గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64
99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి
1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో డిగ్రీ పొంది ఆ నాటి ఆగ్రా యూనివర్సిటి నేటి అంబేద్కర్ యూని వర్సిటిలో నుండి సంస్కృత ఏం .ఏ. సాధించాడు .జీవిత కాలం బికనీర్ లో గడిపాడు .1962లో భారత రాష్ట్ర పతి నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు నందు కోన్నాడు .
బికనీర్ లోని దుంగార్ కాలేజిలో సంస్కృత అధ్యాపకుడుగా 1928లో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు .హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పదోన్నతి పొంది1956లో పదవీ విరమణ చేశాడు .తరువాత ఆలిఘర్ లో ఉన్న హీరాలాల్ బరాశాని కాలేజి లో సంసృత శాఖాధ్యక్షునిగా సేవలందించాడు .1958లో సంస్కృత ,రాజస్థానీ , హిందీ విద్యా వ్యాప్తికోసం ‘’హిందీ విశ్వ భారతి ‘’సంస్థను స్థాపింఛి జీవితాంతం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .
బికనీర్ సంస్థానం లో’’ రాజ గురు ‘’ .హోదా లో ఉంటూ ఎందరో విద్యార్ధులను ప్రభావితం చేశాడు .ఆయన ప్రముఖ శిష్యులలో నరోత్తమ దాస్ ,బ్రహ్మానంద శర్మ ,కాశీరాం శర్మ ,కృష్ణ మెహతా ,రేవత్ సరస్వతి వంటి దిగ్గజాలున్నారు .
విద్యాధరీయం
తాత గారు హరనాం దత్ శాస్త్రి గారి జీవిత చరిత్రను సంసృతం లో ‘’హర నామామృతం ‘’అనే మహా కావ్యాన్ని విద్యాధర శాస్త్రి రచించాడు .ప్రపంచాన్ని అభివృద్ధి చేయటమే ఈ కావ్య పరమావధి గా రాశాడు .రెండవ మహాకావ్యం ‘’విశ్వ మానవీయం ‘’ఇందులో ఆధునిక శాస్త్ర సాంకేతికాభిద్ధిని అభివర్ణిస్తూ మానవుడు చంద్ర మండలం పై కాలు మోపే మహత్తర సంఘటను కూడా చేర్చటం ఆయన మానవీయ ,నవీన భావ అవగాహనకు నిదర్శన .చంద్ర గుప్త విక్రమాదిత్యుని కాలం లో సాంస్కృతిక వ్యాప్తిని వివరించే ‘’విక్రమాభి నందనం ‘’రాశాడు .ఇందులో శంకరాచార్య ,రాణీ పద్మావతి ,రాణా ప్రతాప్ ,గురు గోవింద సింగ్ ,శివాజీ వంటి త్యాగ ధనులజీవితాలను తెలియ జేశాడు .’విక్రమాభ్యుదయం ‘’అనే చంపూ కావ్యమూ రాశాడు .’వైచిత్ర్య లహరి ‘’లో అడ్డూ ఆపూ లేని స్వేచ్చా జీవితాన్ని హాస్య స్పోరకం గా చిత్రించి మార్గ దర్శనం చేశాడు .అలాగే ‘’మత్త లహరి ‘’లో ఒక మత్తు మందు భాయీ సమాజం లోని అందర్నీ సంఘ కట్టు బాట్లు చేదించుకొని తనతో కలిసి మందు కొట్టమని ఆహ్వానించే విషయాన్ని సరదాగా రాశాడు సంస్కృతం లో. మత్తుడి స్నేహితుడి మనోభావాలను’’ఆనంద మందాకినీ ‘’లో రాశాడు .’’హిమాద్రి మహాత్మ్యం ‘’ను1962లో పండిత మధన మోహన మాలవ్యా శత జయంతి సందర్భం గాను ,భారత చైనా యుద్ధ సమయం లో రాశాడు .ఈ కావ్యం లో మాలవ్యాజీ దేశ ప్రజలను హిమాలయాలను రక్షించాలి ,పర్యావరణం కాపాడాలని చేసే సందేశం ఉంది .మహా కవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకంపై వ్యాఖ్యా నం గా ‘’శాకుంతల విజ్ఞానం ‘’రాశాడు .దీనీలో ప్రేమ సౌందర్యాన్ని ఆరాధనీయత ను వివరించాడు .
1915లో విద్యాధరుడు రాసిన ‘’శివ పుష్పాంజలి ‘’మొదటగా ప్రచురితమైంది .ఇందులో ఒకే ఛందస్సును వాడకుండా వైవిధ్యం గా గజళ్ళు,ఖవ్వాలీలు కూడా చేర్చాడు .దీనితో బాటు ‘’సూర్య స్తవం ‘’కూడా ముద్రించాడు .ఆన్ని వేదాంత విషయాలకు అద్వైతమే భూమిక అని తెలియ జేస్తూ ‘’లీలా లహరి ‘’రాశాడు .’’పూర్ణానందం ‘’అనే సంస్కృత చారిత్రిక నాటకం,’’కాళీ దైన్యం’’ ,’’దుర్బల బలం ‘’అనే నాటకాలూ కూడా శాస్త్రి రాశాడు .ఇందులో భౌతిక సుఖాల కంటే పారమార్ధక జీవన విధానం శ్రేష్టం అనే నీతి బోధ ఉంది . తులసీదాసు శ్రీ కృష్ణునిపై రాసిన గీతాలను ‘’కృష్ణ గీతావళి ‘’పేరిట సంకలం చేసి ప్రచురించాడు
అవార్డులు –రివార్డులు
వారణాసి లోని విశ్వసంస్కృత సాహిత్యపరిషత్ ఆధ్వర్యం లో ఆనాటి రాష్ట్ర పతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చే అభినందన సత్కా రాలు అందు కోన్నారు . 1962 లో రాష్ట్ర పతి శ్రీ సర్వేపల్లి రాదా క్రిష్ణ గారి నుంచి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు పొందారు .రాజస్తాన్ సాహిత్య అకాడేమి ఉదయపూర్ వారి నుంచి ‘’మనిషి ‘’అనే మహా బిరుదు ను పొందారు .భారత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా రాష్ట్ర పతి శ్రీ గిరి గారి నుండి సంస్కృత విద్యా వేత్త సన్మానం పొందారు .ఆఖిల భారత సంస్కృత ప్రచార సభ ‘’కవి సామ్రాట్ ‘’బిరుదుతో సత్కరిం చింది .బికనీర్ భారత విద్యా మందిరం వారు 1980లో ఘనం గా పౌరసన్మానం చేసి గౌరవించారు .వీరికి ‘’హరిత్ రుషి ‘’స్మారక పురస్కారం కూడా లభించింది .
విద్యా ధర శాస్త్రి సర్వ గ్రందాలను ‘’విద్యాధర గ్రంధావళి ‘’పేరున ప్రచురణ పొందాయి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు