స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం ఉపనిషత్‌ సిద్ధాంతంలో చెప్పినది.
మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటనే ప్రశ్నకు మన పరంపరలో నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా నడవడానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు ( ఇవి కూడా ధర్మానికి లోబడి ఉండాలి). మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి, మనిషి తన స్వరూపమే బ్రహ్మస్వరూపమని తెలుసుకోవడం. కులం, మతం, వర్ణం, ఆశ్రమం మొదలైన అన్ని రకాల సమాజ నిబంధనలకీ అతీతుడై భగవంతుడెలా అన్నింటికీ అతీతుడో అలా వ్యవహరించడం.
మొదటి మూడూ సమాజవ్యవహారం సరిగా నడవడానికి కావల్సిన విషయాలు. వ్యవహారదశ (empirical level)అని అంటారు. నాల్గవదైన మోక్షం ఈ వ్యవహారదశను దాటి వెళ్లేది. వేదవిచారం వల్ల కలిగిన జ్ఞానం, దానివల్ల వ్యక్తి ప్రవర్తనలో దృష్టికోణంలో వచ్చిన మార్పు, మనిషే భగవంతుడుగా వ్యవహరించడం. దీన్ని పరమార్థదశ (absolute level) అంటారు. ఉపనిషత్తులు ఒకవైపు శాసీ్త్రయంగా విచారం (ఞఠజీటడ) చేస్తూ మరొక వైపు సమాజానికి అవసరమైన విశ్వాసాల్ని కొన్నింటిని సమర్థిస్తూ ముందుకు సాగుతుందని ఇదివరలో చూశాం. స్వర్గం అనేది ఇలాంటి విశ్వాసమే. ఇది అన్ని మతాల్లో చెప్పబడిందే. కొన్ని మంచి పనులు చేసి ఈ లోకంలో ఎలా సుఖశాంతులు సంపాదిస్తామో అలాగే మరొక విధమైన మంచిపనులు (కర్మలు) చేసి స్వర్గాన్ని సంపాదించవచ్చని అన్నిమతాలూ చెబుతాయి.
భారతంలో (వనపర్వంలో) ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కథ ఉంది. ఆ రాజు కొన్ని లక్షలకొలదీ యాగాలు చేసి వాటి ఫలితంగా చాలా ఏండ్లు స్వర్గంలో గడిపిన తర్వాత దేవతలు ఒకనాడు ఆయన పుణ్యంఫలం ముగిసిందని లెక్కవేసి, అతడిని భూలోకానికి పంపడానికి ప్రయత్నించారు. తన పుణ్యం బ్యాలెన్స్‌ ఇంకా ఉందని ఆయన వాదం. భూలోకంలో ఎంతకాలం ఒక మనిషి కీర్తి ఉంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చని ఒక నియమం. అందువల్ల భూమిపై ఇంకా ఆ రాజు కీర్తి ఉందా లేదా అని పరీక్షించాల్సి వచ్చింది. ఆ రాజుతో పాటు ఇద్దరు దేవతలు కూడా భూలోకానికి వచ్చారు. లోకంలో ఉన్న చిరంజీవుల్ని అందరినీ విచారించారు. అందరికంటే చిరంజీవి అయిన ఒక తాబేలు ఒకానొక కొలనులో ఉందని తెలిసింది. ఆ తాబేలును విచారించగా అది రాజును గుర్తించి ఎంతో గద్గద స్వరంతో చెప్పింది. ‘ ఈ మహానుభావుడు ఎన్నో యాగాలు చేసి లక్షల గోవుల్ని దానం చేశాడు. ఆ గోవుల తొక్కిళ్లతోనూ, దానజలంతోనూ ఈ సరస్సు ఏర్పడింది. ఇది నాకు నివాసమయ్యింది.’ అని చెప్పింది. వెంటనే దివ్యరథం రావడం, రాజు మళ్లీ స్వర్గానికి వెళ్లడం అనేది కథ.
దీనర్థం ఏమిటంటే, స్వర్గం కొన్ని మంచిపనులు చేయడం వల్ల సాధింపబడేది. ఆ మంచి పనులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం స్వర్గసుఖాలు ఉంటాయి. వీటిలో గొప్పదనం ఏమీ లేదు. ఇక్కడికన్నా ఎక్కువ సుఖాలు, మంచి భోజనం, డ్యాన్సులు వగైరా సమాజంలో తన కర్తవ్యాన్ని (ధర్మాన్ని) తాను చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తాయని మతం స్థాయిలో ఉన్న విశ్వాసం. ఏది ఏమైనా, పుణ్యం కాస్తా అయిపోయాక వీసా అయిపోయిన వాడిలాగే స్వర్గం నుండి వెనక్కి రావాలి. అందువల్ల స్వర్గం కూడా కామం అనే హెడ్డింగ్‌ క్రిందకు వస్తుంది.
మోక్షం దీనికి పూర్తిగా బిన్నమైనది. ఇది కామం (కోరిక) కాదు. దీనిలో ఎక్కడా దేన్నీ పొందడం అనేది లేదు. వెళ్లడం అనేది లేదు. ఎక్కడో పెళ్లి సుఖాలు పొందేది లేదు. ఉన్నచోటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని అన్ని రకాల కట్టుబాట్లనుండి, బంధాలనుండి, మనస్సులో నిర్మించుకున్న అడ్డుగోడల నుండి బయటకు వచ్చి ఉండడం. కట్టుబాట్లు లేవంటే ఎలాంటి నియమాలూ లేకుండా ఇష్టం వచ్చి వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడని అర్థం కాదు. భగవంతునికి ఎలాగైతే రాగద్వేషాలూ, ఈర్ష్య, అసూయలు, కోరికలు మొదలైనవి లేవో తనూ అలాంటి దశకు రావడానికై చాలా కాలంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేసి మనస్సును ఎంతో పవిత్రం చేసుకున్నట్టి స్థితి అది. ఇలాంటి పవిత్రమైన మనస్సు ఉన్న వ్యక్తి అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అందరిలోనూ దేవుణ్ని దర్శిస్తూ ఉంటాడు. అందరినీ ప్రేమిస్తూంటాడు. సమాజ నియమాల్ని పాటిస్తూంటాడు.
ఈనాటి మాటల్లో దీన్నిenlightenment అంటాం. అంటే మనిషి తను ఫలానా జాతి, కులానికి చెందినవాడ్ని, ఇంత గొప్పవాడ్ని, ఇంత మేధావిని అనే బరువులన్నీ వదిలేసి లైట్‌గా, అంటే బరువులు తగ్గించుకుని ఉండడం.
మోక్షం కేవలం పుస్తకజ్ఞానం వల్ల కలిగేది కాదు. వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం వల్లనే మనస్సులో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. దీన్ని వేదాంత భాషలో చిత్తశుద్ధి అంటారు. ఆ స్థితిలో మనిషి తన స్వరూపాన్ని గూర్చి, భగవంతుడి గూర్చి ఉపనిషత్తులు చెప్పిన విషయాల్ని గురువు దగ్గర తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని మననం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోవడం ముఖ్యమైనవి. తనతో పాటు ప్రపంచాన్నంతా కేవలం బ్రహ్మస్వరూపంగా చూడడం, తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అందరినీ అలాగే చూడడం సహజంగా వస్తుంది. దీన్ని గీత ఆరవ అధ్యాయంలో ‘ఆత్మౌపమ్యం’ అనే మాటతో శ్రీకృష్ణుడు చెబుతాడు.
మనిషి ఏదో స్వార్థంతో పొందేది కాదు మోక్షం. స్వార్థం నుండి బయటపడడం, చివరకు తన ఐడెంటిటీని కూడా కోల్పోవడం మోక్షం లక్షణం.
స్వర్గం అనే మాటను రిలిజియన్‌ స్థాయిలో (అనగా తాత్కాలిక స్థాయిలో) వేదాంతం అంగీకరిస్తుంది. చిన్నపిల్లల్ని బడికి పండానికి తల్లి ఎలా లాలిపాప్‌ ఇచ్చి పంపుతుందో, అలాగే సమాజంలో మనిషిని మంచి మార్గంలో పెట్డడానికి స్వర్గమనే లాలిపాప్‌ ఉందని భాగవతం చెబుతుంది. స్కూలుకు వెళ్లి చదువుపై శ్రద్ధ మొదలైన తర్వాత లాలిపాప్‌పై శ్రద్ధ ఎలా తొలగిపోతుందో అలాగే జ్ఞానమార్గంలో వచ్చినవాడికి స్వర్గంపై కోరిక తొలగిపోతుంది. దీనివల్ల ముఖ్యంగా మనం గమనించేదేమంటే స్వర్గమనేది కొన్ని కర్మ (మంచిపనుల)ల వల్ల పొందబడేది. కానీ, మనిషి స్వార్థం సమసిపోలేదు. స్వార్థం పూర్తిగా సమసిపోయి సమాజానికి హితమైన పనుల్ని చేస్తూ జ్ఞానమార్గంలోన ఉన్నవాడు పై చెప్పిన మోక్షమనే స్థాయికి వస్తాడు.

స్వర్గం, మోక్షం అనే ఈ రెండు పదాలకూ తేడా తెలుసుకున్న తర్వాత మనం మరికొంతగా కర్మయోగం గూర్చి తెలుసుకోగలం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.