అభాగినుల పాలిట ఆపన్నహస్తం
- -లావణ్య
- 16/11/2014

ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. ‘ప్రజ్వల’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ నిరాశ్రయులకు ఆమె ఆశ్రయం ఇస్తున్నారు. ‘మహిళలను, పిల్లలను అపహరించే వారితో యుద్ధం చేసే పోరాట యోధురాలి’ (యాంటీ ట్రాఫికింగ్ క్రుసేడర్) గా ఆమెను అంతా అభివర్ణిస్తుంటారు. సంఘ సేవకురాలైన సునీతా కృష్ణన్ తాను ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ద్వారా అనేక సమాజహిత కార్యక్రమాలను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అయతే- వీధి బాలలు, అనాథ మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఎదో ఒకటి చేయాలన్న తపన పెరగడంతో ఆమె వినూత్న కార్య్రకమాలను ప్రారంభించారు. మనదేశం నుంచి నేపాల్, బర్మా వంటి పొరుగు దేశాలకు మహిళలను, పిల్లలను తరలించే ముఠాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె ధీరత్వం ప్రదర్శించారు. ఆమె సాహసాన్ని పోలీసులు, న్యాయవాదులు, సంఘ సంస్కర్తలు పలుసార్లు ప్రశంసించారు.
అసాంఘిక శక్తుల నుంచి తాను కాపాడిన మహిళలు వారి కాళ్లమీద వారు నిలబడి జీవించేందుకు సునీతా కృష్ణన్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. కార్పెంటరీ, వెల్డింగ్, కుట్లు, అల్లికల వంటివి అనాథ మహిళలకు నేర్పించి వారు స్వయం ఉపాధి పొందేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. బంధుమిత్రులు, పరిచయస్థుల చేతుల్లో అత్యాచారాలకు గురయ్యే యువతలను రక్షించి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇపుడు ఆమె వద్ద ఆశ్రయం పొందుతున్న మహిళలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. స్వయం ఉపాధితో తాము స్వతంత్రంగా బతుకుతామన్న ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల సంస్థ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని వారు చెబుతుంటారు. మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ, వీధి బాలలకు చదువు నేర్పిస్తూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అన్ని అవకాశాలను సునీతా కృష్ణన్ కల్పిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి అనేకమంది యువతులకు ఆమె వివాహాలు జరిపించారు. ఇంతగా సేవ చేస్తున్నా- ప్రజ్వల సంస్థ గురించి కానీ, సునీతా కృష్ణన్ గురించి కానీ ఎక్కడా ఎలాంటి ప్రచారం కనిపించదు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రచార పటాటోపం అనవసరమని ఆమె చెబుతుంటారు. అయతే- సమాజంలో మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న దురాగతాలపై అందరూ గొంతెత్తాలని, అన్యాయాన్ని అంతా ప్రశ్నించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే అత్యాచారాలు, అరాచకాలు కొంతవరకైనా తగ్గుముఖం పడతాయని ఆమె చెబుతుంటారు. మన దేశంలో ఏటా వేలాదిమంది అమ్మాయలు, పిల్లలు అపహరణకు గురవుతున్నారని, డబ్బు కోసం వారిని ఇతర దేశాలకు విక్రయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ మరింత పకడ్బందీగా పనిచేస్తే తప్ప దీన్ని ఆపడం సాధ్యం కాదని ఆమె అంటున్నారు. అపహరణకు గురైన ఆడపిల్లల్లో చాలామంది వేశ్యావాటికల్లో దుర్భర జీవితాలు గడుపుతూ, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని సునీత చెబుతున్నారు. సమాజంలో అన్ని వర్గాల వారూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సంఘ వ్యతిరేక శక్తుల దురాగతాలను అరికట్టవచ్చని ఆమె సూచిస్తున్నారు.
చిత్రం.. అనాథ బాలలతో సునీతా కృష్ణన్