సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్యప్రియుల దృష్టిని దువ్వూరు రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు. ఆయన బహుబాషాకోవిదుడు, నిరాడంబరుడు, ప్రకృతి ఉపాసకుడు.

దువ్వూరి వారి జీవితమే ఓ సాహిత్య సాహసగాథ. నెల్లూరులో థర్డ్‌ ఫారం చదివే రోజుల్లోనే ఆయన విదేశీ కెమెరాతో పోటీ పడగల కెమెరాను తయారు చేశారు. ఆ తర్వాత చిత్రలేఖనం, శిల్పకళపై ఆయన దృష్టి మరలింది. ఈ విజ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది. తాను సాధించాలనుకున్న దానికోసం ఎంత కష్టానికైనా, త్యాగానికైనా సిద్ధపడే కార్యదీక్ష, పట్టుదల రామిరెడ్డిది. అందుకే రామకృష్ణ మఠంలో సంస్కృతం, బెంగాలీని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. తర్వాత రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి ఆదేశానుసారం తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు. 1913లో కోవూరు తాలూకా (ప్రస్తుతం కొడవలూరు మండలం) పెమ్మారెడ్డిపాళెం గ్రామంలో తన పినతల్లి కోడూరు రంగమ్మ ఇంట్లో ఉంటూ సమీపంలోని గండవరంలో గ్రంథాలయంలో పుస్తకాలపఠనంలో నిమగ్నమయ్యారు. తన 19వ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను తన జీవిత భాగస్వామిగా రామిరెడ్డి స్వీకరించారు. ఆయనలోని సాహిత్యాభిలాషకు సతీమణి తోడ్పాటు కూడా లభించింది. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’ అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఆయన ‘నలజారమ్మ’ కథ ఆధారంగా 1915లో తొలి పద్యకావ్యం రచించారు. ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవితా ప్రతిభ వెలుగు చూసింది. అనంతరం ‘వనకుమారి’ అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యం రచించారు. ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన నట్టింటికి నడిచి వచ్చాయి. 1929లో ఆంధ్రదేశం ‘కవికోకిల’ బిరుదును అందించి గౌరవించింది. స్వాతంత్య్రం నేపథ్యంలో ఆయన రచించిన ‘మాతృశతకం’లో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించింది. ఈ విషయం పసిగట్టిన బ్రిటిషు ప్రభుత్వం ఆ పుస్తకం ముద్రణను అడ్డుకుంది. దువ్వూరి రామిరెడ్డి 1920-1925 మధ్య కాలంలో మద్రాసు నుంచి వెలువడే ‘సమదర్శిని’ అనే పత్రికకు 9 నెలల పాటు సంపాదకుడిగా పనిచేశారు. 1923లో ఆయన తన కావ్యాలను ‘ది వాయిస్‌ ఆఫ్‌ ది రీడ్‌’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఇది ఆంగ్లేయులను సైతం విశేషంగా ఆకట్టుకుంది.
1925 రామిరెడ్డి సతీమణి శేషమ్మ బాలింత వ్యాధితో మరణించింది. తర్వాత కొద్దిరోజులకే కుమార్తె కుముదమ్మ కూడా గతించడం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసమయంలో ఉమర్‌ఖయ్యూం ‘రుబాయతులు’ ఆయనకు ఊరటనిచ్చాయి. పర్షియన్‌ భాషలో ఉన్న ఖయ్యూం ‘రుబాయతులు’ను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు. 1926లో ఓ ఫ్రెంచి ఆర్కిటెక్ట్‌ను సంప్రదించి పెమ్మారెడ్డిపాళెంలో ఓ సుందర భవనాన్ని నిర్మించేందుకు ఆయన నడుంబిగించారు. ఆ ఇంట్లోని గోడలకు, స్తంభాలకు ఎన్నో చిత్రాలను రామిరెడ్డి సొంతంగా అమర్చుకున్నారు. 1936లో రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశారు. వేంకటేశ్వర మహత్యం, గరుడగర్వభంగం, సతీతులసి, సీతారామజననం తదితర సినిమాలకు మాటలు, పాటలు రాశారు. 1937లో నెల్లూరీయులైన శ్రీరామా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన ‘నల దమయంతి’ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహించారు. 1938 వరకు రామిరెడ్డి సినీరంగంలో ఉన్నారు. ఆ తర్వాత పారశీకం నుంచి సౌదీ కవి రచించిన రెండు కావ్యాలను ‘గులాబీ తోట’ పండ్ల తోట’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ‘కవి-రవి’, ‘ఫలితకేశం’ ద్వారా మూఢనమ్మకాలను ఎండగట్టారు. ‘జలదాంగన’తో భూగోళ రహస్యాలను చర్చించారు. రామిరెడ్డి రచనల్లో నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, పానశాల, గులాబీ తోట, పండ్ల తోట, కుంభరాణా, సీతావనవాసం, నైవేధ్యం, భగ్న హృదయం, మాధవ విజయం, జలదాంగన, కవి-రవి, ఫలితకేశం ఎంతో ప్రాచూర్యం పొందాయి. 1947 సెప్టెంబర్‌ 11న సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆంధ్రసాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు.

– కె.వి. నాగేశ్వరరావు
(నేడు దువ్వూరి రామిరెడ్డి 120వ జయంతి)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.