మాయని మచ్చ

మాయని మచ్చ
ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి వ్యక్తి చేతుల్లో ఆ సంస్థను పెట్టినందుకు ఈ దేశానికి కూడా. వీరతాళ్ళు వేయించుకోవలసిన ఓ సంస్థ ఆయన నేతృత్వంలో ఉరితాళ్ళు వేయించుకుంది. ‘పంజరంలో చిలక’ అంటూ చీవాట్లు తిన్నది. సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఇంతటి మొండిఘటం కాబట్టే, 2జీ కేసులో ఆయనగారిని పక్కకు తప్పిస్తూ కూడా, సీబీఐని పల్లెత్తుమాట అనకుండా స్వయంగా సుప్రీంకోర్టే దాని పరువూ, తన పరువూ కాపాడుకుంది.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఒక కీలకమైన కేసు నుంచి ఆ సంస్థ అధినేతనే దూరం పెట్టడం చరిత్రలో తొలిసారి. రంజిత్‌ సిన్హాకు ముందు ఆ సంస్థ అధినేతలుగా ఉన్నవారు కొందరు కొన్ని కేసుల దర్యాప్తు నుంచి తమకు తాముగా వైదొలిగిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకూ ఉన్నాయి. గతంలో వారు పనిచేసిన రాష్ట్రాలకూ, అప్పటి ముఖ్యమంత్రులకూ సంబంధించి దర్యాప్తులు చేయవలసి వచ్చినప్పుడు వారు ఈ జాగ్రత్తలు తీసుకొనేవారు. చివరకు తమతోపాటు గతంలో కలసిపనిచేసినవారి విషయంలోనూ ఇదే జాగ్రత్తపడేవారు. అంతెందుకు, ఇదే 2జీ కుంభకోణంలో రాజాపేరు వచ్చిచేరగానే తమిళనాడు కేడర్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి దర్యాప్తు బృందం నుంచి తక్షణం తప్పుకున్నారు. వీటిని విలువలని అనుకున్నా, చెడ్డపేరు వస్తుందన్న భయమనుకున్నా, ఇప్పుడు నేరుగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తన సౌశీల్యాన్ని శంకించినప్పుడు రంజిత్‌ సిన్హా కనీసంగా చేయవలసింది ఏమీలేదా? తనకోసం కాకున్నా, తాను స్వయంగా స్వర్ణోత్సావాలు నిర్వహించిన సంస్థ గౌరవం కోసమైనా సెలవుపెట్టి పోనవసరం లేదా? ఆయన ధోరణి చూస్తున్నప్పుడు అలా జరిగే అవకాశాలు లేవు కనుక ప్రభుత్వమే ఇక ఆ పని చేయవలసి ఉంది.

సీబీఐ తీరుపై చాలాకాలంగా విమర్శలున్నాయి. ముఖ్యంగా, రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందువల్ల ప్రతిపక్షాల నోట్లో అది కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అయి కూచుంది. ఈ దశాబ్దకాలంలో అనేక కుంభకోణాలు వెలుగుచూడడం, కాగ్‌ వంటి సంస్థలు తూర్పారబట్టిన కారణంగా సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగడంతో సీబీఐ వ్యవహారశైలి మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇంతకాలమూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆ సంస్థ చిలుకపలుకులు మానేసి పులిలా గాండ్రిస్తుందని అనుకోనక్కరలేదు. కానీ, సర్వోన్నత న్యాయస్థానమూ, సీవీసీ, కాగ్‌ వంటివి క్రియాశీలకంగా ఉంటూ, యావత్‌ దేశమూ ఓ కన్నువేసి ఉంచినప్పుడు, అప్పటికే విమర్శల పాలైన సీబీఐ ప్రతిష్ఠని దాని రథ సారధే తన దుష్ప్రవర్తనతో మరింత దిగజార్చడం ఆశ్చర్యం కలిగించకమానదు. బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించవలసింది పోయి, సర్వాధికారాలూ తనకు దక్కినప్పుడు తన సంస్థ మరింత స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందంటూ సిన్హా సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించడం విచిత్రం.

ఆయన ఇంటికి 2జీ స్పెక్ట్రమ్‌ నిందితులు తరచుగా వచ్చిపోతున్నారంటూ నాలుగునెలల క్రితం ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’ (సీపిల్‌) అనే సంస్థ ఆరోపించింది. దీనిని సిన్హా ఖండించారు. అనంతరం ఆయన నివాసంలోని లాగ్‌బుక్‌లో నమోదైన సందర్శకుల వివరాలను ఆ సంస్థ కోర్టుకు ఇవ్వడంతో, అదంతా అసత్యాల చిట్టా అనడంతో ఆయన దబాయింపు ఆరంభమైంది. ‘నా ఇంటికి ఎవరైనా రావొచ్చును, తలుపులు తెరిచే ఉంటాయి’ అన్నారు. వచ్చేవారు నిందితులైతేనేమి నా మిత్రులైనప్పుడు కలవకూడదా? అని కూడా ప్రశ్నించారు. అలా అనేకులు వచ్చి సమాచారం ఇస్తున్నందువల్లే దర్యాప్తులు సాగుతున్నాయంటూ దీర్ఘం తీసారు కూడా. ఈయన తన ఇంటి తలుపులు తెరిచి స్వాగతించినవారందరూ వివాదాస్పదులే. అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ మాంసం ఎగుమతిదారు మోయిన్‌ ఖురేషీ ఏడాదిన్నర కాలంలో 90సార్లు ఈయనను కలిశాడు. అనిల్‌ అంబానీ కుడి, ఎడమ భుజాలనుకొనే ఇద్దరు వ్యక్తులు ఈయనను యాభైసార్లకు పైగా కలిశారు. బొగ్గుకుంభకోణంలో నిందితుడైన విజయ్‌ దర్దా పదిసార్లు, 2జీ కుంభకోణంలో లబ్ధిదారైన ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత 71సార్లు ఈయనను కలుసుకున్నారు. న్యాయస్థానానికి ఈ చిట్టా ఇచ్చినందుకు సీపిల్‌ సంస్థ మీదా, ప్రశాంత్‌భూషణ్‌ పైనా కేసులు పెట్టాలని సిన్హా వాదించారు. తన సంస్థలోనే ఓ వ్యక్తి తనకు వ్యతిరేకంగా కుట్రపన్ని, గూఢచారిలాగా పనిచేసి వారికి ఈ వివరాలు ఇచ్చాడంటూ విరుచుకుపడ్డారు. సిన్హా జగన్నాటకాన్ని ఎంతో ఓపిగా వీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం చివరకు ఆయన పట్ల ఏమాత్రం నమ్మకం లేదన్న ఏక వాక్యంతో 2జీ దర్యాప్తు నుంచి దూరం పెట్టింది.
ప్రధానమంత్రి, విపక్షనేత తదితరులంతా ఉన్న కొలీజియం ద్వారానే సీవీసీ, సీబీఐ వంటి సంస్థల అధిపతుల నియామకం జరగాలన్న ప్రతిపాదన ఉన్న లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రంజిత్‌ సిన్హా నియామకాన్ని పూర్తిచేసేసింది. అందుకు ఆయన ఎంతో రుణపడి వున్నమాట నిజం. 2జీ కుంభకోణం దర్యాప్తులో రంజిత్‌ సిన్హా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సలహాలు ఇచ్చేవారనీ, ఆయన మాట వినివుంటే కేసు మొత్తం కుప్పకూలేదని సీబీఐ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆనంద్‌గ్రోవర్‌ న్యాయస్థానం ముందు చేసిన వ్యాఖ్యలు సిన్హాకు అత్యంత అవమానకరమైనవి. తమ న్యాయవాదినుంచే అంతమాట పడ్డాక మరొకరైతే తక్షణమే రాజీనామా చేసివుండేవారు. ఇప్పుడు న్యాయస్థానం పక్కనపెట్టినా కుర్చీవదిలేది లేదు అంటున్న రంజిత్‌ సిన్హా విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకుని, పంజరంలో చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించడం మరింత ముఖ్యం.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.