గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66
102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్
ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ జిల్లా రానోలి లో జన్మించాడు .అయిదుగు పిల్లలో రెండవ వాడు .స్వగ్రామం లో ప్రాధమిక విద్య నేర్చి ,సంస్కృతాన్ని వారణాసి లో వర్నిజి స్థాపించిన ప్రసిద్ధ ‘’స్వాద్ వాద్ ‘’మహా విద్యాలయం లో అభ్యసించాడు .అచార్యశాంతి సాగర్ సాంప్రదాయానికి చెందిన ఆచార్య వీర సాగర్ వద్ద జైన మతావలంబిగా(క్షుల్లక్) దీక్ష పొందాడు .దీక్ష పొందిన తర్వాత ఆయన పేరు ‘’క్షుల్లక్ జ్ఞాన భూషణ్’’ గా మారింది .అక్కడ నాలుగేళ్ళు సాధనలో గడిపి, అదే సంప్రదాయానికి చెంది న ఆచార్య శివ సాగర్ ఆశీస్సులతో జైపూర్ లోని ఖనియాజి ఆశ్రమం లో1959లో జైనముని అయ్యాడు .1968లో పదోన్నతి పొంది రాజస్థాన్ లోని నశీరా బాద్ లో ఆచార్య పదవి అధిస్టిం చాడు. నశీరాబాద్ లోనే 1-6-1973లో నిర్యాణం చెందాడు .
సంస్కృతం లో మహా నిధి అయిన జ్ఞాన సాగర్ అనేక అమూల్య గ్రంధాలు రచించాడు .ఆయన గ్రంధాలపై కనీసం ముప్ఫై మంది విద్యార్ధులు పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీలు సాదించారంటే ఆయన గ్రంధ విస్తృతి యెంత ఉత్తమమైనదో తెలుస్తుంది .మూడు వందల మంది రిసెర్చ్ పేపర్లు ఆయన గ్రంధాలపై రాసి ప్రచురించారు .సంస్కృత భాష మృత భాష అని ,దాని పని అయిపోయిందని ,దాన్ని ఇంకెవరూ చదవరూ దాని జోలికి పోరు అని భావిస్తున్న కాలం లో జ్ఞాన సాగర్ నాలుగు సంస్కృత మహా కావ్యాలు.రాశాడు .ఇవికాక మూడు జైన గ్రంధాలు రాశాడు .వీటిని చదివి మహా మహా సంస్కృత విద్యా వేత్తలు ,పండితులే ఆశ్చర్యం పొంది ముక్కు మీద వేలేసుకొన్నారు .అంతటి ఉత్తమోత్తమ సాహిత్య సృష్టి చేశాడు జ్ఞాన సాగర్ .ఆయన పేరుమీద కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .
103- జగద్గురు శ్రీ రామ భద్రాచార్య
14-1-1950లో గిరిధర్ మిశ్రా గా జన్మించిన రామ భద్రా చార్య బహుభాషా వేత్త ,కవి వేదాంతి ,బహు గ్రంధకర్త ,మహా విమర్శకులు నాటక కర్త ,.గాయకులూ సంగీత దర్శకులు ‘’చిత్రకూట కదా కారులు అన్నిటికి మించి నలుగురు జగద్గురువులలో ఒకరుగా గా సుప్రసిద్ధులు .సర్యుపరీన బ్రాహ్మణ కుటుంబం లో రామ భాద్రాచార్య ఉత్తర ప్రదేశ్ లోని జానాపూర్ జిల్లా శాండీ కుర్ది గ్రామం లో జన్మించారు వీరిది వాశిస్టగోత్రం .తల్లి శచీదేవి. తండ్రి పండిత రాజ దేవ మిశ్రా .ఈయన మేనత్త భక్త మీరా బాయి భక్తురాలు .
