గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60
83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి
ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం లోనే కన్నడ భారతం రాసిన పంపకవి కూడా ఉండేవాడు .ఈ చాళుక్య రాజులు జైన అభిమానులు .సూరి మాత్రం ఉత్తర దేశం వాడు ఇక్కడికొచ్చి ఈ కావ్యం రాశాడు .ఇతనికాలం 995 అయి ఉండాలి .
సోమప్రభ యశస్ తిలకం
సూరి రాసిన పై కావ్యం లో యశోధర ,మారి దత్తుడు అనే రాజుల కద ఉంది .మారిదత్తుడు యజ్ఞం చేయాలనుకొని బలికోసం పశువులతో బాటు ఒక బాలుడు బాలిక లను కూడా సిద్ధం చేసుకొంటాడు .సుదత్తుడనే ముని వచ్చి ఇలాంటి యజ్ఞం కూడదు అంటాడు .ఆ ముని బోధ వలన మారిదత్తుడు జైన మతం స్వీకరిస్తాడు .సమకాలిక జీవిత ప్రతి బింబం గా చిత్రణ బాగా చేశాడు .రాజ్య వ్యవహారాలూ ,దురాచారాలు వాస్తవం గా రాశాడు .కాదంబరి లాగానే నడిపించాడుకావ్యాన్ని .
సూరికి ఆదర్శం బాణుడే.అదే దారిలో నడిచాడు .పాండిత్యం తో శ్లేషలతో కవిత్వాన్ని రక్తి కట్టించాడు .సూక్తులను సందర్భోచితం గా ప్రయోగించి సార్ధకత తెచ్చాడు ..సోమ ప్రభును ఆనంతర కవులు చాలామంది అనుకరించారు .
84-అభినవ కాళిదాసు
అసలు పేరు వెల్లాల ఉమా మహేశ్వరుడు .అభినవ కాళిదాస బిరుదాంకితుడు .’’భాగవత చంపువు ‘’రాశాడు .కాలం పదిహేనవ శతాబ్ది .
కొత్త దాసు గారి కవిత్వం
భాగవతం లోని దశమస్కంధం ఆధారం గా ఇతను ఈ చంపువు రాశాడు .రాదా కృష్ణుల ప్రేమ వృత్తాంతం హై లైట్ చేశాడు .రాధను నాయకిని చేసి కృష్ణుడితో పెళ్లి జరిపించి ఒక అడుగు ముందుకే వేశాడు .ఈ దంపతుల ప్రణయాన్ని మధురం గా వర్ణించాడు .భక్తికంటే రక్తికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .శ్లేషకు ప్రాధాన్యం ఇచ్చాడు .గద్య లో సమాస బంధం ముచ్చటగా ఉంటుంది .దీనికి అక్కయ సూరి వ్యాఖ్య రాశాడు .కొత్త కాళిదాసు ‘’భారత చంపువు ‘’కూడా రాశాడు .ముద్రితం కాలేదు .
85-చంపూ భారత కర్త –అనంత భట్టు
క్రీశ పదిహేను వందల వాడైన అనంత భట్టు చంపూ భారతం రాశాడు .అభినవ కాళిదాసుతో విభేదం ఉండేదట .1041శ్లోకాలు ,200గద్యాలున్నాయి .విభాగాలకు ‘’స్తబకాలు ‘’అని పేరుపెట్టాడు పన్నెండు స్తబకాల కావ్యం ఇది .
భట్టు కవితా అనంతత్వం
ఉపాఖ్యానాలు తప్ప తక్కిన భారత ఘట్టాలన్నిటిని ఇందులో చేర్చి రాశాడు .పాండురాజు పుట్టుకతో కావ్యాన్ని ప్రారంభింఛి అతని వేట కు ప్రాధాన్యమిచ్చి ‘’కిందమ ముని ‘’శాప వృత్తాంతం హైలైట్ చేశాడు .వర్ణనలను బాగా చేశాడు .ప్రతి పదాన్ని సమర్ధం గా ప్రయోగించి ‘’పదలాలిత్య పారీణుడు ‘’అనిపించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం –
‘’కిం శుకస్య వాదనే రుచిరత్వం కిం శుకస్య హృదయే పి వశిత్వం –కిం శుకస్య కుసుమేషు నదంతీ శంసతిస్మ మధు పాలి రితీవ’’
అనుప్రాసతో పాటు యమక ఉత్ప్రేక్షాలంకారాలనూ సమర్ధం గా ప్రయోగించాడు .వీర రస కావ్యమైన దీనిలో యుద్ధ వర్ణనలూ బాగా ఉన్నాయి నర్తన శాలలో భీముడు కీచకుడు రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణం లో చేసే చాటు యుద్దాన్న్ మనోహరం గా వర్ణించాడు ,-
‘’అక్ష్వేలితా రావమ వీర వాదం అవీక్షక ఖ్లాఘన చాటు గం ఫనం-అనుచ్చ నిహ్ శ్వాస ముహుం క్రియాకం అభూత పూర్వం తభూన్నియుద్ధం
శిలీ ముఖైస్చిత్తజ చాపాజు స్తైర్దత్తానిరంధ్రాణిదధన్నిజాంగే –సమీర జాతేన విదూని తోసి సకీచాకోనైవ చుకూజ కించిత్ ‘’
కురుక్షేత్ర యుద్ధాన్ని అదే స్తాయిలో వర్ణించి దృశ్యమానం చేశాడు .’’అలాంటి వాడికడుపులో ఎలా పుట్టావు ?’’అనే తెలుగు పలుకు బడికి సంస్కృతం చేసి భట్టు ప్రయోగించాడు .అర్జునుడు ఉత్తరకుమారుడితో అన్న సందర్భం లో –
‘’ఉదితోసి విరాట భూపతేః ఉదరాత్ భద్ర కధంత్వమీద్రుశః ‘’అదీ ప్రయోగం .అలాగే మంగళ సూత్రా విధానమైన తెలుగు సంప్రదాయాన్నిసంస్కృతం లోకి లాక్కేల్లాడు . ఈ చంపువుకు కురవి రామ చంద్ర ,మల్లాది లక్ష్మణ స్వామి ,నారాయణ స్వామి ,కుమారా తాతాచార్య ,నరసింహా చార్య వగైరా వ్యాఖ్యానాలు రాశారు .
86-వసుచరిత్ర చంపువు కర్త-కాళహస్తికవి
అప్పయ్య దీక్షితుల వారి శిష్యుడైన కాళహస్తికవి 1575కాలం వాడు .వసుచరిత్ర చంపువు రాశాడు .కంచి కామాక్షీ దేవి భక్తుడు .కావ్యం చివర అనుప్రాసలతో అమ్మవారిని నుతించాడు .రచన పదిహేడవ శతాబ్దిలో చేసిఉంటాడని ఊహిస్తున్నారు .
‘’ కాళహస్తి’’ మహాత్మ్యం .
తెలుగులో రామ రాజ భూషణుడు(భట్టు మూర్తి) రచించిన ‘’వసు చరిత్ర’’ను సంస్కృతం లో ఈ కవి రాయటం ప్రత్యెక మైన అపూర్వమైన విషయం .వసు చరిత్రకారునిది మౌలిక రచన శైలి సంగీత మాధుర్యంతో నాన్యతో దర్శనీయం .భావాలకు చమత్కారాలకు పుట్టినిల్లు .అలాంటి’’ వసువు’’ ను సంస్కృత కవులకు పరిచయం చేసి అందులోనూ వసువును అంటే బంగారాన్ని పండించాడు .అతని ఆలోచనకు హాట్స్ ఆఫ్ అన బుద్దేస్తుంది .వసుకారుని గురించి ఎక్కడా పేర్కొనక పోవటం కూడా విశేషమే .రామ రాజ భూషణుడు పీఠికలోని తెలుగు పద్యాలను సంస్కృతీకరించాడు .తెలుగు .శ్లేష చమత్కారాన్ని సంస్కృత సాహిత్యం లోకి దించాడు .కృతికర్త వంశ వర్ణన వదిలేశాడు .
ఆరు ఆశ్వాసాలుగా తెలుగు లో ఉన్నట్లే రాశాడు .శ్లేష,ధ్వని గుణీ భూత వ్యంగ్యం మచ్చుకు మచ్చు గీర్వాణం లోకి మార్చి తన కవితా గీర్వాణాన్నేకాక వసుకారుని తెలుగు సోయగ గీర్వాణాన్ని కనులకు కట్టించాడు .తెలుగులో ఉండే యతిప్రాసలనే వాడి సంస్కృతానికి మాధుర్యం లయా ,ఊపు తెచ్చాడు .ఎక్కడా కవిత్వం కుంటు పడదు .తెలుగు పద్యం లోని భావాన్ని ఒకే శ్లోకం లోపొదివి పట్టాడు .మూలం లోని గద్యాన్ని గద్యం గానే గీర్వాణీక రించాడు.అవసర మైన చోట్ల సీసపద్యాన్ని మూడు శ్లోకాలో చెప్పాడు .ప్రాస సౌందర్యాన్ని రామ రాజ భూషణుడికి తగినట్లు సంస్కృతం లోకి తెచ్చి వారేవా అనిపించాడు కాలహస్తికవి .ఒక ఉదాహరణ చూద్దాం –
‘’వేణి చలింప గంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణ –శ్రేణి నటింప లోన శఫారీ నిబరీ సకటాక్ష కాంతి .వి
న్నాణముచూప హంసక గణ క్వనంబులు మీర సైకత –శ్రోణి వివర్తితాబ్జ ముఖ శోభితమై కడు సంభ్ర మించినన్ ‘’
ఇది తెలుగు వాసు చరిత్రలో రామ రాజ భూషనుదిపద్యం ‘దీన్ని సంస్కృతం లో కాళహస్తికవి –
‘’వేణీ చచాల బిసవద్భుజ కంకణానాం-శ్రేణీ ననార్త విబభుశ్శఫరీ కటాక్షాః
నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ-శ్రోణీలసత్పులిన సాచిత మబ్జ వక్త్రం ‘’
87-ద్వ్యర్దికవి రాజు -కవిరాజు
మాధవ భట్టు అసలు పేరున్న కవిరాజు 1182-1197కాలపు జయన్తిపురాదీశ్వరుడు కదంబ వంశ రాజు కామ దేవుడి ఆస్థానకవి .’’రాఘవ పాండవీయం ‘అనే ద్వార్దికావ్యాన్ని సంస్కృతం లో రాశాడు .పదమూడు సర్గలతో ఆరు వందల అరవై ఎనిమిది శ్లోకాలతో వర్ధిల్లిన రామాయణ ,మహా భారత కధలు జమిలిగా ఉన్న కావ్యం ఇది .ప్రతి సర్గ చివర రాజు పేరు చేర్చటం విశేషం .కనుక దీనికి ‘’కామ దేవాంకం’’అనే పేరుకూడా ఉంది .
కవిరాజీయం
తనకంటే ముందు ధనుంజయుడు రాసిన రాఘవ పాండవీయకర్త ధనుంజయుడికి కు ఆశ్రయమిచ్చిన ‘’ముంజ రాజు ‘’కంటే తనకు ఆశ్రయ మిచ్చిన కామదేవుడు గొప్పవాడని చమత్కరించాడు –‘’
‘’శ్రీ విద్యా శోభినో యస్య శ్రీ ముంజా దియతీభిదా –దారాపతి రసావాదీయం తావ ద్ధ్రరా పతిః’’భావం –శ్రీవిద్యఅనే తాంత్రిక సిద్ధిగల ముంజ రాజు ,కు లక్ష్మీ సరస్వతుల చేత శోభిల్లే కామ దేవుడికి భేదం ఏమిటి అంటే –అతడు దారాపతి అంటే దారానగర రాజు ,యితడు ధరాపతి అంటే భూమిపాలకుడు .ధనుమ్జయుని కావ్యం కంటే తనకావ్యం గొప్పదని భావించాడు .వక్రోక్తికి మహా వైభవాన్ని తెచ్చాడు .రామాయణ భారత కధలను జోడించిన తీరు ముచ్చటగా ఉంది .ద్వర్దికావ్య రచన అసిధారా వ్రతం .దాన్ని అనాయాసం గా నిర్వహించి ద్వ్యర్దికావ్యానికి మహా కావ్య గౌరవాన్ని చేకూర్చాడు .ఒకే సర్గలోవివిధ వృత్తాలను ఉపయోగించాడు .వీర రసప్రధానమైన అన్నిరసాలను పోషించాడు ..భావ ప్రకటనలో అద్వితీయుదనిపిస్తాడు –
‘’వికీర్ణ సంక్రందన చాప లేశాచ్చవీనికీర్ణాని వనస్తలీషు –సలీల మాదాయ మయూర బర్హాన్యుత్తంస యంతిస్మకిరాతనార్య ‘’భావం –విరిగిపడిన ఇంద్ర ధనుస్సుముక్కలాగా ఉన్న అడవిలో చెల్లా చెదురుగా పడిఉన్న నెమలి పించాలను ఏరుకొని కిరాత స్త్రీలు విలాసంగా తమ చెవులలో అలమ్కరించుకొంటున్నారు .నెమలి ఈకలను ఇంద్రధనుస్సు ముక్కలుగా పోల్చటం రమణీయ భావన .
రామాయణం పవిత్ర మైన గంగానది .భారతం విశాల సముద్రం లాంటిది .ఈ రెండిటిని కలిపిన కవిరాజు భగీరధుడి వంటివాడు అని చమత్కరించాడు
‘’శ్రీమద్రామాయణం గంగా ,భారతం సాగరోపమన్ –తత్సంయోజన కార్యజ్ఞః కవిరాజో భగీరదః ‘’
మరోకవిని కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు