ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం
- – సి. విజయలక్ష్మి
- 20/10/2014

భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. శివ అన్నా శివలింగంపైన కాసిని నీళ్లు పోసినా, మారేడు దళం వేసినా చాలు శివుడు అత్యంత ప్రీతుడై వారిని తన దరికి చేర్చుకుంటాడు. కైలాసంలో తన ప్రక్కనే కూర్చునబెట్టుకొంటాడు. అలాంటి శివుడు కేవలం మానవులు స్తుతిస్తేనే ప్రీతి చెందుతాడనుకొంటే పొరపాటే. ఎందుకంటే శివుని మనసార స్మరించిన జంతువులకుకూడా మోక్షం లభించినదన్న శివభక్తకథలు మనకు కనిపిస్తాయి. శ్రీకాళహస్తి క్షేత్రం కూడా ఈ విషయానికే తార్కాణంగా నిలిచిఉంది. అంతటి దయాళువు అయిన శంకరుని పూజించని వారు ఎవరు ఉంటారు! శివ అనని నోరు నోరే కాదు సుమా అన్న శివభక్తుల మాట నిజమే!
ఒకానొకకాలంలో భక్తవత్సలుడైన శివుడిని ఓ విప్రుడు అమితమైన ఇష్టంతో పూజించేవాడు. నిరంతరం శివనామస్మరణతో కాలయాపన చేసేవాడు.కార్తికమాసం వచ్చిందంటే ఉపవాసాలు, అభిషేకాదులతో శివుని అనుగ్రహం పొందటానికి శాయశక్తులా శ్రమించేవాడు. అలాంటి విప్రుడు ఓ కార్తిక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యలో శివోపాసన చేయటానికి ఉపక్రమించి మారేడు దళానే్వషణకు వెళ్లాడు. ఎక్కడ చూచినా చంద్రుడు అగుపిస్తున్నాడు కాని మారేడు వృక్షమే ఆ విప్రునకు కనిపించలేదు. విసిగిన ఆ విప్రుడు ఆ శివుడు నాకు మారేడు దళాలతో పూజించటానికి అవకాశం ఇవ్వకపోతే నేనేమి సేతు లింగా… అనుకొని ఇంటి ముఖం పట్టాడు. అలా తిరుగు ముఖం పట్టిన ఆ ద్విజునకు ఎదురుగా మారేడు వృక్షం కనిపించింది. ‘ఓహో శివానుగ్రహం నాకు కలిగింది. ఇదిగో ఈ బిల్వవృక్షమే దానికి చిహ్నం’ అనుకొని ఎంతో సంతోషంతో మారేడు వృక్షం నుంచి దళాలను తెంపపోయాడు. అంతే అక్కడే క్షుద్బాధతో ఉన్న ఓ సింహం నరవాసనను పట్టింది.పెద్దగా గ్రాండించుకుంటూ ఈ విప్రుడున్నచోటికి రాబోతోంది. దీన్ని చూచిన విప్రుడు నిరుత్తుడయ్యాడు. ఇక జీవితాశ ఇక లేదు అనుకొంటూ గబగబా మారేడు చెట్టు ఎక్కాడు. అక్కడే అమ్మా పార్వతీ తండ్రీ శివా నన్ను రక్షించండి. ఈ పులి నుంచి నన్ను కాపాడండీ అంటూ ఎలుగెత్తి పిలుస్తున్నానుకుంటూ మనసుననే మొరపెట్టుకుంటున్నాడు. ఆ వ్యాఘ్రరాజము చెట్టుకిందనే నిలిచి పైకి విప్రునకేసి చూస్తూ గాడ్రిస్తోంది. భయంతో బిర్రబిగిసిన విప్రుడు చేసేదేమీ లేక శివనామమే నన్ను రక్షించాల్సింది ఇక ఎవరూ నన్ను రక్షించలేరు అనుకొంటూ కన్నీటితో శివనామస్మరణ చేయసాగాడు. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆకలితో నకనకలాడే కడుపుతో పులి చెట్టుకింద కూర్చుంది. చెట్టుకొమ్మను ఆసరాచేసుకొన్న విప్రుడూ శివనామస్మరణచేస్తూనే నిత్యమూ తాను చేసే పూజనే మానసికంగా చేయసాగాడు. మానసికంగా శివలింగానికి మారేడు దళాలను సమర్పిస్తున్నట్లుగా భావించసాగాడు. కాని, నిజానికి తాను తెంపిన దళాలను కిందనున్న వ్యాఘ్రంపై పడవేయసాగాడు కొద్దిసేపటికి నైవేద్యాలు సమర్పించినట్లుగాను, నీరాజనాలు పలికి ఆత్మప్రదక్షిణ నమస్కారాలు కూడా మానసికంగానే చేసేసాడా బ్రాహ్మణుడు పూజ చేసేశాననుకొంటూ కళ్లు తెరిచి చూడగా వర్తమానంలోని పులి మారేడు దళాలతో కప్పబడి చలనం లేకుండా ఉంది. ఒకవేళ పులి వెళ్లిపోయిందేమో ఈ మారేడు దళాలన్నీ నేను చేసిన పూజలోని భాగాలేనా అనుకొంటూ శబ్దం లేకుండా చెట్టుదిగి ఏమీ చేయడానికి పాలుపోక ఊరిలోనికి పరుగెత్తాడు. అక్కడున్నవారికి రాత్రి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ సంగతి విన్న యువకులు, గ్రామపెద్దలు కర్రలు, కత్తులు పట్టుకొని అడవికి విప్రునితో వచ్చారు. అక్కడున్న మారేడుదళగుట్ట వారికి కనిపించింది. ఇదే నేను ఉన్న మారేడు చెట్టు , అవే నేను పూజించిన దళాలు వాటికింద పులి వుంది అని చెప్పగా కొందరు మెల్లగా మెల్లగా దూరం గా నిల్చుని ఆ మారేడు దళాలను తొలగించసాగారు. అలా తొలగిస్తున్నప్పుడు పులి చర్మం కూడా తొలిగిపోయింది. వారంతా ఆశ్చర్యంతో చూస్తుండగా పులి వున్న ప్రదేశంలో పానవట్టంతో కూడిన శివలింగం వారిని ఆనందచిత్తులను చేసింది. ఆ రాత్రే ఆ ప్రాంత (పెద్దాపుర) సంస్థానాధీశ్వరునికి కలలో కనిపించి శివుడు ఫలాన మారేడు వృక్షం క్రింద వ్యాఘ్ర శరీరంనుంచి తాను ఉద్భవించినట్లు తనకో ఆలయనిర్మాణం చేపట్టుమని ఆదేశించాడట. ఆ సంస్థాన ప్రభువు తన పరివారంతో అక్కడికి అపుడే చేరుకున్నాడు. అక్కడ జరిగిన సంగతిని తెలుసుకొని తనకు వచ్చిన కలను అక్కడి వారికి తెలియచేశాడు. వారంతో ఎంతో సంతోషంగా వ్యాఘ్రశరీరంనుంచి ఆవిర్భవించిన శివుడు కనుక ఈ శివుణ్ణి వ్యాఘ్రేశ్వరునిగా కొలుద్దామని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి శివునికోసం ఆలయ నిర్మాణం చేశారు. అందుకే ఈ ఆలయానికి వ్యాఘ్రేశ్వరాలయం అనే వాడుక వచ్చింది. ఈ వ్యాఘ్రేశ్వర స్వామిని పుల్లేటి కుర్తివారు అర్చకులుగా ఉంటూ తరతరాలుగా స్వామిని సేవిస్తున్నారు. ఈ ఆలయంలో వ్యాఘ్రేశ్వరునితోపాటుగా శ్రీ రుక్మిణీ సత్యాసమేత గోపాలస్వామి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడుకూడా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న ఇరుసు మండ గ్రామంలో రాముని ప్రతిష్ఠగా భావించబడుతున్న బాలా త్రిపుర సుందరీ సమేత ఆనంద రామేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయం, ఓంకారేశ్వరాలయం కూడ మనం దర్శించుకోవచ్చు.
ఇంతకీ ఈ వ్యాఘ్రేశ్వరాలయం అంబాజీపేటకు అతిసమీపంలో, రాజమండ్రికి వెళ్లు ప్రధాన రహదారిలో, ఇంకా సులభంగా చెప్పాలంటే పుల్లేటి కుర్రు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది.
ఈ ఆలయంలో కార్తికామాసంలో ప్రత్యేకారాధనలు జరుగుతాయ. మహాశివరాత్రి లాంటి ప్రత్యేకమైన దినాల్లో ఇక్కడి జరిగే శివపూజ కనుల పండుగగా సాగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం శివానుగ్రహాన్ని పొందటం ఈ క్షేత్రంలో పరిపాటిగా జరుగుతున్నదే నంటారు ఇక్కడి స్థా