గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70
108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు
బందరు జననం –గుంటూరు నివాసం
1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ కాశీ కృష్ణమాంబ ,వేద వ్యాస దంపతులు కృష్ణాచార్యుల వారిని దత్తత తీసుకొన్నారు .
బహుముఖీన పాండిత్యం
.గుంటూరులో అధరాపురపు శ్రీనివాసాచార్యుల వద్ద సాహిత్యాధ్యనం చేశారు .తరువాత నడిచి విజయనగరం చేరి మహిశూర భీమా చార్యుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .పేరి వెంకట శాస్త్రి గారి నుండి పాణినీయ వ్యారణం నేర్చారు .అక్కడ నుండి గోదావరీ తీరం చేరి కాకర పర్తి నివాసి గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రానికి మెరుగులు దిద్దుకొని ,ఆనాటి మహా మహులైన తార్కిక శిరోమణులతో సరి సమాన పాండిత్యాన్ని పొందారు .వేదాంత శాస్త్ర అంతాన్ని చూశారు .సంగీతం లో ప్రవేశించి నిధి అనిపించుకొన్నారు .వీణా వేణు ,వాయులీన ,మ్రుదంగ జంత్ర వాద్యాలలో నిష్ణాతుడయ్యారు .ఇవే కాక కుమ్మరి, కమ్మరి, నేత ,వడ్రంగం పనులలోను అధిక ప్రావీణ్యం సాధించి తనకు రాని విద్య లేనే లేదు అనిపించారు .విజయ నగరం లో సకల కళా ప్రపూర్ణులు అయ్యారు .
వివాహం –సంతానం –ఉద్యోగం
కృష్ణాచార్యుల వారికి పదకొండేళ్ళ వయసు లోనే శ్రీ మతి కుంభారిలక్ష్మీ నరసాంబ తో వివాహం జరిగింది .ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలకు జన్మ నిచ్చారు .గుంటూరు టౌన్ హైస్కూల్ ,గుడివాడ హైస్కూల్ లో దాదాపు పదేళ్ళు సంస్కృత ,ఆంద్ర అధ్యాపకులుగా ఈ ‘’పుంభావ సరస్వతి’’ పని చేశారు .
క్రిష్ణాచార్యీయం
పదేళ్ళ వయసులోనే కృష్ణాచార్యుల వారు పద్య రచన చేశారు .పందొమ్మిదవ ఏట మొదటి అవధానాన్ని గుంటూరు లో చేశారు .తర్వాత వారి అవధాన ప్రక్రియ నిర్వక్ర పరాక్రమం తో జైత్ర యాత్రలా సాగింది .1-12-1911 న బందరులో శతావధానం చేసి దేశం నలు మూలల నుంచి ప్రశంసా వర్షాన్ని అందుకొన్నారు ప్రతిభను నిరూపించుకొన్నారు .పలు చోట్ల అవధానాలు చేసి అవధాన కీర్తిని దశ దిశలా చాటారు .వినుకొండ ,అనపర్తి ,గద్వాల ,ఆత్మకూరు ,వెంకట గిరి ,నూజివీడు ,పిఠాపురం ,విజయనగరం మొదలైన సంస్థానాలలో శతావధానాలు చేసి ,ఆశు కవితలు చెప్పి మెప్పించి శెభాష్ అని పించి సంస్థానాధీశుల చేత ఘన సన్మానాలను అందుకొన్నారు. అవధాన సరస్వతిని ఊరూరా ఊరేగించిన అవధాన సరస్వతి శ్రీ క్రిష్ణాచార్యులవారు .
క్రిష్ణాచార్యులవారు జీవితాన్ని గీర్వాణ భాషా ప్రచారానికే అంకితం చేశారు .దీనికోసం ‘’మాతృభాషా సమాజం ‘’అనే సంస్థ ను స్థాపించి కృషి చేశారు .విద్యార్ధులు తేలికగా సంస్కృతం నేర్చుకోవటానికి మూడు భాగాలుగా ‘’బాల బోధినులు ‘’రాశారు .’’క్రియాదర్శం,’’సంవాదం ‘’,’’వాల్మీకి చరితం ‘’,’’ఆంద్ర సంస్కృత నిఘంటువు ‘’,అనే గ్రంధాలు రాశారు .ఇవే కాక ‘’గోస్టీవన మహాత్మ్యం ‘’(సంస్కృతం , తెలుగు లలో )’’అవధాన యాత్ర ‘’,అనేక మంది దేవీ దేవతలపై అష్టకాలు ,దండకాలు ,శతకాలు ,స్తోత్రాలు ఈ సాహితీ సరస్వతి లేఖిని నుండి జాలువారాయి .ఒక సారి నెల్లూరు లో ఒక అరగంటలో ‘’శ్రీ రంగ నాయక శతకాన్ని ‘’సంస్కృతం లో ఆశువుగా చెప్పి ఆశ్చర్య చకితులను చేశారు .ఆచార్యుల వారు మహా వక్త .ధారాళం గా ఎంతసేపైనా అనర్గళం గా ఉపన్యసించే నేర్పున్న వారు .
బిరుదులు- సత్కారాలు
శ్రీ కృష్ణాచార్యుల వారికి అవధాన శిరోమణి ,మహా మహోపాధ్యాయ ,విద్యా వారధి ,పౌరాణిక రత్న ,కళా ప్రపూర్ణ ,డి .లిట్ మొదదలైన బిరుదులూ గౌరవాలతో సన్మానాలందు కొన్నారు .ఇవన్నీ వీరి కవితాశక్తికి పాండిత్య ప్రకర్షకు నిదర్శనాలు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పతి చేత 15-8-1960 న ఘన సన్మానం చేయించింది .గుంటూరు పురప్రముఖులు ఆచార్యులవారికి 1961 ఫిబ్రవరి 15,16తేదీలలో ‘’సంస్కృత సామ్రాజ్య పట్టాభి షిక్తుని ‘’గా చేసి ,రత్న ,కనక కిరీటాలతో అలంకరించి అపూర్వ వైభవం తో నభూతో నభవిష్యతి అన్నట్లుగా కలకాలం నిలిచిపోయే ఘనాతి ఘన తర ,ఘన తమ సత్కారం చేసి తమ ఆత్మీయతను ,ఆప్యాయాన్ని ,గౌరవాన్ని విధేయతను ప్రదర్శించారు .
1962లో కాశీ కృష్ణాచార్యుల వారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ‘’నడయాడే సరస్వతి’’ని ’’ ‘’ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవం కల్గించి అద్భుత సత్కారం చేసి తన బాధ్యతను నెర వేర్చుకోన్నది .1963లో నేను రాజ మండ్రి ప్రభుత్వ ట్రెయినింగ్ కాలేజిలో బి .ఇ .డి .చేస్తుండగా మా కాలేజి సాంస్కృతిక వారోత్సవాలలో పాల్గొన టానికి ‘’ఈ వృద్ధ తాపసి’’ 91ఏట వచ్చారు .సభ పై అనంతస్తులో జరుగుతోంది వారు .మెట్లు ఎక్కి పైకి రాలేరని ఒక కుర్చీలో వారిని కూర్చో బెట్టి నేనూ మిగిలిన మిత్రులం కలిసి మా చేతులతో వారిని నెమ్మదిగా మెట్ల మీదనుంచి సభా వేదికకు మోసుకొంటూ చేర్చాం .ఆ సాహిత్య సంగీత సరస్వతిని స్పృశించి ,పైకి మోసుకొని వెళ్ళే మహద్భాగ్యం నాకు కలిగిందని మహా నందం పొందాను .అలాగే మళ్ళీ కిందికి దించి తీసుకొచ్చి పాదాల పై ప్రణ మిల్లాం.వారు సంస్కృతం లోనే మాట్లాడారు అతి సరళమైన భాషలో .అందరికి అర్ధమయ్యింది .వారు ఇతరులతోనూ సంస్కృతం లోనే మాట్లాడేవారని చెప్పుకోగా విన్నాను . అవసరం వస్తే తప్ప అంతా సంసృతం లోనే సంభాషించే వారట .అంతటి దీక్ష వారిది .వారి బాల బోధినులు చదివి ఎందరో సంస్కృతం అభ్యసించారు వారు. ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసేవారు .ప్రతి పట్టణం లోను పరీక్షా కేంద్రాలు ఉండేవి . సంస్కృత భాషా వ్యాప్తికోసం తన జవ సత్వాలను ధారపోసి న ఈ అపర సరస్వతి శ్రీ కాశీ క్రిష్ణాచార్యుల వారు 96వ ఏట 1967 బ్రహ్మైక్యం చెందారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-14-ఉయ్యూరు