ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూనిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. 
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి.

పెంటమ్మ గుడిసె బయట తూర్పుముఖంగా నిలుచుండి ఎర్రని రూపు దాలుస్తున్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తున్నది. దస్తగీర్‌ రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి, పెంటమ్మ వైపు మళ్లే వరకు సూర్యుని కాంతితో ఆమె ముఖం ఇంద్రధనుస్సు రంగులతో మిళితమైనట్టు కనిపించింది. ముగ్ధుడై చూస్తూ టీ గ్లాసును ‘‘ఇగో చాయ్‌, చాయ్‌’’ అని అందించాడు…

పెంటమ్మ తెప్పరిల్లినట్టు దస్తగీర్‌ వైపు మళ్లింది. బిడియంతో నేలకు వంగి గ్లాసును అందుకుంది. తలను వంచే టీ గుటక వేసింది. ఆమెను తీక్షణంగా చూస్తూ దస్తగీర్‌ కూడా ఆమె గుటకలకు తన గుటకలు మేళవించి టీ తాగాడు.
….

ఒక ప్రేమకథను మలుపుతిప్పిన సన్నివేశం అది.
యవ్వనం, భద్రజీవితం, కాల్పనిక ఆవేశం, మోహాతురత – వీటి నడుమ పుట్టిన నడిమితరగతి ప్రణయగాథ కాదది.
చరిత్ర ధ్వంసరచనలో ఆశోపహతులైన ఇద్దరు నిరుపేద నడివయస్కుల బతికిన క్షణాలు అవి.
ఆరుదశాబ్దాల కిందట ప్రచురితమైన ‘రాజకీయ బాధితులు’ కథలోని ఒక సందర్భం అది.
రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి.
తెలంగాణ సంక్షుభిత కాలాన్ని అక్షరాలలోకి అనువదించిన అసామాన్య కథానవలా రచయిత.
ప్రజల మనిషి.
నేటి తరం పాఠకులకు అందు బాటులో లేని ఈ రచన గురించి వ్యాఖ్యానించే ముందు ఇందులోని కథను రేఖామాత్రంగా అయినా పరిచయం చేయడం న్యాయం.
పెంటమ్మ, దస్తగీర్‌- ఈ ఇద్దరూ ఈ కథలో నాయికా నాయకులు.
ఇద్దరూ దళితులు. దస్తగీర్‌ దళిత ముస్లిమ్‌.
ఆమెకు ముప్పయ్యైదేళ్లు, అతనికి నలభై అయిదు.
పెంటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు. దస్తగీర్‌ ఒక మోటారుషెడ్‌లో పనివాడు, కాపలాదారు.
వారిద్దరికి హైదరాబాదు వీధుల్లో తెల్లవారుజామున ముసి ముసి చీకట్లలో పరిచయం అయింది. ‘పొగమాదిరి కమ్మిన’ మంచులో వెచ్చదనం కోసం చుట్టవెలిగించుకోవాలనుకున్న పెంటమ్మకు దస్తగీర్‌ గుడిసె కంతలో దీపం వెలుతురు కనిపించింది.
నిప్పు కోసం వెడితె ఆమెకు దస్తగీర్‌ చాయ్‌ ఇచ్చాడు.
‘నీ పని అయిపోయినాక బువ్వకిక్కడికే రారాదు!..’ అని దస్త గీర్‌ ఆహ్వానించాడు. కుదరదని ఖండితంగా చెప్పింది పెంటమ్మ.
ఆ సాయంత్రం దస్తగీర్‌ కాపుకాసి ఆమెను మళ్లీ వీధిలో ఊడుస్తున్నప్పుడే కలిశాడు.
రెండు వేరుశెనగ పొట్లాలు కొని అతనికి ఒకటి ఇచ్చింది పెంటమ్మ.
రెండు పొట్లాలు కలిపేశాడు దస్తగీర్‌.
చాయ్‌వాడు వస్తే రెండు టీలు తీసుకున్నారు.
పైసలుపెంటమ్మే ఇచ్చింది.
వాళ్లిద్దరినీ చూస్తే టీ కుర్రాడికి ఏదో అర్థమయింది.
……..
ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయ త్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూ నిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. భర్త సజీవుడో కాదో ఆమెకు తెలియదు. భార్యాపిల్లలను చంపేశారని అతనికి తెలుసు.
