విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ

  • – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376

ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. అంతకుముందు న్యాయవాదిగా బాగా సంపాదించారు. సమకాలికులు ఆచంట వారిని ‘‘నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం’’గా ఆదరించారు. 14వ ఏటనే మిడిల్ స్కూల్ పరీక్షలో మద్రాసు రాష్ట్రంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నా, సంస్కృతాంధ్రాలు పుక్కిట బట్టారన్నా, వివిధ శాస్త్రాలు, దర్శనాలు ఆకళింపు చేసుకొన్నారన్నా, సాహిత్య పత్రికలు నడిపారన్నా- అది ఆచంటవారి ప్రజ్ఞానానికి నిలువుటద్దం. అక్కిరాజు రమాపతిరావు ‘‘కిందటి శతాబ్ది జన్మించి ఈ శతాబ్దిలో ఎన్నో రంగాలలో విశేష ప్రతిభావంతులు’’గా పేర్కొనటం సమంజసమే. చిత్రలేఖనంలో కూడా నిపుణులు!!
సాంఖ్యాయనశర్మ తెలుగులో ఎవరూ రాయని ‘‘ఉత్సృష్టికాంకం’’అనే రూపకం రాశారు. ‘‘బొండుమల్లెలు’’ అనే తొలి ఖండకావ్యం రాశారు. ‘లలిత’ అనే తొలి కథ రాశారు. మొట్టమొదటగా సాహిత్య పత్రిక ‘కల్పలత’ పత్రికను నడిపి ‘‘ప్రశ్నావళి’’ శీర్షిక నిర్వహించి ఉత్తమమైన సమాధానాలు రాసిన వారికి ఆరోజుల్లో నూట పదహారు రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. నట సమాజాలకు శిక్షణ ఇచ్చేవారు. పదిహేడు సంవత్సరాల వయసులోనే ‘‘సుజన ప్రమోదిని’’ అనే పత్రిక నడిపారని రమాకాంతరావు పేర్కొన్నారు. ‘‘నాటక సర్వస్వం’’ అనే గ్రంథం రాశారు గానీ అలభ్యం. కాళిదాసు నాటకాలను అనువదించారు. వీరు రాసిన ‘‘రహస్య దర్పణం’’ పుస్తకంలో భూగోళ ఖనిజ, క్రిమికీటక శాస్త్ర విషయాలున్నాయనీ, సౌరశక్తిని గురించి అందులో పేర్కొన్నారనీ తెలుస్తోంది. అంతటి పరిపూర్ణ ప్రజ్ఞాచార్యులు సాంఖ్యాయనశర్మ. నరసమాంబ, బాపిరాజులకు జన్మించిన వీరు 1933లో పరలోక గతులయ్యారు.
ఆనాడు సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం సంప్రదాయవాదుల మీద చాలా ఉండేది. సాంఖ్యాయనశర్మ 1892లో ‘‘ఆంధ్ర పద్యావళి’’ అనే కావ్య సంపుటిలో ‘సంఘ సంస్కరణము’ అనే ఖండికనుంచి సినారె తమ సిద్ధాంత గ్రంథంలో ఒక పద్యం ఉదహరించి వీరి సేవ ఎన్నదగినది అని ప్రశంసించారు.
‘‘మగువలకె గాని చన్బాలు మగలకెందు
పొడవమను మాటలన్నియు బూటకములు
పురుషులికమీద స్తన్యంబు పొడమునట్లు
రొమ్ము సవరించు కొనుక భాగ్యమ్ముకాదె!’’
పురుషులలో వీరతాస్ఫూరి కలగాలని అధిక్షేపంతో చెప్పిన పద్యమిది. కల్పలత (1904, ఆగస్టు సంచిక)లో ‘‘బొండుమల్లె’’ పేరుతో 150 పంక్తుల గీతమాలికను ఖండ కావ్య రచనకు సాంఖ్యాయన శర్మ మార్గదర్శకుడయ్యారని సినారె పేర్కొన్నారు. రాయప్రోలు వారి ఖండ కావ్యాలకు ఇది స్ఫూర్తి అనవచ్చు. చిన్న ప్రేమకథను తీసుకొని స్వతంత్ర ఖండకావ్యం రాసినది ఆచంటవారే. అప్పట్లో ఆంగ్ల ఖండకావ్యాలకు అనువాదాలే వచ్చేవి. అయితే చెప్పుకోదగిన నవ్యత లేకపోవటం వల్ల పేరు పొందలేదని సినారెగారే తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తు, కథాసాహిత్య రచన ఒక ఎత్తు. శర్మగారు ‘‘లలిత’’, ‘‘విశాఖ’’, ‘‘అపూర్వోపన్యాసము’’ వంటి కథలు 1903, 1904లలోనే రాయడం గొప్ప ప్రయత్నం. ఆధునిక కథకి ఒక ప్రాతిపదిక రూపొందించారు.
ఆచంటవారి ‘‘లలిత’’ తొలి కథగా గిడుగు సీతాపతి, పురిపండా వంటివారు సమర్ధించారు. సెట్టి ఈశ్వరరావు మొదలైనవారు దీనిని అంగీకరించలేదు. కానీ సుప్రసిద్ధ విమర్శకులు, ఆధునికత నిండుగా ఉన్న కె.కె.రంగనాథాచార్యులు ఆచంటవారి కథల్ని తొలి కథలుగా నిర్ణయించారు. 1978 మార్చి ‘అభ్యుదయ’ పత్రికలో కూడా ‘లలిత’ను మొదటి కథగా పేర్కొనబడింది. సరే, తొలి కథ అవునా? కాదా? అన్నది అలా వుంచితే తెలుగు కథకి ఓనమాలు దిద్దింది సాంఖ్యాయనశర్మ అనటంలో అనౌచిత్యం కనబడదు.
‘లలిత’ కథలో ఎత్తుగడ, స్ఫూర్తి, స్ర్తి స్వేచ్ఛ వంటివి ఉన్నాయి. ఒకసారి అనురాగం చూపిన తర్వాత మగవాడికి తనపై అధికారం లేదంటుంది లలిత. స్ర్తి పురుష స్వేచ్ఛలు అనే అంశం ఆధునికం తప్ప సంప్రదాయభావన కానే కాదు. అయితే జానపద రీతులుండటం నచ్చకపోవచ్చు. ఇది కథనానికి సంబంధించింది. వస్తువు ఆధునికమే. ‘‘విశాఖ’’ కథ సంభాషణతో మొదలవుతుంది. (వర్ణనతో కాదు). ఒక ప్రేమికుల జంట పక్షాన అబద్ధమాడి, తను మనసుపడినా దానిని చంపుకొని వారిద్దరికీ వివాహం చేసే స్ర్తి పాత్ర సరళ. ఈ కథలో ఆధునికతగల ‘‘మానసిక సంఘర్షణ’’ అనే శిల్పం అబ్బురపరుస్తుంది అంటారు కె.కె.ఆర్. అప్పటి సాంఘిక ఇతివృత్తం గల కథ ‘‘అపూర్వోపన్యాసం’’. సంస్కరణవాదుల ఉపన్యాస విన్యాసాలపై వ్యంగ్య శిల్పంతో రాయబడింది. సభలలో సరిగ్గా మాట్లాడటం రానివారు కూడా సంస్కర్తగా చిలుక పలుకులు పలకటం గమనిస్తాం. ఈ అంశాలన్నీ ఆధునికం కావా? ఇప్పటికి అన్వయించవా?
అయితే ఈ కథలు గ్రాంథికంలో ఉన్నాయి కాబట్టి ఆధునికత లేదనే విమర్శ. ఈమాట అనేముందు 1903-09నాటి సాహిత్య వాతావరణం అర్థం చేసుకోవాలి. అసలు కథే లేని రోజుల్లో కథకు నాంది పలకటమే గొప్ప. కేవలం భాషనుబట్టి ఆధునికత కాదని అంచనావేయడం అనుచితం. ఆ తర్వాత వచ్చిన అచ్చమాంబ మొదలైనవారూ గ్రాంథికంలోనే కథలు రాశారు. అంతవరకు ఎందుకు? గురజాడే ‘కమలిని’ పేరుతో గ్రాంథికంలో రాసి వాడుక భాషకి మార్చి ‘దిద్దుబాటు’ రాయలేదా? అప్పటికిగాని వాడుక భాష తెరమీదకి రాలేదు. గురజాడ తర్వాత వారు రాసిన కథలన్నీ వాడుక భాషలో లేవుకదా! గురజాడ దిద్దుబాటు రావటానికి పూర్వ రచయితల నేపథ్యమూ, స్ఫూర్తీ వున్నాయి. ఆ విధంగా సాంఖ్యాయన శర్మను స్మరించుకుందాం. దీపధారుల్ని విస్మరించటం సబబుకాదు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.