ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా మారాయి. అరచేతిలో ఉండే మొబైల్‌లోనే అతిపెద్ద దుకాణ సముదాయాలను కలియజూసిన అనుభూతి పొందుతూ నేడు చాలామంది ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. పలురకాల వస్తువులు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉండడం, భారీ రాయితీలు, నగదు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, మనం కోరుకున్న వస్తువులు అదే రోజు ఇంటికి చేరడం.. ఇలా ఎనె్నన్నో అనుకూల అంశాలు వినియోగదారుల్లో ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల మక్కువను పెంచుతున్నాయి. ఇదో ప్రభంజనం… ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లు భారత ఆన్‌లైన్ రంగంలో తాజాగా సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. ఇంటర్నెట్‌తో ‘టచ్’ ఉన్నవారిలో అధిక సంఖ్యాకులు ఈ నెల 6న ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్‌ను ఏదో ఒక వస్తువు కోసం ‘క్లిక్’ చేశారంటే అందులో అతిశయోక్తి లేదు. ‘ఆన్‌లైన్ బూమ్’ను పండగల సీజన్‌లో క్యాష్ చేసుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు నిమగ్నమై పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఊహించని డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, కచ్చిత బహుమతులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు వెల్లువెత్తడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి మన దేశంలో ఈ ఏడాది దసరాకు ముందునుంచే ఇ-కామర్స్ సంస్థల జోరు మొదలైంది. ఇదే నెలలో దీపావళి తోడవడంతో ఆ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లకు యథాశక్తిన వల వేశాయి. పదునెక్కిన ప్రచార వ్యూహాలు, పోటాపోటీ ఆఫర్ల నేపథ్యంలో వినియోగదారులు ఈ వెబ్‌సైట్లను ‘క్లిక్’మనిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరికొత్త డిజైన్లు, విదేశీ ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. పది గంటల్లో రూ. 610 కోట్ల విక్రయాలు..! ‘గతంలో ఎన్నడూ చూడని భారీ రాయితీలు.. ఇరవై నాలుగు గంటల పాటు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అరుదైన అద్భుత అవకాశం..’- అంటూ భారీ ప్రచారంతో కస్టమర్లను తెగ ఊరించిన ‘్ఫ్లప్‌కార్ట్’ ఈ నెల 6న ‘ది బిగ్ బిలియన్ డే’ పేరిట ఆన్‌లైన్ వ్యాపారంలో పెను సంచలనం సృష్టించింది. అన్ని రకాల ఉత్పత్తులపై ఎనభై శాతం వరకూ తగ్గింపు ధరలంటూ రెండు వారాల ముందు నుంచీ వివిధ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా కస్టమర్ల నుంచి స్పందన వెల్లువెత్తింది. కొద్ది గంటల్లోనే తమ వెబ్‌సైట్‌కు వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సగం వ్యవధిలోనే ‘్ఫ్లప్‌కార్ట్’ సంస్థ భారీ సేల్‌కు తెరదించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రత్యేక ఆఫర్లతో ఆర్డర్లు స్వీకరించగా కేవలం పది గంటల వ్యవధిలోనే వంద మిలియన్ డాలర్ల ( 610 కోట్ల రూపాయలు) మేరకు విక్రయాలను సాధించినట్లు ఆ సంస్థ గొప్పగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో నాణ్యమైన ఉత్పత్తులను భారీ రాయితీలపై విక్రయించడంతో స్పందన అనూహ్యంగా ఉందని స్పష్టమైనట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రతినిధులు చెప్పుకున్నారు. ఇ-కామర్స్ చరిత్రలోనే ‘బిగ్ బిలియన్ డే’ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు అభివర్ణించారు. విమర్శలూ అధికమే… ‘బిగ్ బిలియన్ డే’ పేరిట ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహించిన సేల్స్ స్కీమ్‌లో కొనుగోళ్లకు కస్టమర్లు ఎంత భారీగా స్పందించారో అదే స్థాయిలో విమర్శలూ చోటు చేసుకున్నాయి. మొబైల్ ఫోన్లు, పలురకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు నాణేలు, ఇతరత్రా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో కస్టమర్లు ఆర్డర్లు చేసేందుకు ఎగబడ్డారు. అసలు