట్టు నటిస్తున్నాయి. అందువల్ల జమ్మూకాశ్మీర్ వివాదం పరిష్కారం కాకపోవడం హింసాకాండ కొనసాగించడానికి కారణమన్న పాకిస్తాన్ వాదాన్ని ఐరోపా దేశాలు కూడ అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఏర్పడడానికి పూర్వం ‘పాకిస్తాన్ ఏర్పడినట్టయితే, ఖండిత భారత్‌లోను పాకిస్తాన్‌లోను కూడ మతోన్మాద జిహాదీ హింసాకాండ అంతరించి పోయి ప్రశాంత పరిస్థితులు ఏర్పడి పోతాయన్న ప్రచారం జరగడం చరిత్ర. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తరువాత జిహాదీ హింసాకాండ మరింత పెరిగింది. పాకిస్తాన్‌లో అన్యమత విధ్వంసకమైన ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడక పూర్వం అదే భూభాగంలో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ నెలకొడం చరిత్ర. పాకిస్తాన్ ఏర్పాటుతో మతోన్మాద ఉగ్రవాదం అణగిపోలేదు. కాశ్మీర్‌లోకి చొరబడింది. ఇదే కాశ్మీర్ సమస్య. ఈ మతోన్మాదం కారణంగానే 83వేల చదరపు కిలోమీటర్ల జమ్మూ కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతోంది. ఈ దురాక్రమణ వివాదం బ్రిటిష్ వారు నిర్దేశించిన నియమావళి ప్రకారం జమ్మూ కాశ్మీర్ సంస్థానం 1947 అక్టోబర్ 26న భారత్‌లోవిలీనమైంది. బ్రిటిష్ రాణి నియమించిన బ్రిటిష్ పౌరుడైన గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం వాస్తవమని బ్రిటన్ అప్పుడే ధ్రువీకరించి ఉండాలి. అలా ధ్రువీకరించకపోవడం ఐక్యరాజ్య సమితిలో వాస్తవాన్ని వివరించకపోవడం బ్రిటన్ ద్వంద్వ ప్రమాణాలకు, చారిత్రక నిదర్శనం. 1972 నాటి సిమ్లా ఒప్పందం తరువాత కాశ్మీర్ వివాదం ఐక్యరాజ్య సమితి పరిధి నుండి విముక్తమైంది. భారత పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక వ్యవహారంగా మారింది. ఈ సంగతి తెలిసినప్పటికీ కాశ్మీర్‌ను మళ్లీ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐరోపా దేశాలుకాని, అమెరికా కాని నిరసించడం లేదు. మానవ అధికారాలను పరిరక్షించే నెపంతో ఐరోపా పార్లమెంటు వారు గత పదేళ్లలో రెండు సార్లు కాశ్మీర్ గురించి చర్చించారు. భారత దేశపు ఆంతరంగిక వ్యవహారమైన జమ్మూ కాశ్మీర్‌లో అలా అక్రమంగా జోక్యం చేసుకున్నారు. 1993-2003 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడుగా ఉండిన బిల్ క్లింటన్ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం నిర్ధారిత వాస్తవం కాదని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత అమెరికా ప్రభుత్వం మాటమార్చినప్పటికీ ‘పాశ్చాత్య అంతరంగ ఆకాంక్షలు’ మాత్రం అలా ఆవిష్కృతమయ్యాయి. ఇస్లాం మత దేశాల సమా ఖ్య-ఓఐసీ-దాదాపు ప్రతి సమావేశంలోను కాశ్మీర్‌ను ప్రస్తావించి భారత్‌ను నిరసిస్తూనే ఉంటారు.
ఇలాంటి అంతర్జాతీరుూకరణ పట్ల మన ప్రభుత్వం నిరసనలు తెలుపుతూనే ఉంది. లండన్‌లో కాశ్మీర్ యాత్రకు అనుమతి ఇవ్వడం పట్ల బ్రిటన్‌కు సైతం ఇప్పుడు నిరసన తెలిపింది. కానీ ఈ నిరసనలను పాశ్చాత్య దేశాలు ఖాతరు చేయకపోవడం వాస్తవం. టిబెట్‌ను దురాక్రమించిన చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను ఐరోపా దేశాలవారు అడ్డుకుంటూనే ఉన్నారు. కానీ మనదైన కాశ్మీర్ విషయంలో మన దేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలకు ఆ దేశాల వారు అనుమతి ఇస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలు ఇవీ…