అంతర్జాలంలో అ‘ద్వితీయం’

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

  • 30/11/2014
  • — పి.ఎస్.ఆర్.

ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం గుర్తుంచుకోవాలి! అయితే, ఇప్పటికిప్పుడు రుచికరమైన మంచి వంటకం చేయడం సాధ్యమా? – సరిత మదిలో సవాలక్ష సందేహాలు *** అర్జెంటుగా యోగా నేర్చుకోవాలి.. పెళ్లికి ముందే ఊబకాయం తగ్గించుకుని నాజూగ్గా మారాలి.. కానీ, పొద్దునే్న లేవాలంటే విపరీతమైన బద్ధకం.. తనకు యోగా నేర్పే గురువెవరు..? – ప్రియాంకకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి *** మనసులో చెలరేగే భావాలకు అక్షర రూపం ఇచ్చేలా కవితలు, కథలు రాయడమంటే ఎంతో ఇష్టం.. సాహిత్యం, భాషపై మమకారం ఉన్న వారితో తన మనోభావాలను పంచుకోవడం ఎలా? – ఇరవై ఏళ్ల యామినికి ఇదో ఇరకాటం *** … ఇలా ఎనె్నన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నవారికి దిశానిర్దేశం చేస్తూ ‘ఆత్మీయ నేస్తం’గా నిలుస్తోంది- ‘అంతర్జాలం’. వారు, వీరు అనే తేడా లేదు… వయోభేదం అసలే లేదు.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వయోవృద్ధులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారూ నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. ‘అక్షరాలు రాని వారు నిరక్షరాస్యులు’- ఇది నిన్నటి మాట. ‘అంతర్జాలం వాడని వారు అన్నింటా వెనుకబడిన వారే’- ఇది ఇప్పటి మాట. దైనందిన జీవితంతో ఇంటర్నెట్ ఇంతలా పెనవేసుకుపోయింది. ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే పరిగణింపబడుతున్న భారత్‌లో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి మన దేశంలో ‘ఆన్‌లైన్’ వినియోగదారుల సంఖ్య 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తాజా నివేదిక చెబుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాను వెనక్కి నెట్టేసి అంతర్జాల వినియోగంలో రెండోస్థానానికి భారత్ చేరుకోబోతోంది. 600 మిలియన్ల వినియోగదారులతో మొదటి స్థానంలో ఉన్న చైనాను రాబోయే కాలంలో మన దేశం అధిగమించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అన్నింటికీ ఆధారమై… ఉదయం లేచింది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయే వరకూ అన్ని వ్యవహారాలకూ అంతర్జాలంపై ఆధారపడక తప్పని రోజులివి. పలు రకాల పన్నులు చెల్లించాలన్నా, పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా, వంట గ్యాస్ బుక్ చేయాలన్నా, పెళ్లి సంబంధాలు చూడాలన్నా, ఇంట్లోనే కూర్చుని ఎక్కడో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినాలన్నా, రైలు, బస్, విమానం టిక్కెట్లు రిజర్వు చేసుకోవాలన్నా, కొత్తరకం వంటలు నేర్చుకోవాలన్నా, ఆన్‌లైన్ షాపింగ్‌కు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా … ఇలా ఒకటేమిటి? అన్ని రకాల అవసరాలకూ అంతర్జాలాన్ని ఆశ్రయించాల్సిందే. ఇంటర్నెట్ సేవలు ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు అంచనాలకు మించి విస్తరిస్తుండగా మరోవైపు సెల్‌ఫోన్ల వినియోగం తప్పనిసరైంది. అంతర్జాలానికి అనుసంధానంగా ‘సెల్‌ఫోన్ ఆధారిత టెక్నాలజీ’ అన్ని వర్గాల వారిలో అనూహ్య మార్పులు తెస్తోంది. వ్యక్తిగతానికే కాదు, సామాజిక ప్రయోజనాలకూ వెబ్‌సైట్లు దోహద పడుతున్నాయి. మహారాష్టల్రో ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్‌ఐవి వ్యాధి ప్రభావంపై గ్రామీణులకు అర్థమయ్యేలా మొబైల్ ద్వారా సైన్స్ పాఠాలు బోధిస్తోంది. పాఠశాలల్లో పిల్లల హాజరీపై ఏరోజుకారోజు తల్లిదండ్రులకు ఒడిశా ప్రభుత్వం సందేశాలు పంపుతోంది. గుజరాత్‌లో ‘ఇ-మమతా హెల్త్’ పేరుతో గర్భిణులకు ఆరోగ్య సూత్రాలను మెసేజీల ద్వారా అందజేస్తున్నారు. అవినీతిని, అరాచకాలను ఎదిరించే వారికి నేడు సామాజిక వెబ్‌సైట్లు పదునైన ఆయుధాలు. వీడియో టేపుల్ని యూట్యూబ్‌లోకి ఎక్కిస్తూ అక్రమార్కుల బండారం బయటపెట్టేందుకూ అంతర్జాలం దోహద పడుతోంది. ఇంటర్నెట్ జీవితాల్ని మార్చేస్తోంది. రాజకీయాలను శాసిస్తోంది. స్వచ్ఛంద సేవకు ఆసరా ఇస్తోంది. ‘లోకల్ టాలెంట్’ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతోంది. అభివృద్ధికి బాటలు వేస్తోంది. విజ్ఞాన కాంతులను వెదజల్లుతోంది. నేర పరిశోధనకు అండగా నిలుస్తోంది. ఇలా ‘అంతర్జాల సాధికారత’ సమాజంపై అపార ప్రభావం చూపుతోంది. ‘ఎక్కడ అంతర్జాలం ఉండునో అక్కడ ప్రగతి వెలుగులు ప్రసరించును..’- ఇది సరికొత్త ఆర్థిక మంత్రం అంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి విషయాల్లో మన దేశం ఇంకా వెనుకబడే ఉన్నా- ఇంటర్నెట్ వినియోగం, సెల్‌ఫోన్ కనెక్షన్ల విషయంలో మాత్రం శరవేగంగా దూసుకుపోతోంది. ఇంట్లో టాయిలెట్ లేకున్నా చేతిలో సెల్‌ఫోన్ తప్పనిసరైంది. మొట్టమొదట- సమాచారం తెలుసుకోవడం, దాన్ని ఇతరులతో పంచుకోవడంతో ప్రారంభమైన అంతర్జాల వినియోగం ఇపుడు ‘జీవితమంత విశాలం’గా విస్తరించింది. అది ఎంతలా మారిందంటే కంప్యూటర్‌కు, స్మార్ట్ఫోన్‌కు జీవితాన్ని అర్పించుకునే పరిస్థితి వచ్చేసింది. ఉదయం నిద్ర లేచాక యోగా పాఠాలు, ఆధ్యాత్మిక విషయాలకు వెబ్‌సైట్ చూడాల్సిందే. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఈ-మెయిల్స్ చూసుకోవడం, ట్విటర్‌లో ట్వీట్లు చదవడం, ఫేస్‌బుక్‌లో మిత్రులను కలుసుకోవడం, ఆఫీసులో ఉన్నా లంచ్ టైమ్‌లో సరికొత్త మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) కోసం అనే్వషించడం, ఇంటికొచ్చాక భార్యతో ముచ్చటిస్తూ ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, నిద్రపోయే ముందు వెబ్‌సైట్ల నుంచి పాత పాటలు, కమ్మటి సంగీతం డౌన్‌లోడ్ చేసుకుని వినడం… ఇలా రోజంతా నీడలా- మన వెంటే ఇంటర్నెట్ అనివార్యమైంది. రాజకీయాలకు వేదికై… భారీ బహిరంగ సభలు, పెద్ద పెద్ద హోర్డింగులు, టీవీల్లో ప్రకటనల వల్ల అధిక వ్యయప్రయాసలు తప్ప అందరినీ ప్రభావితం చేయలేమన్న నిజాన్ని గ్రహించి ఇపుడు రాజకీయ పార్టీలు ఓటర్లను అంతర్జాల వేదికపై ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంతోమంది నేతలు ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఖాతాలు తెరిచి తమ మనోభావాలను ఎప్పటికప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో బహిర్గతం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను వలలో వేసుకునేందుకు- నేరుగా వారికే మెసేజీలు పంపుతూ రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు, నేతల వ్యవహార శైలిపై ఓటర్లు కూడా సామాజిక వెబ్‌సైట్లలో చురుగ్గా స్పందిస్తున్నారు. వాగ్దాన భంగానికి పాల్పడే నేతలను వెబ్‌సైట్లలో పదునైన మాటలతో ఎండగడుతున్నారు. జాతీయ పార్టీలే కాదు, పలు ప్రాంతీయ పార్టీలు కూడా సొంతంగా వెబ్‌సైట్లను నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు తాపత్రయ పడుతున్నాయి. బహిరంగ సభలకు వెళ్లేందుకు, టీవీల్లో ప్రకటనలు చూసేందుకు తీరిక లేని ఓటర్లు కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లకు, ఈ-మెయిల్స్‌కు స్పందిస్తారన్న విషయం గ్రహించి నేతలు సామాజిక మీడియా వైపే మొగ్గు చూపుతున్నారు. ట్విటర్‌లో నేతల కబుర్లు, బ్లాగుల్లో వారి సందేశాలు ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సామాజిక మీడియాను ప్రధాన వేదికగా చేసుకోవడం తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు రాబోయే కాలంలో ‘ఆన్‌లైన్ ఓటింగ్’ కార్యరూపం దాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక- ఉపాధ్యాయులు, విద్యార్థులూ కలిసి టెక్నాలజీ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునే దిశగా ఆధునిక పాఠశాలలు అడుగులు వేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి రావడంతో డిజిటల్ క్లాస్ రూములు, ఆడియో వీడియో సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మొబైల్ లెర్నింగ్ (ఎం-లెర్నింగ్) విధానం విశ్వవ్యాప్తం కాబోతోంది. అధ్యాపకుల్లో బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. అమెరికాపై ఆధిక్యత… మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 213 మిలియన్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 32 శాతం వృద్ధితో- 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిపుణులు తమ తాజా నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 354 మిలియన్లు దాటుతుందని వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇపుడు మూడో స్థానంలో ఉంది. 600 మిలియన్ల వినియోగదారులతో చైనా ప్రథమ స్థానంలో, 279 మిలియన్ వినియోగదారులతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది అంతానికి ‘పెద్దన్న’ అమెరికాను వెనక్కి నెట్టేసి రెండో స్థానాన్ని భారత్ కైవసం చేసుకోబోతోంది. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పది మిలియన్ల నుంచి వంద మిలియన్లకు చేరుకోవడానికి దశాబ్ద కాలం పట్టింది. కేవలం గత మూడేళ్లలో ఈ సంఖ్య వంద మిలియన్ల నుంచి 200 మిలియన్లకు చేరుకుంది. అయితే, 200 మిలియన్ల నుంచి 300 మిలియన్లకు చేరుకోవడానికి ఒక్క ఏడాది వ్యవధి చాలని నిపుణులు విశే్లషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 278 మిలియన్ల మంది నెట్ వినియోగదారులుండగా, పట్టణ ప్రాంతాల్లో 177 మిలియన్ల మంది (ఏడాది కాలంలో 29 శాతం వృద్ధి) వినియోగదారులున్నారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ సంఖ్య వచ్చే నెలాఖరుకు 190 మిలయన్లకు, 2015 జూన్ నాటికి 216 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగం 39 శాతం మేరకు పెరిగింది. గత నెలాఖరుకు పల్లెల్లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 101 మిలియన్లు కాగా, ఈ ఏడాది చివరినాటికి 112 మిలియన్లకు, వచ్చే జూన్ నాటికి 138 మిలియన్లకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా 278 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతుండగా, వారిలో ప్రస్తుతం 159 మిలియన్ల మంది నెట్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది అంతానికి సెల్‌ఫోన్లలో నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 173 మిలియన్లకు, 2014 జూన్‌కు 185 మిలియన్లకు చేరుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో 119 మిలియన్ల మంది, గ్రామాల్లో 40 మిలియన్ల మంది ఇపుడు సెల్‌లో వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారు. వచ్చే నెలాఖరుకు పట్టణాల్లో 128 మిలియన్లు, పల్లెల్లో 45 మిలియన్ల మేరకు మొబైల్‌లో నెట్ వినియోగదారుల సంఖ్య పెరగనుంది. శాశ్వతంగా నెట్ కనెక్షన్ తీసుకోకుండా ఏరోజుకారోజు డబ్బు చెల్లిస్తూ అంతర్జాలాన్ని వీక్షించే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం మంది సమాచార సేకరణకు, సామాజిక వెబ్‌సైట్లను చూసేందుకు,ఈ-మెయిల్స్‌కు, శోధన (సెర్చి)కు నెట్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వినోదం కోసమే (87 శాతం) అంతర్జాల వేదికను ఆశ్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని నిపుణులు గణాంకాలను వల్లెవేస్తున్నారు. నెట్ వినియోగదారుల్లో 90 శాతం మంది సమాచార సేకరణ కోసం మొగ్గు చూపుతున్నారు. ఈ-మెయిల్స్ కోసం 78 శాతం మంది నెట్‌ను వాడుతున్నారు. 75 శాతం మంది సామాజిక వెబ్‌సైట్ల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. 69 శాతం మంది వినోదం కోసం నెట్‌ను ఎంచుకుంటున్నారు. వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్, సంగీతం, పాటలు, ఆన్‌లైన్ షాపింగ్, సరికొత్త ఆప్స్ కోసం నెట్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక నైపుణ్యంతో మనం అంబరవీధిన దూసుకుపోతామా? విలువల్ని మరచి పాతాళానికి దిగజారుతామా? అన్నది మన చేతుల్లోనే ఉంది. మంచి, చెడులతో సాంకేతికతకు సంబంధం లేదు. అదంతా మనిషి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సాంకేతిక సామర్థ్యం వినాశనానికా? వికాసానికా? అన్నది తేల్చుకోవాల్సింది మనమే. అంతర్జాలం కూడా ఓ అణుబాంబు లాంటిదే! దాన్ని మానవ కళ్యాణానికి, సమాజ హితానికి వాడుకోవడం అందరి కర్తవ్యం. * ఆన్‌లైన్ షాపింగ్ అదరహో! ఇంటి నుంచి కాలు కదపకుండానే అవసరమైన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో దేశంలో ఇ-కామర్స్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 18,600 కోట్లు దాటిందని విశే్లషకుల అంచనా. మరో రెండేళ్లలో అంటే 2016 నాటికి భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల (93వేల కోట్ల రూపాయలు)కు చేరుకుంటుందని ‘సెర్చింజన్’ దిగ్గజం గూగుల్ తాజా నివేదికలో పేర్కొంది. 2012లో మన దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేవారి సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3.5 కోట్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఫర్నిచర్… ఇలా అన్ని రకాల వస్తువులను ఇళ్లలో కూర్చునే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం ఇపుడు ఫ్యాషన్‌గా మారింది. 2016 నాటికి ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా, రాబోయే 12 నెలల కాలంలో తాము అన్ని రకాల కొనుగోళ్లను ఆన్‌లైన్ ద్వారానే చేస్తామని 71 శాతం మంది స్పష్టం చేశారు. ఇంటర్నెట్ వినియోగం విస్తరించడం, ఆన్‌లైన్ షాపింగ్ పట్ల విశ్వసనీయతతో తమ వ్యాపారం రాబోయే కాలంలో అనూహ్యంగా పెరగడం ఖాయమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్డ్, ఆమెజాన్, స్నాప్‌డీల్ వంటి సంస్థలే కాకుండా దేశంలో ప్రముఖ ఉత్పత్తిదారులు సైతం సొంతంగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకుని ఈ-కామర్స్ రంగంలో అడుగుపెట్టేందుకు సుముఖత చూపుతున్నారు. 2016 నాటికి నమోదు కానున్న 10 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్లలో 4 కోట్ల మంది మహిళలు ఉంటారని గూగుల్ అంచనా వేసింది. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. సౌందర్య సాధనాలు, గృహాలంకరణ, పిల్లల వస్తువులు, ఆభరణాలు వంటివి మహిళలు విరివిగా కొంటున్నారు. డిస్కౌంట్లు, ఇతర రాయితీలు, ఉచిత పథకాలు, ఇళ్ల వద్దకే సరకులను చేర్చడం వంటి కారణాలతో ఎంతోమంది ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య అధికమైంది. ప్రతి ముగ్గురు ఆన్‌లైన్ షాపర్లలో కనీసం ఒకరు మొబైల్ ద్వారా కొనుగోళ్లకు ఆర్డర్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమకు అవసరమైన వస్తువుల కోసం గూగుల్‌లో ‘సెర్చి’ చేస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నా ఈ పద్ధతిలో ఇపుడు కొన్ని అసౌకర్యాలు లేకపోలేదని 62 శాతం మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోరుకోని వస్తువులు లేదా నాణ్యతపరంగా లోపాలున్న వాటిని వెనక్కి పంపడం (రిటర్న్) సంక్లిష్టంగా, ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉందని వారు అంటున్నారు. కాగా, షాపింగ్ మాల్స్‌లో కొనుగోళ్లు చేసేవారిలో 55 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువుల నాణ్యత, ఆర్థిక లావాదేవీల్లో భద్రత వంటి విషయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాణానికి రెండో వైపు.. సాంకేతిక పరిజ్ఞానం సర్వత్రా విస్తరించి, ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో కొన్ని విపరిణామాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. బూతు వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల వైపు ఎంతోమంది యువకులు మొగ్గు చూపుతున్నారు. మహిళలను వేధిస్తూ వారిని లొంగదీసుకునేందుకు కొందరు యువకులు ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లను దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు, అశ్లీల ఫొటోలను వెబ్‌సైట్లలో ఉంచడం ద్వారా కొందరు యువకులు వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కంప్యూటర్లలో, సెల్‌ఫోన్లలో వెబ్‌సైట్లను వినియోగించే వారి సంఖ్య ఎంతగా పెరుగుతోందో.. అంతే వేగంతో పెడ పోకడలు విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ‘పోర్న్’ (అశ్లీల) చిత్రాలు చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సైట్లను చూడడం కొంతమంది యువతకు వ్యసనంగా మారుతోంది. ఫలితంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌కు సంబంధించి- అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారిలో హింసా ప్రవృత్తి అధికమవుతోందని లండన్‌కు చెందిన ‘రెస్క్యూ’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. అశ్లీల చిత్రాలను చూడడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ సంస్థ విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలో పలు నగరాల్లో ఆ సంస్థ విద్యార్థులను సర్వే చేయగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 21 శాతం మంది విద్యార్థులు అశ్లీల చిత్రాలు, సామూహిక అత్యాచారాల సంఘటనలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. తొమ్మిదేళ్ల వయసు నుంచే కొందరు బూతు వెబ్‌సైట్లు చూస్తున్నారు. కొందరు యువకులైతే వారానికి కనీసం నాలుగు గంటల చొప్పున అశ్లీల దృశ్యాలను చూస్తూ.. నిజజీవితంలోనూ తాము అలాగే చేయాలని ఆరాటపడుతున్నారు. బూతు చిత్రాల ప్రభావంతో కొందరు ఇష్టారాజ్యంగా లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. హింసాత్మక అత్యాచారాలు, పిల్లలపై అకృత్యాలు చూసేందుకు మొగ్గు చూపే యువత సంఖ్య అధికంగానే ఉంటోంది. ఈ వెబ్‌సైట్లను చూసే వారిలో కనీసం 10 శాతం మంది లైంగిక నేరాలు పాల్పడుతున్నారు. అశ్లీల వెబ్‌సైట్లు చూసే విద్యార్థుల్లో 53 శాతం మంది చిన్నపిల్లలకు సంబంధించి లైంగిక చర్యలను చూసేందుకు బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ కేఫ్‌లపై ఎలాంటి నిఘా లేకపోవడంతో- వాటిలో బూతు సైట్లు చూసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఐటి చట్టం ప్రకారం అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ట్విట్టర్.. లీడర్.. బిజెపి ప్రచార రథసారథిగా ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో ఆసేతుహిమాచలం ప్రభంజనం సృష్టించి, దేశ ప్రధానిగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నరేంద్ర మోదీ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ట్విటర్’లో అక్షరాలా ఎనిమిది మిలియన్ల మంది అనుచరుల (్ఫలోవర్స్)తో మోదీ ప్రపంచంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ట్విటర్‌లో 43 మిలియన్ల మంది అనుచరులతో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రథమ స్థానంలోను, క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ 14 మిలియన్ల మంది అనుచరులతో ద్వితీయ స్థానంలోను ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే మోదీ సామాజిక మీడియాను ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రచార వేదికగా మలచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథిగా బాధ్యతలు చేపట్టాక ఎన్నికల సమయంలో ఆయన ట్విటర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో ముందుకు దూసుకుపోయారు. ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించి, ఈ ఏడాది మే నెలలో మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ‘ట్విటర్’లో ఆయన అనుచరుల సంఖ్య రెట్టింపయ్యింది. ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఎప్పటికప్పుడు జనంతో పంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. ప్రధాని పదవి చేపట్టిన సమయంలో ట్విటర్‌లో ఆయన అనుచరుల సంఖ్య నాలుగు మిలియన్లు మాత్రమే. ఆరు నెలల వ్యవధిలోనే ఆ సంఖ్య రెండింతలైంది. ఎన్నికల్లో మోదీ గెలిచినపుడు ఆయనను అభినందిస్తూ 70,586 ‘ట్వీట్లు’ నమోదయ్యాయి. భారత్‌కు సంబంధించి ఇదే ఇప్పటికీ ఓ రికార్డుగా నిలిచిపోయింది. కాగా, విదేశీ పర్యటనలో ఉండగా ‘ట్విటర్ మిర్రర్’ను వాడిన తొలి ప్రధానిగా ఆయన ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డును దక్కించుకున్నారు. ‘ట్విటర్ మిర్రర్’ అనే ప్రక్రియ ద్వారా బహిరంగ సభలో మాట్లాడుతున్న వ్యక్తి తన వెనుక దృశ్యాలను సైతం తల తిప్పకుండా చూసుకునే వీలుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని టోనీ అబ్బోట్‌తో ఓ సభలో పాల్గొన్నపుడు, క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీ విద్యార్థులను కలుసుకున్నపుడు ‘ట్విటర్ మిర్రర్’ను తాను వాడినట్లు మోదీ తన ‘ట్వీట్ల’లో పేర్కొన్నారు. ***

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.