మా ఊరు అట్లాలేదు
- – బెల్లి యాదయ్య
- 24/11/2014

సహజంగా
పడమర నుంచి తూర్పుకే
వీస్తుంటుంది గాలి
ప్రవహిస్తుంటాయి నీళ్లు
దేవుడు బ్రాహ్మడూ దొరలూ
వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న
కొలువుతీరి ఉంటారు
మా పాలెం అట్లా ఉండదు
జ్వాలా నరసింహుడి గొప్ప గుడి
హరిజనుల చీకటి అరలు
పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి
మా ఊరికి
అహంకారం మనువు ఎత్తిపోస్తే
మోకాళ్లమీద కూర్చొని
వాకిట్లో గంగ దాహం తీర్చుకునే
నిషిద్ధ లోకాన్ని మీరూ చూసే వుంటారు.
సాంద్ర స్వరంగా
ఇంట్లోకి వచ్చి బల్లపీట మీదో
పట్టె మంచం మీదో కూర్చొని
సేదదీరిన దొడ్డి శ్రీరాములును
నేను మా తాతకు తోబుట్టువుగా భావిస్తాను.
ఒరేయ్ ఎల్లిగా
ఒసేయ్ లచ్చీ మాటల కొరడాలు ఫెళ్ళుమనడాలు
స్వర్గలోక గర్జనలూ మీరూ చూసే వుంటారు
వినే వుంటారు
మాల దేవయ్య
గౌండ్ల ఎంకన్నను అరేయ్ తమీ అనడం
మాదిగోల్ల స్వామి
గొల్ల కృష్ణమూర్తిని ఒరే కొడకా అనడం
మా వూళ్లో ప్రజాస్వామ్యం
ఇదీ అదీ
దీనికీ దానికీ అని
పాలు ప్రత్యేకం నేనేమి చెప్పను
కల్సి బువ్వ తినడం బాగోతా లాడడం
మంచికీ చెడుకూ అర్సుకోవడం
మరీ ముఖ్యంగా
మనుషులిక్కడ సర్వం సమానం
అనే కథ చెప్పకోడానికి
ఏ ద్వీపం అవసరమో
అదే మా ఊరు
గుడి ఓచోటా
బ్రాహ్మడో దిక్కూ
దొరలు ఓవైపూ ఉండేవారు
మా ఊళ్లో
ఈ మూడు దూరాలే
మా జనం చైతన్యానికి ముఖద్వారాలు
మా ఊరులాంటి ఊరు
ఏదైనా ఉంటే ఎన్నైనా ఉంటే చెప్పండి
అక్కడ మూడు నిద్రలు చేసి వస్తాను