రామ భాద్రాచార్య చిత్రకూటం లో సంత్ తులసీదాస్ స్మారకార్ధం’’ తులసీ పీఠం’’స్థాపించారు .దానికి వ్యపస్తాపక అధ్యక్షులుగా పని చేశారు .చిత్రకూటం లోని జగద్గురు రామ భాద్రాచార్య వికలాంగుల విశ్వ విద్యాలయాన్ని స్థాపించి దాని చాన్సలర్ గా జీవితాంతం ఉన్నారు .వికలాంగులు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయటానికి ఏర్పడిన ప్రత్యెక విశ్వ విద్యాలయం ఇది .రామ భాద్రాచార్య చిన్న నాట రెండవ నెలలోనే కంటి చూపు కోల్పోయారు .జీవితాంతం అంధ జీవితమే గడుపుతున్నారు .ఎన్ని వైద్యాలు చేసినా చూపు రాలేదు .ఎవరైనా చదివితే విని అర్ధం చేసుకొని అనంత జ్ఞానాన్ని సంపాదించారు .తానూ చెప్పి ఎవరి చేతనైనా రాయిస్తారు .అలానే అనంత గ్రంధ రచన చేశారు .ఇదొక అద్భుతమైన విషయం కనీ విననట్టిది .పది హేడవ ఏడు వరకు ఏ విద్యనూ నేర్చుకోలేక పోయారు .బ్రెయిలీ లిపిని ఏ సందర్భం లోనూ వాడని విద్యా వేత్త ఆయన .ఆదర్శ గౌరీశంకర్ సంస్కృత విద్యాలయం లో చేరారు .ఏక సందా గ్రాహి అవటం వలన చదివి వినిపించినదంతా ఆకళింపు చేసుకొనే వారు .సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి లో వ్యాకరణం చదివారు .ఆచార్య ,మాస్టర్ డిగ్రీ లు సాధించారు .యూని వర్సిటి గ్రాంట్ కమిషన్ నుంచి స్కాలర్షిప్ పొంది అయిదేళ్ళు చదివి సంస్కృతం లో విద్యా వారిధి డిగ్రీ పొందారు ‘’.ఆధ్యాత్మ రామాయణములో పాణిని ప్రయోగం ‘’అనే అంశం పై పరిశోధన చేసి అందులో అపాణినీయప్రయోగాలపై ప్రత్యెక ద్రుష్టి తో రాశారు .పి .హెచ్. డి .సాధించిన తర్వాత అదే వర్సిటీలో వ్యాకరణ శాఖ అధ్యక్ష పదవి కి ఆహ్వానించినా ,హిందూ మతం సంస్కృత వ్యాప్తి కోసం కృషి చేస్తానని సున్నితం గా తిరస్కరించి తన కోరికను సఫలం చేసుకొన్నారు .
రామ భాద్రాచార్య 22భాషలలో నిష్ణాతులు ,ఆశువుగా కవిత్వం చెప్ప గల నేర్పున్నవారు .సంస్కృత, హిందీ ,అవధి మరాటీ మొదలైన భాషలలో అనేక గ్రంధాలు రచిం చారు .వందకు పైగా గ్రంధాలు యాభైకి పైగా పరిశోధన పత్రాలు రాశారు .ఇందులో నాలుగు సంస్కృత మహా కావ్యాలున్నాయి .తులసీదాసు రామ చరిత మానస్ ,హనుమాన్ చాలీసా ,పాణిని సంస్కృత ‘’అష్టాధ్యాయి ‘’ లపై విపుల మైన వ్యాఖ్యానాలు రచించారు .’’ప్రస్తాన త్రయం ‘’కు సంస్కృతం భాష్యం రాశారు .సంస్కృత వ్యాకరణం న్యాయ ,వేదాంతా లలో మహా పండితునిగా గుర్తింపు పొందారు .భారత దేశం మొత్తం మీద తులసీ దాస్ పై పూర్తీ సాధికారిత ఉన్న శ్రేష్ట విద్వాంస పండితులని గుర్తింపు పొందారు .రామ చరిత మానస్ కు అద్భుత వ్యాఖ్యానం రచించారు .రామాయణ భాగవతాలకు’’ కదా కళా కారుని’’గా ప్రసిద్ధి చెందారు .ఆయన కదా ప్రదర్శనలు భారత దేశం లోని ప్రతి పట్టణం లోను నిర్వహించారు .అవి రేడియో టి వి లద్వారా ప్రసారమై గొప్ప గుర్తింపు లభించింది .విశ్వ హిందూ పరిషద్ అగ్ర నాయకులలో రామభాద్రాచార్య ఒకరు .
రామభాద్రాచార్య జీవితాంతం బ్రహ్మ చారిగా ఉన్నారు .వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి వైరాగ్యం పొంది రామానంద సంప్రదాయం లో విరక్త దీక్ష తీసుకొన్నారు .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు