పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్‌.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. కేవలం నార్ల సంపాదకీయం కోసమే పత్రిక చదివే వారుండేవారన్న అతిశయోక్తి కాదు. ఆంగ్ల భాషలోను ప్రతిభా సంపన్నుడైన నార్ల ఇంగ్లీషు జర్నలిజం వైపు కాక తెలుగులోనే కొనసాగుతూ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకొన్నారు. ఆయన తెలుగు పత్రికల సంపాదకుడుగా కొనసాగడం తెలుగు వారు చేసుకొన్న అదృష్టమేనేమో! ఆయనీ పత్రికా రచనను ఒక పవిత్రమైన వృత్తిగా స్వీకరించి నిబద్ధతతో నిజాయితీతో పనిచేశారు. పత్రికారంగంలో తిరుగులేని వ్యక్తిగా రాణించిన నార్ల అక్కడే ఆగి పోలేదు. తెలుగు సాహిత్యంలోని వివిధప్రక్రియల్లో ఆయన ఎన్నో రచనలు చేసారు. ఆంగ్లంలోను విశిష్టమైన రచనలు చేసారు.
పత్రికా సంపాదకత్వ బాధ్యతలను నార్ల ఆషామాషీ వ్యవహారంగా ఎన్నడూ భావించలేదు. పత్రిక తన భుక్తికి పనికి వచ్చే ఒక ఉద్యోగంగా ఆయన తీసుకోలేదు. ప్రజలచేతిలో ఆయుధంగా ఆయన పత్రికలను భావించారు. ప్రజలపక్షాన నిలిచి పత్రికలు యుద్ధం చేయాలి.
ప్రపంచ చరిత్రను పరిశీలించి చూచినట్లయితే పత్రికలు ప్రజల పక్షాన ప్రజల కోసమై పోరాడిందే ఎక్కువగా కనబడుతోంది. ఎన్నో దేశాల పోరాట యోధులు మతతత్వం, నియంతృత్వం, ఫ్యూడలిజం వంటి దాష్టీకాలనుంచి ప్రజలకు విముక్తికలిగించే దశలో పత్రికలను తమ పోరాటాలకు ఉపకరణంగా చేసుకొన్నారు. మన దేశంలోను పత్రికల ఆవిర్భావ వికాసదశలను పరిశీలించినట్లయితే దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికో దురాచారాలను నిర్మూలించడానికో, సాహితీ సంస్కృతుల అభివృద్ధికో స్థాపించినట్లుగా కనబుడతోంది. ఎలకా్ట్రనిక్‌ మీడియా కంటే ముందే విశాల భారతదేశాన్ని చుట్టివచ్చి ఒక ప్రాంత వాసులకు మరొక ప్రాంత వాసుల్ని దగ్గర చేసింది పత్రికలే.
ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా ఛానల్స్‌ వచ్చి పడ్డా, ఇంటర్నెట్‌ సదుపాయమున్నా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందించేవి -సామాన్యుడికి సైతం చేరువులో ఉన్నవి పత్రికలే. పత్రికలు చేసింది చాలా వున్నప్పటికి చేయవలసింది ఇంకా ఎంతో వుంది. పత్రికల పైని గురుతరబాధ్యత వుంది. ఎన్నెన్నో సమస్యలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఆవహించినప్పుడు పత్రికా సంపాదకుడు సంయమనంతో, వివేచనతో వ్యవహరించవలసివుంటుంది. అట్టి వివేచన, విశ్లేషణ నార్ల వారి సంపాదకీయాల్లో మనకు కనబడుతోంది. మన రాష్ట్రం, మన దేశం ప్రపంచం అయోమయ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1942 నుంచి 1978 వరకు నార్ల సంపాదకుడుగా ఉన్న పత్రికల్లో ఆయన అభ్రిపాయాలు సుస్పష్టంగా, హేతుబద్ధంగా వుండేవి. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తోన్న ఈ దేశంలో సమస్యలు లెక్కకు మించినన్ని ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోని, కనీసావసరాలు తీరని గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఏలికలు, పాలకులను పక్కనబెడితే ఉన్న ఈ సమస్యలన్నింటిని వెలుగులోకి తెచ్చే నాథుడెవరు? అని ప్రశ్నించుకుంటే ఠక్కున సమాధానం వచ్చేది ప్రజాస్వామ్యానికి కాపలాదారులైన వార్తా సంస్థలే. అట్లాటి పత్రికలు ఎన్ని వుండాలి, ఎట్లా వుండకూడదు అనే విషయంలో నార్లకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి.
పత్రికా సంపాదకునిగా అపార విషయ పరిజ్ఞానం ఉన్న నార్ల కవిగా, నాటకకర్తగా, విమర్శకునిగా, హేతువాదిగా, మానవతావాదిగా, శాసీ్త్రయ విజ్ఞానశీలిగాను ఎన్నో రచనలు చేసారు. వేమనను విపరీతంగా అభిమానించిన నార్ల ఆ మహాకవి వలెనే ఆటవెలది పద్యాలు రాసారు. మొదట ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చారు. ఈ పద్యాల్లో చమత్కారం, సూటిదనం, వ్యంగ్యం, లోకజ్ఞత కొట్టొచ్చినట్లు కనపడతాయి. వెయ్యి వరకు రాయాలనుకొన్న ఈ పద్యాల సంఖ్య అంతవరకు చేరుకోలేదు. అనేకానేక విషయాలను ఈ పద్యాల్లో వెల్లడించిన నార్ల పత్రికలంటే ఎట్లా వుండాలి అని కొన్ని పద్యాల్లో చెప్పారు.
పాలకుల కొమ్ముకాచే పత్రికలు, పాలకులకు పాదాభివందనం చేస్తూ బానిసల్లా వార్తలు అందించే ఎడిటర్లని ఆయన ఏవగించుకొన్నారు. ‘ఎడిటరైన వాడు బిడియముచూపు చో/ ధాటి తగ్గి వృత్తి ధర్మమందు/ కడుపు కూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా!’ జరుగుతోన్న విషయాలను చూచిచూడనట్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్న విషయాలను బయటపెట్టని ఎడిటర్లు ఉంటే ఏమి? ఊడితే ఏమనేది ఆయన మాట. ‘వర్తమాన జగతి పరివర్తనాలపై/ స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి/ ఎడిటరెందుకోయి ఏటిలో గలపనా?’ అని ఆయన అన్నారు. నిజానిజాలు తెలిపే పత్రికలు ప్రజలపక్షాన పోరాడే పత్రికలకే ప్రజాస్వామ్యంలో స్థానముంటుంది. అటువంటి పత్రికలనే ప్రజలు ఆదరిస్తారు. ఏదో ఓ పార్టీకో, కులానికో వెన్నుదన్నుగ నిలిచే పత్రికల పోకడలను ప్రజలు గమనించకపోరు. ఒకవేళ ఏదేని పత్రిక పత్రికకుండవలసిన లక్షణాలను మరచి ఏలికలకు కొమ్ముకాస్తే అటువంటివి పత్రికలే కావు హంతకులే అంటారు నార్ల. ‘నీతినియతిలేని నీచుని చేతిలో/ పత్రికుండెనేని ప్రజలకు చేటు/ హంతకుని చేతికత్తి గొంతులు కోయదా?’ పాలకులు కొందరు ‘మీడియా’ను పరమ శత్రువులుగా భావిస్తూ నిప్పులు చెరగుతుంటారు. అప్పుడు నిజానికి ప్రజాళి ఏం చేయాలి? ప్రజలపక్షాన పత్రికలు పోరాడుతున్నప్పుడు, మీడియా పక్షాన వుండి అది ప్రింట్‌ లేదా ఎలక్ర్టానిక్‌ మీడియా ఏదైనప్పటికీ వాటి పక్షాన వుండి ప్రజలు పోరాడాలి. కానీ ప్రజల్లో ఓ లాటి నిర్లిప్తత, భయం, పోరాటపటిమ లేకపోవడం కూడా మనం గమనించవచ్చు.
అసలు పత్రికలే లేకుంటే? ప్రజలపక్షాన వకాల్తా పుచ్చుకుని పోరాడేదెవరు? ప్రభుత్వాల తప్పొప్పులు చిట్టా విప్పేదెవరు? ప్రజాస్వామ్యం చక్కగా పరిఢవిల్లాలంటే ప్రజల కోసమై గొంతువిప్పే ఉపకరణాల్లో పత్రిక కూడ ఒకటన్నతి ఆయన దృఢమైన అభిప్రాయం. అందుకే నార్ల అంటారు: ‘పత్రిక నియంత పక్కలో బల్లెమ్ము/ పత్రిక ప్రజాళి పట్టుగొమ్మ/ ప్రభుత వక్రమౌను పత్రికలేనిచో’.
పత్రికలు అనుసరించవలసిన ధర్మం ‘సత్యనిష్ఠ’ అనిచెప్పారు నార్ల. పత్రికలు ప్రజాళికి మేలుమాత్రమే చేయాలనేది ఆయన ప్రగాఢ వాంఛ. అట్లాకాకుండా పత్రికలు ప్రజల్లో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ, ఏదో ఒక ప్రయోజనం నిమిత్త ం వాళ్ళల్లో పోరాట పటిమను, చైతన్యాన్ని నిర్వీర్యం చేయటం తగదు. పత్రికొకటుంటే అదే ‘కాగల కార్యాన్ని నిర్వర్తిస్తుందని ప్రజలు ఆదమరచి నిద్రించగలరని’ అంటారు. పత్రికారంగంపైన నార్ల కెంత విశ్వాసం! ఎంత మక్కువ!
నార్ల మాటల్లో ఉత్తమ సంపాదకుడు అంటే ‘విశ్వమానవ దృష్టి, శీల సంపద, ధర్మాభినివేశం’ ఉన్నవాడు. ఇవి ‘లేనివాడు ఏమైనాకావచ్చు కాని ఉత్తమ శ్రేణి సంపాదకుడు కాలేడు’ అని నార్ల అన్నారు.
డా. కనుపర్తి విజయ బక్ష్‌
(డిసెంబర్‌ 1న నార్ల జయంతి)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.