గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

79- ప్రాకృత కావ్య కవి రాజు  -వాక్పతి రాజు

వాక్పతి రాజు  భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు ఇందులో 1209 గాధలున్నాయి .ఇందులో యశో వర్మ జీవిత వృత్తాంతం కూడా ఉంది .అసంపూర్ణ కావ్యం .యశోవర్మ కాశ్మీర రాజు లలితా దిత్యుని చేతిలో733లో  ఓడిపోయాడు .కనుక వాక్పతి రాజు కావ్యం740లో రాసి ఉంటాడని భావన.

వాక్పతి కవితా రాజం

ఈ కావ్యం లో యశోవర్మ గౌడ రాజును జయించే కదఉంది అందుకే ‘’గౌడ వధ .’’(గౌడ వహో)అని సముచితమైన పేరు పెట్టాడు .చరిత్రకంటే కావ్య లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి .గౌడ వధ తో బాటు రాజు దిగ్విజయాలూ ఉన్నాయి .శ్లేష చమత్కారాలు తక్కువగా సుందరమైన శైలిలో రాశాడు . .

80-నవ సాహసాంక చరిత్ర కర్త-పరిమళ పద్మ గుప్తుడు

కాళిదాసమహా కవి మీద గౌరవం తో ‘’పరిమళ కాళిదాసు ‘’అనే బిరుదుపొండాడు పరిమళ గుప్తుడు .దారానగర రాజు సాహసాంక అనే బిరుదు పొందిన సింధురాజు ఆస్థానకవిగా ఉన్నాడు పద్మ గుప్తుడు .,కవిపండితపోషకుడురెండవ వాక్పరి రాజు   తమ్ముడే సింధురాజు .భోజ రాజు తండ్రి  .సింధు కూడా కవిపండిత పోషకుడు .వాక్పతి కర్నాటక రాజు   తైల పుడి చేతిలో మరణించాడు ,సింధురాజు  రాజయ్యాడు  .పద్మ గుప్తుడి తండ్రి మృగాంక గుప్తుడు .సింధురాజు ప్రోత్సాహం తో ఈకావ్యం రాశాడు .ఇతని తర్వాత  ముంజ రాజు ఆ తర్వాత భోజుడు రాజులయ్యారు .ఈ ఇద్దరి ఆస్థానాల్లోనుపద్మ గుప్తుడు  కవి .భోజుడు ఎక్కడా ఇతని విషయం ప్రస్తావించ లేదు .కనుక పద్మ గుప్తుడు పదవ శతాబ్దం చివరినుండి పదకొండవ శతాబ్దం లోపు వాడు .గుప్తుడు కాశ్మీర దేశపు శైవుడు .

గుప్తుని కవితా పద్మ పరిమళం

‘’నవ సాహసాంకచరిత్ర’’  పద్దెనిమిది సర్గల కావ్యం .క్షేమేంద్రుడు ఇతని శ్లోకాలను ఉదాహరించాడు. ఇందులో సింధురాజు నాగ రాజు కూతురు శశిప్రభను పెళ్లి చేసుకోవటం ఇతి వృత్తం .వజ్రాం కుడు అనే నాగుల శత్రువును చంపి ,వాడి సరస్సులో ఉన్న బంగారు కమలం తెచ్చి నాగ రాజుకిచ్చి  అతని కూతురు శశిప్రభను పెల్లాడతాడు  .రమ్యమైన శైలిలో కావ్యం నడిపాడు .అనుప్రాసలతో కవిత్వం పారించాడు  ఓజోగుణశైలి ఎక్కువ .సహజ వర్ణనలు చేశాడు. అలంకార పుష్టిని కావ్యానికి చేకూర్చాడు .తన అభిమాన కవి మహా కవి కాళిదాసు ను అన్నిటా అనుకరించాడు అనుసరించాడు .

సింధురాజు పరమార వంశానికి చెందిన వాడు .క్షత్రియులని ,బ్రహ్మ క్షాత్ర కులం వారమని చెప్పుకొన్నారు. పదకొండవ సర్గ లో పర మార వంశ చరిత్ర చెప్పాడు .విశ్వా మిత్రుడు వసిస్టూడి కామ ధేనువును ఎత్తుకు పోగా అరుంధతి దేవి మొదలైన రుషిపత్నులు తీవ్రం గా విచారించారు ,వసిస్టమహర్షి యజ్ఞం చేస్తాడు అందులో నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భ వించి విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామ ధేనువు తెచ్చి ఇస్తాడు .ఆ పురుషుడికి ‘’పరమారుడు ‘’అనే పేరుపెట్టాడు వసిస్స్టూడు .అతని నుంచి పరమార వంశం ఏర్పడింది .శాసనాలలో దీన్నే రాసుకొన్నారు .

పదవ సర్గ లో సింధు రాజు వాగడ ,మురళ,లాబా ,హూణదేశాలను జయించి నట్లు రాశాడు ఇవన్నీ చారిత్రిక సత్యాలే .విద్యాధరుల సాయం తో సింధురాజు వజ్రామ్కశ రాజును జయించి నాగరాజు కూతురు శశి ప్రభను వివాహం చేసుకోవటం చారిత్రిక సత్యమే అన్నారు .వజ్రాంకుడి రాజ దాని  రాత్నావతి నర్మదానది కి దక్షిణాన ఉంది .వీరు జీమూత వాహనుడినితమ వంశ మూల పురుషుడిగా చెప్పుకొంటారు .బహుశా వీరి రాజ్యం కొంకనణ ప్రాంతం అయి ఉండాలి .

81-‘’శివాజీ చరిత్ర రాసిన -అంబికా దత్త వ్యాసుడు

1850-1900వాడిన అంబికాదత్తుడు ‘’శివ రాజ విజయం ‘’కావ్యం రాశాడు .కాశీ వాసి ఇందులో శివాజీ మహా రాజు చరిత ఉంది .శివాజీ జీవితం లోని ముఖ్య ఘటనలన్నీ ఉన్నాయి కల్పననలూ బాగానే చేశాడు

అంబికా దత్తీయం

స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే మహోత్క్రుస్ట ఉద్దేశ్యం తో ఛత్రపతి శివాజీ మహారాజు సమర్ధ రామ దాస స్వామి ఆశీర్వాద ప్రోత్సాహాలతో నిర్ణయించుకొని మహమ్మదీయ అత్యాచారాలను నిర్మూలనం చేసి సాధిస్తాడు కొద్దిమంది ససైనిక పరివారం తో జైత్ర యాత్ర ప్రారంభిస్తాడు . బీజ పూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ అనే సైన్యాదికారిని శివాజీ మీదకు పంపిస్తాడు .బుద్ధి బలం తో అతడిని శివాజీ మట్టుపెడతాడు .తర్వాత సయిస్తఖాన్ ను జయించి చంపి సూరత్ జయించి మహా రాష్ట్ర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు ,కొన్ని కల్పిత పాత్రలూ ఇందులో ఉన్నాయి .ఎక్కడా అసహజత్వం లేకుండా రాశాడు .దండి  బాణులను అనుకరించాడు. అవసరమైన అలంకారాలు వాడాడు .పాత్రోచిత భాష తో అలరించాడు .ప్రతి పాత్రా సజీవం గా కన్పిస్తుంది .శివాజీ శీల ఉత్క్రుస్టతను మనోహరం గా చిత్రించాడు .

శివాజీ మహారాజులో ఉన్న దేశ భక్తీ శౌర్య పరాక్రమాలు ,దానం ధర్మ మార్గా నుసరణం  నిర్భయం స్వాభిమానం ఆత్మ గౌరవం స్త్రీలయెడ ఉన్న గౌరవ సమ్మానం చరిత్ర లో ఎక్కడా చూడం .అన్నిటినీ సహజ సుందరం గా వర్ణించాడు .సాంఘిక రాజకీయ విషయాలను ఉత్క్రుస్టంగా చిత్రించాడు .అన్ని రకాల వర్ణనలు చేశాడు .శివాజీని ఆదర్శ మూర్తిగా వీరునిగా మహా దీరునిగా దేశ భక్తీ ప్రబోధకునిగా మహత్తరం గా చిత్రీకరించి మెప్పుపొందాడు అంబికా దత్తుడు .చారిత్రక ఇతి వృత్తానికి గొప్ప కావ్య గౌరవం కలిగించాడు .ఆధునిక కాలం లో కూడా ఇంతటి ఉత్కృష్ట సంస్కృత కావ్య రచనలు చేసేవారున్నారని అంబికా దత్తుడు నిరూపించి మార్గ దర్శనం చేశాడు

82-నల చంపువు రాసిన –త్రివిక్రమ భట్టు

నల చంపువు రాసిన త్రివిక్రమ భట్టు పదవ  శతాబ్ది కవి .తండ్రి దేవా(నేమా)దిత్యుడు తాత శ్రీధరుడు భోజుడు త్రిక్రముడిని ఉదాహరించాడు .మాన్య  ఖేటాధిపతి  అయిన మూడవ ఇంద్రుడు అనే రాష్ట్రకూట రాజు ఆస్థాన కవిగా ఉన్నాడు .

భట్టు కవితా త్రివిక్రమం

భట్టు తండ్రి నేమాదిత్యుడు రాజాస్థాన పండితుడు .భట్టు చదువు వదిలేసి తిరుగు బోతుగా ఉండేవాడు .తండ్రి ప్రక్క ఊరు వెళ్ళినప్పుడు రాజాస్థానానికి శాస్త్ర వాదం చేయటానికి ఒక పండితుడు వచ్చాడట .రాజు ఇంటికి కబురు చేశాడు ఏమి చేయాలో తోచని త్రివిక్రముడు సరస్వతీదేవిని  ప్రార్దిం చాడట ..అతని తండ్రి తిరిగి వచ్చేదాకా తానూ భట్టు నాలుక మీద ఉంటానని వాణివాగ్దానం చేసి అలానే చేసింది .అమ్మ బలం తో శాస్త్రవాదానికి వచ్చిన పండితుడిని తానె ఓడించి రాజ సత్కారం పొందాడు .సరాసరి ఇంటికి వచ్చి ‘’నల చంపువు ‘’రాయటం ప్రారంభించాడు .ఏడవ ఉచ్చ్వాసం పూర్తీ అయ్యేసరికి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు .సరస్వతి ఇచ్చిన మాటప్రకారం నాలుకమీద నుంచి వై దోలగింది .తర్వాత కావ్యాన్ని పూర్తీ చేయలేక పోయాడట .అని కద ప్రచారం లో ఉంది  ,

,  భారతం లోని అరణ్య పర్వ కద.అందరికీ తెలిసిందే .నలుడు హంసను చూసి పట్టుకోవటం దానితో సంభాషించటం  ,అది దమయంతికి నలునిపై ప్రేమ ఉందని చెప్పటం .దమయంతి  వృత్తాంతం అంతా వివరంగా రాశాడు .హంస దమయంతిని చేరి నలుని ప్రేమ విషయం తెలియ జేయటం ,దమయంతీ స్వయం వరం దిక్పాలకుల తరఫు రాయబారం దమయంతీ విరహం తో నలుడు పడే బాధ .త్రివిక్రముడు చంపు వును ఆధారం గా చేసుకొనే శ్రీ హర్షుడు నైషద కావ్యం రాశాడంటారు .ఇందులోని భాగాలను ఉచ్చ్వాసాలు అని పేరుపెట్టాడు ప్రతి ఉచ్చ్వాసం చివర్లో ‘’హర చరణ సరోజ ‘’అనే పదాన్ని వాడాడు .ఈ చంపూకావ్యానికి చాలా టీకలున్నాయి .కనుక అందరిని అలరించిన కావ్యం అనుకోవచ్చు .త్రివిక్రముని బాటలో హర్షుడు లక్ష్మీధరుడు శ్రీనివాస దీక్షితులు నల దమ యంతుల కావ్యాలు రాశారు ఇందరికి ప్రేరణ నిచ్చినవాడు త్రివిక్రముడు .

త్రివిక్రముడు మదాలస చంపువు కూడా రాశాడు .మార్కండేయ పురాణం లోని ‘’కువలయాశ్వుడు –మదాలస ‘’ల చరిత్ర .కువలయాశ్వుడు పాతాళ కేతువును చంపి మదాలసను పెళ్ళాడటమే ఇతి వృత్తం .బహుశా దీన్నే ముందుగా రాసి ఉంటాడు .అంత పరిపక్వమైణ రచన అనిపించదు .కదా విషయం లో ఉత్క్రుస్టకావ్యం అనిపించుకొన్నది .దీని ఆధారం గా కృష్ణ దేవరాయలు తో సహా చాలామంది మదాలస చరిత్ర కావ్యాలు రాశారు .ఇందరికి స్పూర్తికల్గించాడు .చంపువు అంటే పద్యం తో బాటు గద్యమూ ఉన్న రచన అని మనకు తెలిసిన విషయమే. త్రివిక్రముడు సవ్య సాచిగా రెండిటిని పండించాడు .మధురమైన శైలి ఆకర్షిస్తుంది .సభంగ శ్లేషను బాగా ప్రయోగించాడు .

‘’ఉదయగ్రి గతాయాం ప్రాక్ప్రభా పాండుతాయా –మనుసరతి నిశీదే శ్రుంగా మస్తాచలస్య

జయతి కిమపి తేజః సాంప్రతం వ్యోమ మధ్యే –సలిలమివ విభిన్నం జాహ్నావం యామునం చ ‘’ అంటే –ఉదయ కాంతి ఉదయ గిరి కొండమీద ప్రకాశిస్తోంది .రాత్రి హస్తగిరి శిఖరాల మీద నుంచి జారుతోంది ,.అప్పుడు గంగా యమునా జలాలు కలిసి పోయినట్లు ఒక అలౌకిక తేజస్సు అంతటా ప్రకాశిస్తోంది ‘’అన్నాడు త్రివిక్రముడు .

కవి పద ప్రయోగం లో నిపు ణుడుగా ఉండాలి .కాకపొతే తప్పటడుగులు వేసి అర్ధం కాని బాలుడి మాటల వాడు అంటారు అన్నాడు త్రివిక్రముడు .’’కిం కవేస్తేన కిం కాండేన ధనుష్మతః –పరస్య హృదయే లగ్నం ణ ఘూర్ణ యతి యచ్చిరః ‘’అని మరొక చోట అంటాడు దీని అర్ధం –ప్రయోగించిన పదం ధనుర్ధారి ప్రయోగించిన బాణం హృదయాన్ని తాకి వ్యామోహితుడిని చేయక పొతే లాభం లేదు .ఇదీ త్రివిక్రమ భట్టు కవితా ప్రాభవం .

మరోకవితో మళ్ళీ

సశేషం

మీ-గబ్బిట డుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.