ఈ కథా కాలం 1955 ప్రాంతం. అప్పటికి హైదరాబాద్‌ పై సైనిక చర్య జరిగి ఏడేళ్లు. తెలంగాణ సాయుధ పోరాటం అధికారికంగా విరమించి నాలుగేళ్లు. రచయిత కథాకాలాన్ని, నేపథ్యకాలాల్ని ఎంతో ఖచ్చితంగా పాటించారు. పెంటమ్మ ఫ్లాష్‌ బ్యాక్‌ ప్రకారం ఆమె భర్త కోటయ్యరాఘవాపురంలో దొర తోట మాలిగా పనిచేసినవాడు. మాటకారీ, దళితవాడలో పెద్దమనిషీ కావడం వల్ల కమ్యూనిస్టుపార్టీ స్పర్శ ఆ ఊరికి సోకగానే ప్రథమ కార్యకర్తగా మారినవాడు. దొరదగ్గరి పనికిరాని తుపాకీని మర మ్మత్తు చేయించుకుని సాయుధుడయ్యాడు. దొరమీదకే దాన్ని గురిపెట్టాడు. కమ్యూనిస్టుగా మొదట రజాకార్లను, తరువాత కాంగ్రెస్‌ వాండ్లను, మిలటరీని, పోలీసులను కూడా వేటాడాడు. కమ్యూనిస్టు పార్టీ పోరాటం మానుకున్నా కోటయ్య మాత్రం మానుకోలేదట. అందుకని పార్టీ వాండ్లు అతన్ని వెలివేశారు. అప్పుడు పార్టీ వాండ్లపైనా అతను కన్నెర్ర చేశాడట. ఏకాకిగా ఎన్నో అవస్థలు పడ్డాడట. బహుకష్టంగా ప్రభుత్వానికి చిక్కాడు. ఆ తరువాత అతని ఆచూకీ లేదు. అతను బతికిందీ చచ్చిందీ గట్టిగా చెప్పగలవారెవరూ లేరు. పెంటమ్మ కోటయ్యకు అన్ని విధాల చేదోడు వాదోడుగా పనిచేసింది. కానీ, ఆమెకు కోటయ్య పార్టీని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయింది. కోటయ్య పట్టుబడ్డాక ఎవరినుంచి సానుభూతీ సహకారం దొరకక, ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిలో కుది రింది. కానీ యూనియన్‌ వాండ్లకు కూడా తన వివరాలు చెప్ప లేదు. మహానగరంలో తనను తాను కాపాడుకుంటూ ఎట్లాగో నెట్టుకువస్తున్నది. ఇదంతా జరిగి మూడేండ్లపైన అయింది.
రామయ్య అనే దళితుడు పదిహేడేండ్ల కిందట మతం మారి దస్తగీర్‌ అయ్యాడు. దళితులను మతమార్పిడి చేసే కార్యక్రమం 1937-40 ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. ‘ప్రజల మనిషి’ నవలలో దాని విశేషాలను గమనించవచ్చు. అట్లా మారినవారు, అనేకమంది తిరిగి ఆర్యసమాజం శుద్ధి స్వీకరించి వెనుకకు వచ్చారు కానీ, కొందరు కొనసాగారు కూడా. అట్లా కొనసాగిన వాడు దస్తగీర్‌. అంతే కాదు, రజాకార్‌గా మారి, వారి కార్యకలా పాల్లో పాలుపంచుకున్నాడు. పెంటమ్మతో పరిచయం అయిన రోజున అతనికి తనగతం గుర్తుకు వచ్చింది. పెంటమ్మ ముఖం కడుక్కుంటుంటే, రెండు మూడు సార్లు గుడిసెలోంచి తొంగి చూచి, తన్మయత్వంలో మునిగితేలాడు. ‘‘….ఒకసారి శిలాప్రతిమ వలె నిలుచుండి తన్ను తానే మరచి ఆలోచించసాగాడు. అకస్మా త్తుగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లలో పోలీసు ఏక్షన్‌ రోజుల్లో పల్లెటూరిలో అతని ఇంటిపై దాడి జరిగి తన భార్య, పిల్లలు హత్య చేయబడడం గురించి, విన్న వివరాల ప్రకారం దృశ్యాలు తాండవించాయి. ఆనాడే ఆ సంఘటన జరిగినంత తల్లడిల్లాడు. పచ్చిగాయం మీద బలమైన ఇంకొక గాయం తగిలినంత వణికి పోయాడు. తాను రజాకారుగా చేసిన హత్యలు, గృహదహనాలు, మానభంగాలు పాపాన్ని కన్నీటిబొట్లతో కడిగి వేస్తున్నాడు…’’

వీళ్లిద్దరిని కథకుడు హైదరాబాద్‌లో ఎందుకు కలిపాడు? ఇద్దరి మధ్య ఏ సారూప్యం ఉన్నది? ఇద్దరూ రాజకీయ బాధితులు కావడమే కారణమా? అసలు వీరిని రాజకీయ బాధి తులు అనడం సరిఅయినదేనా?- ఈ ప్రశ్నలకు పూర్తి సమా ధానాలు కథలో దొరకవు. రెండు దళిత పాత్రలనుంచే ఎందుకు తీసుకున్నాడు? – ముస్లిమును ముస్లిముగానే తీసుకుని ఉండ వచ్చును గదా? గోపీచంద్‌ ‘గతించని గతం’లో బతుకమ్మ ఆడుతున్న సీ్త్ర మీద అత్యాచారంచేసిన ముస్లిం, పోలీసు యాక్షన్‌ వేళ పాకిస్థాన్‌కు పారిపోయి, ఏడేళ్ల తరువాత తిరిగివచ్చి పశ్చాత్తాప పడడం కథ. అది కేవలం రజాకార్‌ అత్యాచారాన్ని, బాధితురాలు బేలగా తనమీద దాడిచేసినవాడి కోసం ఎదురు చూడడాన్ని, ఆమె దయనీయస్థితి చూసి దుండగుడే పశ్చాత్తాప పడడాన్ని కథకుడు మూసవిలువల నేపథ్యంలోనే చిత్రించాడు. ఇక్కడ ఆళ్వారుస్వామి, రజాకార్‌గా మారిన దళితుడిని పాత్రగా తీసుకున్నాడు. దస్తగీర్‌ అయినా, పెంటమ్మ భర్త కోటయ్య అయినా – భూస్వామ్యపీడన నుంచి విముక్తి కావడానికే ఆయా రాజకీయ పాత్రలను స్వీకరించారు. తెలంగాణ గ్రామాల్లో మత మార్పిడి కోసం ముస్లిమ్‌ మతతత్వ సంస్థ ఉద్యమం చేపట్టి నప్పుడు- వారు దళితులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూస్వా ముల నుంచి పడుతున్న కష్టాలను మతమార్పిడి తొలగి స్తుందన్న భ్రమ కల్పించారు. దస్తగీర్‌ ఏ మార్గాన్ని ఎంచు కున్నప్పటికీ, అతని ఉద్దేశ్యం మాత్రం దోపిడి నుంచి బయట పడడమే. మతమార్పిడి చెందిన దస్తగీర్‌ యథాలాపంగా ఉండి పోలేదు.
నిష్ఠ కలిగిన ముస్లిమ్‌గా మారాడు. ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ చేసిన రాజకీయ ప్రబోధాలను విశ్వసించి రజాకార్‌గా మారాడు. తెలంగాణలో రజాకార్లు చేసిన పనులన్నిటిలోను భాగస్వామి అయ్యాడు. ఫలితంగా, పోలీసుచర్య సందర్భంగా జరిగిన పౌరదాడుల్లో తన భార్యాపిల్లలను పోగొట్టుకున్నాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యం కానీ, ఉదార లౌకికవాదులైన కాంగ్రెస్‌ ప్రాబల్యం కానీ ఉన్నచోట్ల ముస్లిములపై ప్రతీకార దాడులు జరగకుండా నిరోధించగలిగారు కానీ, ఇతర ప్రాంతాల్లో హింసా త్మకమైన చర్యలు జరిగాయి. అందుకు దస్తగీర్‌ కుటుంబంలోని అమాయకులైన సీ్త్రలు, పిల్లలు మరణించడమే రచయిత చూపిన నిదర్శనం. తనకు కలిగిన నష్టం నుంచి, తాను చేసిన పనులను దస్తగీర్‌ బేరీజువేసుకుని దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలగలిపి బాధపడ్డాడు. గ్రామంలో ఏమి జరిగిందో వినడమే తప్ప, అతను గ్రామానికి వెళ్లలేదని, హైదరాబాద్‌లో బతుకు ఈడుస్తున్నాడని కథాక్రమంలో మనకు అర్థమవుతుంది. ఈ ఏడేళ్ల కాలం అతను కష్టజీవిగానే గడిపాడు. పెంటమ్మతో అతను వ్యవహరించిన తీరులో ఎంతో సంస్కారం, పరిణతి కనిపిస్తాయి. అతనికి సంక్రమించిన జీవితం- అతన్ని ఒక మౌన పశ్చాత్తప్తునిగా మార్చివేశాయి. పెంటమ్మ కలిసిన రోజు శుక్రవారం. ఆరోజు అతను కొంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అట్లా అనుకోవడంలో ఒక వెలితి, దైన్యం కనిపిస్తాయి.

