కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు

  • – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788
  • 24/11/2014
TAGS:

‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత కథలుగా ఎలా మారాయా అని ఆశ్చర్యం కలిగింది. సాహిత్య సృజనకి సంబంధించి దాని ఉనికి కాలానుగుణంగా రెండు రకాలుగా మారవచ్చు.
ఒకటి – రాసిన కాలానికి ప్రాసంగికమై అప్పటి అవసరాలను నెరవేర్చి క్రమేణా మరుపులోకి మరలిపోవడం. రెండు – రాసిన కాలంలో నిశ్శబ్దంగా ఉండి తదనంతర కాలంలో ఒక పర్టిక్యులర్ దశకి ప్రాసంగికమై ఉండడం. అదృశ్యము, బలహీనులు కథలు రెండవ విభాగానికి చెందినవి. దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత నేటి కాలానికి అవసరమైన ఆలోచన, చర్చల్ని ఇవ్వగలిగినవి. స్ర్తి పురుష సంబంధాలని చిత్రించిన సాహిత్యాన్ని నైతిక పరిధి లోపలా, వెలుపలా విశే్లషించడం ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈ కథల రచనా కాలపు నేపథ్యాన్ని తరచి చూస్తే కారా మాస్టారిని ప్రభావితం చేసిన అంశాలు కనపడొచ్చు. 1945 సంవత్సరానికి, దానికి అటూ ఇటూగా ఉన్న కాలానికి చరిత్రలో ప్రాధాన్యత ఉంది.
1945 – రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం, దేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తిని వాగ్దానం చేస్తున్న కాలం, స్ర్తిలు ఉన్నత విద్యలోకీ ఉద్యోగాల్లోకీ అడుగులేస్తున్న కాలం, మధ్యతరగతి రూపురేఖలు స్పష్టపడుతున్న కాలం, మోటు విలువలు పోయి నాజూకు విలువలు ప్రవేశిస్తున్న కాలం, విస్తృత-విస్మృత వర్గాలు స్వరం సవరించుకుంటున్న కాలం, ఇటువంటి కాలంలో ఈ కథలు వచ్చాయి. కుట్ర, యజ్ఞం, చావు వంటి కథలు రాసిన కాళీపట్నం రామారావు మాస్టారు అదృశ్యము, బలహీనులు అనే కథలు రాయడం యవ్వన ప్రభావం అనిపించే అవకాశాన్ని అట్లా ఉంచుతూనే మరికొన్ని కారణాలు కూడా గుర్తించాలి.
1945 నాటికి స్ర్తి పురుష సంబంధాలను తమ రచనల్లో విస్తృతంగా చిత్రిస్తున్న రచయితలు ఇద్దరు. చలం, కొడవటిగంటి కుటుంబరావు. సంప్రదాయవాదులకీ స్వేచ్ఛాప్రియులకీ మధ్య చర్చలకి వీరి సాహిత్యం చాలా ఉపయోగపడింది. ఆ చర్చల ప్రభావం కాళీపట్నం మాస్టారు మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రెండు కథల్లోనూ అటువంటి చర్చ, పాత్రల ద్వారా ఘటనల ద్వారా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ కథాంశాలను పై ఇరువురికన్నా భిన్నంగా లాక్కొచ్చే పెంకితనాన్ని చూపారు కారా.
15 ఏళ్ల అవివాహిత లలిత, అందరికీ అన్నివిధాలుగా నచ్చిన ఒక పెళ్లి సంబంధాన్ని తోసిపారేస్తోంది. ఎందరు ఎన్ని విధాలుగా అడిగినా కారణం చెప్పదు. ఈసడించినా నోరు మెదపదు. అందరూ ఆమెని మూర్ఖురాలు అంటున్నా ఆమె మూర్ఖురాలు కాదు. ఆమె తిరస్కరణకి కారణం ఉంది. ఆ కారణం వెల్లడించకపోవడంవల్ల ఆమె మూర్ఖురాలు అనిపించుకుంది. ఆ సంబంధాన్ని లలిత ఎందుకు తిరస్కరించిందో చెప్పే క్రమంలో కథాంశం విస్తరిల్లింది. పట్నంలో ఉండే అక్కాబావ వద్దకి చుట్టం చూపుగా వచ్చిన లలిత, పక్కింటి పాతికేళ్ళ వివాహిత అనూరాధల మధ్య నడిచిన సంభాషణలే స్ర్తి పురుష సంబంధాల నైతికతకి ఉండే పలు కోణాలని పరిచయం చేస్తాయి. ఎదురింటి పెళ్లికాని కుర్రాడితో చూపులతో శృంగారాన్ని (Flirting) నెరిఫే అనూరాధ, లలితకి ఆ స్థితిలో పట్టుబడి తన ప్రవర్తనని సమర్ధించుకునే వాదన చేయగా దానిని వ్యతిరేకించే ఆలోచన లలిత చేస్తుంది. చివరికి లలిత తిరస్కరించింది ఆ ఎదురింటి కుర్రాడినే అన్నది కొసమెరుపు ముగింపు ద్వారా చెపుతారు రచయిత.
లలితకి అనూరాధకి మధ్య జరిగిన సంభాషణ ఒక ఇబ్బందికర ఘటనవల్ల పుట్టింది కనుక చర్చని నడిపిన తీరు కూడా అందుకు అనుగుణంగా సృష్టించారు. అంటే కేవలం చెప్పదలచుకున్న అంశాలను ఏదోలా సంభాషణల రూపంలో చెప్పించేయడం కాకుండా అందుకు అనువైన మూడ్‌ని సృష్టించడంలో కారా మాష్టారు చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ సంభాషణలో కేవలం నీతికి సంబంధించిన అంశాలే కాకుండా మానవ మనస్తత్వ పరిశీలన కూడా శక్తిమంతంగా ప్రతిఫలించింది. లోకానికి తప్పు అనిపించే పనిచేసి దొరికిపోయిన యువతి దాన్ని ఒప్పుగా నమ్మించడానికీ నమ్మించుకోడానికీ ఎలా ప్రయత్నిస్తుందో, ఆ తప్పుని కనిపెట్టిన యువతి దానిని తన నైతిక ఆధిక్య ప్రదర్శనకు ఎలా ఉపయోగించుకున్నదో పాత్రోచిత కథనం, సంభాషణల ద్వారా చెప్పగలిగారు రచయిత.
‘అదృశ్యాని’కి ముందు రావలసిన కథ ‘బలహీనులు’. స్ర్తి పురుషుల తొలి పరిచయాల్లోని అస్పష్టత సందిగ్ధతల దోబూచులాటని రెండే పేజీల్లో స్పష్టంగా చిత్రించారు యువ కారా. కోరుకునేది ఒకటి, ప్రవర్తించేది వేరొకటి అయిన బలహీనులకు నిరాశ అనివార్యమనే సూచన ముగింపులో కనపడుతుంది. ఒక ఆసుపత్రిలో నర్స్‌గా చేస్తున్న ఆమె సౌందర్యవతి, అంతేకాకుండా ఆ విషయం ఆమెకి బాగా తెలుసు. పేషెంట్ తాలూకు వ్యక్తి ఒకతను రోజూ ఆమెని Trickingగా ఛూస్తుంటాడు. చూడగా చూడగా చూడగా ఆమెకి కూడా అతనంటే ఆసక్తి కలుగుతుంది. కోరిక కూడా కలుగుతుంది. దానిని శీల పతనంగానూ గుర్తిస్తుంది, అయినా ఆకర్షణ తగ్గదు. పేషెంట్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకున్న అతను ఆకస్మాత్తుగా. మళ్ళీ తనకి ఎదురుపడేసరికి తన కోరిక కన్నా నైతికతే ముందుకు తోసుకువచ్చి అతన్ని నొప్పించే మాట అంటుంది. తడబడి వెళ్ళిపోతాడు అతను. నిరాశతో దుఃఖానికి లోనవుతుంది ఆమె.
ఈ రెండు కథల్లోనూ తరువాతి కథలన్నిటిలోనూ సమానంగా కనిపించే సుగుణం ఒకటుంది. కారా మాస్టారు కథని, దాని చుట్టూ అల్లుకుని ఉండే కథాంగాల్లో దేనినీ వాచ్యం చేయరు. ఎత్తుగడ మొదలు ముగింపువరకూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు కనుకనే ఆయన చెప్పకనే చెప్పిన అంశాలను వెలికి తీయడానికి ఈ డెబ్భై ఏళ్ల కాలమూ సరిపోలేదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలూ, అన్వయాలూ స్ఫురించడానికి ఈ గుణమే కారణం. కథని వాచ్యం చేయకుండా వాక్యం చేయడమనే అంశానికి నైతిక తీక్షణత కూడా ఉంటుంది. కనుకనే కారా కథలు భయపెడతాయి కూడా. ఈ రెండు కథల్లో కూడా పై గుణముంది. తన తొలి రచనల కాలానికే కథని వాచ్యం కాకుండా వ్యక్తం చేయడాన్ని సాధన చేసిన కారా వ్యక్తిగా కూడా అంతే నిగూఢ స్వభావం కలవారు. ఆ స్వభావ సిద్ధత కూడా ఈ సుగుణానికి చేర్పు అయి ఉంటుంది.
కారా కథల్లోని పాత్రలు సర్వ స్వతంత్రమైనవి. రచయిత ఆగ్రహానికో ప్రేమకో వ్యంగ్యానికో ఇష్టానికో బలికానివి. వలపక్షం లేని పాత్ర చిత్రణ వల్లనే కథకి సాధికారికత వస్తుంది. కారా తన కథల్లో ఏ పాత్రనూ సమర్ధించరు. వ్యతిరేకించరు. వాటి ప్రవర్తనలను గమనించి మంచీ చెడూ గ్రహించడమే పాఠకుల పని. ‘అదృశ్యం’ కథలో కథకుడు ఇటు లలితనూ అటు అనూరాధనూ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. కథకుని స్వరం ద్వారా ఈ అంశాన్ని గ్రహించవచ్చు.
‘‘నేను ఆలోచించాను. నా సుముఖత్వం అతనికి కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా ఉండడంవల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ కాడికి అతనిని బాధ పెట్టటమెందుకూ? ఆ ఆరంభ యవ్వనుని ఒంటరితనంలోని యాతన ఊహించి జాలి కలిగించుకున్నారు’’ (కాళీపట్నం రామారావు రచనలు, పుట 17) అంటుంది అనూరాధ. అనూరాధ మాటల్నిబట్టే ఆమె మానసిక స్థితీ, సమర్థన కోసం వాడుతున్న లాజిక్ తెలుస్తాయి. అలాగని నైతిక విలువలకే అంతిమ ప్రాధాన్యం ఇచ్చి లలితను సమర్థించారని అనుకోవడానికీ వీలు లేదు. ఆ విషయం ముగింపులో వ్యక్తమవుతుంది.
‘‘….వాళ్లకి శారీరక సంబంధం ఉండే ఉంటుందని జాణతనం ఉపయోగించి అసలు విషయం దాచి దానికి రంగులు పూచి చూపెడుతోందనీ… నేను ఇటువంటి మాటలకు మోసపోను’ అని తనలో తాను గర్వంగా అనుకుంటూ వారి దోషాన్ని స్థిరీకరించింది లలిత,’’ ‘‘గుణ శీలాలకి ప్రాధాన్యత యిచ్చే భారతనారి- లలిత- ఆ దుర్మార్గుణ్ణి, నీచుడినీ, రౌడీని తెలిసి తెలిసి యెలా వరిస్తుంది?’’ (కాళీపట్నం రచనలు, పుట-18) అంటారు కథకుడు.
స్ర్తిల లైంగిక విలువలకి సంబంధించిన చర్చ ఆ కాలానికన్నా ముందున్న అంశం. అందులోనూ ఫ్లర్టింగ్, ట్రిక్కింగ్ లాంటి సున్నిత శృంగార భావనలను ఆధునికంగా నిర్వచించడం, అసలు అటువంటి స్థితులు ఉంటాయన్న అంశాన్ని ముందుగా కథకుడు ఆమోదించడం, వాటిని కథలుగా మలచడం వలన కాలాతీతమైన ఇటువంటి భావనల మంచీ చెడూ చర్చలోకి వస్తాయి.
కారా మాస్టారి సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలించినపుడు స్ర్తి పురుష సంబంధాల చిత్రణలో శృంగారపరమైన అంశాల విషయంలో గోప్యతని పాటించడం కనిపిస్తుంది. ఈ గోప్యతని నాటక సాహిత్యంలో ఔచిత్యగుణంగా పోషించారు. నాటకంలో ప్రదర్శనకు వీలుకాని అంశాలను అర్థోపక్షేపకాల్లో చెపుతారు. యుద్ధం, రక్తపాతం, ఆహార, నిద్ర, మైధునాదులు ప్రదర్శన యోగ్యం కాదు. అందుకే సూత్రధారుడు వచ్చి వాటిని ప్రస్తావించి వెళ్ళిపోతాడు. కారా మాస్టారు కూడా తన కథలకి సూత్రధారుని వంటి పాత్ర మాత్రమే పోషించారు. పాఠకులలో తామస గుణాలను రేకెత్తించే అంశాల పట్ల గోప్యతనే అలంకారంగా మార్చుకున్నారు. కారా కథలు, దృశ్యకథలుగా కూడా భాసించడానికి ఇటువంటి జాగ్రత్తలు కూడా సాయపడ్డాయి. అందుకు అదృశ్యము, బలహీనులు కథలే ఉదాహరణలు. తన మిగతా కథలతో పోల్చుకుని గానీ, వాటి పరిణామాన్ని విశే్లషించుకున్నప్పుడు గానీ తన తొలి కథల పట్ల కారా మాస్టారికి అంతగా ఏకీభావం ఉన్నట్లు కనపడదు. అది సహజమే అయినప్పటికీ అరుదుగా తీవ్ర శ్రుతిలో దీర్ఘ్ధ్వనితో వాటిని వ్యతిరేకిస్తూ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు. అయినప్పటికీ ఈ రెండు కథలూ ఇలాంటి కథలు మరికొన్నిటి మీద విశే్లషణలు రావాల్సిన అవసరం ఉ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.