హీరోయిన్‌గా పనకిరావన్నారు..
![]() |
|
సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. త్వరలో 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకున్నారు.
సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. ‘దేవదాసు’లో సావిత్రి పాత్రకు తనను తీసుకుని, దుస్తులు కుట్టించి, షూటింగ్ రేపు అనగా ‘నిన్ను సినిమా నుంచి తీసేస్తున్నాం’ అన్న నిర్మాతల ఏకవాక్య లేఖ అందుకుని కూడా నిబ్బరంగా ఉండగలిగారు. తన పని తాను చేసుకుంటూ, వివాదాలకు దూరంగా సినీ ప్రయాణం చేసిన ఆ ధీశాలి గురించి…
‘‘మాది రాజమండ్రి. నాన్నగారు టేకుమళ్ల వెంకోజీరావు, అమ్మ శచీదేవి. నాన్న పూర్వీకులు మరాఠీ వారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ భాషలు కూడా మాట్లాడేవారు. ఆచారాలు, విలువల పట్ల ఎంతో గట్టి నమ్మకం ఉండే కుటుం బం మాది. నేను గుంటూరులోని ‘కుగ్లర్స్’ ఆసుపత్రిలో పుట్టాను. మా అమ్మమ్మ పేరు ‘జానకి బాయి’. ఆ పేరే నాకు పెట్టారు. మా అమ్మాన్నాలది మేనరికపు వివాహం. ముగ్గురు పిల్లలు పుట్టాక ఆయన ఇంగ్లాండు వెళ్లి రసాయన శాస్త్రం, కాగితం తయారీలో శిక్షణపొందారు. మా నాన్న ఇంగ్లాండులో ఉండగానే మా రెండో అన్నయ్య రామకృష్ణ, సోదరి సుగుణ చనిపోయారు. అయినా, మా అమ్మ ఆ కష్టం తనలో దాచుకుని, మా నాన్నను చదువు పూర్తి చేసే తిరిగి రమ్మని చెప్పింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనే నాన్నను ఇంగ్లాండ్ పంపించడానికి ఏర్పాటు చేశారు. అంతకు ముందు గాంధీగారి అనుచరుడిగా నాన్న ‘కల్లు మానండోయ్’ అంటూ ఊరూరా ప్రచారం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.
పోస్టల్ కోచింగ్‌లో ఆంగ్లం…
నాన్న ఇంగ్లాండ్‌లో చదువుకున్న మూడేళ్లలో పోస్టల్ కోచింగ్ ద్వారా అమ్మకు కూడా ఇంగ్లీషు నేర్పించారు. ఆయన లండన్ నుండి వచ్చాక ‘ఆంధ్రాపేపర్ మిల్స్’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మా నాన్న సముద్రం దాటి వెళ్లడంతో రాజమండ్రిలో మా బంధువులు మమ్మల్ని బహిష్కరించారు. కుటుంబాల్లో జరిగే ఏ కార్యక్రమాలకూ పిలిచే వారు కాదు. బాల్యంలో రాజమండ్రిలో మా ఇంటికి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర, గోదావరి గట్టున పిల్లలతో ఆడుకుంటూ గడిపాను. అక్కడే జీళ్లు, తేగలు, మొక్కజొన్న కంకులు కొని తినేవాళ్లం. అయితే, ఇంటి వద్ద ఎంతో క్రమశిక్షణ ఉండేది. చివరికి భోజనం వద్ద కూడా పద్ధతిగా ఉండాలనేవారు. అసత్యం చెప్పకూడదని, నిజాయితీగా ఉండాలని అమ్మానాన్న చెప్పేవారు మాకు. ఆ లక్షణాలే నాకూ వచ్చాయి. నా పిల్లలకూ అవే నేర్పాను.
లెక్కలంటే తలనొప్పి…
రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో సెకండ్ ఫాం చదివాక చెన్నై వచ్చేసాం. మా నాన్న బెంగాల్ పేపర్ మిల్లుకు వెళ్లిపోయారు. మద్రాసులో ఆంధ్రమహిళాసభలో చదువుకున్నాను. అపుడే దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ నన్ను ఎంతో అభిమానించేవారు. మేం అక్కడ చదువుకుంటున్నపుడే ఆమె వివాహం జరిగింది. నేను లెక్కల్లో చాలా వీక్. గణితం అంటే తలనొప్పి. ఇప్పటికీ అంతే. ఆ విషయం మా నాన్నతో చెబితే… లెక్కలు లేకుండా సంస్కృతం, హిందీ చదువుకోమన్నారు. దాంతో పాఠశాలలో నాటకాల్లో నటించడానికి వీలు చిక్కింది. దుర్గాబాయ్ గారు నా చేత ‘రాధ, రుక్మిణి’ వంటి వేషాలు వేయించేవారు. అలాగే ఎగ్మూరులో ఉండే మద్రాసు రేడియోలో ‘బాలానందం’ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. పాలగుమ్మి పద్మరాజు, పివి రాజమన్నార్, ఆరుద్ర, బుచ్చిబాబు వంటి వారి కథలు రేడియోలో చదివే అవకాశం కలిగింది. వీటికి ఆకాశవాణి నాకు డబ్బులు ఇచ్చేది. ఆ సొమ్ము బ్యాంకులో వేసేదాన్ని, ఇంట్లో ఎవరికైనా డబ్బు అవసరం వచ్చినపుడు నేను చెక్ ఇచ్చేదాన్ని.
గాంధీదర్శనం…
1946లో గాంధీజీ మద్రాసు వచ్చారు. హిందీ ప్రచారసభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మూడు రోజులు నగరంలో ఉన్నారు. ఆ మూడు రోజులూ నేను, చెల్లెలు కృష్ణకుమారి గాంధీగారికి సేవలు చేయడానికి దుర్గాబాయ్ అమ్మగారు ఏర్పాటు చేశారు. రోజూ ట్రాములో వచ్చి వెళ్లేవాళ్లం. మూడురోజులు గాంధీగారితో ఉన్న సమయం ఎంత గొప్పదో ఆ తరువాత తెలుసుకున్నాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, పండిట్ నెహ్రూ, సివి. రామన్, సత్యసాయిబాబా వంటి మహామహుల పరిచయం నాకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
తొలి సినిమా ప్రయత్నం…
రేడియోలో నా గొంతు విని బిఎన్ రెడ్డిగారు పిలిపించారు. ‘సినిమాల్లో నటిస్తావా’ అని అడిగారు. సరే అన్నాను. కానీ మా నాన్న అంగీకరించలేదు. రేడియో అంటే ఫరవాలేదు. సినిమాలు మనకొద్దని కోపగించుకున్నారు. నాకు పదహారేళ్లప్పుడు అంటే 1947 నవంబర్ నెలలో పెళ్లి చేశారు. అందుకే నేను ‘దేశానికి స్వాతంత్రం వచ్చింది, నాకు స్వేచ్ఛపోయింది’ అని సరదాగా అంటుండేదాన్ని. పెళ్లితో టేకుమళ్ల జానకి కాస్తా శంకరమంచి జానకిగా మారిపోయాను. మా వారి పేరు శంకరమంచి శ్రీనివాస్. తను ఆకాశవాణిలో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తరువాత విజయవాడలో కాపురం పెట్టాం. సత్యనారాయణపురంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం. అప్పుడే ‘గౌహతి వర్సిటీ’లో పరీక్షలకు రాశాను. అమ్మా వాళ్లు అప్పట్లో గౌహతిలో ఉండేవారు. పరీక్షలప్పుడు గర్భవతిని. అందుకని మానాన్నగారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. వాళ్లక్కడ ‘హ్యాపీ వ్యాలీ’లో ఉండేవారు కానీ నా మనసులో తీవ్ర ఆశాంతి ఉండేది. పెళ్లి తరువాత పుట్టినింటికి రావడం ఎంత తప్పో ఆ రోజుల్లో తెలుసుకున్నాను. స్వంతంగా జీవించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అక్కడ ఉండగానే నా ఆలోచనలో మార్పు వచ్చింది. కొంత స్థిరత్వం కూడా వచ్చింది.
మద్రాసు పయనం…
ప్రసవం తరువాత కొన్ని రోజులకు గౌహతి నుండి కోల్‌కతా వచ్చి, మద్రాసు బయలుదేరాం. అక్కడ మా సామానంతా దొంగల పాలయింది. వెండి, బంగారం పోయింది. కట్టుబట్టలతో మద్రాసు చేరాం. మా మేనమామ, అత్త మాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ తరువాత, మా వారి పొలం అమ్మిన సొమ్ముతో జీవనం ప్రారంభించాం. చేతిలో పసికందు, పాల డబ్బాలకు డబ్బులేని పరిస్థితి. సంపాదనపై దృష్టి పెట్టాలనుకున్నాను. ఏంచేయాలో తోచలేదు. ఉద్యోగాలు వచ్చే చదువు చదువుకోలేదు. మనసంతా దిగులుగా ఉండేది.
రెండో ప్రయత్నం…
చేతిలో మూడు మాసాల పసికందును పట్టుకుని, భర్తతో కలిసి మళ్లీ బిఎన్ రెడ్డిగారి దగ్గరకు వెళ్లాను. ఆయన్ని సినిమాలో వేషం ఇమ్మని అడిగాను. పై నుంచీ కిందికి ఓసారి చూసి ‘అప్పుడు ఇస్తానంటే వద్దని వెళ్లిపోయావ్, ఇపుడు నేను సినిమా ఏదీ తీయడంలేదే’ అన్నారు. నా పరిస్థితి వివరించిన తరువాత నాగిరెడ్డిగారికి ఫోన్ చేసి, నా గురించి చెప్పారు. అప్పుడు వాహినిలో ‘షావుకారు’ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగిరెడ్డిగారు నాకు మేకప్ టెస్ట్ చేయించారు. ఏడు రకాలు డైలాగ్‌లు ఇచ్చి చెప్పమన్నారు. దాదాపు నెల రోజుల వరకు ఏ సమాధానం రాలేదు. నేను చాలా ఆందోళన చెందాను. చివరకు ఒక రోజు షావుకారులో నువ్వే హీరోయిన్, హీరో ఎన్‌టీఆర్ అంటూ నాగిరెడ్డి వర్తమానం పంపారు. నాగిరెడ్డి, చక్రనాణి, ఎల్వీ ప్రసాద్‌లు మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. అలా జూలై, 1949లో షావుకారు ప్రారంభమైంది. ఆ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకులు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. స్వయంగా నటించి చూపించే వారాయన.
ఈ లోగా ‘పల్లెటూరి పిల’్ల చిత్రానికి సంతకం చేశాను. మూడు నెలల పాపాయిని ఇంట్లో వదిలిపెట్టి షూటింగులకు వెళ్లేదాన్ని. 1950లో షావుకారు విడుదలైంది. మంచి విజయం సాధించింది. నాకూ మంచి పేరు వచ్చింది. సినిమా పేరే ఇంటి పేరుగా మారి ‘షావుకారు జానకి’ అయ్యాను. కాని ఆ తరువాత సినిమాలు రాలేదు. ఆ సమయంలో ఒకసారి కెవి రెడ్డిగారిని కలిసాను. అప్పుడాయన ‘నీకు సినిమాలు రావు. హీరోయిన్‌గా పనికిరావు. విజయవాడ వెళ్లిపోవడం మంచి’దన్నారు. కానీ పట్టుదలతో ప్రయత్నించాను, జెమినీ, మోడరన్ థియేటర్ వంటి వారు తీసిన సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
దేవదాసు గాయం…
డిఎల్ నారాయణ గారు ‘దేవదాసు’లో నన్ను కధానాయకిగా ఎంపిక చేశారు. నాకు కావలసిన డ్రస్సులు కూడా కుట్టించారు. ‘ఓ దేవదా.. చదువు ఇదేనా’ పాట రిహార్సల్ కూడా జరిగింది. రేపు షూటింగ్ అనగా ‘నిన్ను సినిమా నుంచీ తొలగిస్తున్నాం’ అంటూ ఒక లేఖ పంపారు. చాలా బాధ అనిపించింది. పది రోజులు తేరుకోలేకపోయాను. నా జీవితంలో బాగా బాధపడిన సంఘటన అదొక్కటే. మా నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ వల్ల నేను త్వరగా తేరుకోగలిగాను. గతంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణగారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దేవదాసులో జానకిని తొలగించి, సావిత్రిని చివరి నిమిషంలో తీసుకున్నారని నాకు తెలియ’దన్నారు. ఆ షో లైవ్‌లో నేనూ నాగేశ్వరరావుతో మాట్లాడాను. నా తొలి సినిమా హీరో ఎన్‌టీఆర్ నన్ను ఎంతో గౌరవించేవారు. వారి స్వంత సంస్థ ఎన్‌ఏటీ చిహ్నం(ఎంబ్లమ్)లో నా బొమ్మనే వాడుకున్నారు.
సినిమా పరిశ్రమకు రాకముందు విజయవాడలో ఉండేవాళ్లం, అపుడు నైజాంలో రజాకార్ల పోరాటం జరిగేది. ఆ వార్తలను రేడియోలో వింటూ ఉండేదాన్ని. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అని వినిపించేది. చివరకు సినిమాల్లోకి వచ్చిన తరువాత జగ్గయ్యగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. 1949 నుంచీ 1973 వరకూ కథానాయకిగా పనిచేశాను. ఆ తరువాత నెమ్మదిగా సినిమాలు తగ్గించుకున్నాను. వయసు పెరగడం, పిల్లలు, బాధ్యతలు, కుటుంబ జీవితం కూడా ముఖ్యమే కదా. సినిమాలు కాకుండా 300కు పైగా నాటకాల్లో నటించాను. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో చేశాను. కె.బాలచందర్ గారికి నేనంటే ఎంతో గౌరవం.
ఆత్మకథలు చదువుతా…
సాహిత్యం అంటే కూడా చాలా అభిమానం. బాగా చదువుతాను. మా నాన్న మాకు చక్కటి ఇంగ్లీషు నేర్పించారు. ఆత్మకథలు ఎక్కువగా చదువుతాను. హాలీవుడ్ జీవిత చరిత్రలు చదువుతాను. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటాను. రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కాకపోతే ఇప్పుడీ వయసులో ప్రత్యక్షంగా పనిచేసే ఆలోచన లేదు. నరేంద్ర మోదీ, సానియా మీర్జాలంటే ఇష్టం.
మరపురాని పురస్కారం…
ఒక సభలో ఆరుద్ర గారు మాట్లాడుతూ ‘షావుకారు జానకి త్యాగరాజకీర్తన వంటిది. తెలుగువారు ఆదరించకున్నా, తమిళులు ఆదరిస్తున్నారు’ అన్నారు. నాకింతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది. బాలచందర్ గారి తమిళ సినిమా ‘కార్యతలైవి’ కొని, తెలుగులో డబ్ చేశాను. కానీ విడుదల కాలేదు. అల్లురామలింగయ్య వాళ్లు కొని, రీళ్లు పోగొట్టారు. ఆ సినిమా ఎంతో ఇష్టంగా చేశాను. అది వెలుగు చూసి ఉంటే తెలుగులో ఎంతో పేరు వచ్చేది. నటిగా కాకుండా చేసిన ఒకే ప్రయత్నం అది.
ఇప్పుడూ బాగా చేస్తున్నారు…
నూతన నటీనటులు బాగా చేస్తున్నారు. వాళ్లకి జాగ్రత్త ఎక్కువ, డబ్బు విలువ తెలుసు. ప్రస్తుతం కృష్ణకుమారితో బెంగళూరులో ఉంటున్నా. ప్రశాంత జీవనం, మంచి కుటుంబం, తోట పని, చదువుకోవడంతో కాలక్షేపం చేస్తున్నాను. ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అభిమానం చూపారు. అవన్నీ మధురానుభూతులే. కానీ ‘సీతామయ్య గారి మనవరాలు’ వంటి సినిమాల్లో నన్ను కాకుండా ఇతర భాష నటితో ఎందుకు చేయించారో అర్థం కాలేదు. దేవుడ్ని నమ్ముతాను. అవార్డులు, పురస్కారాలు రావలసినవి రాలేదని అభిమానులు చెప్పినా వాటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దేనికీ అశాంతి లేదు. పాకులాడేది లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించాను. జాతీయ, ప్రాంతీ య సినిమా అవార్డుల జ్యూరీగా పనిచేశాను. సినిమా వృత్తి అని తెలుసు, అందుకే ఎటువంటి ఫిర్యాదులూ లేవు.’’
కృష్ణకుమారి…
కృష్ణకుమారి నా చెల్లెలు. మా నాన్నగారు పోవడంతో తనూ సినిమాల్లోకి వచ్చింది. తన సొంత నిర్ణయమది. సినిమా నటిగా కృష్ణకుమారి సాధించిన విజయమంతా ఆమెకే చెందుతుంది. అప్పట్లో మేం కలిసింది కూడా చాలా తక్కువ. అంతరాలు ఉండేవి. సినిమాల నుంచీ మానేసిన తరువాత మేం బాగా దగ్గరయ్యాం. తను సినిమాల్లో సంపాదించిందంతా మా కుటుంబానికే ఖర్చు చేసింది. ఎంతో సాయం చేసింది. నేను సాంఘికాలకే పరిమితమైతే, తను జానపదాలు, చారిత్రకాలు అన్నీ చేసింది. నాకంటే బాగుంటుంది కదా. అలాగే నా కో-స్టార్స్‌తో కూడా నాకు పోటీ లేదు. నా పరిమితి నాకు తెలుసు. భానుమతి నన్ను ఎంతో బాగా ఆదరించేది. సూర్యకాంతంగారు కూడా బాగా చూసుకునేవారు.
మన్నవ గంగాధర ప్రసాద్, ఆంధ్రజ్యోతి, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్
|
వీక్షకులు
- 993,478 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023
- రీ సువర్చాలంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నాడు నటుడు మిస్రో దంపతులకు ఆలయ సాంప్రదాయ ప్రకారం సత్కారం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.4వభాగం.19.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.22వ భాగం.19.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 3వ భాగం.18.3.23.
- శోభక్రుత్ ఉగాది 2023 ఆహ్వానం సరసభారతి వుయ్యూరు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,950)
- సమీక్ష (1,305)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (375)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (843)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు