పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!

అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం పది గంటలకు పటేల్ తుది శ్వాస వదిలాడు! సర్దార్ జీవించి ఉండగా చివరి పుట్టినరోజు పండుగ 1950 అక్టోబర్ ముప్పయవ తేదీన జరిగినట్టు ఆయన కుమార్తె మణిబెహిన్ పటేల్ తన డైరీలో వ్రాసుకున్నారు! మణిబెహిన్ దినచర్య పుస్తకంలోని వివరాల మేరకు 1946, 1947, 1948, 1949 సంవత్సరాలలో ముప్పయి ఒకటవ తేదీన జరిగిన ఈ పుట్టిన పండుగ 1950లో ఒక రోజు ముందుగా ఎందుకు జరిగిందో తెలీదు! పటేల్ ప్రధానంగా గుజరాతీ పంచాంగం- విక్రమ శకం- ప్రకారం పుట్టిన పండుగ జరుపుకునేవాడు. ఈ సంగతి మణిబెహిన్ మరోచోట వెల్లడించి ఉన్నారు! అందువల్ల 1950లో ఒక రోజు ముందుగానే ‘జన్మదినం’ వచ్చిందేమో?? కానీ పటేల్ దేశానికి అవసరమైనంతకాలం జీవించలేదు, ముందుగానే మరణించాడు! ఎనబయి ఏళ్లు జీవించడం ‘అద్భు తం’కాదు… పటేల్ డెబ్బయి ఐదు ఏళ్లకే మరణించడం దేశ ప్రజల దురదృష్టం! పటేల్ కనీ సం మరో ఐదు ఏళ్లు జీవించి ఉండి ఉంటే చైనా టిబెట్‌ను దురాక్రమించకుండా భారత ప్రభు త్వం చర్యలు తీసుకొని ఉండేదన్న వాదం ప్రచారంలో ఉంది! టిబెట్ 1949-1959 సంవత్సరాల మధ్య చైనా దురాక్రమించడాన్ని మన దేశం అడ్డుకొని ఉండి ఉంటే……??
1962 సెప్టెంబర్ 8వ తేదీ నుండి చైనా మన దేశంలోకి చొరబడి ఉండేది కాదు, అక్టోబర్ 20నుండి దురాక్రమణను ఆరంభించి ఉండేది కాదు! టిబెట్ స్వతంత్ర దేశంగా మనకూ చైనాకుమధ్య నెలకొని ఉన్నప్పుడు చైనా దళాలు మన సరిహద్దునకు వచ్చే ప్రశే్న లేదు, భారత్ చైనా సరిహద్దు లేదు… భారత్-టిబెట్ సరిహ ద్దు, టిబెట్-చైనా సరిహద్దు మాత్రమే ఉండేది!! కానీ పటేల్ మరో ఐదేళ్లు జీవించి ఉంటే చైనాను నిరోధించడం- టిబెట్‌ను దిగమింగకుండా – సాధ్యమయి ఉండేదా??
తాను మరణించడానికి నెల రోజుల ముందు 1950 నవంబర్‌లో ఉప ప్రధానమంత్రి వల్లభభాయి కమ్యూనిస్టు చైనానుండి మన దేశానికి రానున్న ప్రమాదం గురించి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అప్రమత్తం చేయయత్నించాడు! ‘‘మన దేశాన్ని నమ్ముకున్న టిబెట్ దేశా న్ని తమ ప్రభుత్వం చైనా దురాక్రమణ బారినుండి కాపాడలేకపోతోందని’’ పటేల్ తన ఉత్తరంలో నెహ్రూకు తెలియజేశాడు. కానీ అప్పటికే జవహర్లాల్ టిబెట్‌ను చైనాలో విలీనం చేయడానికి నిర్ధారించి ఉన్నాడు! 1949లో భారత ప్రభుత్వం తరఫున ఆయన చైనాకు వ్రాసిన ఉత్తరం ఇందుకు సాక్ష్యం!! ‘‘టిబెట్‌లో చైనాకు ఎలాంటి ప్రతిఘటన కూడ ఉండబోదు…’’అని ఆ ఉత్తరంలో భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ ‘మైత్రీ లేఖ’కు సమాధానంగా అత్యంత పరుష పదజాలంతో చైనా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని నిందించింది. ‘‘చైనా వాడిన పదజాలం మైత్రిని కోరేవారు ఉపయోగించేది కాదు… ప్రబల శత్రువు వాడే పదజాలమిది…’’అని ఆ సమాధానం గురించి పటేల్ నెహ్రూను హెచ్చరించాడు! పటేల్ ఉత్తరాలకు నెహ్రూ ఇచ్చిన చివరి సమాధానం ‘‘టిబెట్ స్వాతం త్య్రం మరణించింది…’’అని మాత్రమే!! బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ముగిసిన తొలి రోజులలో మన దేశపు అంతర్గత వ్యవహారాలను వల్లభభాయిపటేల్ నిర్వహించాడు. ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడని రీతిలో ఖండిత భారత సమైక్యతను సాధించాడు! జమ్మూకాశ్మీర్ బ్రిటిష్ దురాక్రమణ సమయంలో అర్థ స్వతంత్ర సంస్థానం. ఈ సంస్థానం కూడ 1947 అక్టోబర్ 26న దేశం లో విలీనమైంది! కానీ ఈ అంతర్గత వ్యవహారాన్ని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా నిర్వహించడంవల్ల జమ్మూకాశ్మీర్‌లోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూమి పాకిస్తాన్ అక్రమ అధీనంలో అలమటిస్తోంది! నెహ్రూ నిర్వాకంవల్లనే టిబెట్‌ను చైనా కాజేయగలిగింది… ఈ కాజేసిన ఫలితమే మన లడక్‌లోని చైనా చొరబడి పోవడం! లడక్‌లోని ముప్పయి ఎనిమిది వేల చదరపుకిలోమీటర్ల ప్రాంతం చైనా దురాక్రమణకు గురి అయి ఉంది!! ఇదంతా అక్టోబర్ నెలతో ముడిపడిన వ్యవహారం!!
చైనావల్ల తమ దేశానికి దురాక్రమణ ప్రమాదం ఏర్పడిందని నిరోధించాలని 1949లో టిబెట్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి మొరపెట్టుకుంది! ‘‘జవహర్లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదుల వీపుమీద ఎక్కాడు. అతగాడు వారి తొత్తు…’’అని 1949 సెప్టెంబర్ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ అధికార పత్రికలు అభివర్ణించాయి! అతి పెద్ద సోషలిస్టు దేశమైన చైనాకు తన పట్ల కలిగిన ఈ దురభిప్రాయం బహుశా జవహర్లాల్ నెహ్రూకు ఆవేదన కలిగించి ఉండవచ్చు… అందువల్లనే ఈ దురభిప్రాయాన్ని దూరంచేసి చైనా మెప్పును పొందడానికి ఆయన ఆ జీవన కృషి సాగించాడు. 1949 నవంబర్ 24న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ‘టిబెట్’ చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా మన ప్రతినిధి చైనా ప్రతినిధివలె ప్రవర్తించడం చరిత్ర… టిబెట్ చైనా లో భాగమన్న వాదాన్ని వినిపించడం ద్వారా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయ చకితనుచేయడం కూడ చరిత్ర!! ఇదం తా చైనా మైత్రికోసం నెహ్రూ చేసిన ‘కృషి’లో భాగం!! ఐక్యరాజ్య సమితిలో మాత్రమే కాదు మన పార్లమెంటులో సైతం నెహ్రూ వినిపించిన వాదం టిబెట్ స్వాతంత్య్ర హనన చరిత్రలో భాగం… 1954 మే నెల 18వ తేదీన నెహ్రూ పార్లమెంటు ఉభయ సభలలో మూడు సుదీర్ఘ ప్రసంగాలు చేశాడు! ఈ ప్రసంగాల సారం టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పే ‘బ్రిటిష్ పాలన’నాటి విధానాన్ని దుయ్యబట్టడం, తప్పు పట్టడం! బ్రిటిష్‌వారు మన దేశాన్ని పాలించిన సమయంలోను, అంతకుముందు దాదాపు రెండువేల ఏళ్లకు పైగా టిబెట్ స్వతంత్ర దేశమన్న చరిత్రను నెహ్రూ గుర్తించలేదు! 1914నాటి సిమ్లా ఒప్పందం ద్వారా చైనా దురాక్రమణనుండి టిబెట్‌ను రక్షించే అధికారం మన దేశానికి సంక్రమించింది! ఈ ఒప్పందంలో భాగంగానే టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పారు, మన తంతి తపాలా కార్యాలయాలను నెలకొల్పారు. ఈ సంస్థలను నెహ్రూ ప్రభుత్వం రద్దుచేసింది! ఇలా రద్దుచేయడం మన భద్రతకు చైనావల్ల ప్రమాదం ఏర్పడుతుందన్న వాదాన్ని నెహ్రూ తన మూడు ప్రసంగాల ద్వారా ‘‘తిప్పికొట్టాడు’’…
‘‘టిబెట్ చైనాలో భాగం, మరో స్వతంత్ర దేశంలో భారతీయ సైనికులు కొనసాగడం ఊహించరాని వ్యవహారం… టిబెట్‌లోని భారతీయ సైనికుల సంఖ్య మూడువందలు మాత్రమే కావచ్చు. కానీ ఈ ‘పటాలాన్ని’ టిబెట్‌లో ఎందుకని మోహరించారు? టిబెట్ స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనా అంతర్భాగం కావచ్చు! కానీ తన సైన్యంలోని ఒక విభాగాన్ని చైనాలో నెలకొల్పే అధికారం భారత్‌కు ఉందా? గతంలో… టిబెట్‌లో భారత సైనిక దళాలను నెలకొల్పిన సంప్రదాయం బ్రిటిష్ సామ్రాజ్యవాద చిహ్నం. ఈ ‘వ్యవస్థ’ను కొనసాగించడం ప్రస్తుతం అసాధ్యం! ‘యాతంగ్’లో కాని ‘జ్ఞాన్క్షా’లో కాని భారత సైనికదళాలను నెలకొల్పాలనడం వాస్తవాలకు, విచక్షణకు విరుద్ధమైన అంశం…’’అని 1954 మే 18న నెహ్రూ నిగ్గుతేల్చాడు! ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది’’అని పటేల్‌కు చెప్పడం ద్వారా ఒకప్పుడు టిబెట్ స్వతంత్ర దేశమని నెహ్రూ 1950లో అంగీకరించి ఉన్నాడు! కానీ 1954 నాటి టిబెట్ గతంలో స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనాలో అంతర్భాగం కావచ్చు… అని అంటూ నెహ్రూ చరిత్రను వక్రీకరించాడు! ‘నెహ్రూ విధాన’వాదులు రచించిన చరిత్ర పుస్తకాలను తగులబెట్టాలని భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి అక్టోబర్ ఐదవ తేదీన ఢిల్లీలో జరిగిన ‘ఇతిహాస సంకలన యోజన’ సమితివారి సదస్సులో పిలుపునిచ్చాడు! ఈ పిలుపు చరిత్రలో ‘హేమచంద్ర విక్రమాదిత్యుడు’అన్న స్వదేశీయ సామ్రాట్టు క్రీస్తు శకం 1556నకు పూర్వం నిర్మించిన సామ్రాజ్యాన్ని ‘నెహ్రూవాద’ చరిత్రకారుడు పట్టించుకొనక పోవడంపట్ల నిరసన….కానీ టిబెట్టు స్వాతంత్య్ర చరిత్రను నెహ్రూ స్వయంగా పట్టించుకోలేదు!! 1950లో టిబెట్ స్వాతంత్య్ర పరిరక్షణకు భారత ప్రభుత్వం పూనుకోవాలని కోరిన పటేల్ ఆ తరువాత ఐదేళ్లు అయినా జీవించి ఉండి ఉంటే ఏమయి ఉండేదో…??
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య టిబెట్ స్వతంత్ర దేశం! అందువల్లనే టిబెట్ చైనా తరఫున పోరాడలేదు, బ్రిటిష్‌వారి తరఫున పోరాడలేదు! రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో చైనా, బ్రిటన్లు ఒకే జట్టు! జవహర్లాల్ నెహ్రూ బృందంవారు ఆ తరువాత భ్రమించినట్టు టిబెట్ చైనాలో భాగమయి ఉండినట్టయితే చైనా ‘బ్రిటన్ అమెరికా రష్యాల కూటమి’లో ఉన్నప్పుడు టిబెట్ తాటస్థ్యం వహించడం కుదరదు!! అతి ప్రాచీన చరిత్రను మరచిపోయినప్పటికీ కనీసం క్రీస్తుశకం ఇరవైయవ శతాబ్ది చరిత్రనైనా మన ప్రధాని 1949 తరువాత గుర్తించుకోవలసి ఉండింది!! అతి ప్రాచీన కాలంలో టిబెట్ భారతదేశంలో సాంస్కృతికంగా మాత్రమేకాక, ఆర్థికంగాను, భౌగోళికంగాను రాజ్యాంగ వ్యవస్థాగతంగానూ కూడ భాగమన్నది చారిత్రక సత్యం.
ఐదువేల నూట నలబయి మూడు ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో యదువంశ బలరాముడు ఎవరి పక్షంలోనూ చేరలేదు. ఇలా కౌరవులకూ, పాండవులకూ కూడ దూరంగా ఉండిపోయిన ‘మరో రాజకుమారుడు’ ‘రూపతి’…. రూపతి యుద్ధవిముఖుడై ఉత్తరంగా వెళ్లాడు, హిమాలయాలలో త్రివిషృప సీమలకు చేరుకున్నాడు. ఆ సమయంలో త్రివిష్టపమ్- టిబెట్టు- అనేక వనవాసీ నాయకుల మధ్య విభక్తమై అనేక రాజ్యాలుగా ఉండేది. ఈ ‘పాలకులు’ పరస్పరం కలహించుకునేవారు! ఈ వనవాసీలు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి ఆరాధన వేదధర్మంలోని ఒక సంప్రదాయం! రూపతి పరస్పరం కీచులాడుతున్న ‘వనమతం’వారిని సమైక్యపరచి విశాల త్రివిష్టప రాజ్యాన్ని నిర్మించాడు. అలా ‘కలియు గం’లో తొలి టిబెట్ పాలకుడు రూపతి… భారతీయుడు! రూపతికి పూర్వం కూడ త్రివిష్టప ప్రాంతాలన్నీ భరత ఖండంలో భాగం, అందువల్లనే వనజనుడు రూపతిని రాజుగా అంగీకరించాడు!
క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకుల దండయాత్రలు మొదలైన తరువాత రెండు సహస్రాబ్దులపాటు భారత రక్షకుల దృష్టి పశ్చిమంవైపు తిరిగింది! ఈ సమయంలో టిబెట్, బర్మా వంటి తూర్పు సరిహద్దు ప్రాంతా లు ప్రధాన భారత భూభాగంనుండి విడిపోయి రాజకీయంగా స్వతంత్రమయ్యాయి! రాజకీయంగా ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటికీ టిబెట్ సంస్కృతి భారతీయ సంస్కృతిలో భాగం కావడం చరిత్ర!! టిబెట్ మళ్లీ స్వాతంత్ర దేశంగా ఏర్పడడంవల్ల మాత్రమే మనకు చైనా బెడద తప్పుతుందన్నది చరిత్ర చెబుతున్న పాఠం!