హద్దులు చెరిపిన అందెల రవళి
![]() |
|
నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయటం చాలా కళ
అరుదైన విషయం. అదీ కూచిపూడి సంప్రదాయంలో. ప్రముఖ నృత్య కళాకారుడు హలీంఖాన్- ఇటీవల మా లఖాచందా అనే కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించినందుకు అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి థ్యాంక్స్ గివింగ్ అనే నృత్యం ద్వారా తన కృతజ్ఞతలు చెప్పాడు. ఈ నేపథ్యంలో- నవ్య హలీంఖాన్‌ను పలకరించింది. అప్పుడు ఆయన చెప్పిన విశేషాలివి..
హైదరాబాద్‌లో పైగా ప్యాలెస్‌కు వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. మూడో నిజాం పాలిస్తున్న సమయంలో ఈ ప్యాలెస్ ‘మా లఖాచందా’ అనే కవయిత్రి కవితాలపలనలతో మార్మోగుతూ ఉండేది. పైగా ప్యాలెస్ అమెరికా కాన్సులెట్ కార్యాలయంగా మారిన తర్వాత- శిధిలావస్థలో ఉన్న కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించారు. ఇప్పుడు అనేక మంది ఆ సమాధిని సందర్శిస్తున్నారు. రెండు వందలేళ్ల క్రితం నాటి వైభవాన్ని మళ్లీ తిరిగి తీసుకువచ్చినందుకు- అమెరికా అధికారులకు కృతజ్ఞతలు చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నమే థ్యాంక్స్ గివింగ్. ఇది వెల్‌కం డ్యాన్స్, జావళి, థిల్లాన, తరంగం, తాండవంల సంగమం. నృత్యంలో ఈ విధమైన ప్రయోగాలు చేయటం నాకు కొత్త కాదు. తానీషా, కులీ కుతుబ్‌షాలు రాసిన కవితలను నాట్యంగా మార్చి ‘యాద్-ఎ-మాజి’గా, అర్థవంతమైన ఇంగ్లీషు కవితలతో ‘రైమ్ అండ్ రిథమ్’, కూచిపూడి, బాలే, సమకాలీన సంగీతాల మేళవింపుతో ‘మిలాంజ్ ఆఫ్ డాన్సెస్’ లాంటి ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాను.
రూపానురూపం
భావాన్ని వ్యక్తం చేయటానికి వీలున్న చక్కని మాధ్యమం నాట్యం. ఫలానా నాట్యం సీ్త్రలే చేయాలి. పురుషులు చేయకూడదనే నిబంధనేదీ లేదు. నిజానికి 50 – 60 ఏళ్లకు ముందు నాట్య కళను కేవలం పురుషులే అభ్యసించేవాళ్లు. ఆ తర్వాత దేవదాసీలు నాట్య కళను సాధన చేసి వేదికల మీద ప్రదర్శనలివ్వటం మొదలుపెట్టారు. అలా నాట్యకళను సీ్త్రలు అభ్యసించటం మొదలైంది. పురుషులు సీ్త్ర వేషంలో, సీ్త్రలు పురుషుల వేషంలో డాన్స్ చేసే పద్ధతిని ‘రూపానురూపం’ అంటారు. నేను చేసేది ఈ పద్ధతే. అయితే దీనిలో అనేక ఇక్కట్లు ఉన్నాయి. గత 16 ఏళ్లలో మన దేశంలోను, ఇతర దేశాల్లోను కలిపి 800కు పైగా నాట్య ప్రదర్శనలిచ్చాను. ముఖ్యంగా నాట్య ప్రదర్శన ఇచ్చేటప్పుడు సభికుల్లో ఎలాంటి అనుమానాలు రేకెత్తకుండా ఉండటం కోసం ముందుగానే నా ఐడెంటిటీని స్పష్టం చేసేస్తూ ఉంటాను. ముఖ్యంగా విదేశీయులు ఆడ వేషంలో ఉన్న పురుషుడిని చూసి ‘గే’ లేదా ‘ట్రాన్స్‌జెండర్’గా పొరబడుతూ ఉంటారు. అలాంటి ఉద్దేశంతో సభికులు నాట్యం వీక్షిస్తే కేవలం శరీర కదలికల మీదే తప్ప హావభావాల మీద వారు దృష్టి పెట్టలేరు కదా! ఆ పొరపాటు జరగకుండా రూపానురూపం గురించి వివరించిన తర్వాతే ప్రదర్శన మొదలు పెడుతూ ఉంటాను. కానీ కొంతమంది డాన్స్ ఆర్గనైజర్లు ప్రదర్శన ఐపోయాక నేను పురుషుడినని చెప్పి సభికుల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు కదా! అని అంటూ ఉంటారు. కానీ మగవాడినైన నేను సీ్త్ర వేషంలో నాట్యం చేసి మెప్పించటానికి ఎంత అంకితభావంతో కృషి చేశానో వాళ్లు గ్రహించాలంటే నా ఐడెంటిటీని ముందుగా చెప్పక తప్పదు కదా! ఇలా ఇప్పటివరకూ పాకిస్తాన్, సింగపూర్, మలేసియా, అమెరికాలలో ప్రదర్శనలిచ్చాను.
ప్రస్థానం మొదలైందిలా..
మాది ప్రకాశం జిల్లా ఒంగోలులోని సత్యన్నారాయణ పురం. టీవీ, సినిమాల్లో కూచిపూడి నాట్యం చేస్తున్న కళాకారుల్ని చూసి నాకు కూడా అలా నాట్యం చేయాలనిపించేది. అప్పుడు నాకు పద్నాలుగేళ్లుంటాయి. ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలనుకున్నాను. ఇంట్లో చెప్తే ఆడపిల్లలా నాట్యం నేర్చుకోవటమేంటని వద్దనేశారు. దాంతో వాళ్ల అనుమతితో నాట్యం నేర్చుకోవటం సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే ట్యూషన్ పేరుతో చాటుమాటుగా కూచిపూడి నేర్చుకోవటం మొదలుపెట్టాను. స్కూలు చదువు పూర్తయ్యాక వెంపటి చినసత్యంగారి శిష్యుడు కె.వి.సుబ్రహ్మణ్యంగారి దగ్గర నాట్యకళ అభ్యసించి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగాను. హైదరాబాద్‌లో ఓ పక్క ప్రముఖ కంపెనీకి పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోపక్క నాట్య ప్రదర్శనలిచ్చేవాడిని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నాట్య ప్రదర్శలు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్లకి ఆ విషయం తెలియదు. 2008లో రవీంద్రభారతిలో బాలే, కూచిపూడి మేళవింపుతో ‘మిలాంజ్’ అనే నాట్య ప్రదర్శన ఇచ్చాను. దానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ సమయంలో ఒక ఛానల్ వారు- నా ఇంటర్వ్యూతోపాటు మా అమ్మానాన్నల స్పందనను కూడా కవర్ చేయాలనుకున్నారు. మా అమ్మనాన్నల అడ్రస్సు అడిగారు. అప్పటివరకూ ఇంట్లో తెలియకుండా గుట్టుగా నెట్టుకొచ్చాను. ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందనిపించింది. ఆ ఛానల్ రిపోర్టర్ మా అమ్మనాన్నల ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. దాంతో మా అమ్మనాన్నలకు నా నాట్యం గురించి తెలిసింది. దాంతో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ముస్లింగా పుట్టి హిందూ సంప్రదాయ కూచిపూడి నాట్యం నేర్చుకోవటం వాళ్లకసలు మింగుడుపడని విషయం. పైగా అమ్మాయి వేషంలో ప్రదర్శనలిస్తూ పేరు తెచ్చుకోవటంతో వాళ్లు మరింత కంగారుపడ్డారు. పెళ్లి కావటం కష్టమని, నాట్యం మానేసి చక్కగా ఉద్యోగం చేసుకొమ్మని నన్ను పోరు పెట్టారు. ఎంతో ఇష్టపడి నేర్చుకున్న నాట్యాన్ని అమ్మానాన్నల అభ్యంతరం కారణంగా వదిలేయగలనా? అది జరగని పని. అదే విషయాన్ని సూటిగా చెప్పేశాను. మొదట్లో బాధపడ్డారు. కానీ నా ఎదుగుదల చూశాక క్రమంగా నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి మద్దతు ఉంది.
చాలా చేయాలనుంది..
నాకు థ్యాంక్స్ గివింగ్‌లాంటి నాట్య ప్రయోగాలెన్నో చేయాలని ఉంది. అలాగే యువతు నాట్యం వైపు ఆకర్షితులయ్యే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. మన . దేశ ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పటానికి, సంస్కృతిని కలకాలం కాపాడుకోవటానికి కళలెంతో తోడ్పడతాయి. భావ వ్యక్తీకరణకు నాట్య కళను మించిన కళ మరొకటి లేదనేది నా విశ్వాసం. అంతటి ప్రత్యేక లక్షణం కలిగిన నాట్యంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.
|