గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73
111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి
‘’యదా కాళిదాస స్తధా కాశీ నాదః ‘’అని పించు కొన్న మహా సంస్కృత విద్వాంస కవిపండితులు శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి గారు .విశాఖ పట్నం మండలం గజపతి నగరం తాలూకా పురిటి పెంట గ్రామం లో 1885లో జన్మించారు .తండ్రి వెంకట శాస్త్రి, తల్లి మహాలక్ష్మమ్మ గార్లు .తండ్రి గారే ప్రధమ గురువులు .తండ్రివద్ద వ్యాకరణాన్ని ఔపోసనపట్టారు .మధ్వశ్రీ భీమా చార్యుల వారి వద్ద న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారి దగ్గర వేదాంత ,అలంకార శాస్త్రాలను నేర్చారు .
కాశీ నాద శాస్త్రి గారు విజయ నగర మహా రాజా ఆస్థాన పండితులు .తర్వాత రాజావారి సంస్కృత కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా చేరి జీవితాంతం కొనసాగారు .పాఠ ప్రవచనం లో ప్రసిద్దులనిపించుకొన్నారు .వాద శక్తిలో ప్రతివాద భయంకరులే .మహా విద్వాంసులైనా, కవిగా కూడా కీర్తి గాంచారు .మహారాజు ఆనంద గజపతి భోజరాజు అని కాశీనాధ శాస్త్రిగారు కాళి దాసమహాకవి అని ఆరోజులలో అందరూ చెప్పుకొనేవారు .అనేక కవితలు రాసి వెలువరిస్తూ నానా రాజ సందర్శనం చేస్తూ సత్కార పురస్కారాలు అందుకొంటూ జైత్ర యాత్ర చేశారు .పండిత, కవి మహా జనమధ్యఎన్నో కనకాభిషేకాలు అందుకొన్న మహా శాస్త్ర విద్వాంసులు .
గోదావరీలహరి ,బ్రహ్మ సూత్ర భాష్యానువాదం అనే రెండు గ్రంధాలు రాసి ముద్రించారు .ఉత్తర శాకుంతలం అనే గ్రంధ వ్రాత ప్రతి ఇప్పటికీ విజయ నగర రాజ గ్రంధాలయం లో ఉందని చెబుతారు .శాస్త్రి గారు పూర్తిగా గ్రాంధిక వాది .ఆ నాటి మరోగ్రాన్ధిక భాషా వాది అయిన కల్లూరి వెంకట రామ శాస్త్రి గారికి వత్తాసుగా ఉండేవారు .ఉర్లాం మొదలైన సంస్థానాల్లో శాస్త్రిగారు విద్వత్ పరీక్షకులుగాఉండి సన్మానాల నందుకొన్నారు .వీరి సంతానం ఆరుగురు .అందులో ఇద్దరుకుమారులు నలుగురు కుమార్తెలు .ప్రసిద్ధ శాస్త్ర పారంగతులు మహామహోపాధ్యాయ శ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రి గారు కాశీ నాధ శాస్త్రిగారికి అల్లుడుగారు .అరవై రెండేళ్ళు జీవించి శాస్త్రిగారు 1920లో మరణించారు .
112- సంస్కృతం లోనే ఉత్తరాలు రాసిన –నాగ పూడి కుప్పుసామయ్య
1864లో తమిళనాడు లోని తిరుత్తని లో కుప్పుసామయ్యగారు జన్మించారు .అసలుపేరు రామ కృష్ణ శర్మ .మద్రాస్ లో చదివారు తిరుపతిలో న్యాయ వాదిగా ఉండి,ఇక్కడే స్తిరపడ్డారు .సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులని పించుకొన్నారు .రెండుభాషల్లో కవిత్వం చెప్పి అనేకమైన గ్రంధ రచన చేసిన సవ్య సాచి .
శత ఘంటం వెంకట రంగ శస్త్రి గారు అనే మహా విద్వాంసుల శిష్యుడై సంస్కృతం అభ్యసించారు .వట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ,వేదం వెంకట రాయ శాస్త్రి ,జనమంచి శేషాద్రి శర్మ వంటి ఆనాటి ప్రసిద్దులు వీరికి ప్రాణ స్నేహితులు .వీరి విద్వత్తును గుర్తించి ప్రభుత్వం తిరుపతి సంస్కృత కళాశాల పాలక మండలిలో సభ్యులనుగా నియమించి గౌరవించి వీరి అమూల్య సేవలను అందుకొన్నది .
నైష్టిక జీవనం వినమ్రత ,రుజువర్తనం వీరికి సహజ భూషణాలు .వీటికి శిష్యులు ఆకర్షింప బడి ఆరాధించారు .పారిజాతాపహరణం అనే నంది తిమ్మన ప్రబంధానికి ఎవరూ వ్యాఖ్యానం రచించ నందున వీరు చక్కని ‘’పరిమళోల్లాస వ్యాఖ్యానం’’బహు సుందరంగా సులభ శైలిలో 1929లో రాసి ప్రచురింఛి ఆ లోటును తీర్చారు .సంస్కృతాంధ్రాలలో వీరు రచించిన కృతులు అనేకం ఉన్నాయి .అయితే చాలాభాగం అముద్రితాలే కావటం మన దురదృష్టం .మిత్రులకు శిష్యులకు కుప్పుసామయ్యగారు రాసే ఉత్తరాలలో ఎక్కువగా సంస్కృతమే రాసేవారు .అప్పుడప్పుడు తెలుగుపద్యాలతోనే ఉత్తరాలు రాసేవారు .సంస్కృతం లో రాసిన కావ్యాలనన్నిటిని కావ్య సంపుటం గా చేసి ‘’సప్త రత్నావళి ‘’పేరిట ‘’1927లో ముద్రించారు .ఇందులో పది హేడు లఘుకావ్యాలున్నాయి . పారిజాతాపహరణం వ్యాఖ్యానం లో తన పుట్టుపూర్వోత్తరాలను పేర్కొన్నారు . నాగ పూడి గ్రామం లో జన్మించానని ,భారద్వాజస గోత్రమని ,సామగద్రాహ్యాన సూత్రీకులమని ,యజ్నేశ్వరార్య పుత్రుడినని కుప్పుసామి పండితుడనని ,రాసుకొన్నారు డెబ్భై ఏడేళ్ళు జీవించి ఈ మహా పండతకవి 1941లో పరమ పదించారు ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు .