నటుడు మహేష్ బాబు ను కలవాలనుకొంటున్న నట గాయక దర్శకుడు ఫరాస్ అక్తర్

మహేష్ ని కలవాలనుకుంటున్నా

నటన, దర్శకత్వం, పాటలు పాడటం- ఇలా బహుముఖ ప్రజ్ఞ ఉన్న బాలీవుడ్‌ నటుల్లో ఫరాన్‌ అక్తర్‌ ఒకరు. ఈయన ఇంకా బాగా గుర్తుకు రావాలంటే ‘రాకాన్‌’, ‘జిందగి నా మిలేగీ దొబారా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ వంటి చిత్రాల గురించి చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సంగీతానికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
నటుడు, గాయకుడు, దర్శకుడు – ఈ మూడింటిలో మీరు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
దర్శకుడిగా పనిచేయడం ఎంత ఇష్టమో నటించడం కూడా అంతే ఇష్టం. ఇష్టం కదాని రెండూ ఒకేసారి చేయలేను. నటిస్తున్నప్పుడు పూర్తిగా దానిపైనే దృష్టిపెడతాను. దర్శకత్వం చేస్తున్నప్పుడు ధ్యాసంతా దానిమీదే. దేనిమీదైతే అమితమైన ఇష్టం, చేయగల సామర్ధ్యం ఉంటుందో ఆ పని చేసేందుకు వెనకాడకూడదు. ఈ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఒకవేళ అది ప్రయోగమే అయినప్పటికీ మీ పని మీరు చేయాలి. అప్పుడే ఆ పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టైం మేనేజ్‌మెంట్‌ అనేది చాలా కీలకం.
గాయకుడు అవ్వాలని ఎప్పుడనిపించింది?
బాల్యం నుండే సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. చాలా ఏళ్లు గిటార్‌ వాయిస్తూ, పాటలు పాడాను. కాని సినిమా ప్రాజెక్టు వల్ల రెగ్యులర్‌గా పాడలేకపోయాను. అయినప్పటికీ ఏడాదిలో నాలుగైదు నెలల సమయాన్ని సమాజానికి సంబంధించిన అంశాల గురించి పాడేందుకు కేటాయిస్తాను. గాయకుడిగా నాకు మొట్టమొదటి స్ఫూర్తి ‘బీటిల్స్‌ బ్యాండ్‌’. ఈ బ్యాండ్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల వల్లే నాకు సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. హిందీలో నా మీద బాగా ప్రభావం చూపింది కిషోర్‌కుమార్‌, ఆర్‌.డి. బర్మన్‌లు. ఆ తరువాత ‘కోల్డ్‌ప్లే, యు2, పర్ల్‌ జామ్‌’ బ్యాండ్‌లంటే ఇష్టం.
అమితాబచ్చన్‌తో పనిచేస్తున్నారు కదా. ఆయనతో మర్చిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?
మొదట్లో ఆయనతో పనిచేయడం ఎలాగా అని చాలా ఆందోళన పడ్డాను. కాని ఒకసారి పనిచేయడం మొదలుపెట్టాక అదెంత సులువో అర్థమైంది. ఆయన సానుకూల వ్యక్తిత్వం కలిగిన మనిషి. సెట్‌లో తన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎంతో తేలికపరుస్తారు. సెట్‌పైకి రాగానే ఆయనతో మాట్లాడితే చాలు మీకు తెలియకుండా కంఫర్టబుల్‌ జోన్‌లోకి వచ్చేస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది అద్భుతమైన అవకాశం. నా సినిమా ఇంకా పూర్తికాలేదు ఇప్పటికీ ఆయనతో షూటింగ్‌ చేస్తూనే ఉన్నాను. ఆయన పనంటే నాకెంతో ఇష్టం. అమితాబ్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం వల్ల ఎక్కువ సమయాన్ని ఆయనతో గడుపుతున్నాను. అది నాకెంతో ఉత్సాహాన్నిస్తోంది.
తెలుగు సినిమా గురించి, ఈ పరిశ్రమ గురించి మీకెంతవరకు తెలుసు? హైదరాబాద్‌ వచ్చారు కదా తెలుగునటుల్ని ఎవరినైనా కలుస్తారా?
నా షెడ్యూల్‌ చాలా టైట్‌గా ఉంది. టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.
‘మర్ద్‌’ క్యాంపెయిన్‌ గురించి…
మర్ద్‌(MARD- Men Against Rape and Discrimination) క్యాంపెయిన్‌ను 2013లో ప్రారంభించాను. ప్రారంభం నుంచే ఈ క్యాంపెయిన్‌ పలు సామాజిక వెబ్‌సైట్లలో చర్చలకు వేదికయ్యింది. షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, అర్జున్‌ రాంపాల్‌, హృతిక్‌రోషన్‌లు దీనికి మద్దతుగా నిలిచారు. ఈ క్యాంపెయిన్‌ ఏర్పాటుచేయడం వెనక బలమైన కారణమే ఉంది. 2012 ఆగస్టులో ముంబయికి చెందిన పల్లవి అనే న్యాయవాది అతి కిరాతకంగా హత్యకి గురైంది. వాచ్‌మెన్‌ లైంగిక అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఆమె నిరాకరించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడా ప్రబుద్ధుడు.
క్యాంపెయిన్‌ను విద్యాసంస్థలకి చేరువ చేయాలనేది నా ఆలోచన. అలాగయితే మహిళల్ని గౌరవించాలనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరేలా చేయొచ్చనేది నా అభిప్రాయం.
ఈ క్యాంపెయిన్‌ నుంచి ఏం కోరుకుంటున్నారు?
నా జీవితాంతం చేయాలనుకున్న పని ఇది. సంగీతం ద్వారా మర్ద్‌కు సాయపడదామనుకుంటున్నాను. అలాగని నేను దాన్ని సెన్సేషనల్‌ చేయాలనుకోవడంలేదు. మర్ద్‌ గురించి తెలుసుకున్న వాళ్లు దాన్లోని ఫిలాసఫీ పట్ల నమ్మకం చూపాలి. అంతేకాని అంతా విన్నాక ఆశ్చర్యంతో ‘అవును’ అనడంతో సరిపెట్టడం కాదు. బాల్యం నుంచే ఆడ, మగ ఇద్దరూ సమానం అనేది అర్థమయ్యేలా చెప్పాలనేదే మా ఉద్దేశం. సమాజంలో నెలకొన్న ఈ అసమానతల వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో క్యాంపెయిన్‌ ద్వారా వివరిస్తాం. ఈ క్యాంపెయిన్‌ నాజీవిత కాలపు కమిట్‌మెంట్‌. ఒక్కరాత్రిలో మార్పు రాకపోయినా నెమ్మదిగా మార్పు రావడం ఖాయమనేది నా నమ్మకం. మేము ‘మ్యాజిక్‌ బస్‌’ అనే ఎన్జీవోతో కలిసి ఆడపిల్లల విద్య కోసం పనిచేస్తున్నాం. చాలా కుటుంబాల్లో సమీపంలో విద్యాలయాలు లేని కారణం వల్ల కాకుండా అమ్మాయిలకు చదువు ఎందుకనే భావనతో వాళ్లని చదివించరు. ఆ ధోరణి పోగొట్టి అమ్మాయిలకు చదువు చెప్పించేందుకు గాను ‘మ్యాజిక్‌ బస్‌’ కోసం నిధులు సేకరిస్తున్నాం.
మీరు ఎదుర్కొన్న వైఫల్యాలు ఎక్కువ సమయాన్ని పనికి కేటాయించేలా చేశాయా?
వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితంలో ఎత్తుపల్లాలనేవి ఒక భాగం. అలాగని వాటి గురించే బాధపడుతూ డిప్రెస్‌ అయిపోయి అక్కడే ఆగిపోరు కదా. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా తరువాత ఏం చేయాలనేది ఆలోచించాలి. అంతేకాని విచారిస్తూ కూర్చోవడం, చిటపటలాడడం, సోమరిగా మారిపోవడం వల్ల ఏం ఒరుగుతుంది. వైఫల్యాల నుంచి పాఠాల్ని నేర్చుకోవాలి. అప్పుడు వైఫల్యాలనే అవకాశాలుగా మలచుకోవచ్చు. అలాచేసినప్పుడు వైఫల్యం అనేది అనుభవపాఠంగా మాత్రమే మిగిలిపోతుంది. ఇక్కడ చెప్పిన వాటిలో చివర్లో చెప్పిన పని చేసేందుకే నేను ఇష్టపడతాను. ఇలా చెప్తున్నానని పుట్టుకతోనే నాకు ఈ సత్యం తెలిసిరాలేదు. జీవితానుభవాలే నేర్పాయి.
హైదరాబాద్‌లో ఇవ్వబోయే ఈ ప్రదర్శన గురించి మీరెలా ఫీలవుతున్నారు? ఈ ‘విండ్‌సాంగ్‌’ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ గురించి వివరించండి…
దీని గురించి నా ఫీలింగ్‌ని ఒక్కమాటలో చెప్పడం కష్టం. కాన్సర్ట్‌ చేస్తున్న సమయంలో ఎక్కువమందిని కలుస్తాం. ఎక్కువమంది ఔత్సాహికులు వస్తారు. వాళ్లని చూస్తే మాకు ఉత్సాహం వస్తుంది. ప్రేక్షకులతో నేరుగా కలవడం వల్ల వాళ్లు మనం చేస్తున్న దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. ప్రదర్శన జరుగుతున్నప్పుడు వాళ్లలో కనిపించే వ్యక్తీకరణ నిజాయితీతో ఉంటుంది. అది చాలా అపురూపమైనది. ప్రదర్శన జరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో అనుసంధానమయ్యేలాంటి అవకాశం సినిమాల్లో నటించినప్పుడు రాదు.
టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.