కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –

కర్మయోగం అంటే

గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం.
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది. లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం. లేనిదాన్ని పొందడం. పొందినదానిని రక్షించుకోవడం . యోగమంటే ఇక్కడ కర్మయోగం. అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ప్రయోజనాన్ని పై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మయొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం. దాని పర్యవసానాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్‌ సోపు లాంటిదని చెబుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగ: కర్మసు కౌశలం ’ అంటాడు. కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్‌ ప్లాన్‌ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పనిచేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది. ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య అంటాడు శ్రీకృష్ణుడు .మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే . ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచఽధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అఽధ్యయనం. అఽధ్యాపనం ,యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెబుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం,వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. అయ్యా ..మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకి వచ్చాం కదా. నీవు ఎప్పుడూ నీ శస్ర్తాలు పట్టుకునే ఉంటున్నావు. రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకూ? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ది కూడా కలుషితమవుతుంది కదా అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం ధర్మం అని వివరి స్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు. కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది. కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి.
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా. కర్మఫలానికి నేనే కారణం. నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడటం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రద్దగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్‌ నీకుంది. దాని ఫలంపై నీకు అధికారం . అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు,దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు.ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కర్మయోగమే.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothy.com కు పంపండి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.