నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
‘మత విశ్వాసాలు లేని రాజకీయవేత్త నెహ్రూ. అయితే ఆయనలో గాఢమైన నైతిక వివేకం ఉన్నది. మతంపై ఆధారపడకుండా ఒక నైతికతను పెంపొందించడానికి నెహ్రూ ప్రయత్నించారు; అధికార బాధ్యతలను నిర్వర్తించడంలో ఎదురయ్యే ఒత్తిళ్లలోనూ ఆయన నైతిక విచక్షణతో వ్యవహరించారు’- ఇది, ప్రముఖ చరిత్రకారుడు సునీల్‌ ఖిలానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాసంలో చేసిన వాదన. ఖిలానీ తన వ్యాసాన్ని, 1933లో గాంధీకి నెహ్రూ రాసిన ఒక లేఖ నుంచి ఉటంకింపుతో ప్రారంభించారు. ‘మతం నాకు అంతగా తెలిసిన వ్యవహారం కాదు. పెద్దవాడినవుతున్న కొద్దీ నేను ఖచ్చితంగా మతానికి దూరమవుతూ వచ్చాన’ని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత (1936లో ప్రచురితమైన) నెహ్రూ ‘ఆత్మకథ’లోని మాటలను ఖిలానీ ఉటంకించారు. ‘వ్యవస్థీకృత మతం నాలో ఎప్పుడూ భీతిని గొల్పుతుంది… ఒక అంధ విశ్వాసానికి, పిడివాదానికి, మూఢ నమ్మకాలకు, దోపిడీకి అది ఆలవాలంగా ఉన్నట్టు కన్పిస్తుంద’ని నెహ్రూ అన్నారు.
మతం పట్ల నెహ్రూ ఉదాసీనతతో ఉండేవారన్న అవగాహన అసత్యమేమీకాదు. అయితే అది పూర్తిగా సత్యమూ కాదు. మత గ్రంథాలు, ధార్మిక భావాల పట్ల ప్రగాఢంగా ఆకర్షితుడైన సంద ర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. సహాయ నిరాకరణోద్యమ (1921-22) కాలంలో నెహ్రూ జైలులో ఉన్న సమయం అటు వంటి వాటిలో ఒకటి. 1922 తొలినాళ్లలో గాంఽధీకి నెహ్రూ రాసిన రెండు అసాధారణ లేఖలను ఇటీవల నేను కనుగొన్నాను. ఇవి, ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాలేదు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ లేఖలు, మతం పట్ల నెహ్రూ వై ఖరి గురించి మన అవగాహనను మరింత సంక్లిష్టం చేస్తాయి.
ఆగ్రాలోని జిల్లా జైలు నుంచి నెహ్రూ ఈ రెండు లేఖలను గాంధీకి రాశారు. 1922 జనవరి 9న రాసిన మొదటి లేఖలో జైలులో తాను చదువుతున్న పుస్తకాల గురించి నెహ్రూ ప్రస్తావించారు. అవి చాలావరకు మత సంబంధమైన గ్రంథాలే. ‘గ్లోవర్‌ రాసిన ‘‘జీసస్‌ ఆఫ్‌ హిస్టరీ’’ చదివాను. పాఠకుడిని పూర్తిగా తనలో లీనం చేసుకొనే రచన ఇది. ఈ పుస్తకం ఇచ్చిన అవగాహనతో బైబిల్‌ని కూడా చదివాను. రామాయణాన్ని తదేక దీక్షతో చదవడం ప్రారంభించాను. తులసీదాస్‌ రామచరిత మానస్‌, కబీర్‌ భజన్‌లు, భగవద్గీత శ్లోకాలు ఉదయం, సాయంత్రం నడక సమయాల్లో ధారణ అభ్యాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రతిరోజూ క్రమబద్ధంగా ప్రార్థనలు చేస్తున్నాను. మీరు చెప్పిన సమయానికి నిద్రకు ఉపక్రమిస్తున్నాను. గురునానక్‌ చెప్పినట్లుగా ‘ఆకాశం మకరందాన్ని వర్షించే సమయం’లో నిద్ర నుంచి లేస్తున్నాను’. నాలుగు వారాల అనంతరం (1922 పిబ్రవరి 19) నెహ్రూ రెండో లేఖ రాశారు. అలీగఢ్‌ నుంచి ‘ఖ్వాజా సాహెబ్‌’ అనే పెద్ద మనిషి నెహ్రూకు సహ ఖైదీగా వచ్చారు. ‘ఖ్వాజా నుంచి ఉర్దూ నేర్చుకోవడం ఒక ప్రత్యేకమైన ఆనందమని’ గాంధీకి నెహ్రూ రాశారు. ‘ఉర్దూ లిపి చాలా మాననీయమైనది. ముస్లమాన్‌ల వైభవానికి అది ప్రతీకలా గోచరిస్తుందని’ ఆయన రాశారు. ఉర్దూ లిపి నేర్పడంతో పాటు ఖ్వాజా సాహేబ్‌ రోజూ ఉర్దూ కవుల నుంచి కొన్ని ద్విపదలను, ఖురాన్‌ బోధనలను నాకు నేర్పుతున్నారు. ఆయనకు నా వంతుగా ఉపనిషత్తులలోని విషయాలను చెబుతున్నాను. భగవద్గీతలోని శ్లోకాలనూ వివరించదలిచాను’.
మరో సహ ఖైదీ రామ్‌నరేష్‌జీతో కలసి నెహ్రూ రామాయణంలోని బాలకాండ, అయోధ్యాకాండలను చదవడం పూర్తి చేశారు. ‘మిగతా కాండలను కూడా ఇరవై రోజుల్లో పూర్తిచేయగలనని భావిస్తున్నాను. నైనీటాల్‌ జైలులో ఉండగానే సుందరకాండను చదివాను. ప్రతి ఉదయమూ రామాయణాన్ని చదవడం చాలా ఆనందప్రదమైన విషయం. రామాయణం శ్రీరామచంద్రుని కవితాత్మక చరిత్ర కంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక ఆత్మకథ’.
ఈ లేఖలను రాసినప్పుడు నెహ్రూ ముప్పై రెండేళ్ల వయస్సులో ఉన్నారు. అప్పటికి ఆయన పూర్తిగా గాంధీ ప్రభావంలోకి వచ్చారు. గాంధీ ప్రగాఢమైన మత విశ్వాసాలు కల వ్యక్తి. సకలమతాల ప్రబోధాలను సమాదరించిన విశాల మనస్కుడు. ముగ్గురు ఋషితుల్యుల ప్రభావం ఆయనపై అమితంగా ఉంది. వారు వైష్ణవ కవి నరసింహ మెహతా, జైన దార్శనికుడు రేచంద్‌భాయి, సంప్రదాయ వ్యతిరేకుడైన క్రైస్తవ చింతకుడు లియో టాల్‌స్టాయ్‌. మహాత్ముని ప్రభావంతోనే యువ నెహ్రూ తన జైలువాసంలో హిందూ, ఇస్లామ్‌, క్రైస్తవ, సిక్కు మత గ్రంథాలను శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. గాంధీకి ఈ లేఖలు రాసిన దశాబ్దంలోగానే మతంపట్ల తన ఆసక్తిని నెహ్రూ కోల్పో యారు. ఈ మార్పుకు కారణమేమిటి? సహాయ నిరాకరణోద్యమంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా పనిచేశారు. అయితే ఆ తరువాత రెండు మతాల వారు వేరయిపోయారు. ఉత్తర భారతంలో వరుసగా పలుచోట్ల హిందూ -ముస్లిం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత రాజకీయాల్లో మతం చాలా ప్రమాదకరమైన చీలికలు సృష్టించే శక్తి అనే భావనకు నెహ్రూ వచ్చారు. ప్రజా వ్యవహారాల్లో మతానికి ప్రమేయం కల్పించకూడదనుకున్నారు.
1930 దశకంలో నెహ్రూను పాశ్చాత్య సోషలిస్టు భావస్రవంతి, ఉద్యమాలు ప్రభావితం చేశాయి. లౌకిక, శాసీ్త్రయ దృక్పథానికి ప్రాధాన్యమిచ్చే సోషలిజం మత విశ్వాసాలపై ఏ విధంగానూ రాజీపడలేదు. 1921-22లో జైలు వాసంలో లౌకిక సాహిత్య అధ్యయనానికి నెహ్రూ పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. 1930ల్లో ఆయన పూర్తిగా సోషలిస్టు సాహిత్య అధ్యయనానికే అంకితమయ్యారు. దేశ విభజన సమయంలో చెలరేగిన మతోన్మాద హింసాకాండ వ్యవస్థీకృత మతంపట్ల నెహ్రూను మరింతగా విముఖుడ్ని చేసింది.
భారతీయ ప్రజానీకంలో ‘శాసీ్త్రయ దృక్పథాన్ని’ పెంపొందించాలని 1940, 50 దశకాలలో నెహ్రూ ఆరాటపడ్డారు. జాతి నిర్మాణంలో మతానికి ఎటువంటి స్థానం లేదని, భారత్‌ ఎటు వంటి పరిస్థితులలోను ‘హిందూ పాకిస్థాన్‌’గా పరిణమించకూడదని ఆయన గట్టిగా భావించారు. అయితే వృద్ధుడు అవు తున్న కొద్దీ నెహ్రూ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని గట్టిగా విశ్వసిస్తూనే ఒక వ్యక్తి జీవితంలో మతం నిర్వహించేపాత్ర ఒకటి తప్పక ఉందని ఆయన భావించారు. తన చివరి సంవత్సరాలలో నెహ్రూ మా ఊరు-డెహ్రాడూన్‌-ను తరచు సందర్శించేవారు. శోభాయమానమైన హిమాలయాలను వీక్షించడంతో పాటు ఒక ఆధ్యాత్మిక గురువు వద్ద తన సమయాన్ని గడపడానికి ఆయన డెహ్రా డూన్‌ వచ్చేవారు. డెహ్రాడూన్‌-రాజ్‌పూర్‌ రోడ్‌లో నివశించే ఆ ఆధ్యాత్మిక గురువు పేరు ఆనందమాయి మా. ఆమె బెం గాలీ హిందూ. అయితే గాంధీ వలే అన్ని మతాలను ఆమె సమాదరించేవారు. అన్ని మతాల వారితో ఆమె ఆధ్యాత్మిక సంభాషణలు జరిపేవారు.
నెహ్రూ, ఆనందమాయి మా ఏమి మాట్లాడుకునే వారో ఎవరికీ తెలియదు. అయితే ఇరువురూ తరచు సమావేశమవ్వడం, మతం పట్ల నెహ్రూ వైఖరి విషయమై మన అవగాహనను సంక్లిష్టం చేస్తుంది. ఆయన అభిమానులు కొంతమంది, అనేకమంది వ్యతిరేకులు మనలను విశ్వసించేలా చేస్తున్నట్టుగా నెహ్రూ కలహశీల నాస్తికవాది కాదు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతోపాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన రాజకీయ జీవితం అత్యున్నత దశలో ఉన్న నలభైలు, యాభైల్లో హేతువాదంతో మాత్రమే మనిషి ఈ ప్రపంచాన్ని (జయించలేకపోయినా) అర్థం చేసుకోగలడని విశ్వసించారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు.
– రామచంద్ర గుహ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.