దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ?

దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి.
లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి మన ఊహను జోడించి దేవుడున్న లోకంలో మనం ఈ లోకంలో ఎదుర్కునే కష్టాలేమీ ఉండవనీ, అక్కడంతా బంగారు ఇండ్లు, రోడ్లు,పేవ్‌మెంట్లు ఉంటాయనీ, దేవుడి శక్తిసామర్థ్యాలని అంచనా వేయలేమనీ చెప్పవచ్చు. వివేకానందుడు చెప్పినట్లు చీమకు ఆలోచనాశక్తి ఉంటే దేవుణ్ణి వేలకొద్దీ తలలు, అవయవాలూ ఉన్న గొప్ప చీమరూపంలో ఊహించుకుంటుంది. అలాగే మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మన దేవుళ్ళు ఉంటారు. మన శత్రువులే దేవుడికి శత్రువులు. మనమే దేవుడికి అతి ప్రేమపాత్రులైన జాతి అని కూడా చెప్పుకోవచ్చు. దేవుడికి తన భక్తుల్ని అన్ని విధాలా ఆదుకునే స్వభావం. భక్తులను కానివాళ్ళను అనేక కష్టాలకు గురిచేసే స్వభావం ఉంటుంది అని కూడా కొన్ని మతాలు చెబుతాయి. మనిషి గుణాలలాగానే దేవుడికి కూడా కొన్ని గుణాల్ని మనం అంటగడతాం. ఈ స్థాయిలో వర్ణించబడే దేవుడిని సుగుణస్థాయి అంటారు. ఇంగ్లీషులో దీన్నే (personal god) అంటారు.

అయితే ఈ సుగుణస్థాయి రెండు విధాలుగా చూడగలం. దేవుణ్ణి అనేక గుణగణాలున్న వ్యక్తిగా మనం భావించినపుడు ఆ గుణగణాలను ఒక రూపం ద్వారా తెలియజేయడం. ఉదాహరణకు మనం సైన్సులో అనేక సంజ్ఞల్ని (symbols) వాడుతుంటాం. అలాగే సృష్టి అనే ప్రక్రియకు తెలివి అవసరం కావున సృష్టికర్తకు నాల్గువేదాలు తెలుసని చెప్పడానికి నాలుగు తలల్ని ఊహిస్తాం. తెలివి అనే శక్తిని సీ్త్ర రూపంలో భావించి అతనికి భార్యగా ఊహిస్తాం. ఇదే విధంగా మన పురాణాల్లో అనేక దేవతారూపాలకు సాంకేతికమైన అర్థాల్ని చూడగలం. ఇలాగ ఒకానొక రూపమున్న దేవుడు సుగుణం అనే కేటగిరీలో ఉన్నా సాకార(ఆకారం ఉన్న)అనే స్థాయికి చెందుతాడు. మన సంప్రదాయంలో ఉన్న శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, లక్ష్మి, గణేశుడు మొదలైన అనేక దేవతారూపాలు ఈకోవకు వస్తాయి. ఇదే సుగుణస్థాయికి ఎలాంటి రూపాన్నీ ఇవ్వకుండా కూడా చెప్పవచ్చు.మన సంప్రదాయంలో వైశేషికులు, పతంజలి యోగులు మొదలైనవారు ఇలాంటి దేవుడి గురించి చెప్పారు. ఈ దేవుడు సుగుణం అనే స్థాయిలో ఉన్న నిరాకారుడు అనే కోవకు వస్తాడు. పాశ్చాత్యమతాలు కూడా ఈ కోవకు వస్తాయి. వారి మతగ్రంథాల్లో దేవుడు కూడా అనేక పనుల్ని చేస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ, భక్తులుకాని వారిని దండిస్తూ కనిపిస్తాడు. దేవుడు తన ప్రతిరూపంలోనే మనిషిని చేశాడని చెబుతూనే, అతనికి ఆకారం లేదని అంటారు. పైన చెప్పిన సుగుణ, సాకార అనే స్థాయి, సుగుణ, నిరాకార అనే స్థాయి – ఈ రెండూ ఞ్personal god అనే నిర్వచనం కిందకే వస్తాయి. మనిషి తన కల్పనాశక్తిని ఉపయోగించి నిర్మించిన స్థాయి.
ఉపనిషత్తులు దేవుడిలా ఉంటాడు అని చెప్పకుండా దేవుడెలా ఉండాలి అని ఆలోచిస్తాయి. ఈ స్థాయిలో ‘దేవుడు’ అంటూ ‘డు’ గానీ ‘దేవత’ అంటూ ‘త’ గానీ చెప్పలేం. అంటే దీన్ని పుంలింగంలోగానీ, సీ్త్రలింగంలో గానీ చెప్పలేం. దీన్ని మనలాగ జీవి అని కూడా చెప్పలేం. జీవి అని అంటే దీనికి ఒక ఆకారం. అవయవాలు ఉండాలి. ఒకానొక స్థానంలో, ఒకానొక పరిమాణంలో ఉండాలి. ఉదాహరణకు మనం మన ఇంటిలో ఒక చదరపు గజమంత పరిమాణంలో ఉంటాం. ఇక్కడ ఉంటే మరొక చోట ఉండలేం. ఈ కాలంలో ఉంటే మరొక కాలంలో ఉండలేం. అంటే మనం ఉండే ప్రదేశంచేత, పరిణామంచేత, కాలంచేతం మనం కొలవబడి ఉన్నాం. దేవుడికి ఇలా చెప్పడానికి వీలులేదు. పై మూడు రకాలైన పరిమితులు, కొలతలు చెప్పలేం.
అలాగే దేవుడు సృష్టి చేశాడు అంటే ఏ ముడిసరుకును తీసుకుని సృష్టి చేశాడని ప్రశ్న వస్తుంది. ఏదో ఒక ముడిసరుకు ఉన్నది అని అంగీకరిస్తే,దేవుడు కంటే వేరుగా అది ఉంది కాబట్టి దేవుడికి ఒక పరిమితి ఉన్నట్లే అవుతుంది. ముడిసరుకు లేదు, అయినా సృష్టి జరిగింది అంటే దేవుడు తనలోనే ఏదో ఒకభాగాన్ని తీసి సృష్టి చేశాడని చెప్పాల్సి వస్తుంది. అంటే దేవుడికి అవయవాలు ఉన్నవని భావించినట్లవుతుంది. ఇలా కూడా చెప్పడానికి వీలులేదు. దేవుడు వ్యక్తి కాదు, దేవుడి కంటే వేరుగా మరొక పదార్థం లేదు అన్నప్పుడు ఆ దేవుడు అనే తత్వమే సృష్టిలా మారిందనో, సృష్టిలాగ కనిపిస్తుందనో చెప్పాలి. సృష్టిలాగ మారింది అనేది ఒక వాదన. సృష్టిలాగ కనిపిస్తుంది అనేది మరొక వాదన. ఈ విచారణలోకి మనం వెళ్ళాల్సిన పనిలేదు.
ఎలా చెప్పినా మనం దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు కేవలం ఒక తత్వం అని చెప్పాల్సివస్తుంది. ఈ తత్వాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని ఒక ఉపనిషత్తు చెబుతుంది. ప్రతిచోట ఒక ఉనికి రూపంలో కనిపించేదే ‘సత్‌ ’ లేదా సత్యం అంటారు. ఇది చీమ నుండి మొదలుకుని ఏనుగు వరకూ అన్ని జీవులలో తెలివి రూపంలో తెలుస్తూ ఉంది కాబట్టి జ్ఞానం అన్నారు. దీన్ని ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి బ్రహ్మ అని పేరు పెట్టారు (ఈ బ్రహ్మ వేరు, సృష్టికర్త బ్రహ్మదేవుడు వేరు అని ఇది వరలో చెప్పుకున్నాం )
ఈ బ్రహ్మకు ఆకారం ఉండదని చెప్పాల్సిన పనిలేదు. నిరాకారమే కాకుండా ఎలాంటి గుణాలు చెప్పడానికి వీలులేదు. అంటే ఈ బ్రహ్మ భక్తుల్ని రక్షిస్తుందని గానీ, ఇంకేదో చేస్తుందని గానీ, ఎలాంటి గుణాలు చెప్పడానికి లేదు. దీన్ని నిరాకార , నిర్గుణస్థాయి అంటారు.ఇదొక చైతన్యతత్వం. దీనికి ఒకలోకం అంటూ లేదు. స్వర్గం, నరకం, దేవుళ్ళు, దేవదూతలు, రాక్షసులు మొదలైన కల్పనలేవీ లేవు. ఈనాడు మనకున్న సైన్సు పరిజ్ఞానంతో పదిమంది శాస్త్రజ్ఞులు కూర్చొని మేధోమధనం చేసినా ఇంతకన్నా వేరుగా చెప్పలేరు. ఉపనిషత్తులు ఇలాంటి విచారణే చేశాయి.
మతం స్థాయిలో దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం ,పాపం అనే స్థాయిలో చెప్పేదంతా విశ్వాసంతో ముడిపడి ఉంది.ఇది శివుడు కావచ్చు.విష్ణువు కావచ్చు. అమ్మవారు కావచ్చు,లేదా పాశ్చాత్యమతాల్లోని దేవుడు కావొచ్చు.వీరందరికీ పుణ్యము, పాపం, రక్షించడం, శిక్షించడం మొదలైన గుణాలన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మా విశ్వాసమే సరైనది. మా పుస్తకమే సరైనది అనడం చిన్నపిల్లల వాదం లాంటిది. ఉపనిషత్తులు చేసే శాసీ్త్రయమైన విచారానికి మతము, విశ్వాసంతో సంబంధం లేదు. కేవలం సత్యం ఏమిటనేదే ప్రశ్న.
మామూలు మనిషికి ఎక్కువ సత్యంతో పనిలేదు. టి.ఎస్‌.ఎలియెట్‌ అనే ఆంగ్లకవి చెప్పినట్లు ‘human kind cannot bear too much of reality. మనిషికి తన గోల చెప్పుకోవడాననికి ,నడిరేయి ఏ జాములోనైనా పతిదేవుని ఒడిలో పవళించే అమ్మవారిని డిస్టర్బ్‌చేసి, ఆమె ద్వారా ఆయ్యవారికి తన పిటిషన్‌ వివరించడానికి ఒకానొక దేవుడు కావాలి.ఈ స్థాయిని మనం కాదనలేం.అందుకు ఉపనిషత్తులు సుగుణ స్థాయిలో మనం చెప్పుకునే దేవుణ్ణి పూర్తిగా నిరాకరించలేదు. పోతే దీన్ని lower level of reality, వ్యవహారస్థాయిసత్యం అని అన్నాయి. మరి నిరాకరించలేని నిజం ఏమిటి అంటే చైతన్యము (consciousness) అదేabsolute reality, పరమార్థసత్యం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.