పెంటమ్మ కోటయ్య వంటి సాయుధయోధుడికి, ప్రజా నాయకుడి భార్యగా ఉండడంలోనే అనేక కొత్త సంస్కారాలు అలవరచుకుంటుంది. ఒకరికి తోడుగా ఉండగలిగిన గుణమూ, ఒంటరిగా నిభాయించుకోగలిగిన నిబ్బరమూ రెండూ ఆమెకు ఉంటాయి. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఒంటరి మహిళగా తనకు ఎదురైన అనుభవాలనన్నిటినీ ఒక విద్యార్థిగా ఆమె విశ్లేషించుకుంటుంది. తనకు దగ్గర కావడానికి ప్రయత్నించే పురుషులలోని స్వార్థాన్ని ఆమె గుర్తించగలదు. దస్తగీర్‌ విషయంలో కూడా ఆమె ఆ స్వార్థాన్ని పసిగట్టింది కానీ, అతని ప్రయత్నంలోని హుందాతనాన్ని గౌరవించింది. భర్త ఉన్నాడో లేదో తెలియనితనం నుంచి, పోయాడులే అని నిర్ధారణకు వస్తున్న క్రమంలో ఉన్నదామె. (జైలులో లేకుండా, బయట లేకుండా అదాలతులో మొఖద్దుమా లేక ఏమై ఉంటాడు? హృదయంలో ఒక ప్రశ్న బయలుదేరింది. ఆ విధంగా నామ రూపాలు లేకుండా మాయమైన వారు ఎందరు లేరు? వారిలో కోటయ్య కూడా ఎందుకు చేరగూడదు? ప్రజల బలం గాని, పార్టీ సానుభూతి గాని లేని కోటయ్యను ఎవరు ఏమి చేసినా అడిగేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి తప్పకుండా చచ్చి ఉండాలి..) అప్పుడు దస్తగీర్‌ పరిచయం ఆమెలో కదలిక కలిగించింది.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తమ గత జీవితాలను చెప్పుకున్నారా? రచయిత అట్లా ఎక్కడా చెప్పలేదు. కానీ, దస్తగీర్‌ రూపురేఖలను తలచుకుంటూ పెంటమ్మ అనుకున్న మాటలు ఆమె గ్రహింపు శక్తిని సూచిస్తున్నాయి. ‘‘.. అతడు అందగానిలో లెక్క కాదు. పిల్లి గడ్డం, స్ఫోటకపు మచ్చలతో చెదలు పట్టినట్లున్న ముఖం, పట్టుదలతో నమాజు చేస్తున్నందుకు గుర్తుగా నుదుటి మీది రూపాయి కంటె పెద్ద నల్లని మచ్చా, పోలీస్‌యాక్షన్‌ రోజుల్లో మిలటరీ తుపాకీ దెబ్బకు ఎగిరిపోగా మిగిలిన చెవ్వు, మిలటరీ క్యాంపులో తిన్న దెబ్బలకు వంకరలు తిరిగిన వేళ్లు…’’ అదీ దస్తగీర్‌ రూపం. బహుశా, తెలంగాణలో అణగారిన ప్రజలు ప్రతి ఒక్కరి ఒంటి మీదా, జీవితం మీదా నాటి కాలం కొన్ని గుర్తులు వేసింది. బాధితుల మధ్య కలిగే సహజమైన మమత్వం ఏదోవారిద్దరినీ దగ్గర చేసి ఉండాలి. యుద్ధరంగం ఎన్ని మరణాలను వెదజల్లినా, ఎప్పుడో ఒకప్పుడు జీవితం తిరిగి మొలకెత్తవలసిందే.
తెలంగాణ సాయుధపోరాటం, పోలీసు యాక్షన్‌- భారతదేశ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు. దేశవిభజన కాలం నాటి పరిణామాలతో పరోక్షంగా సంబంధం ఉన్న పరిణామాలు. అంతర్జాతీయంగా, రెండో ప్రపంచయుద్ధపు ముగింపు, చైనాలో విజయానికి చేరువగా ఉండిన విప్లవం, నూతన స్వతంత్ర భారత పాలకవర్గాల జాతీయోన్మాదం-అన్నీ కలిసి నాటి సంఘటనలను రచించాయి. తాము అడుగులో అడుగు వేసి నడిచిన విశ్వాసాలు తమను వెలిగా పెడితే, లేదా తాము ఎడం జరిగితే కలిగే ఏకాకితనం పెంటమ్మ, దస్తగీర్‌లకు అదనపు కష్టం. బహుశా, ఆళ్వారుస్వామి కూడా ఈ కథారచన కాలంలో అటువంటి మనస్థ్సితిలో ఉండి ఉంటారు. అందుకే ఆయన ఈ కథకు ‘రాజకీయ బాధితులు’ అని పేరుపెట్టారు. తరువాత కొద్దిరోజులకే తన ఒంటరి సంక్షోభానికి పరిష్కారంగా తిరిగి కమ్యూనిస్టుపార్టీలో ఆయన ప్రవేశించి ఉంటారు.
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, పాత్రల పట్ల ఆయన చూపించిన అపారమైన గౌరవం, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి. అలభ్యంగా ఉండిపోయిన ఆళ్వారు స్వామి కథల్లో ఇది ఒకానొకటి మాత్రమే. తక్కిన కథలన్నీ ఇంతటి విస్తృతినీ, ఇంతటి జీవితాన్నీ, చరిత్రనూ చిత్రించాయని కాదు కానీ, ప్రతి ఒక కథా ఒక ఆణిముత్యమే. లభ్యం కాని కథలే కాదు, దొరుకుతున్న కథలు కూడా తెలుగు పాఠకులకు తగినంతగా తెలియదు. కనీసం ఆళ్వారుస్వామి పేరైనా తరచు ప్రస్తావనకు వస్తున్న తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఆ ప్రయత్నం జరగకపోవడం ఆశ్చర్యకరం.
పుస్తకరూపం తీసుకోకుండా ‘స్రవంతి’ పత్రిక సంపుటాల్లోనే మిగిలిపోయిన ‘రాజకీయ బాధితులు’ కథతోపాటు సుమారు మరో ఇరవైకథలు ఇంకా తెలుగు పాఠకులకు కొత్తగా పరిచయం కావలసి ఉన్నాయి. ప్రగతిశీల ప్రచురణకర్తల దారుణమైన విస్మరణకు, వివక్షకు గురై ‘జైలు లోపల’కథలు కూడా ఇటీవలి దాకా పునర్ముద్రణే జరగలేదు. అముద్రిత కథలు పుస్తకరూపమే తీసుకోలేదు. కథారచయితగా ఆళ్వారుస్వామి అజ్ఞాతవాసానికి త్వరలో ముగింపు లభిస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి పరిశోధనల ద్వారా అసామాన్యమైన కృషి చేసిన సంగిశెట్టి శ్రీనివాస్‌ సేకరించిన అముద్రిత కథలతో పాటు, ఆళ్వారుస్వామి కథలన్నీ శతజయంతి సంవత్సరంలో 2015 ఫిబ్రవరి 5న ఆళ్వారుస్వామి వర్ధంతి రోజున ఆవిష్కృతం కానున్నాయి.
– కె. శ్రీనివాస్‌
(నవంబర్‌ 1న ఆళ్వారుస్వామి 99వ జయంతి, శతజయంతి ఉత్సవాల ప్రారంభం)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.