గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు
బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయి.
కొత్తగా చీపురు పట్టుకున్న నరేంద్ర మోదీ – ఆయన పరివారమూ కలిసి, కొన్ని పాత చరిత్రలను ఊడ్చే పనిలో పడ్డారు. కొన్ని కొత్త ప్రతీకల్ని నెలకొల్పదల్చుకున్నారు. అందులో భాగమే పటేల్‌ జయంతిని సమైక్యతా దివస్‌గా ప్రకటించడం, గాంధీ జయింతికి స్వచ్ఛ్‌ భారత్‌ను ప్రారంభించటం…
మోదీ అండ్‌కో చెబుతున ్నట్టుగానే – ఆ ఇద్దరు మహనీయులకి కాంగ్రెస్‌ సరైన గుర్తింపును ఇవ్వలేదనుకుందాం.. అంతమాత్రాన చరిత్ర పుటల్లో పటేల్‌కి ఇండియన్‌ బిస్మార్క్‌గా ఉన్న ఖ్యాతిని ఎవరైనా చెరపగలరా? మహాత్ముడు ఇ-జనరేషన్‌కి కూడా ఎంతో స్ఫూర్తినిస్తున్నారని చెప్పడానికి మున్నాభాయ్‌ సినిమాల్ని మించిన ఉదాహరణ కావాలా? పటేల్‌ సంగతి అలా ఉంచితే, గాంధీని కూడా హైజాక్‌ చేస్తుంటే – ఇక ఏ చెట్టు పేరు చెప్పుకుని బతకాలో తెలీక కాంగ్రెస్‌ కలవరపడుతోంది. ఎప్పుడూ విజేతలే చరిత్రను రాయటం ఎంత నిజమో, రాసేవాళ్లు ఎందరినో విస్మృతిలోకి నెట్టేయడమూ అంతే నిజం. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు, కానీ ఝల్కారీబాయి గురించి బుందేల్‌ ఖండ్‌ దాటి ఎవరికీ తెలీదు. తెలంగాణ పోరాటంలో మల్లు స్వరాజ్యంలాగే తుపాకీ పట్టిన ఎరుకల గండెమ్మ (బీబీ నగర్‌) పేరు తెలీదు మనకి. ఇక సీ్త్ర జనోద్ధరణ అనగానే రాజారామ్‌ మోహన్‌రాయ్‌, కందుకూరి గుర్తొస్తారు… ఆడపిల్లల కోసం దేశంలోనే తొలి పాఠశాల పెట్టిన సావిత్రీబాయి ఫూలేని జాతికి తెలియనిచ్చారూ? గాంధీ కంటే ముందే ప్రజల సమక్షంలో జ్యోతిబా ఫూలేకి మహాత్మ అనే బిరుదు ఇచ్చినా దాన్ని మరుగు పరిచి-రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ గాంధీజీని సంబోధిస్తూ మహాత్మా అన్న మాటనే బిరుదుగా మార్చి స్థిరపరచలేదా? ఇప్పుడు మళ్లీ స్వచ్ఛ్‌ భారత్‌కి వస్తే… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పట్టుకుని – తమ చీపురును మోదీ హైజాక్‌ చేశారని ఆమ్‌ ఆద్మీ ఆరోపిస్తోంది. అది గాంధీ చీపురని బీజేపీ చెబుతోంది. కొంచెం చరిత్రలోకి వెళితే చీపురు మీద గాంధీకి పేటెంట్‌ హక్కులు లేవన్న సంగతి తెలుస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన గాంధీజీ తన ఆశ్రమంలోనూ, నౌఖాలీలోనూ మరికొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ – చీపురు పట్టుకోవటమూ, టాయ్‌లెట్లను శుభ్రపరచటమూ నిజమే. అయితే గాంధీకున్న అనేక కోణాల్లో ఇది ఒక కోణం మాత్రమే. గాంధీ కంటే చాలా ఏళ్ళముందే – పరిశుభ్రతకే మొత్తం జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడున్నాడు. అతడి పేరు గాడ్గే బాబా. చీపురు ఆయన ట్రేడ్‌ మార్క్‌. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెనకబడిన ధోబీ కులంలో పుట్టిన దేవూజీ అనే నిరక్షరాస్యుడు – మరాఠీలంతా ఆరాధించే గాడ్గే బాబాగా ఎదిగాడు. చీపురుతో పాటు బిచ్చమెత్తుకునే మట్టి పాత్ర ఒకటి ఉండేది ఆయన దగ్గర. తిన్న తర్వాత దాన్నే కడిగి నెత్తిన బోర్లించుకునేవాడు. మరాఠీలో మట్టిచిప్పను గాడ్గే అంటారు.. అలా దేవూజీ పేరు కాస్తా గాడ్గే బాబాగా మారిపోయింది. ‘గోపాల గోపాల దేవకీ నందన్‌గోపాల’ అనే కీర్తన ఆయనకి పర్యాయపదంగా నిలిచింది. తన కీర్తనల్లో – జంతుబలుల్ని, బాల్య వివాహాల్ని అంటరానితనాన్ని, మద్యపానాన్ని, మూఢత్వాన్ని నిరసిస్తూ సామాన్య ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించేవాడు. గాడ్గేబాబా 1905లో తన ముప్పయ్యో ఏట సాధువుగా మారి చీపుర పట్టిన సమయానికి గాంధీజీ ఇంకా జోహెన్స్‌బర్గ్‌లోనే ఉన్నారు. గాడ్గే బాబా అనుచరుడైన ప్రముఖ మరాఠీ రచయిత పి.కె. ఆత్రే ఇలా రాశారు – ‘చాలా మంది విద్యాధికుల్లో బ్రూమ్‌ టెక్నిక్‌ (చీపురు టెక్నిక్‌)ను గాంధీజీయే కనిపెట్టినట్టు ఒక మూఢనమ్మకం వ్యాపించి ఉంది. కానీ దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి – సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు…. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు’. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి ఒక భూమిక ఏర్పడడానికి గాడ్గే బాబా బోధనలూ కీర్తనలూ ఎంతగానో ఉపకరించాయని కూడా ఆత్రే విశ్లేషించారు. గాడ్గే బాబా -మహారాష్ట్రలో చాలామంది దృష్టిలో గాంధీ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా. ఆ ఇద్దరి మధ్యా జరిగిన ఒకేఒక సమావేశంలో అంటరానితనంపై చర్చలు జరిగాయి. ఆ ప్రభావం గాంధీజీ కార్యక్రమాల్లో తర్వాత ప్రతిఫలించిదని చెబుతారు.
ప్రజలిచ్చిన విరాళాలతో గాడ్గే బాబా మొత్తం 141 విద్యాలయాలను నెలకొల్పారు. కింది కులాల చదువుకోసం గాడ్గే పడుతున్న తపనను, చేస్తున్న కృషిని చూసి అంబేద్కర్‌ ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారు. బాబాను తన గురువుగా చెప్పుకున్నారు. చివరి క్షణం వరకూ చీపురు, మట్టిపాత్ర, చింకిపాత్రలే ఆస్తులుగా బతికిన గాడ్గేబాబా సేవలకి గుర్తింపుగా – వాజ్‌పేయి హయాంలో కేంద్రం ఓ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇక 1986 నుంచి కేంద్రంలో అమలవుతున్న స్వచ్ఛతా పథకాన్ని మెరుగుపరచి – 2001లో సంత్‌ గాడ్గే బాబా పేరు పెట్టారు. ఏళ్లతరబడి గాడ్గే పేరు మీద జాతీయ స్థాయిలోనూ, మహారాష్ట్రలోనూ అమలవుతున్న పథకాన్ని – మోదీ వచ్చి గాంధీకి అంటగట్టారు. ఎంతో కొంత వెలుగులోకి వచ్చాడనుకున్న గాడ్గేబాబాను ఇప్పుడు మళ్లీ కిందికి నెట్టే శారు. గాడ్గే బాబా సర్వసంగ పరిత్యాగి కావడానికి ముందు ఒక చిన్న రైతు. తాను ఎంతో కష్టపడి సాగులోకి తెచ్చిన బంజరును ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని, ఆ ఊరి షావుకారు కుట్ర పన్ని గూండాలను ఉసిగొలిపితే – వారిని తన పొలంలోకి అడుగుపెట్టనివ్వకుండా తన్ని తరిమేశాడు. ఇప్పుడు చీపురుమీద పేటెంట్‌ను – ఎవరెవరి ఖాతాలలోనో వేద్దామని చూస్తే మాత్రం ఊరుకుంటాడా? దళిత బహుజనుల రాజ్యం వచ్చినప్పుడు ఊడ్చాల్సినపేర్లను ఊడ్చేయకుండా ఉంటాడా?
– మల్లంపల్లి సాంబశివరావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.