గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52
52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు
తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు .రఘునాధుడు తండ్రి అచ్యుత రాయలపై సంస్కృతం లో ‘’అచ్యుతేయాన్ద్రాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .యక్షగానాలు రాశాడు .వీణా వాదనలో మహా విద్వాంసుడు .క్షేత్రయ్య తంజావూర్ వచ్చి ఈ రాజును దర్శించి తన మువ్వ గోపాల పదాలతో మెప్పించాడు .తంజావూర్ సరస్వతిమహల్ గ్రంధాలయాన్ని, కుంభకోణం లో రామస్వామి దేవాలయాన్ని ,ఆది కుమ్భేశ్వరాలయానికి గోపురం నిర్మించాడు .తంజావూరు లోను పశుపతి దేవాలయం లోను స్వామి వారల రదోత్సవాలను మహా వైభవం గా నిర్వహింప జేసేవాడు .వీణ విధానం లో గణనీయమైన మార్పులు తెచ్చాడు రఘునాధుడు .జయంత సేన రాగాన్ని సృష్టించాడు .రామానంద తాళం కనిపెట్టాడు .చేమకూర వేంకటకవి ,కృష్ణాధ్వరి మధురవాణి, రామ భద్రాంబ ఈ ఆస్థాన కవులు .అనేక కావ్య రచన ఇక్కడ జరిగింది .శృంగారం వరదగా రఘునాదుడికాలం లో పారింది .అందుకని క్షీణ యుగం అన్నారుకూడా .బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు దానం చేశాడు .బీద బ్రాహ్మణులకు ఖరీదైన బహుమతు లంద జేశాడు .గుర్రపు సవారిలో ,ఖడ్గ యుద్ధం లో సాటిలేని వాడు .కవి ,పండిత సంగీతజ్ఞుల పోషణ చేశాడు .ఇంగ్లాండ్ డెన్ పోర్చుగీసు దేశాలతో మంచిమైత్రి నెలకోల్పాడు .
గోవింద ,యజ్న నారాయణ దీక్షితుల ప్రాభవం
ఈయన మంత్రి గోవింద దీక్షితులు ‘’సంగీత సుధ’’అనే కృతి చేశాడు .దీక్షితులకుమారుడు యజ్న నారాయణ దీక్షితులు రఘునాధుని విద్యా గురువేకాక ‘’రఘునాదాభ్యుదయం ‘’అనే సంస్కృత కావ్యం ను రాజు జీవిత చరిత్రగా రాశాడు .’’రఘునాధ విలాసం ‘’అనే సంస్కృత నాటకం రాసి రాజు ధర్మకార్య విశేషాలను తెలియ జేశాడు .’’అలంకార రత్నాకరం ‘’అనే అలంకార శాస్త్రాన్ని ప్రతాప రుద్రీయం నమూనాలో రఘునాధ రాయలను వర్ణిస్తూ లక్ష శ్లోకాలలో రాశాడు ‘.
53-ఆస్థానకవయిత్రి –రామ భద్రాంబ
తంజావూరు రాజు రఘునాధ రాయల ఆస్థాన నకవయిత్రి,ప్రియురాలురామ భద్రాంబ .రాజు జీవిత చరిత్రను ‘’రఘునాదాభ్యుదయం ‘’సంస్క్రుతకావ్యం రాసింది. శ్రీరామావతారం గా రఘునాధుని భావించి వర్ణించిన కావ్యం ఇది .పన్నెండు సర్గల మనోహర కావ్యం .ఇందులో రఘునాధుని దిగ్విజయాలు ,సుపరిపాలన వర్ణించింది .రామ భద్రాంబ తెలుగు కవిత్వం లోనూ ఆరి తేరింది .తెలుగు పద్యాలకు ప్రత్యెక మైన యతి ప్రాసలను సంస్కృత శ్లోకాలో ప్రయోగించటం ఒక గొప్ప ప్రయోగం .సంస్కృత ,ప్రాకృత భాషల్లో అనేక సమస్యలను పూరించిందని తెలుస్తోంది .ఈమె చెంగల్వ రాయకవి శిష్యురాలు .త్రిభాషా కవయిత్రిగా ప్రసిద్ధి చెందింది .అస్టావదానాలలో నిష్ణాతురాలు .
