మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ –శ్రీమతి కైవారం బాలాంబ

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ  –శ్రీమతి కైవారం బాలాంబ

ప్రాతస్మరణీయులు

నిరతాన్న ప్రదాతలు  అంటే ఆంద్ర దేశం లో ముందు గుర్తు కొచ్చేది అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు .ఆ తర్వాత శ్రీ బందా పరదేశి గారు .పిమ్మట శ్రీమతి జిల్లెళ్ళమూడి అమ్మగారు .వీరి చేతి భోజనం తిని తరించని వారు లేరు అంటే అతిశయోక్తికాదు .అంతే కీర్తి వైభవాన్ని నిరతాన్నదానం చేతపొందిన మరో దివ్యవ్యక్తి శ్రీమతి కైవారం బాలాంబ గారు .ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా వారి ఆప్యాయత ,ఆదరణ,ప్రేమ సేవా భావం తెలుగు జనం గుండెల్లో  స్తిరం గా  నిలిచిపోయాయి .వీరిలో బాలాంబ గారి గురించి ఈ తరం జనానికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు .ఆమెను గురించి తెలియ జెప్పటానికే నేను చేస్తున్న ప్రయత్నం ఇది .

బాలాంబ గారి జీవిత విశేషాలు

గుంటూరు జిల్లా లోని అంగల కుదురు   గ్రామం లో బాలాంబ గారు 1849లో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ దేవులపల్లి సుబ్బన్న గారు .తల్లి గారు శ్రీమతి వెంకమాంబ గారు .ఈ కుటుంబం మొదటి నుండి దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందినది .బాలాంబ గారు చిన్నప్పటి నుండి దాన ధర్మాలపై గొప్ప శ్రద్ధ చూపేవారు .ఇవి తలి దండ్రుల నుండిఆమె కు  సంక్రమించిన సద్గుణాలు .బాల్యం లో నే రామాయణ ,భాగవతాదిఆధ్యాత్మిక గ్రంధాలను చదివి సారాన్ని జీర్ణించుకొన్నారు .’’అమ్మా !అన్నం ‘’అనే కేక యెంత దూరం నుండి వినిపించినా ఆమెకు  వినపడేది .వెంటనే ఇంటి నుండి అన్నం కూరలు ,పచ్చళ్ళు తీసుకొని వెళ్లి  వాళ్లకు  పెట్టి సంతృప్తి చెందేవారు .వారు కడుపునిండా తింటే ఆమెకెంతో సంతోషం గా ఉండేది .వారిలోనే పరమాత్మ ను దర్శించేవారామే .

వివాహం –దాంపత్యం

గుంటూరు జిల్లా మంగళ గిరి నివాసి కైవారం సుబ్బన్న గారితో బాలాంబ గారికి వివాహం జరిగింది .పెండ్లి అవగానే కాపురానికి అత్తవారిల్లు మంగళగిరీ వచ్చారు .సుబ్బన్న గారితో కాపురం ఏంతో అన్యోన్యంగా  కొన్నేళ్ళు కొనసాగింది .ఇంతలో దైవ ఘటన మరో రకం గా ఉంది .సుబ్బన్న గారు అకస్మాత్తుగా చనిపోయారు .మొదటి నుంచి శ్రీ మంగళ గిరి లక్ష్మీ నృసింహ స్వామిఉపాసనలో బాలాంబ గారు గడిపేవారు . భర్త మరణం తో ధ్యాస అంతా స్వామి మీదే లగ్నం చేసి  స్వామి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు  .కొంతకాలం మంగళ గిరి కొండపైనే ఉంది తపస్సు చేశారు .అనుకో కుండా బాలాంబ గారికి ఒక రోజు జ్ఞానోదయం అయింది .అన్నదానం చేయాలనే ప్రేరణ కలిగింది .

నిరతాన్న దాన కార్యక్రమం

మంగళ గిరి గ్రామం లో అన్నదాన కార్య క్రాన్ని బాలాంబ గారు ప్రారంభించారు .అన్నం పెట్టెటప్పుడు ఏ భేదమూ  పాటించే వారు కాదు . అదే ఆమె విశిష్ట వ్యక్తిత్వం .ఆ నాటి సంఘ ఆచార వ్యవహారాలలో ఇదొక గొప్ప ముందడుగే .నిరాడంబరం గా ,అదొక సేవా భాగ్యం గా అన్నదానాన్ని నిర్వహించేవారు .స్వ,పర భేదాన్ని ఏనాడు పాటించని సమద్రుష్టి బాలాంబ గారిది .ఆడంబరాల జోలికి పోకుండా ప్రశాంత చిత్తం తో నిరతాన్న దానాన్ని కొన సాగించారు ..క్రమంగా బాలాంబ గారి వితరణ  అందరికీ తెలిసి అందరి అభిమానానికి పాత్రురాలయ్యారు బాలాంబ గారు .ఆమె వారికి ఒక అన్నపూర్ణా దేవిగా గోచరిం చేవారు .

గ్రామం లోను ,చుట్టు ప్రక్కల గ్రామాలలోను బాలాంబ గారి సేవా తత్పరత ను గుర్తించిన దాతలు సహాయం చేయటానికి ముందుకొచ్చారు .వారి సహాయ సహకారాలను స్వీకరింఛి  బాలాంబ గారు అన్నదానాన్ని క్రమం గా విస్తరింప జేశారు .నిత్యం బాటసారులు ,పేదలు  భక్తులు ,వందలాదిగా వచ్చి బాలాంబ గారి ‘’అన్న దాన సత్రం ‘’లో అన్నదానాన్ని స్వీకరించి సంత్రుప్తిపొంది దీవించి వెళ్ళేవారు .పుణ్య క్షేత్రమైన మంగళ గిరి పానకాల స్వామిని దర్శించటానికి వచ్చే భక్తులకు ,బాటసారులకు ఇతరగ్రామాలనుండి స్వంత పనుల నిమిత్తం వచ్చేవారికి  అది ఒక కేంద్రమై నిలిచింది .బాలాంబ గారు అనే ఒక వ్యక్తీ ఇప్పుడు ఒక మహా సంస్థ గా ఎదిగారు .ఇంతటి భారీకార్య క్రమానికి కావలసిన వనరులు కూడా భారీగానే అవసరం కదా .

వనరుల సేకరణ

అందుకని బాలాంబ గారు ఎద్దుల బండీ మీద గ్రామాలలో పర్య టిం చేవారు .రైతులు అంద జేసే బియ్యం ,పప్పులు కూరలను సేకరిం చేవారు .రైతులు కూడా ఇదొక పవిత్ర యజ్ఞం అని భావించి తామూ అందులో భాగాస్వాములవుతున్నందుకు అధికమైన సంతోషం తో ఇష్టపూర్తిగా అన్నీ అందజేసి ,అది తమ పని గా భావించి సహాయ పడేవారు .పంటలు చేతికొచ్చినప్పుడు రైతులు బాలంబ గారి సత్రం లో సరుకులు తోలుకొని వెళ్లి పడేసేవారు  మంగళ గిరి స్వామి తిరునాళ్ళకు వచ్చే అసంఖ్యాక భక్త జనాలకు సత్రం లో కమ్మని రుచికరమైన శుచికరమైన భోజనాన్ని వండించి దగ్గరుండి వడ్డింప జేసేవారు బాలాంబ గారు .1926లో బాలాంబ గారు ‘’మంగళ గిరి అన్న పూర్ణ సత్రం ‘’అనే పేరుతొ ఒక ధర్మ సంస్థను నెలకొల్పారు. అన్నదానం ఒక నిరంతర కార్య క్రమంగా మారిపోయింది .ఆమె కీర్తి ప్రతిష్టలు జిల్లాలు దాటి రాష్ట్రమంతా వ్యాపించాయి .

యోగిని బాలాంబ గారు

ఫల ప్రాప్తికోసం కాకుండా అన్నదానం ఒక కర్తవ్యమ్ గా భావించి చేస్తున్న బాలాంబ గారు కేవలం ఒక యోగిని లాగా నే జీవించారు .యోగం లో ఆమెకు కొన్ని అద్భుత శక్తులు అలవడ్డాయి .ఎన్నో మహత్తులు ప్రదర్శించేవారని చెప్పుకొనేవారు .గుంటూరు సీమ అంటేనే ఆ నాడు కరువు ప్రాంతం .మెట్టపంటలేకాని మాగాణి భూములు చాలా తక్కువ .ఇంట్లో ఉన్న బావి నుండి నీరు తోడాలంటేనే మంగళ గిరి కొండ అంత ఎత్తున్న పొడవైన చేంతాడు కావాల్సి వచ్చేది .ఎక్కడో పాతాళం లో ఉన్నట్లు నీరు బావిలో కనిపించేది .దాన్ని చిన్న బొక్కేనతో పైకి తోడాలంటే చేతులు అరిగిపో యేవి బుజాలు నొప్పి పుట్టేవి .ఒక బకెట్ నీరు లాగిన వాడు బాల చంద్రునితో సమాన పరాక్రమం గలవాడనే వారు .అదీ ఆనాటి  పరిస్తితి .ఎవరైనా పొడుగ్గా ఉంటె ‘’మంగళ గిరి చాంతాడంత ఉన్నాడు ‘’అనే సామెత లోకం లో బాగా ప్రచారమైంది .ఇవన్నీ బాలాంబ గారు స్వయం గా అనుభవించిన కష్టాలే .ప్రజల బాధ ,వారి కాలేకడుపులు ,గుక్కెడు మంచి నీటి కోసం అర్రులు చాచే దైన్యం చూసి చూసి ఆమె కడుపు తరుక్కు పోయేది .ఏదో చేయాలనే తపన మొదలై  అన్నదానం చేసి వారికి కనీసం రొజు అన్నం తినే యోగ్యం కలిగించాలన్న భావనే ఆమెను అన్నదాన సత్ర నిర్మాణానికి ప్రోత్సహించి ఇంతటి మహత్కార్యాన్ని చేయించింది .

బాలాంబ గారు చిన్నప్పటి నుంచీ పురాణాలు చదివి అర్ధం చేసుకొని పారాయణ  చేసేవారని చెప్పుకొన్నాం .ఇప్పడు వైధవ్యం ,దైవ భక్తికి తోడై అన్నదాన మహత్కార్యానికి దోహద పడింది .అందర్నీ తన ఆత్మీయులు గా చూసుకొనే మహత్తర ఆత్మ సంస్కారం వారికి అబ్బంది .బాలాంబ గారిని చూస్తె సంస్కృత శ్లోకం ఒకటి గుర్తుకు వస్తుంది –

‘’శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః –వక్తా శత సహశ్రేషు –దాతా భవతా వా నవా ‘’

అంటే-శూరుడనే వాడు వందల్లో ఒకడు ఉంటాడు .పండితుడు అనేవాడు వేలల్లో ఒకడే ఉంటాడు .వక్త లక్షల్లో ఒకడు ఉండచ్చు .కాని ