శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

శ్రమైక జీవనం

కథల పోటీలో ఎంపికైన రచన
……………..

ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా? ఎప్పుడు కూతుర్ని చూద్దామా? అని మనసు కొట్టుకుపోతూనే వున్నది లలితమ్మకి.
‘అమ్మా..! ఒంట్లో అసలు బాగుండటం లేదే! చాలా నీరసంగా ఉంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని వుంది’- అని ఈ మధ్య ఫోన్లమీద ఫోన్లు చేసింది కూతురు.
కవల పిల్లలవటంతో భార్య చేసుకోలేపోతున్నదని, పిల్లలు కాస్త పెద్దయ్యేవరకూ తోడు రమ్మని కొడుకు బతిమాలితే కాదనలేక కొడుకు ఉద్యోగం చేస్తున్న గౌహతికి లలితమ్మ దంపతులు వెళ్ళారు. దూరాభారం.. ప్రయాణం కష్టం! అంచేత ఏణ్ణర్థం అయిపోయింది ఇటుకేసి రాక!
ఇన్ని రోజులు చూడకుండా ఎప్పుడూ లేదు. అందుచేత దిగులు పడి అట్లా మాట్లాడుతున్నదేమోలే వెఱ్ఱిపిల్ల! అనుకొన్నారు కానీ, ఓ వారం నాడు అల్లుడు కూడా ఫోన్ చేసి ‘మీ అమ్మాయికి అసలు ఆరోగ్యంగా లేదు. నీరసమంటోంది! ఉపవాసాలు చేస్తున్నది! డాక్టర్‌కి చూపిస్తానంటే రాదు. మీ మాటంటే గురి కదా! మీరు ఎప్పుడు వస్తారా?’-అని ఎదురుచూస్తున్నాము- అనేసరికి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని వచ్చేశారు.
పెళ్లికి ముందు ఉత్సాహంగా నేలపై కాలు ఆననట్లు తిరిగేది పిల్ల! పిల్లలతో షటిల్ ఆడేది. ఎప్పుడూ ఉస్సు ఉస్సుమన్న పాపాన పోలేదు. పోనీ అత్తింట్లో చాకిరియా? అంటే మొగుడు పెళ్లాం, ఇద్దరు పిల్లలు. అన్నిటికీ పనిమనుషులున్నారు! అల్లుడు అంత పెద్ద ఆఫీసరయినా తన పన్లన్నీ తను చేసుకోవటమే కాక తీరిక దొరికినప్పుడు ఇంట్లో పనులకు సహాయం చేస్తాడు. పిల్లలు అల్లరివాళ్లు కాదు! అయినా, వాళ్లని మూడో ఏడు నిండగానే స్కూల్లో వేసేసింది. మరి ఈ నీరసమేమిటో? డాక్టర్‌కి చూపిచ్చుకోకపోవటమేమిటో? ఏం మాయదారి జబ్బులో?-అని దారంతా మదనపడుతూనే వుంది లలితమ్మ.
చూడగానే ‘అమ్మా!’ అంటూ కావలించుకొన్న కూతురి వెన్ను నిమురుతూ ఉండిపోయింది లలితమ్మ. కాస్త స్థిమితపడ్డాక కూతుర్ని పరీక్షగా చూచింది.
చిక్కి శల్యంలా ఉంటుందేమోననుకుంటే బాగా ఒళ్లు చేసి పిప్పళ్ల బస్తాలాగా వున్నది. ఈమధ్యకాలంలో చూడలేదేమో తేడా కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. పిల్లలు మాత్రం చిక్కిపోయ వున్నారు.
మనవడు నాలుగేళ్లవాడు పొడి పొడిగా వున్న అన్నాన్ని కోడికెలికినట్లుగా తింటున్నాడు.
‘‘ఇదేమిటే..? పాపం.. వాడికి నీవు అన్నం కలిపి పెట్టకూడదూ..! అయినా ఇంత బిరుసుగా వున్న అన్నాన్ని పసివెధవ ఎలా తింటాడు? వేరే గినె్నలో కాస్త మెత్తగా వండచ్చు కదా!’’ అన్నది లలితమ్మ నొచ్చుకుంటూ.
‘‘అబ్బ.. అన్ని రకాలు వండటానికి నాకు ఓపిక లేదే! ఏదో తప్పనిసరిగా వండి పడేశాను’’ అని తేల్చేసింది కూతురు భార్గవి.
‘‘అయ్యో..! నా తండ్రీ! నేను కలిపి పెట్టనా?’’ అంటూ లలితమ్మ దగ్గరికి పోబోతే వాడు దూరంగా వెళ్లి తాతగారి దగ్గర నించున్నాడు.
‘మనల్ని చూచి ఏణ్ణర్థం దాటిపోయిందిగా..! పాపం గుర్తుపట్టలేదు’ అంది లలితమ్మ.
‘అదేం కాదు..! ఆ వెధవ ఆడాళ్ల దగ్గరకు రాడు. ఇంతప్పటినుండి గీర్వాణం వెధవకి. ఆకలైతే వాడే తింటాడులే, నీవు ఊరుకో…’ అంది భార్గవి.
ఆ రోజు పెద్దవాళ్లందరికీ గురువారం కాబట్టి అల్లుడు అందరికీ ఫలహారాలు బయటనుండే తెచ్చాడు. ఇడ్లీలు, పూరీలు, వడలు, సాంబారు, చట్నీలు, పళ్లరసాలు.. టేబిల్ నిండా పరచినవన్నీ చూసేసరికి వెలపరం వచ్చింది లలితమ్మకి.
వద్దంటే బాగుండదని రెండు ఇడ్లీలు, ఒక వడ మాత్రం తీసుకుని ఇవతలకి వచ్చి కూర్చుని తిన్నాననిపించింది.
భార్గవి మాత్రం శుభ్రంగా అన్నీ లాగించి పెద్ద గ్లాస్‌తో జ్యూస్ తాగేసింది. తరువాత బ్రెడ్, ఫ్లాస్క్‌లో పాలు గదిలో పెట్టుకుంది. రాత్రి ఆకలైతే తింటుందట!
మర్నాడు పొద్దునే్న పనిమనిషి వచ్చి పనంతా చేసి పిల్లల్ని తయారుచేసి టిఫిన్స్ తెచ్చిపెట్టి వెళ్లింది. అప్పటికి లేచింది భార్గవి.
ఈలోగా లలితమ్మ వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ తనిఖీ చేసింది. బియ్యం, పంచదార, ఇన్‌స్టెంట్ కాఫీ పొడి లాంటివి తప్ప వంటకు పనికివచ్చే పదార్థాలేవీ లేవక్కడ!
‘ఏవిటే…?’ అని అని కూతుర్ని అడిగితే- ‘అబ్బో..! పక్కనే బోలెడన్ని కర్రీ పాయింట్లు వున్నాయి. రాత్రే తెప్పించి ఫ్రిజ్‌లో పెట్టేస్తాను. అన్నం ఒక్కటీ వండుకుంటే చాలు! ఖర్చూ, శ్రమా రెండూ తప్పుతాయి’ అంది తేలిగ్గా.
‘అందుకని రోజూ బయటి తిండ్లు తింటున్నారా? ఆరోగ్యాలు చెడ్డాయి అంటే చెడవు మరి..?’ అని కోప్పడింది లలితమ్మ!
‘వంట మనిషిని పెడతానంటే వద్దంటుందండీ’ అల్లుడు గిల్టీగా అన్నాడు.
‘ఆ..! ఆవిడకన్నీ అందించటం, సరుకులు తెప్పించటం, డబ్బాలలో సర్దడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకసలు ఓపిక లేదు బాబూ..!’ అంది భార్గవి టిఫిన్ లాగిస్తూనే.
‘శుభ్రంగా తినేది తింటూనే ఈ ఓపిక లేకపోవడం ఏమిటో? నిండా ముప్ఫై ఏళ్ళు లేవు, ముసలి వగ్గులా మాట్లాడుతోంది’ అనుకుంటూ భర్తని కూరలు, సరుకులు తెమ్మని పురమాయించింది లలితమ్మ వంట చేయటానికి.
‘‘అమ్మమ్మా..! ఇవాళ కూరలు యింట్లో వండుతావా! బెండకాయ ఫ్రై, ముద్దపప్పు చేయవా.. కర్రీ పాయింట్లో కూరలు బాగుండవు! కారంగా ఉంటాయి. మరేమో.. అమ్మమ్మా..! ఇవాళ నేను స్కూలు డుమ్మా కొడతాను. అమ్మతో చెప్పవా..’ గారాబాలు పోతూ అన్నది మనవరాలు శ్రావణి.
‘వద్దులే బంగారం! ఒక్క రోజు స్కూల్‌కెళ్ళకపోతే మునిగిపోయిందేమీ లేదులే. అమ్మేం అనదులే.. తాతగారు కూరలు తేగానే వండుతాను, తిందురుగాని’ అన్నది లలితమ్మ!
మనవడు ఏం చెప్పటానికి భాష చాలక తాతగారి ఒళ్లో చేరిపోయాడు.
ఇంతలో పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లటానికి ఆటో అతను వచ్చాడు.
‘ఈ పిల్లమూకతో వేగే ఓపిక లేదు నాన్నా నాకు..’ అని భార్గవి గొడవ పెడుతున్నా వినకుండా చంద్రవౌళిగారు ఆటోను పంపేశారు.
నాలుగేళ్ల పసివాడికి రోజంతా స్కూలూ, ఆపైన ట్యూషనూ..! ‘స్కూల్‌కి వచ్చే సంవత్సరం వెళుదువులే నాన్నా! మాతోటి వస్తావా?’ అన్నారాయన తనని బల్లిలా కరచుకున్న మనవడి వీపు తడుతూ.
అంతే..! వాడు తాతగారు ఎటువెడితే అటు చివరకు బజారుకు కూడా వెంటబడి వెళ్లాడు.
ఇక భార్గవి
నిశ్చింతగా స్నానం చేసి దేవుడి ముందు ఓ నిముషం కూర్చుని టీవీ ముందున్న దివాను కాట్ మీద సెటిలయ్యింది. ఆ తరువాత ఆ ఛానెల్‌లో ఆ సీరియల్, ఈ ఛానెల్‌లో ఈ సీరియల్… అనుకుంటూ చూస్తూనే వుంది. మధ్యమధ్యలో కునుకు తీస్తూనే వుంది. లేచినప్పుడు పక్కనే టీపాయ్ మీద పెట్టుకున్న పళ్లూ, బిస్కెట్లు, స్వీట్లూ కడుపులో వేస్తూనే వుంది. మళ్లీ నీరసం అంటూనే వుంది.
‘దీనికేమన్నా బకాసురుడు కానీ పూనలేదు కదా..! ఇంతకుముందు ఇలాగ తినేది కాదే’-అనుకుని, మళ్లీ ‘్ఛ! ఛీ!’ అని చెంపలేసుకుంది లలితమ్మ!
వంటయిన తరువాత దగ్గర కూర్చుని పిల్లలకు కలిపి పెడుతుంటే.. ‘ఇంకా.. ఇంకా..’ అని పోటీలు పడి తిన్నారు.
‘పాపం..! పిచ్చి సన్యాసులు తిండికి ముఖం వాచిపోయారు’ అనుకుంటూ భర్తకు పెడుతూ కూతుర్ని కూడా భోజనానికి కేకేసింది లలితమ్మ.
‘అమ్మా..! ఇక్కడికే తెచ్చిపెట్టేవే! మంచి సినిమా వస్తున్నది’ అంది భార్గవి లేచే ప్రయత్నం చేయకుండానే.
లలితమ్మ గమనిస్తూనే వుంది. భార్గవికి తిండితోపాటు బద్ధకమూ పెరిగింది. భర్తో, పిల్లలో, పనివాళ్లో ఎవరికి పడితే వాళ్లకు పనులు చెబుతుంది. ‘పందిరిగుంజకు పని చెప్పటమంటే ఇదే..’ కాబోలు అనుకుంది లలితమ్మ.
ఆ రాత్రికి మళ్లీ ఉపవాసమని చెప్పి రకరకాల తినుబండారాలు తెప్పించుకొన్న భార్గవితో ‘ఈ ఉపవాసాలెన్ని రోజులేమిటి?’ అడిగింది లలితమ్మ.
‘గురువారం బాబాకి, శుక్రవారం సంపదల కోసం.. వేంకటేశ్వరస్వామికి శనివారాలు, ఇకపోతే అన్నం ముట్టని ఆదివారాలు, శోకం లేని సోమవారాలు నోములు పట్టాను. మంగళ, బుధవారాలే లేవులే..’ అంది భార్గవి.
‘అయ్యో..! అదేం పాపం! మతిలేని మంగళవారాలు, బుద్ధిలేని బుధవారాలు కూడా నోములు పట్టకపోయావా?’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయన ఉండి ఉండి ఒక చురక అంటిస్తారు.
తండ్రి మాటలకు నవ్వి ‘అమ్మావాళ్లు కూడా నోములు నోచుకునేవారు కదా నాన్నా..!’ అంది భార్గవి.
తాము ఇలా నోచుకునే వాళ్ళా! ఉపవాసమంటే ఏ పండో, పాలో పుచ్చుకునేవారు. అంతగా వుండలేనివాళ్లు కాస్త పిండో, రొట్టె ముక్కో తినేవారు. నాగులచవితికి చలిమిడి, పౌర్ణమికి అట్లు, శివరాత్రికి పళ్లు, అంతేగానీ- ఈ బజారు తిండ్లేమిటి? ఈ ఉపవాసాలేమిటి? అనుకుంది లలితమ్మ.
‘అయినా.. పైకి మాత్రం నీరసం అంటూ ఈ ఉపవాసాలెందుకే! శుభ్రంగా ఇంత అన్నం కూరా పప్పు తింటే బలం కదా!’ అన్నది.
‘ఇంకా నయం.! ఈ ఉపవాసాలుంటేనే ఇంతగా ఊరాను. పదిహేను కేజీలు పెరిగాను తెలుసా?’ అంది భార్గవి.
‘అంతేనా! ఈ రకంగా తింటే నూట యాభై కేజీలకు చేరుకుంటావు!’ అన్నారు చంద్రవౌళిగారు.
ఆయనకి కూడా కూతురు తినే పద్ధతి అబ్‌నార్మల్‌గా తోచింది.
‘చాల్లే! ఊరుకోండి! పిల్ల అసలే బాధపడుతుంటేను!’ అని ఆయన్ని కసిరి ‘మరి… డాక్టర్ దగ్గరకెందుకెళ్లావు?’ అడిగింది లలితమ్మ?
‘అబ్బ…! టెస్టులు అవీ అంటారు, నాకు విసుగే! అయినా నాకేం జబ్బని చెప్పు?’ అంది భార్గవి.
‘‘అది నీకూ నాకు ఎలా తెలుస్తుంది? పోనీ మామయ్య మంచి అనుభవమున్న డాక్టర్ కదా! అక్కడికి వెళ్లకపోయావా?’’
‘అబ్బా..! సిటీకి ఈదరిని మేము, ఆ దరిని ఆయన. ఈ ట్రాఫిక్‌లో ఇప్పుడు బయలుదేరితే వెళ్లేసరికి తెల్లారుతుంది’.
‘‘చాల్లేవే మరీ చోద్యం! నేను మామయ్యతో నిన్ననే మాట్లాడాను. రెండు రోజులుండేటట్లుగా వస్తే అన్ని టెస్టులూ చేయిస్తానన్నాడు. అల్లుడుగారికి కూడా సెలవులే కదా! మనందరం రేపు పొద్దున వెళుతున్నాం.. అంతే!’’ అంది లలితమ్మ.
***
‘మేమంటే పెద్దవాళ్ళమయ్యామనుకో! నీకేం చిన్నదానివి. ఒక్కసారన్నా వచ్చి చూడవా భార్గవీ?’ అని నిష్ఠూరం ఆడుతున్న అత్తయ్యతో-
‘ఒంట్లో అస్సలు ఓపికుండటం లేదత్తయ్యా! తగని నీరసం! ఎక్కడికి చివరికి గుడిక్కూడా వెళ్లటంలేదు. పెద్దవాళ్లయినా కాని నాకంటే మీరే నయమనుకో అత్తయ్యా’.
అంటున్న భార్గవిని తేరిపార చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు డాక్టర్ రామారావు.
తరువాత చెల్లెలని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకొన్నాడు. ఆ తరువాత పక్కనే వున్న తన క్లినిక్‌కి తీసుకువెళ్లి టెస్టులు చేయించాడు.
ఆ మరునాడు భోజనాలు అయి అందరూ కూర్చున్నపుడు చెప్పటం మొదలుపెట్టారు.
‘్భర్గవీ..! నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకో! పూర్వం అంటే నా చిన్నతనంలో కూడా ప్రతివాళ్లు ఒళ్లు వంచి కష్టపడి పనిచేసేవాళ్లు! ఏమీ లేని ఆడవాళ్లు పొలాలలో పనిచేస్తుంటే, బాగా వున్నవాళ్లు కూడా పప్పులు విసురుకోవడం, పిండి రుబ్బి వడియాలు, అప్పడాలు పెట్టుకోవడం, పచ్చళ్లు పెట్టుకోవడం- ఇలాంటి పనులన్నీ తీరిక లేకుండా చేసుకొనేవారు. ఎక్కువగా పనిచేయలేని పెద్దవాళ్లు సాత్త్వికాహారం మితంగా తింటూ నియమ నిష్ఠలతో దైవచింతనతో పగలు నిద్రించకుండా ఉపవాసాలు చేసేవాళ్లు! కార్తీకమాసం మాగుడుకాలం అంటే చలికి తిండి అరగదు. అందుకే ఉపవాసాలు. ఇపుడు ఒళ్లు వంచే పనిలేదు. ఆహార నియమాలసలే లేవు! నీ సంగతే చూడు! పెళ్లికి ముందు ఎంత ఉషారుగా వుండేదానివి! స్పోర్ట్స్ ఛాంపియన్ కదా నీవు! కాలేజ్ యాక్టివిటీస్ అన్నిట్లో లీడింగ్‌లో వుండేదానివి. ఇపుడో.. రోజంతా టీవీ ముందు కూర్చునో లేక నిద్రపోతూనో కాలక్షేపం చేస్తున్నావు. పిల్లలను కూడా చూసుకోకుండా- స్కూళ్లకీ, ట్యూషన్లకీ పంపేస్తున్నావ్! పైగా దేవుళ్ల పేరు చెప్పి అడ్డమైన తిళ్లకు అలవాటుపడ్డావు. మంచం దిగగానే బాత్‌రూం, ఆ పక్కనే డైనింగ్ రూం, లేకపోతే టీవీ… నీ శరీరానికి వ్యాయామం ఎక్కడ?
ఈ నియమ నిష్ఠలు లేని తిండివల్ల, శారీరక శ్రమ చేయకపోవటంవలన నీ ఒంట్లో షుగర్ నిల్వలు బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈ ఒబెసిటీ! భార్గవీ! ఈ శరీరాన్ని మనమెంత సుఖపెట్టాలని చూస్తే అది మనల్నంత బాధపెడుతుంది, గుర్తుపెట్టుకో..!
కనుక ఇకనైనా ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా ఒళ్లు వంచి పనులు చేసుకో! నీ పిల్లల పనులు పనివాళ్లకు అప్పచెప్పక నీవే చూసుకో! ఉదయానే్న లేచి వాకింగ్, తోట పని చేయి. ఇంకా తీరిక వుంటే సోషల్ వర్క్ చేయి. ఆ టీవీని అమ్మేయి! లేకపోతే డస్ట్‌బిన్‌లో పడెయ్యి!’ అన్నాడు.
ఆ తరువాత- తాను పీట మీద కూర్చోలేనంటే కుర్చీమీద కూర్చోబెట్టి వంగి కాళ్లకు పసుపు రాసి, బొట్టు పెట్టి పట్టుచీర చేతిలో పెడుతున్న డెబ్భై ఏళ్ళ అత్తయ్యను, అన్నా వదినల కాళ్లకు వంగి నమస్కరించి చలాగ్గా పిల్లవాడిని చంకన వేసుకున్న ఏభై ఎనిమిదేళ్ల తల్లిని చూస్తూ ఆలోచనలో పడింది భార్గవి. *

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

  1. swaroop అంటున్నారు:

    ఆధునిక ఒరవడికి అద్దం పట్టిన రచన…స్వరూప్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.