ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి

ఆకాశదీప మహాత్మ్యం

కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః 

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేఇ కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.