ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’!
- -లాస్య

లింగ వివక్షను నిర్మూలించాలని ప్రభుత్వం ఎనె్నన్ని పథకాలను ప్రవేశపెట్టినా, భారీగా నిధులను ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చట్ట విరుద్ధ గర్భస్రావాలు, లింగ నిర్థారణ పరీక్షలు, భ్రూణహత్యలతో ఆడశిశువులు పుట్టకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఇంకా చాలా రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లింగ నిష్పత్తి తగ్గినట్లు ప్రభుత్వం తాజాగా పార్లమెంటు సమావేశాల్లో అంగీకరించింది. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారమన్న భావజాలం నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతున్నందున లింగ నిష్పత్తి తీరు ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి మంది బాలురతో పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్య 1991లో 945గా నమోదైంది. 2001లో ఆ సంఖ్య 927గా, 2011లో 918గా ఉంది. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణాదితో పోల్చి చూస్తే ఈ పరిస్థితి ఉత్తరాదిలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వధువుల కోసం ఉత్తరాది రాష్ట్రాల యువకులు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితులే లింగ నిష్పత్తి తగ్గిందనడానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
దేశంలో ఇతర ప్రాంతాల కంటే హర్యానాలోని పనె్నండు జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఆ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 834 మంది బాలికలు ఉన్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పంజాబ్లోని 11 జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 846 మంది బాలికలు ఉన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, యుపిలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు.
గత మూడు దశాబ్దాలుగా జననాల తీరును విశే్లషిస్తే ఆడశిశువులు వద్దనుకుంటున్న దంపతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కుమారుడు పుడితేనే వంశం పెరుగుతుందని, కుటుంబానికి అండగా ఉంటాడన్న భావన ఇంకా అనేక కుటుంబాల్లో బలంగా ఉంది. సామాజిక పరిస్థితులు, సాంప్రదాయాల కారణంగా ఆడపిల్లలపై పలు రూపాల్లో వివక్ష కొనసాగుతోంది. ఆడపిల్లకు పెళ్లి చేయడం పెనుసమస్య అని ఇప్పటికీ ఎంతోమంది భావిస్తున్నారు. లింగ నిర్థారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఆడశిశువులు భూమీద పడకుండా అడ్డుకుంటున్నారు. గర్భస్రావాలు, భ్రూణహత్యలకు సైతం పాల్పడుతున్నందున ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు. 1991లో దాద్రా, నగర్ హవేలి ప్రాంతంలో ప్రతి వెయ్యి మంది బాలురకు ఆడపిల్లల సంఖ్య 1013 కాగా, 2011లో ఆ సంఖ్య 926కు తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలికల సంఖ్య 1991లో 975 ( ప్రతి వెయ్యి మంది బాలురకు) కాగా, 2011లో ఆ సంఖ్య 939గా నమోదైంది. 1991- 2011 మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఆ సంఖ్య 967 నుంచి 956కు తగ్గింది. మణిపూర్ (974 నుంచి 936), మేఘాలయ (986 నుంచి 970), నాగాలాండ్ (993 నుంచి 943) వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒక్క మిజోరంలో మాత్రమే స్వల్పంగా ( 969 నుంచి 970కి) పెరిగింది. పంజాబ్లో 11 జిల్లాల్లో బాలికల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నా, మిగతా జిల్లాల్లో 2001 నుంచి 2011 వరకూ స్వల్పంగా పెరుగుదల (798 నుంచి 846) కనిపించిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్లో బాలికల సంఖ్య 2001లో 975గా, 2011లో 915గా నమోదైంది. కేరళలో బాలికల సంఖ్య 1991లో 958గా, 2011లో 960గా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఈ సంఖ్య 1991లో 951గా, 2001లో 896కి తగ్గి, తిరిగి 2011లో 909గా పెరిగింది.