రఘునాదాభ్యుదయం లో రామ భద్రాంబ మొదటి సర్గలో చోళ రాజ్య వైభవాన్ని వర్ణించింది .తామ్రపర్ణి, కావేరి నదుల సోయగాలను వర్ణించింది .తరులు ,,లతలు ,పక్షులు, జంతువులూ అన్నీ ఆమె రచనలో చోటు చేసుకొన్నాయి .బ్రాహ్మణులు వేదం వేదాంగాలలో నిష్ణాతులుగా ,వారు నిర్వహించే యజ్న యాగాదులను తనివి తీరా వర్ణించింది .రెండవ అధ్యాయం లో చోళ రాజధాని తంజావూర్ పురాన్ని విశేషం గా వర్ణన చేసింది .అందులోని వీధులను ,దగ్గరున్న సముద్రాన్ని నాట్యకత్తెలను ,ఎత్తైన భవనాలను ,ఏనుగులు గుర్రాలను వర్ణించి రాజు ధార్మిక పరిపాలనను వివరించింది ..మూడవ అధ్యాయం లో రాజు శౌర్య ప్రతాప వితరణలను చెప్పింది .స్త్రీవిద్యకు రఘునాధుడు చేసిన కృషిని తెల్పింది .నాలుగవ సర్గలో రాజు దిన కృత్యాలను పూస గుచ్చినట్లు వర్ణించింది .అయిదులో కూడా రాజు గురించే రాసినా రాజాస్స్థానాన్ని సందర్శించిన కేరళ ,అంగ మగధ ,కలింగ గౌడ ,ఆరాట్ట దేశాలనుండి విచ్చేసిన సందర్శ్శకులను ముఖ్యంగా వేదాంతులను ,వ్యాకరణ పారీణులను ,కవులను ,కళాకారులను విపులంగా వివరించింది .రాజు విద్వాంసులను ఆదరించిన తీరు ,కళాకారులను ప్రోత్సహించి ,వారికి శిక్షణ నిచ్చిన విధానాలనూ తెలియ జేసింది రామ భద్రాంబ .
54-చోళ రాజ్య చరిత్ర రాసిన –విరూపాక్షకవి
చోళ రాజుల చరిత్రను విరూపాక్షకవి ‘’చోళ చంపువు ‘’గా సంస్కృతం లో రాశాడు .కావేరి పట్టణాన్ని రాజ దానిగా చేసుకొని తమిళ దేశాన్ని పాలించిన చోళ రాజుల చరిత్ర అంతా ఇందులో చూపాడు. ఈ రాజ్యం క్రీ శ మూడు నాలుగు శతాబ్దాలలో పల్లవ రాజుల చేత అంతమైంది .మళ్ళీ తొమ్మిదవ శతాబ్దం లో చోళ వంశం పునరుద్దరింప బడింది .అప్పుడు వీరు తంజావూర్ ను రాజ దానిగా చేసుకొని పరిపాలన సాగించారు .ఇదిమాత్త్రమే లభ్యం అవుతోంది. పూర్వ చోళ చరిత్ర దొరకలేదు కాని తమిళ సంగమ సాహిత్యం లో లభిస్తోంది .చోళ చంపువు ను మొదట కనుగొన్న వాడు ‘’హల్చ్ ‘’ఇది పౌరాణిక కల్పన ఆన్నాడు .స్థల పురాణం అయిన ‘’బృహదీశ్వరమాహత్మ్యం ‘’ఆధారంగా విరూపాక్షుడు ఈ చంపువు రాశాడు .చోళ చంపువు పదిహేడవ శతాబ్దపు రచన .భట్ట బాణుడి శైలిలో విరూపాక్షుడి శైలి ఉంటుంది .సరళ సుందర కవిత్వం తో ఈ చంపువు చంపక పరిమళాన్ని వెదజల్లింది .
55- పట్టపు రాణి కవయిత్రి- నంజన గూడు తిరుమలాంబ
విజయ నగర రాజు అచ్యుత రాయల భార్య తిరుమలాంబ .కాలం 1529-1542 .’’వరదాంబికా పరిణయం ‘’అనే చంపూ కావ్యాన్ని సంస్కృతం లో రాసిన కవయిత్రి తిరుమలాంబ .ఆమె ప్రతిభకు ఇది నిదర్శనం .తాను ఏక సంతాగ్రాహిని అని చెప్పుకొన్న విదుషీమణి .మనుష్య రూపం లో ఉన్న సరస్వతీ దేవి అని పేరుపొందింది .కవయిత్రిమాత్రమేకాదు కవులను పోషించిన ఔదార్యం అమెది .శకలం వారి ఆడపడుచు అయిన వరదాంబిక ,అచ్యుత దేవరాయల వివాహ వర్ణనయే ఈకావ్య ఇతివృత్తం ..మొదటగా అచ్యుత రాయల వంశాన్ని వర్ణించింది .అతని తండ్రి విజయ యాత్రలు ఓబలాంబ తో అతడి వివాహం అచ్యుతుని జననం ,రాజ్యాభిషేకం వివరం గా చెప్పింది ఒక రోజు రాయలు కాత్యాయని ఆలయం లో పూజ చేస్తున్న వరదాంబికను చూసి ప్రేమిస్తాడు .ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించటం ,ఇంతలో విదూషకుడు వచ్చి రాచకార్యం పై తీసుకొని వెళ్ళటం ,అయిష్టంగా అతను కదిలి వెళ్ళటం వరదాంబిక విరహ వేదన ఉంటుంది చెలికత్తెలు వచ్చి ఆమెను అచ్యుత రాయలకిచ్చ్చి ఆమె వివాహం జరిపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పటం ,ఇద్దరి పరిణయం .శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తో దంపతులకు వెంకటాద్రి జన్మించటం పట్టాభి షేకం జరగటం తో సమాప్తం .
తిరుమలాంబ కద కన్నా వర్ణాలకే ప్రాధాన్య మిచ్చి కావ్యం రాసింది .అచ్యుతరాయల కంటే తండ్రినే అధికం గా వర్ణించింది .సంస్కృతం పై చక్కని అధికారం తో కావ్యం రాసింది సందర్భాను సారం గా అన్ని రసాలను వర్ణించి కావ్య గౌరవం పెంచింది .శృంగారాన్ని అంగి రసం గా చేసుకొన్నది .శ్లేష ,యమకాలనూ సమయాన్ని బట్టి వాడింది సైన్యం , ,యుద్ధాలను ,నదులను ,ఋతు జలక్రీడ వర్ణనలను అద్భుతం గా చేసింది .అచ్యుత రాయలను నఖ శిఖ పర్యంతం శోభాయమానం గా వర్ణించింది .స్త్రీ ఇలా పురుష వర్ణన చేయటం అప్పటికి కొత్తా, వింత కూడా . ఈమె గద్యం బాణుని బాటలో సమర్ధం గా నడిచింది .పరి సంఖ్యాలంకారాన్ని చమత్కారం తో ప్రయోగించింది .గద్యం ఓజో గుణ భరితం .అనుప్రాసలతో దీర్ఘ సమాస బంధురం గా రాసింది .ఉదాహరణకు –
‘’నిరంతరాంద కారిత దిగంతర కందళ మంద సుధారస బంధు సాన్ద్రతర ఘనాఘన వృందా సందేహ కరస్యన్దమాన మకరంద బిందు బంధుర మాకంద తరుకుల తల్ప కల్ప మృదల సికతాజాల జాతిల మూలతల మరువక మిలిద లఘు లయ కలిత రమణీయ పానీయ శాలికా బాలికా కరార వింద గలంతికా గల దేల లవంగ పాటల ఘన సార కస్తూరి కాతి సౌరభ మేదుర లఘుతర మధుర శీతలతర సలిల ధారా నిరాకరిష్ణు తదీయ విమల విలోచన మయూఖ రేఖా పసారిత పిపాసా యాస పాదిక లోకాన్ –‘’అని రస రమ్యం గా సాగుతుంది .ఆమె గద్యం కన్నా పద్యం హృద్యం.
‘’సరసి విరహసి త్వం శాత్రవా వారధి మధ్యే –త్యము పవన సరన్యాం తేలి ఘోరే వానంతే
కృతక గిరి తటే త్వం కిన్చాటే వింధ్య శైలే –కదా మరిషు విగానం కధ్యతా మచ్యుతేంద్ర ‘’
తిరుమలాంబ ‘’ఆర్య మహిళే’’ అని రాసిన దానిలో మహిళలే ఆర్య ధర్మాన్ని నిలబెట్టాలని సూచించింది .కన్నడ దేశాన్ని గురించి ,కన్నడ భాషను గురించి తిరుమలాంబ చెప్పిన విషయాలు .ఆమె కన్నడ అభిమానానికి కన్నడ దేశ భక్తికి నిదర్శనాలని కన్నడ భాషా విమర్శకుడు సి యెన్ మంగళ చెప్పారు .ఇలా కన్నడం గురించి దేశాన్ని గురించి ప్రస్తుతించిన మొదటి కవి తిరుమలాంబ యేననీ ఆయన చెప్పటం తిరుమలాంబ వ్యక్తిత్వానికి మరింత శోభ కూర్చింది .
నంజన గూడు తిరుమలాంబ పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ఏర్పరచి ప్రముఖులకు అందిస్తున్నారు .ఆ పురస్కారాన్నిపొండిన వారిలో విజయ లక్ష్మి పండిట్ కుమార్తె నాయన తారా సెహగల్ ఉన్నారు .ఏఎ అవార్డ్ గ్రహిస్తూ నాయన తార ఆనాడే పురుషుల తో బాటు స్త్రీకూడా అన్ని రంగాలలోనూ ముందు ఉండాలని ప్రబోధించి ఆచరించి చూపింది తిరుమలాంబ అని కొనియాడింది .
మరో కవితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-14-ఉయ్యూరు