తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’

Namasthe Telangana Latest News

ఆదివారం
నవంబర్ 30, 2014

ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా

Updated : 11/30/2014 3:30:31 AM
Views : 32
ఆదర్శం
మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే
మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు తెలంగాణ వారు నిర్మాతలుగా 1960లో చివరికి మిగిలేది సినిమా తీశారని
ఇప్పటి దాకా సినిమా చరిత్రకారులు చెబుతూ వచ్చారు. అదంతా నిజమని నమ్ముతూ వచ్చాం. అయితే, హైదరాబాదు స్టేటుగా ఉన్న కాలంలోనే
మద్రాసు వెళ్లి 1952లోనే తెలుగు సినిమా తీసిన తెలంగాణ నిర్మాతల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా వారు తీసిన ఆ సినిమానే ఆదర్శం.

– హెచ్.రమేష్‌బాబు, 94409 25814


ఆదర్శం సినిమాను 1952లోనే తీశారు. దీని నిర్మాతలు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకా కందిబండ, గణపవరం గ్రామాలకు చెందిన దేశ్‌ముఖ్‌లు.

ఈ సినిమా సంగతులు తెలుసుకోవాలంటే 1952కు మరో అయిదేళ్లు వెనక్కు వెళ్ళాలి. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత
అప్పటిదాకా స్వతంత్ర రాజ్యంగా ఉన్న నిజాం స్టేట్‌ని ఇండియాలో విలీనం చేయడానికి ఆయన అంగీకరించని సంగతి తెలిసిందే. దీంతో నిజాం వ్యతిరేక
పోరాటం ఉధృతమైంది. ప్రజలపై అణచివేతకు, దాష్టీకాలకు పాల్పడుతున్న రజాకార్ల దాడులను తప్పించుకునేందుకు ఉద్యమకారులు, ప్రజలు ఇతర
ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ పరిస్థితుల్లో కందిబండ గ్రామ దేశ్‌ముఖ్‌లైన నారపరాజు కుటుంబం జగ్గయ్యపేటకు వెళ్లింది. వీరి వెంబడే గణపవరానికి చెందిన
బంధువులు కూడా అక్కడికి వెళ్లారు.

జగ్గయ్యపేటలో ఉన్నప్పుడే వారికి విజయవాడలో పలు నాటక ప్రదర్శనలు, సినిమాలు చూసే అవకాశం కలిగింది. సినిమా రంగానికి చెందిన వారితో

పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో ఆత్రేయ ఈనాడు నాటకం రాశారు. ఈ ప్రదర్శన విజయవాడలో జరిగింది. ఇందులో ఆయన ఒక ప్రధాన పాత్ర పోషించారు.
హిందూ, ముస్లింల సమైక్యతను ప్రబోధించే ఈ నాటకంలో ఆత్రేయ హిందువు వేషం వేశారు. 1948 జనవరిలో మహాత్మాగాంధీ హత్యానంతరం మారిన దేశ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసిన నాటకం అది.

ఆ నాటకం మన నారపరాజు జానకి రామారావు, తమ్మర వేంకటేశ్వరరావులకు బాగా నచ్చింది. వారికి ఆత్రేయ అభిమాన రచయితయ్యారు. ఆ రోజుల్లోనే

భవిష్యత్తులో వీలైతే ఆత్రేయను రచయితగా తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబర్‌లో పోలీసు యాక్షన్ తరువాత జగ్గయ్యపేటకు
వెళ్లిన మన వాళ్లంతా కోదాడ ప్రాంతాలకు తిరిగి వచ్చి మళ్లీ తమ వ్యవహారాల్లో మునిగిపోయారు. ఆ తరువాత రెండేళ్లకు ఓ రోజు మద్రాసు సినిమా రంగంతో
పరిచయం ఉన్న జగ్గయ్యపేటకు చెందిన గౌరవరం వెంకటరామయ్య నారపరాజు దగ్గరకు వచ్చి మేమంతా వందమందిమి షేర్ హోల్డర్స్‌గా ఏర్పడి సినిమా తీస్తున్నాం.
మీరేమైనా కలుస్తారా? అనడిగారు. ఎందుకో గానీ వందమందితో కలసి ఏం సినిమా తీస్తాం. మేమే సొంతంగా తీస్తాం అని సున్నితంగానే తిరస్కరించారు జానకి
రామారావు. ఆ తరువాత కందిబండ, గణపవరంలో ఉన్న తన బంధువులతో కలసి పదిమంది భాగస్వాములై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది
జరిగింది 1951 జనవరి ప్రాంతంలో. శుభోదయం ఫిలింస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై తమ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటినుండి ఆత్రేయ తమ
అభిమాన రచయిత గనుక ఆయననే సినిమాకు రచయితగా ఏర్పాటు చేసుకున్నారు. కథ, మాటలు, పాటలు ఆయనే రాశారు.

దర్శకుడెవరనే ప్రస్తావన వచ్చినప్పుడు హెచ్.ఎం.రెడ్డి అయితే తారలను, బడ్జెట్‌ను అదుపులో ఉంచి సినిమా తీస్తాడని వెంకట్రామయ్య వెంట వెళ్లి ఆయన్ను

కలిశారు. అప్పుడాయన నేను బిజీగా ఉన్నాను. మీకు మంచి దర్శకుడిని సూచిస్తానని హెచ్.వి. బాబును పరిచయం చేశారు. ఆయననే దర్శకుడిగా
నిర్ణయించారు. ఈ హెచ్.వి.బాబు పూర్తి పేరు హనుమంతప్ప విశ్వనాథ్‌బాబు. ఈయన తొలి తరం సినీ దర్శకులలో ఒకరు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936),
కనక తార (1937), భోజ కాళిదాసు (1940), కృష్ణప్రేమ (1943), ధర్మాంగద (1949) అప్పటిదాక ఆయన తీసిన సినిమాలు. వీటిలో ధర్మాంగద కరీంనగర్‌కు
 చెందిన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్రచారంలో ఉన్న జానపద గాథ. ఈ విషయాలు వేరొక సందర్భంలో ముచ్చటించుకుందాం.

ఆదర్శం సినిమా నటీనటుల సంగతికి వస్తే ప్రధాన పాత్రధారులు అంతా అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వచ్చి స్థిరపడుతున్న వారే. హీరోలు కొంగర జగ్గయ్య,

 రామశర్మలు కాగా, నాయికలుగా షావుకారు జానకి, సావిత్రి నటించారు. ఇతర పాత్రలలో గౌరీనాథశాస్త్రి, వంగర, రామశాస్త్రి, శ్రీవత్స, టి.కృష్ణ, ఇందిరాచారి,
రేవతి, సరస్వతమ్మ తదితరులు నటించారు.

చిత్ర రచయితగా పనిచేసిన ఆత్రేయ ఒక ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ఆయన తెరపై కనిపించిన తొలిచిత్రం కూడా ఇదే. కాగా, ఆ తరువాత

కోడెనాగు, మరో రెండు చిత్రాలలో నటించారాయన.

సాంకేతిక నిపుణులుగా సి.హెచ్.యి. ప్రసాద్ (కళాదర్శకత్వం), అన్నయ్య (ఛాయాగ్రహణం), అశ్వత్థామ (సంగీత దర్శకత్వం), ఎం.వి.రాజన్ (ఎడిటింగ్) తదితరులు

 పనిచేశారు. సినిమా ముగింపుకు వచ్చేసరికి హెచ్.వి.బాబు తప్పుకోవడంతో మిగిలిన దృశ్యాలను ఎం.వి.రాజన్, టి.కృష్ణలు డైరెక్ట్ చేశారు. టైటిల్స్‌తో దర్శక
నిర్మాతలుగా శుభోదయ ఫిలింస్ అని వేశారు.

ఇక నిర్మాతలుగా పదిమంది సంయుక్తంగా శుభోదయ పతాకంపై నిర్మించారని ముందుగానే చెప్పుకున్నాం. వారంతా వరుసగా నారపరాజు జానకి రామారావు,

తమ్మర వేంకటేశ్వరరావు (వీరిరువురూ మేనేజింగ్ డైరెక్టర్లు), కోదాటి వెంకట అప్పారావు, నారపరాజు లక్ష్మీ నరసింహారావు (నాబీరామ), కె.వి.లక్ష్మీనారాయణరావు,
కె.వి.రాజగోపాలరావు, కె.వి.వరదారావు, కె.వి.నరసింహారావు, కె.వి. సీతారామారావు, ఎస్.జె.వి.రామారావులు.

ఈ చిత్రంలో బాలనటుడిగా నిర్మాతల్లో ఒకరైన జానకి రామారావు కొడుకు సుగుణాకర్‌రావు నటించాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కృష్ణహరే శ్రీకృష్ణహరే పాటలో

ఇందిరాచారి వొడిలో కూర్చున్న బాలుడు సుగుణాకరరావే. వైద్య ఆరోగ్యశాఖలో నౌకరీ చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వీరు ఇప్పుడు హైదరాబాదులో
ఉంటున్నారు. అలాగే, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు కూడా నగరంలోనే ఉన్నారు. కాగా, 1974లోనే జానకి రామారావు కాలం చేశారు.

ఆదర్శం ఇతివృత్తం

స్థూలంగా సినిమా కథలోకి వెళితే… భారతదేశ స్వాతంత్య్ర సమయంలో పాకిస్థాన్ విభజన జరిగి మత కలహాలు రేగినపుడు పంజాబ్‌లో నివాసముంటున్న ఒక

తెలుగు కుటుంబం అల్లర్లకు బలవుతుంది. అందరూ పోగా అన్నా చెల్లెళ్లయిన రూప్, కామిని మాత్రం ప్రాణాలతో మిగిలి పారిపోతారు. మార్గమధ్యంలో రూప్ తప్పి
పోతాడు. కామిని ఎన్నో తంటాలు పడి మద్రాసు చేరుకుని ఒక నాటక సమాజంలో చేరుతుంది. మద్రాసులో ఉన్న శరణార్థుల శిబిరం సహాయార్థం నాటకాలు
వేస్తుంటారు. కామిని తనను తాను రక్షించుకోవడానికి మగవేషంలో తిరుగుతుంటుంది. ఈ విషయాన్ని నాటక సమాజంలో హీరోగా వేస్తున్న కుమార్ గుర్తిస్తాడు.
అటు తప్పిపోయిన రూప్, చెల్లెలిని వెదుకుతూ మద్రాసు వస్తాడు. బతుకు తెరువు కోసం ఒక సంగీత పరికరాల దుకాణంలో పనికి చేరతాడు.

నాటక సమాజం అధిపతి దయానిధి కూతురు శశి ఫిడేలు కొనాలని అక్కడికి వస్తుంది. తనకు సంగీతం నేర్పేందుకు అతనిని కుదుర్చుకుంటుంది. వీరిరువురు

ప్రేమలో పడ్తారు. అటు దయానిధి అక్రమాలను కుమార్ ఎండగట్టడంతో నాటక సమాజం నుండి అతను కామినితో సహా బయటికి వస్తాడు. కుమార్ కొత్తనాటక
సమాజం నెలకొల్పి వూరూరా నాటకాలాడి అంతటా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అటు కుమార్ విడిచిన నాటక సమాజంలో రూప్ చేరి నాటకాలాడితే రాళ్లు
విసురుతారు. ఇంతలో కుమార్, కామిని విడిపోవలసి వచ్చి ఏకంగా తనకు తెలీకుండానే స్వయాన అన్న రూప్‌తో పెళ్లికి వొప్పుకుంటుంది. దుఃఖంతో ఆత్మ
హత్యకు యత్నిస్తుంది. చివరికి కథ సుఖాంతమవుతుంది.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ఉన్నత ఆదర్శాలతో తీసిన ఆదర్శం చిత్రం 1952 డిసెంబర్ 25న విడుదలైంది. కానీ, బాక్సాఫీసు వద్ద ప్రేక్షకాదరణ లభించలేదు.


1952లోనే తీశాం:
చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు మాటల్లోనే ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1951 మార్చిలో మద్రాసు వెళ్లి సంవత్సరాంతానికి సినిమా పూర్తి

చేద్దామనుకున్నాం. కానీ, 1952 డిసెంబర్‌లో పూర్తయింది. దీనికి దర్శకునికి కథపై పూర్తిస్థాయి పట్టులేకపోవడం ఒక కారణమైతే, మధ్యలో మాకు రావలసిన
డబ్బు సకాలానికి రాకపోవడం, డిస్ట్రిబ్యూటర్‌కి కొన్ని ఆర్థిక సమస్యలు రావడం వీటన్నిటి వల్ల చిత్రం ఆలస్యంగా విడుదలైంది. నిర్మాణ వ్యయం పెరగడంతో
సినిమా నష్టాలు తెచ్చి పెట్టింది. దాంతో మేమంతా మద్రాసు వదిలి వచ్చేశాం. దాని నెగెటివ్ ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ఆ తర్వాత మరో సినిమా తీయలేదు.

అయితే, ఆదర్శం సినిమా ఆర్థికంగా అపజయం పొందవచ్చు. కానీ, టి.కృష్ణ వంటి ఎడిటింగ్, డైరెక్షన్‌లో గొప్ప పేరొందిన టెక్నీషియన్‌ని, ఆ తరువాత రాష్ట్ర స్థాయి

నంది, జాతీయ స్థాయి అవార్డులు పొందింది. అంతేకాదు, ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం వంటి చిత్రాలు తీసిన బి.ఎస్.నారాయణ, తొలిజాతీయ ఉత్తమ సంగీత
దర్శకుడి అవార్డు అందుకున్న ఎం.వి.రాజు వంటి తెలంగాణకు చెందిన వారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసి చరిత్రలో మైలురాయి వంటి సినిమాగా
నిలిచింది ఆదర్శం.

మన తొలి తెలుగు సినిమా తారాగణం
జానకి – జగ్గయ్య
సావిత్రి – రామశర్మ
రేవతి – ఆత్రేయ
ఇందిరాచార్య, గౌరినాథశాస్త్రి
వంగర, సరస్వతమ్మ
శ్రీవత్స, టి.కృష్ణ

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.