గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -61

88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు

రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో రాశాడు .దీనికి వృత్తి కూడా ఉంది..ఇతని శిష్యుడే మంఖకుడు .శ్రీకంఠం కావ్యాన్ని రాశాడు .సూత్రాలను రుయ్యకుడు రాస్తే వ్రుత్తి మంఖకుడు రాశాడని ప్రచారం లో ఉంది .అలంకార సర్వస్వానికి జయ రధుడు టీక రాశాడు .

రుయ్యక పాండితీ గరిమ

అలంకార లక్షణాలను సూత్రాలలో చెప్పి వృత్తిలో ఉదాహరణలతో వివరించాడు విశ్లేషణపద్దతి శాస్త్రీయ విధానం లో ఉంటుంది .ఇతర కావ్యాల విషయం ఎత్తుకోలేదు .కొత్త అలంకారాలను చేర్చాడు .ధ్వనివాదిగా రుజువు చేసుకొన్నాడు .ధ్వని సిద్ధాంతాన్ని ఖండించినవారిని ఖండించాడు .కావ్య ప్రకాశం కు ‘’సంకేతం ‘’అనే టీకా రాశాడు .మహిమ భట్టు రాసిన ‘’వ్యక్తీ వివేకం ;;కు విచార విమర్శ చేశాడు సాహిత్య మీమాంస ,నాటక మీమాంస ,అలంకారారల సరణి ,సహృదయ లీల అనే గ్రంధాలను కూడా రుయ్యకుడు రచించాడు .రుద్రటుడు రుయ్యకునిపై విపులమైన చర్చ చేశాడు .

89-రస తరంగిణి కర్త మాయా రస ప్రతిపాదకుడు  –భానుదత్తుడు

పదమూడవ శతాబ్ది వాడైన భాను దత్తుడు రసతతంగిణి ,రసమంజరి అనే అలంకార శాస్త్రాలు రాశాడు .మిధిలా గణనాదునికొడుకు .

దత్తుని కవితా భానుప్రతాపం

రసమంజరిలో శ్లోకాల తోబాటు టీకా కూడా ఉండటం విశేషం .నాయికా నాయకుల భేదాలను వివరించాడు .రసమంజరితర్వాత రస తరంగిణి రాశాడు .ఇది భరతుని నాట్య శాస్త్రం లోని ఆరు ఏడు అధ్యాయాలకు వ్యాఖ్యానం గా భావిస్తారు గద్య రూప రచన.రాముడికి కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు రాసి ఉదాహరణలుగా ఇచ్చాడు .ఎనిమిది తరంగాల కావ్యం .శృంగార రసం ప్రాధాన్యతను తెలియ బరచాడు .’’మాయా రసం ‘’అనే దాన్నిప్రతిపాదించి దాన్ని పదవ రసం గా చెప్పాడు చిత్త వ్రుత్తి అనేది ప్రవ్రుత్తి ,నివృత్తి అనే రెండు రూపాలలో ఉంటుందని ,నివృత్తిలో శాంతరసం ,ప్రవృత్తిలో మాయారసం ఉంటాయన్నాడు . రతి ,హాస,శోక ,క్రోధ ,ఉత్సాహ ,భయ ,జుగుప్స విస్మయాలు ప్రవృత్తిలో పుట్టి అక్కడే అణగిపోతాయన్నాడు . ఇవన్నీ స్థాయీ భావాలని ,ఇవి మాయా రసానికి వ్యభిచారీ భావాలు అవుతాయని చెప్పాడు .మాయారసానికి స్థాయీ భావం గా మిధ్యజ్ఞానం ,ధర్మాధర్మాలు ,సంతానం విజయాలు అనుభవాలు అన్నాడు .మాయ అనాది అని ఏదోఒక దాని వల్లమాయ పుట్టదని అది రసమే కాడుపోమ్మన్నాడు చిరంజీవి భట్టాచార్యుడు .జ్రుమ్భ అనే తొమ్మిదవ సాత్విక భావాన్ని భాను దత్తుడు చెప్పాడు ‘’.ఛలం’’ అనే ముప్ఫై నాలుగవ సంచారీ భావాన్నికూడా చెప్పాడు

90-.సాహిత్య దర్పణ రచయిత –విశ్వనాధుడు

ఒరిస్సా కు చెందిన విశ్వనాధ మహా పాత్రుడు పద్నాలుగవ శతాబ్దికి చెందిన వాడు ..ఒరిస్సా రాజాస్థానకవి తండ్రిచంద్ర శేఖరుడు కూడా అదే ఆస్థానం లో మహా కవీశ్వరుడు .

కవితా విశ్వనాధం

‘’సంధి –విగ్రహ మహా పాత్రుడు ‘’అనే బిరుదున్న వాడు విశ్వనాధుడు ,ముమ్మటుడి కావ్య  ప్రశంస  కు ‘’కావ్య ప్రకాశ దర్పణం ‘’అనే టీకా రాశాడు ..విశ్వనాధుని ‘’సాహిత్య దర్పణం ‘’బాగా ప్రచారమైన అలంకార శాస్త్రం .ఇందులో పది పరిచ్చేదాలున్నాయి .దృశ్య ,శ్రవ్య కావ్య చర్చ చేశాడు ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’అని సిద్దాన్తీకరించినవాడు విశ్వనాధుడు .ధ్వని వాదికాడు రసవాది .రసమే కావ్యానికి ఆత్మ అని భరతుడిని సమర్ధించాడు .రూపక భేదాలను వివరంగా వివరించాడు .దశ రూపకం తర్వాత ఇదే ప్రామాణికం .అలంకార రీతులనూ విశదీకరించాడు .తానూ స్వయంగా కవికనక తన గ్రందాలనుంచే ఉదాహరణలిచ్చాడు .రఘు విలాస మహా కావ్యం ,కువలయాశ్వ చరిత్ర ,అనే ప్రాకృత కావ్యం ప్రభావతి ,చంద్రకళ అనే నాటకాలు కూడా రాశాడు విశ్వనాధుడు .విశ్వనాధుని సాహిత్య దర్పణం నిజం గానే సాహిత్యాని దర్పణం లాంటిదే. అందరి ప్రశంసలను అందుకొన్నది .ముమ్మటుని గ్రంధం తర్వాత దీనికే ప్రాచుర్యం ఎక్కువ .దర్పణానికి అనేకమంది టీక లు రాశారు .విశ్వనాదుడికొడుకు అనంత దాసుకూడా ఒక టీకా రాసి తండ్రి ఋణం తీర్చుకొన్నాడు .

91-వసంత రాజీయం రచించిన –కుమారగిరి రెడ్డి

కొండవీటి సామ్రాజ్య ప్రభువు కుమారగిరి రెడ్డి ‘’వసంత రాజీవం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కాలం 1386-1402.ఇందులో ముఖ్యం గా రూపకాల భేదాలను విపులంగా వివరించాడు .కుమార గిరి రెడ్డి బావమరది కాటయ వేమా రెడ్డి కాళిదాసు రాసిన మూడు నాటకాలకు బావ గారి పేర ‘’కుమారా గిరి రాజీయం ‘’వ్యాఖ్యానం రాశాడు ఇవి చాలా ప్రఖ్యాతమైన వ్యాఖ్యానులుగా  గుర్తింపు పొందాయి .వసంత రాజీయం లోని వ్యాఖ్యానాలకు అనుగుణం గా కాటయ వేముడు ఈ వ్యాఖ్యానాలు రాశాడు .మల్లినాధుడు ,కుమారస్వామి  నాదెండ్ల గోపయ్య మంత్రి తమ వ్యాఖ్యానాలలో వసంత రాజీవాన్ని బాగా ఉదాహరించారు .కుమారగిరిని వసంత రాయలు అంటారు వసంతోత్సవాలను గొప్పగా నిర్వహించేవాడు .

92-సాహిత్య చింతామణి కర్త –పెదకోమటి వేమ భూపాలుడు

కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి కుమారా గిరి రెడ్డి తర్వాత రాజయ్యాడు సాహిత్యప్రియుడు అనేక వ్యాఖ్యానాలతో బాటు సాహిత్య చింతామణి అనే అలంకార గ్రంధాన్ని కూడా రాశాడు .కాలం 1403-1420.ముమ్మటుడి కావ్య ప్రకాశ ధోరణిలో వేమారెడ్డి ‘’సాహిత్య  చింతామణి ‘’కూర్చాడు. పదమూడు పరిచ్చేదాలున్న కావ్యం .కావ్యం  ఉత్పత్తి లక్షణాలు గుణ దోషాలు అలంకారాలు రీతులు కావ్య వస్తువు దృశ్యకావ్య లక్షణాలు మొదలనవన్నీ వివరించాడు .ధ్వనికి లోబడే రసాన్ని ఒప్పుకొన్నాడు .తన రచనల నుంచే ఉదాహరణలిచ్చాడు .వేముడికి సంగీతం లోను గొప్ప ప్రతిభ ఉంది ‘’సంగీత చింతామణి ‘’రాశాడు .’’సర్వజ్ఞ చక్ర వర్తి’’ బిరుదున్నవాడు .

93- చమత్కార సిద్ధాంత కర్త -విశ్వేశ్వరుడు

రెండవ సింగ  భూపాలుడి ఆస్థానకవి విశ్వేశ్వరుడు ‘’చమత్కార చంద్రిక ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు ఉదాహరణ శ్లోకాలు రాజు ప్రశంసలతోనే ఉంటాయి .ఎనిమిది విలాసాల కావ్యమిది .వర్ణ వివేక ,వాక్య గుణ దోష విచార ,అర్ధ దోష ప్రబంధ విశేషక ,గుణ రీతి వ్రుత్తి పాక శయ్య వివేక ,రస వివేక ,శబ్దాలంకార ,అర్దాలంకార ,ఉభాయాలంకార అని ఆ విలాసాలకు పేర్లుపెట్టాడు. ఇతనిది చమత్కార సిద్ధాంతం .చమత్కారం కావ్యం యొక్క మూల తత్త్వం గా చెప్పాడు ‘’నహి చమత్కార విహితస్య కవేఃకవిత్వం కావ్యస్యవా కావ్యత్వం ‘’అని గంట కొట్టి క్షేమేంద్రుడు చెప్పాడు విశ్వేశ్వరుడి తర్వాత హరిప్రసాదుడు కూడా చమత్కారాన్ని మెచ్చాడు .ఆహ్లాదం ,జ్ఞానం లోకోత్తరత్వం హ్లాదం చమత్కారం ఉన్నది రమణీయం అన్నాడు జగన్నాదుడుకూడా .ఇంకో అడుగు ముందుకు వెళ్లి విశ్వేశ్వరుడు చమత్కారాన్ని తరగతులుగా విభజించాడు చమత్కారి శబ్ద చిత్రం ,చమత్కార తరం ,అర్ధ చిత్రం గుణీభూత వ్యంగ్యం ,చమత్కారి తమం ,వ్యంగ్యం కలిగిఉన్నదే కవిత్వం అన్నాడు .చమత్కారాన్ని ధ్వని సరసన నిల బెట్టాడు  .అనేక అలంకారాలు ప్రసిద్ధ అలంకారాల నుండే ఉద్భవిస్తాయి అన్నాడు .అలంకార మీమాంస విషయం లో జగన్నాదుడిని సమర్ధించాడు .అలంకార కౌస్తుభానికి తానె స్వయం గా టీకరాశాడు .రస చంద్రిక ,అలంకార ప్రదీపం ,అలంకార ముక్తావళి ,’’కవీంద్ర కంఠా భరణం ‘’లో చిత్రకావ్యాలప్రామాణికత ను పరిశీలించాడు .ఇతని అన్న ఉమాపతి కూడా  ఆలంకాకారికుడే  ఆతను చెప్పిన పరికరాలంకారాన్ని విశ్వేశ్వరుడు సమర్ధించాడు .తండ్రి లక్ష్మీ పతికూడా కవేకాక పండితుడుకూడా .ప్రౌఢ ఆచార్యులలోకొందరి దృష్టిలో ఇతనే చివరివాడు .ఎక్కువ మంది సృష్టిలో జగన్నాదుడినే  చివరివాడిగా గుర్తించారు .యితడు పద్దెనిమిదవ శతాబ్దం పూర్వార్ధం లో ఉన్న వాడు .

94- తానీషా రాజ గురువు -అక్బర్ షా

గోల్కొండ రాజు అబుల్ హసన్ తానీషా కు రాజ గురువు అక్బర్ షా తండ్రి అంటారు .షాకు తపశ్శక్తి కూడా బాగా ఉండేదని నమ్ముతారు .తండ్రితర్వాత తానీషా  కొలువులో రాజ గురువు అయ్యాడు .అక్బర్ షా సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన పండితకవి .’’శ్రుంగార మంజరి ‘’అనే అలంకార గ్రంధాన్ని షా రాశాడు .దీన్ని ముందు తెలుగులో రాసి తర్వాత సంస్కృతం లోకి అనువాదం చేశాడట .ఆయన మాటల్లోనే –

‘’తేనాంద్ర భాషాయాం రచితః శృంగార మంజరీ గ్రంధః –స్వయమా కబరేణ భూ భ్రున్ముకుట మణి రంజితాంఘ్రి కమలేన

తద్విరచితాంధ్ర భాషా కలితాం శృంగార మంజరీచ్చాయాం –సేవద్వం సురవాణీ రచితాం రస తోషితా రసిక భ్రుమ్గాః’’

శ్రుంగార మంజరి లో నాయికా నాయక చర్చ ,రసంపై చర్చ చేశాడు షా .ఇందులో నాయికా విభాగం నాయక విభాగం ,దూతీ విభాగం ,రస విభాగం అనే నాలుగు భాగాలున్నాయి  ఈ గ్రంధానికి ఆధారం భాను దత్తుడి రసమంజరిగా భావిస్తారు .షా ఒక గొప్ప తమాషా చేశాడు తన పేరుతొ .అక్బర్ ను అ ,క ,వ ,ర అని విడగొట్టి అ అంటే బ్రహ్మ ,క విష్ణువులను వర అంటే మించిన వాడు అని అర్ధం చెప్పుకొన్నాడు .షా కు ‘’బడే సాహెబ్ ‘’అనే పేరుకూడా ఉందట .దీనికికూడా తన సొంత అర్ధం చెప్పుకొన్నాడు దానికి అర్ధం –మహేశ్వరుడు అన్నాడు .మహామ్మదీయుల్లో సంస్కృతం నేర్చినవారు తక్కువే .అందులోను సంస్కృత గ్రంధాలను రాసిన వారు మరీ తక్కువ .అలాంటి వారిలో ప్ర ప్రధముడు అక్బర్ షా కవి .

95-రూప గోస్వామి శిష్యుడు –గోస్వామి కర్ణ పూరుడు

చైతన్య శిష్యపరంపరలో ఇంకొక ఆలంకారికుడు కర్ణ పూరుడు .రూప గోస్వామికి సమకాలికుడేకాక శిష్యుడుకూడా ‘’.అలంకార కౌస్తుభం ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు .ఇతని  అసలుపేరు ‘’పరమానంద సేనుడు ‘’కర్ణ పూరుడు వాడుక పేరు .బెంగాల్ లో 1524లో పుట్టాడు .చైతన్యుని ప్రభావం తో కృష్ణ భక్తుడై   చైతన్యుడి భక్తీ సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి ‘’చైతన్య చంద్రోదయం ‘’  అనే గ్రంధం రాశాడు .కావ్య తత్వాలన్నీ కూలం కషం గా చర్చించాడు .తానూ శ్రీ కృష్ణునిపై భక్తితో రాసిన శ్లోకాలను ఉదాహరణలుగా పేర్కొన్నాడు గ్రంధం లో .రసం ఒక్కటే అని సిద్దాన్తీకరించాడు .శుద్ధమైన మనస్సుకు ఆనందం అనే దర్మం ఉందని అదే స్థాయి అని చెప్పాడు .స్పటికం లో అనేక రంగులు కనిపించినట్లు ఒక్కటే అయిన స్థాయి అనేక విభావాదుల కలయిక తో వీరం, అద్భుతం మొదలైన రూపాలను ధరిస్తుంది అన్నాడు .సూర్య ప్రతిబింబాలు యెన్నిఉన్నా అసలు సూర్యుడు ఒక్కడే అన్నట్లు ఉపాదులలో భేదమే కాని ఆనందం లో భేదం లేదు .రాసాలన్నిటికి’స్వాద్వాత్మ’’ ఒక్కటే అని కర్ణ పూరుడి సిద్ధాంతానికి శాస్త్రీయత ఉందని అందరూ అంగీకరించారు .

కర్ణ పూరుడు ‘’ఆనంద బృందావనం ‘’అనే చంపువును ‘’గౌర గణోద్దీపిక ‘’లను రచించాడు ఈయన కొడుకు కవి చంద్రుడుకూడా లబ్ధ ప్రతిస్టూడైన కవే .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం కు తాత్కాలిక విరామం

మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం అనే శీర్షిక తో ఇప్పటికి 61ఎపిసోడ్ లలో 95 మంది ప్రసిద్ధ  సంస్కృత కవుల గురించి, వారి సాహిత్య సేవలను గురించి ,వారు చూపిన నవ్య మార్గాల గురించీ ,సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన ,నేను సేకరించిన సమాచారాన్ని అంద జేశాను.ఇదే సంపూర్ణం కాదు .ఒక సారి ఆ మహా కవులను  సంస్మరించే ప్రయత్నమే నేను చేశాను .ఇంకా లోతులు తరచాలనుకొనే వారికి ఒక చిన్న ఆధారం మాత్రమె .

శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి  మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను  .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .మధ్యలో కొంత గందర గోళం అయింది కాలం విషయం లో .అయినా అలానే రాశాను   .నేను రాసిన వారుకాక పూర్వ కవులలో ఇంకా ఎందరో మహాను భావులున్నారు. వారి గురించి రాయక పోయినా వారి ప్రతిభకు జోహార్లు అర్పిస్తున్నాను .

ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు .వారిపేర్లూ సేకరించి రెడీగా ఉంచుకోన్నాను .వారిని గురించి కూడా రాయాలనుకొంటున్నాను .కనుక ఇంతటితో ఈ శీర్షికకు ఫుల్ స్టాప్ కాకుండా కామా మాత్రమె పెడుతున్నానని మనవి చేస్తున్నాను .వాటినీ త్వరలోనే రాస్తాను . ఎందరో మహాను భావులు. అందరికి వందనములు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.