కొత్త మురిపెం’ ముగిసింది!

కొత్త మురిపెం’ ముగిసింది!

రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు ఉభయులూ తమదైన శైలిలో తెలుగు ప్రజలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ వచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినందున అటు కేసీఆర్‌కు, ఇటు చంద్రబాబుకు ప్రత్యేక సౌలభ్యం లభించింది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించినందున, అదే సెంటిమెంట్‌ను వినియోగించి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యర్థులను, విమర్శకులను ఆత్మరక్షణలోకి నెడుతూ వచ్చారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే భూతల స్వర్గం దిగివస్తుందని నమ్మిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆచరణలో ఏమవుతాయో తెలియని అద్భుత పథకాలను కేసీఆర్‌ ప్రకటిస్తూ వచ్చారు. గ్రాఫిక్స్‌ మాయాజాలం ద్వారా హైదరాబాద్‌ ఎలా ఉండబోతోందో ఆవిష్కరించారు. ఈ అద్భుతాల మధ్య రైతుల ఆత్మహత్యలు, ఆసరా లభించని ఫించన్‌దారుల మరణాలు మరుగునపడిపోయాయి. ఇక ఏపీ విషయానికి వస్తే రాజధాని కూడా లేకపోవడం, లోటు బడ్జెట్‌తో రాష్ర్టాన్ని విభజించడాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రజల నుంచి ఒత్తిడి రాకుండా తప్పించుకుంటున్నారు. అదే సమయంలో రాజధాని నిర్మాణంతో పాటు, ఇతర జిల్లాలలో తాను చేయబోతున్న అభివృద్ధిని చెప్పుకొంటూ, ప్రజలు కూడా కలలు కనేలా చేసుకుంటూ వచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ట్రాక్‌ రికార్డును చూసిన ప్రజలు కూడా చంద్రబాబు చెబుతున్న విషయాలను నమ్ముతూ వచ్చారు. మధ్యలో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాను వల్ల నష్టపోయిన విశాఖ వాసులను ఆదుకోవడానికి అహర్నిశలు శ్రమించడం ద్వారా ప్రజల మన్ననలు కూడా చూరగొన్నారు.
 గ్రామీణంలో ఆగ్రహం
హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినందున ఇప్పుడు ముఖ్యమంత్రుల పనితీరుపై విమర్శకులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ప్రభుత్వాల పనితీరుపై ఉభయ రాష్ర్టాల ప్రజలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలలో సామీప్యంకనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న విద్యావంతులు, ఉద్యోగులు స్వరాష్ట్రం సిద్ధించింది అన్న భావనలో మునిగితేలుతూ ప్రభుత్వ లోటుపాట్లను పట్టించుకోవడం లేదు. కేసీఆర్‌ ప్రకటిస్తున్న పథకాలను చూసి ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందబోతుందా అంటూ కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రజల మనోభావాలు మరో రకంగా ఉంటున్నాయి. నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించిన తమను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని గ్రామీణ రైతాంగంతో పాటు పేదలు కూడా వ్యక్తంచేస్తున్నారు. కరెంట్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వంపై రైతాంగం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కష్టాలలో ఉన్న రాష్ర్టాన్ని నిలబెట్టడానికి, అభివృద్ధి చేయడానికి చంద్రబాబు తపిస్తున్నారనీ, తెగ కష్టపడిపోతున్నారనీ అంటూ విద్యావంతులు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలవుతున్నా రుణమాఫీని ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ అధికారపక్ష ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రుల ప్రకటనలను మభ్యపెట్టే మాటలుగా గ్రామీణ ప్రజానీకం అభిప్రాయపడుతోంది. దీంతో ఉభయ రాష్ర్టాల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ పూర్తిగా కరిగిపోతోంది. కేసీఆర్‌, చంద్రబాబు ఇరువురు కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన తరుణం ఆసన్నమైంది. మాటల నుంచి చేతల్లోకి దిగాల్సిన సమయం వచ్చింది. హైదరాబాద్‌లో కూర్చుని అంతా సవ్యంగా ఉందనుకుంటే అది వారిష్టం.
కొందరు మంత్రుల కొద్ది చేష్టలు!

ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు తపనపడుతున్నారు. అందుకు అనుగుణంగా కష్టపడుతున్నారు కూడా! పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి వచ్చారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇదే విధంగా అమెరికాలో పర్యటించారు. ప్రముఖ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది చంద్రబాబు హయాంలోనే! ఐటీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలుగు ప్రజలకు తెలిసివచ్చింది కూడా ఆ కాలంలోనే! ఇవాళ అమెరికా, తదితర దేశాల్లో తెలంగాణ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అప్పుడు పడిన పునాదే కారణం. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను బహుముఖంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. ఇది తనకు లభించిన సదవకాశంగా ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. పనిలో పనిగా ఏపీలో జరిగిన అభివృద్ధి చూపించి 2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన సహచరులు మాత్రం ఆయనకు గుదిబండగా మారుతున్నారు. కొంత మంది మంత్రులు, వారి పుత్రులు కలిసి అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వానికీ, పార్టీకీ చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా ఉండేట్టుగా అధికారుల ద్వారా చంద్రబాబు జరిపించారు. ఈ చర్యపై పార్టీ నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయన మంత్రులు, శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి అన్న తేడా లేకుండా బదిలీల్లో డబ్బు చేతులు మారింది. ఒక జిల్లాలో అయితే ఉపాధ్యాయులు, స్టాఫ్‌ నర్సుల బదిలీలకు కూడా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. రెవెన్యూ డివిజనల్‌ అధికారి బదిలీకి కోటికి పైగా చేతులు మారిన విషయం కలకలం రేపడం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రకటించిన రుణమాఫీని అమలుచేయలేకపోతున్నందున వారిని మరో విధంగా సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ రంగంలో వారికి అనుభవం లేకపోవడంతో డ్వాక్రా మహిళల పేరిట అధికారపక్షానికి చెందిన కొంతమంది ఇసుకను యథేచ్చగా అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అదే సమయంలో వినియోగదారులపై భారం పడుతోంది. పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కంటే అధ్వానంగా మారాయని కొన్ని జిల్లాలలో ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పరిస్థితులు బాగుపడతాయనుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నవారిలో ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల చేతిలో బందీగా మారారు. దీంతో జిల్లాలో అన్ని విషయాల్లో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెచ్చుమీరుతోందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరో మంత్రి విషయానికి వస్తే బదిలీలు సహా ఏ విషయంలోనైనా పని జరగాలంటే ఆయన కుమారుడిని కలిసి సంతృప్తి పరచాలట! మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది. పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల కాబోలు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు రేపు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకొని ఈ ధోరణికి అడ్డుకట్ట వెయ్యని పక్షంలో రాష్ర్టాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, పడుతున్న శ్రమ పూర్వపక్షమవుతాయి. చంద్రబాబునాయుడు స్వతహాగా మొహమాటస్తుడు. తప్పు చేసిన వారిని తీవ్రంగా మందలించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి జావగారిపోతారు. తప్పు చేసిన వారిని పిలిపించుకొని సుద్దులు చెప్పి పంపుతారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులపై పూర్తి పట్టు సాధించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా మంత్రులను తన అదుపాజ్ఞలలో ఉంచుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి తమ మాట వినడం లేదని మంత్రులు వాపోతుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడంలో స్వేచ్ఛ ఇవ్వడం ఎంత ముఖ్యమో, అరాచకంగా ప్రవర్తిస్తున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యుల్ని కట్టడి చెయ్యడం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. ఎన్నికల హామీలలో ప్రధానమైన రుణమాఫీ విషయంలో ప్రజలు అసహనానికి గురవుతున్నందున వారి ఆవేదన ఆగ్రహంగా మారకముందే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అవసరం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. సంఖ్యాపరంగా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ నైతికంగా ఆ పార్టీ బలహీనపడింది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజలకు నమ్మకం క్రమంగా సడలుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ పిల్లాడికి ఓటువేస్తే ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారని పలువురు భావిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా వ్యవహరిస్తున్నాడన్న నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. తన వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సింది పోయి ఫలానా ఫలానా పత్రికలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నందువల్లనే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారని విమర్శిస్తూ తనను తాను మభ్యపెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. చంద్రబాబుకు లేనిదీ తనకు ఉన్నదీ ‘దేవుడి దయ’ అని ఆయన తరచుగా అంటుంటారు. దేవుడి దయే ఉండి ఉంటే జగనే ముఖ్యమంత్రి అయిఉండేవారు కదా. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

 కట్టడి మంత్రం…!

ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ సెంటిమెంట్‌ను కవచంగా మలచుకొని ఆరు నెలలుగా పరిపాలిస్తున్న చంద్రశేఖర్‌ రావు విషయంలో కూడా ఇంతకుముందే పేర్కొన్నట్టు గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రాచుర్యంలోకి రాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తనదైన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను పరిశీలిస్తే మొత్తం సభలో కేసీఆర్‌ ఒక్కరే తెలివైనవారు అన్న విషయం స్పష్టమవుతోంది. మీడియాతో పాటు రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి లేదా అణచివేయడానికి సరికొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రెండు చానళ్లపై నిషేధం విధించడం ద్వారా మీడియాను ఇదివరకే లొంగదీసుకున్న కేసీఆర్‌, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి సారించారు. గతంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవకతవకలపై పత్రికలలో వార్తలు వచ్చేవి. వాటి ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఇరుకున పెట్టేవి. ఇప్పుడు తెలంగాణ శాసనసభలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. నిన్నటివరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ప్రముఖుల గత చరిత్రపై కేసీఆర్‌ తన సొంత పత్రికలో ప్రముఖంగా వార్తలు ప్రచురిస్తున్నారు. దీంతో సదరు నాయకులు ఆత్మరక్షణలో పడిపోగా, ప్రభుత్వం జరుపుదామనుకుంటున్న విచారణలను తామే స్వాగతించే పరిస్థితిని వారికి కల్పిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందున ఆయనను టార్గెట్‌ చేసి వార్తలు ప్రచురించారు. నాగార్జునసాగర్‌ కాలనీలో అక్రమంగా నివసిస్తున్నారంటూ వార్తలు ప్రచురించడం ద్వారా ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిని ఆత్మరక్షణలోకి నెట్టారు. కేసీఆర్‌ వ్యవహార శైలి ఎలా ఉంటున్నది? ఆయన ప్రజాస్వామికవాదా.. కాదా? క్షమాగుణం ఉందా.. లేదా? ప్రభుత్వ నిర్వహణలో కార్యదక్షత ఎంత అన్న విషయాలను పక్కన పెడితే ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో మాత్రం ఆయన చెడుగుడు ఆడుకుంటున్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే శాసనసభలో ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయగలుగుతున్నారు. భూముల వ్యవహారాలకు సంబంధించి కడచిన కొన్ని రోజులలో ప్రభుత్వం కొన్ని విచారణలకు ఆదేశించింది. సభాసంఘాల నియామకం వల్ల అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది పక్కనపెడితే కేసీఆర్‌ మాత్రం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చుకోబోతున్నారు. హౌసింగ్‌ సొసైటీల మీద సభా సంఘాల నియామకం మంచి ఉద్దేశంతోనే జరిగినా, దానివల్ల కొన్ని చానెళ్లు దారిలోకి వచ్చే అనుబంధ ప్రయోజనం కూడా చేకూరనున్నది. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలో జరిగిన అవకతవకలలో కొన్ని చానళ్ల యజమానులకు సంబంధం ఉందన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలను ఆయుధాలుగా, కవచాలుగా మలచుకొని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంతో పాటు, ప్రభుత్వంపై ఎవరూ విమర్శలు చేయకుండా చూసుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. దీంతో మొత్తం తెలంగాణ సమాజంలో భయం ఆవహించింది. ప్రభుత్వాన్ని తప్పుపడితే ఏ ముప్పు ముంచుకువస్తుందోనన్న భయంతో ప్రశ్నించవలసిన వర్గాలు స్తబ్ధుగా ఉంటున్నాయి. ఈ కారణంగానే చైతన్యానికీ, ప్రశ్నించే తత్వానికీ ప్రతీకగా ఉండే తెలంగాణ సమాజంలో స్తబ్ధత ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వాన్ని శభాష్‌ అని మెచ్చుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉంటున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 40 వరకు భారీ టవర్లు నిర్మించాలన్న నిర్ణయం ఇందులో ఒకటి. ఈ టవర్లను నిర్మించి ఏమి చేస్తారు? వాటి అవసరం ఏమిటి? అని ప్రశ్నించే వారు కరువయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు భవనాల్లోని పై అంతస్తులు ఖాళీగా పడి ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానికి తరలి వెళ్తే పలు ప్రభుత్వ భవనాలు కూడా ఖాళీ అవుతాయి. సచివాలయంలో సగం భవనాలు ఖాళీ అవుతాయి. వాటిని ఏమి చేయాలో తెలియకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌ను నిర్మించాలన్న కేసీఆర్‌ ఆలోచనను ఆక్షేపించడానికి కూడా ఎవరూ సాహసించలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలలోని సాధ్యాసాధ్యాలను పరిగణనలోనికి తీసుకోకుండా మీడియా కూడా వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నది. గతంలో ఇలాంటి నిర్ణయాలు వెలువడినప్పుడు వాటిపై సమీక్షలు ఉండేవి. ఇప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే, ఏంటి తెలంగాణలో టవర్లు కట్టుకోకూడదా? మీరు తెలంగాణ ద్రోహులు అంటూ ఒంటికాలి మీద లేస్తున్నారు. దీంతో ఎవరికి వారు మనకెందుకులే అని సర్దుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి గమనించిన ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ, ‘రాజకీయ పార్టీలను, మీడియాను బెదిరించడం ఇంత తేలికా? ఈ సంగతి మాకు తెలిస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసి ఉండేవాళ్లం కదా’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా సమకూరుతున్న బలాన్ని పక్కనబెడితే తెలంగాణ శాసనసభలో కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిన మెజారిటీ అంతంత మాత్రమే. మామూలుగా అయితే అత్తెసరుగా ఉన్న ప్రభుత్వానికి సుస్థిరత సమస్యగా మారేది. తెలంగాణలో ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలే అభద్రతా భావానికి గురవుతున్నాయి. ఇది మంచి పరిణామమా కాదా అన్నది పక్కనబెడితే, ఇట్లాంటి పరిస్థితి కల్పించిన కేసీఆర్‌ను అభినందించకుండా ఎలా ఉంటాం. తెలంగాణ సమాజం విలక్షణమైనది. ప్రతిఘటనతో పాటు అణకువ కూడా ఉంటుంది. అలాంటి సమాజంలో ఫ్యూడల్‌ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డికి సభలో ఎదురవుతున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. తనపై నేరుగా విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుక్కలు చూపిస్తున్నారు. శాసనసభలో రేవంత్‌ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారు.
ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు చేయడమే నేరమన్నట్లుగా తన చర్యల ద్వారా కేసీఆర్‌ ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నారు. ఈ దేశంలోని ఏ శాసనసభలో కూడా ప్రతిపక్ష సభ్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండదు. జార్జి ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు శవపేటికల కుంభకోణంతో ఆయనకు సంబంధం ఉందని నమ్మిన ప్రతిపక్షాలు అప్పట్లో మంత్రిగా ఆయన లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యుడు రేవంత్‌ రెడ్డిని అధికార స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది. ఈ విషయంలో మిగతా ప్రతిపక్షాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి భయాలు వారికి ఉండి ఉంటాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో మరెందరిపై నిర్బంధం కొనసాగుతుందో తెలియదు. రాజకీయ నాయకుడిగా విజయం సాధించడం వేరు, ముఖ్యమంత్రిగా శభాష్‌ అనిపించుకోవడం వేరు. ఆర్భాటపు ప్రకటనలతో ఒక వర్గం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతానికి సఫలీకృతులయ్యారు. ప్రత్యర్థులను అణచివేయడం ద్వారా తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ప్రస్తుతం ఉన్న ఫీల్‌గుడ్‌ ఎప్పటికీ ఉండదు. తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు. తెలివితేటల్లో తనకు తానే సాటి అయిన కేసీఆర్‌కు ఈ విషయం తెలియదా?

ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు… తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.