ధరలో పదోవంతుకే కొన్ని వస్తువులు ఇస్తామంటూ ఊదరగొట్టడంతో ఈ ఆన్‌లైన్ సైట్ ఎంతోమందికి లభించని పరిస్థితి ఏర్పడింది. తాము కోరుకున్న ఉత్పత్తులకు ఆర్డర్లు ఇస్తే తీసుకోలేదని, కొన్ని సందర్భాల్లో ‘క్లిక్’లు తప్పుడు పేజీలకు వెళ్లాయని సామాజిక మాధ్యమంలో కస్టమర్లు ఆరోపించారు. సర్వర్ ‘క్రాష్’ అయిందని చెప్పడమే గాక, తప్పుదోవ పట్టించే ధరలతో మోసగించారని కూడా విమర్శలు చెలరేగాయి. తమ వెబ్‌సైట్‌కు ‘ట్రాఫిక్’ అనూహ్యంగా ఉన్నా, సర్వర్ ‘క్రాష్’ కాలేదంటూ ‘్ఫ్లప్‌కార్ట్’ ఇచ్చిన వివరణ వినియోగదారులకు ఊరట కలిగించలేదు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో పలు రకాల ఉత్పత్తులను సాధారణ షాపింగ్ మాల్స్‌లో కంటే తక్కువ ధరలకు విక్రయిస్తారన్న నమ్మకం జనంలో ప్రగాఢంగా ఉంది. ఈ నమ్మకంతోనే ‘బిగ్ బిలియన్ డే’ పట్ల కస్టమర్లు వేలం వెర్రిగా మొగ్గు చూపారు. ‘్ఫ్లప్‌కార్ట్’లో ప్రదర్శించిన ఉత్పత్తుల ధరలు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఇతర సంస్థల్లో కంటే అధికంగా ఉన్నాయని, అందువల్ల భారీ రాయితీలపై నిజమైన నమ్మకం కుదరలేదని కొందరు కస్టమర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ రాయితీలు చూపించేందుకు గతంలో విక్రయించిన ధర కంటే ఎక్కువగా చూపారన్న ఫిర్యాదులూ వచ్చాయి. ‘24 గంటల సేల్’ అంటూ ఘనంగా ప్రచారం చేసినా కొద్ది గంటల వ్యవధిలోనే ‘నో స్టాక్’ అని ప్రకటించడం ‘మరో దగా’ అన్నవారు కూడా లేకపోలేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ‘్ఫ్లప్‌కార్ట్’ ద్వారా విక్రయించే సరఫరాదార్లు ఆర్డర్లు నిలిపి వేయడమే ఇందుకు కారణమని కొందరు వ్యాఖ్యానించారు. అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో సాధ్యమైనంత త్వరగా సరకులను డెలివరీ ఇచ్చేందుకే కొత్త ఆర్డర్లు నిలిపివేశారన్న ఫిర్యాదులూ వినిపించాయి. ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్ అందుబాటులో లేనందున కొందరు కస్టమర్లు ఇతర వెబ్‌సైట్లను ఆశ్రయించక తప్పలేదు. కొద్దిమందికి డిస్టౌంట్ ధరల్లో వస్తువులు దక్కినా చాలామందికి నిరాశే మిగిలింది. ఒకే ఉత్పత్తి వివిధ సమయాల్లో వివిధ రకాల రేట్లలో దర్శనమివ్వడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ‘సారీ’.. మరోసారి ఇలా జరగదు.. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా వినియోగదారులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయామని, ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచలేక పోయామని ఇ-కామర్స్‌లో దిగ్గజమైన ‘్ఫ్లప్‌కార్ట్’ కస్టమర్లకు క్షమాపణలు చెప్పుకుంది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినపుడు పూర్తి స్థాయి సన్నాహాలతో, సమర్ధతతో ముందుకు వస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ స్పష్టం చేశారు. వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు సమర్ధించుకున్నారు. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా 20 రెట్లు అధిక ట్రాఫిక్‌ను ముందుగానే తాము అంచనా వేసి 5 వేల సర్వర్లను ఉపయోగించామని, అయినప్పటికీ కస్టమర్ల నుంచి విమర్శలు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. ఇంతటి భారీ స్పందనను ఊహించనందునే కస్టమర్లందరినీ సంతృప్తి పరచలేక పోయామని, ఇకముందు ఇలాంటి ఈవెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని ‘్ఫ్లప్‌కార్ట్’ వ్యవస్థాపకులు భరోసా ఇచ్చారు. తాము సాధ్యమైనంత వరకూ పలు రకాల ఉత్పత్తులను వేలు, లక్షల సంఖ్యలో సిద్ధం చేసినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోలేదన్నారు. సంప్రదాయ రిటైల్ వ్యాపారం వెలవెల.. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో అమ్మకాల జోరు పెరగడంతో మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం ఇప్పటికే పలు ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు తోడు స్నాప్‌డీల్, అమెజాన్.. ఇంకా అనేకానేక ఇ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా అమ్మకాలు జరపుతున్నందున దేశీయ సంప్రదాయ రిటైల్ వ్యాపారం మనుగడపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ సంస్థల అమ్మకాల దూకుడు ఇలాగే కొనసాగితే సాధారణ దుకాణాలు, షాపింగ్ మాల్స్ పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గత అయిదారేళ్లుగా ఇ-కామర్స్ కంపెనీలు దేశీయ మార్కెట్లో పాతుకుపోయేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయడంతో ఇటీవల పరిస్థితిలో అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ దేశీయ వ్యవస్థాగత రిటైల్ వ్యాపారంతో పోలిస్తే ఆన్‌లైన్ వ్యాపార పరిమాణం చాలా తక్కువే. సంప్రదాయ రిటైల్ వ్యాపారం పరిమాణం 50 వేల కోట్ల డాలర్లు ఉంటుందని ఓ అంచనా. 2013 నాటికి ఇ-కామర్స్ వ్యాపారం విలువ 1,300 కోట్ల డాలర్లు మాత్రమే. ఇటీవలి కాలంలో ఇ-కామర్స్ వ్యాపారం అనూహ్యంగా విస్తరించడంతో రిటైల్ సంస్థలు దిగాలు పడుతున్నాయి. విదేశీ పెట్టుబడులతో… దేశ, విదేశీ పెట్టుబడి సంస్థల నుంచి ఆన్‌లైన్ సంస్థలు భారీ ఎత్తున ప్రైవేటు ఈక్విటీని సమీకరిస్తున్నాయి. దేశీయ ఇ-కామర్స్ సంస్థల్లోకి గత ఆరేళ్లలో దాదాపు 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఆన్‌లైన్ సంస్థలు అంచనాలకు అందని రీతిలో ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఈక్విటీల పేరిట సమీకరించిన డబ్బునే ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు, టర్నోవర్‌ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. నిజానికి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నా కొన్ని ఆన్‌లైన్ సంస్థలు సైతం ఆఫర్ల మాయాజాలం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఇనె్వస్టర్లు సైతం ఈ సంస్థల్లోనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఆధిపత్య పోరాటం.. దాదాపు 25 కోట్లకు పైగా ఇంటర్నెట్ కస్టమర్లు ఉన్న మన దేశంలో ఆన్‌లైన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి. అందుకే ఆఫర్లు, రాయితీల పేరుతో లక్షలాది ఉత్పత్తులను విక్రయించేందుకు ఇ-కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కస్టమర్ల ఆసక్తే ఈ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరిగే రిటైల్ అమ్మకాల్లో దసరా, దీపావళి వాటా ఎంత కాదన్నా 40 శాతం దాకా ఉంటుంది. పండగల వేళ కొనుగోళ్లకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందునే ఆన్‌లైన్ సంస్థల మధ్య ఆధిపత్య పోరాటం ఆరంభమైంది. కొన్ని రకాల ఉత్పత్తులు తమ సైట్‌లకే పరిమితమయ్యేలా ఉత్పత్తిదారులతో ఇవి ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కేవలం ప్రచారానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే వాటి మధ్య ఎంతటి పోటీ ఉందో అవగతమవుతుంది. ప్రస్తుతం భారత రిటైల్ మార్కెట్ 31 లక్షల కోట్లని ఓ అంచనా. ఆన్‌లైన్ మార్కెట్ వ్యాపారం ప్రస్తుతం 24 వేల కోట్లకు మించిందని, ఇది అంతకంతకూ పెరిగి 2016 నాటికి 50 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ చెబుతోంది. ‘అమెజాన్’ చూపు భారత్ పైనే… ప్రపంచ ఈ-మార్కెట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ‘అమెజాన్’ కళ్లు ఇప్పుడు భారతీయ మార్కెట్‌పై పడ్డాయి. వేలాదికోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఇక్కడి మార్కెట్‌లో కుమ్మరిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈమధ్య ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో చేసిన తమాషా ‘ఔరా’ అన్పించింది. ఆ సంస్థ ప్రకటించిన తాయిలాలు చూస్తే నిజమేనా అన్పిస్తుంది. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? అమెజాన్ 1994లో పురుడు పోసుకుంటే- ఢిల్లీ ఐఐటీలో మార్కెట్ పాఠాలు నేర్చుకున్న సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ అందులో చేరారు. వారు అమెజాన్‌లో ఉద్యోగం చేసి వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు. తరువాత 2007లో సొంతంగా ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థను 2007లో ఏర్పాటు చేశారు. సింగపూర్‌లో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వీరి వెబ్‌సైట్ భారత్‌లో అత్యధికులు సందర్శించే టాప్ టెన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఒకటి. 2008 వరకు పుస్తకాలు, చిన్నచిన్న ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవల తన ఆలోచనలను మార్చుకుంది. 125 కోట్ల భారతీయుల్లో 20శాతం మంది ఈ-కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారని అంచనావేసింది. ఈలోగా భారత్‌లో వేలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్ కూడా ‘సై’ అంది. ఇదిగో అప్పటి నుంచి మార్కెట్‌లో ఆయా సంస్థల ఆఫర్ల మాయాజాలం మొదలైంది. 1994లో ఈ-మార్కెట్‌లో అడుగులు వేసిన అమెజాన్ ఒక్కో దేశానికి ఒక్కో వైబ్‌సైట్ నడుపుతోంది. భవిష్యత్‌లో శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లోనూ అడుగుపెట్టబోతోంది. భారత్‌లో మింత్ర డాట్ కామ్ వంటి సంస్థలతో చేతులు కలిపిన అమెజాన్ ధాటిని తట్టుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు అంత సులువేం కాదు. ఈకామర్స్ కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఈ-కామర్స్ రంగంలో 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల అమ్ముడుపోతాయి. ఇప్పటి వ్యాపారం కన్నా అది 70 శాతం అధికమని చెబుతోంది. పైగా ఈ వ్యాపారం అంతా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్ వినియోగదారులతో ఎక్కువగా నడుస్తోంది. టాబ్లెట్ల ద్వారా విజిట్ చేసే వినియోగదారులది రెండోస్థానం. భారత్‌లో భవిష్యత్‌లో ఈ సాంకేతిక విప్లవం వర్థిల్లే సూచనలు ఎక్కువగా ఉండటం వల్ల మునుముందు భారీస్థాయిలోనే విక్రయాలు సాగుతాయని అంచనా. అందుకే ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, మింత్ర, అలిబాబా వంటి సంస్థలు భారతీయ మార్కెట్‌లో కాసులు గుమ్మరిస్తున్నాయి. కొత్తకొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఈ-మార్కెట్‌లో గెలుపెవరిదో..? * ………………………………… నియంత్రణ ఉండాల్సిందే! ఆన్‌లైన్ రిటైల్ కంపెనీల దూకుడుకు పగ్గం వేయాలంటూ దేశీయ రిటైలర్లు గళమెత్తుతున్నారు. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ‘కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అసోసియేషన్’ (సిఎఐటి) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆన్‌లైన్ వ్యాపార సంస్థల ధోరణి సంప్రదాయ మార్కెట్‌ను దెబ్బ తీస్తోందని సిఎఐటి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇష్టారాజ్యంగా డిస్కౌంట్లను ఇస్తున్నాయని, అనుచిత వ్యాపార విధానాలతో సంప్రదాయ రిటైల్ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ సంస్థల దూకుడుతో భవిష్యత్తులో వ్యాపార రంగంలో గుత్త్ధాపత్యానికి దారి తీసే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల వ్యాపార విధానాలపై, వాటి పన్ను చెల్లింపులపైనా సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని రిటైల్ వ్యాపారుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తాజాగా నిర్వహించిన ‘బిగ్ బిలియన్ డే’పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన డిస్కౌంట్‌పై రిటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడంతో అవసరమైతే కొత్త విధానాలను రూపొందిస్తామని, ఈ-కామర్స్ వ్యాపారంపై మరింత స్పష్టత తీసుకొస్తామని ఆమె చెబుతున్నారు. భారీ ఆఫర్ల కారణంగా సంప్రదాయ మార్కెట్లలోని వ్యాపారులు దెబ్బతింటారని ఆమె అంగీకరించారు. కాగా, ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈ-కామర్స్ బిజినెస్‌కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనను ఉల్లంఘన జరిగిందా? అన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) అధికారులు కూడా ప్రకటించారు. ……………… ఈ-కామర్స్‌లోకి అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తుండడంతో ఈ-కామర్స్ వైపు నేడు పలు భారతీయ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. 2020 నాటికి ఈ-కామర్స్ వ్యాపారం మనదేశంలో 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉండడంతో రేమండ్స్, అరవింద్, టాటా గ్రూపు వంటి ప్రముఖ సంస్థలు ఆన్‌లైన్ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. సంప్రదాయ రిటైలింగ్, మార్కెటింగ్, పంపిణీ విధానాలకు పూర్తి భిన్నంగా ఈ-కామర్స్ విస్తరిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భవిష్యత్తులో ఈ-కామర్స్ ప్రధాన మాధ్యమం అవుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తుండగా, మరి కొన్ని మాత్రం ప్రత్యేక విభాగాలకే పరిమితమవుతున్నాయి. ఫ్యాషన్ దుస్తులు, జ్యూయలరీ తదితర ఉత్పత్తుల్లో ప్రజాదరణ పొందిన సంస్థలు భారీగా లాభాలను చవి చూస్తున్నాయి. దీంతో కొన్ని అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు కూడా ఈ-కామర్స్‌వైపు దృష్టి సారిస్తున్నాయి. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో ఆశాజనక పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ దేశీయ వ్యాపార సంస్థలు కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు సొంతంగా వెబ్‌సైట్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులను ఇతర ఆన్‌లైన్ సైట్ల ద్వారా విక్రయాలకు పెడుతున్నాయి. ఫ్ల్లిప్‌కార్ట్ వంటి సంస్థలపై ఆధారపడడం కన్నా సొంతంగా ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లను ప్రారంభించేందుకు వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దుస్తుల రంగంలో ప్రఖ్యాతి పొందిన రేమండ్స్ లిమిటెడ్ ఇప్పటికే సొంతంగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇదే తీరులో ప్రముఖ దుస్తుల కంపెనీ అరవింద్ కూడా ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. టైటాన్ కంపెనీ కూడా తన సొంత పోర్టల్‌ను ప్రారంభించింది. చేతి గడియారాలు, ఆభరణాలు, కళ్లద్దాలు, బ్యాగులు వంటి పలు రకాల వస్తువులను విశ్వవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు టైటాన్ కో-ఇన్ అనే పోర్టల్‌కు రూపకల్పన జరిగింది. ఇతర కంపెనీలకు చెందిన వస్తువులను కూడా ఈ సైట్‌లో టైటాన్ విక్రయిస్తుంది. అలాగే, పారిశ్రామిక దిగ్గజం అయిన టాటా గ్రూపు కూడా తాము ఉత్పత్తి చేసే అన్నిరకాల వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించే పనిలో పడింది. ……………… ఉద్యోగాల వెల్లువ… రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలో ఈ-కామర్స్ రంగం 20 నుంచి 25 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ. కనీసం లక్షన్నర మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంటున్నారు. 2016 నాటికి దేశంలో ఈ-కామర్స్ వ్యాపార పరిమాణం 50 వేల కోట్లరూపాయలకు చేరుకునే అవకాశం ఉన్నందున అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ-కామర్స్ రంగం ఆశాజనకంగా ఉన్నందున ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయని ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఇండియా సంస్థ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, మింత్రా వంటి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నందున క్యాంపస్ నియామకాలు కూడా జోరుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ సంస్థలు భారీగా వేతనాలు ఇస్తున్నందున యువత కూడా వాటిపై మొగ్గుచూపుతోంది. ఈ సంస్థల్లో జూనియర్ స్థాయి సిబ్బందికి వార్షికంగా 1.45 నుంచి 2 లక్షలు, మధ్యస్థాయి ఉద్యోగులకు ఏటా 12నుంచి 30 లక్షల వరకు వేతన ప్యాకేజీ లభించే అవకాశం ఉన్నట్టు మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.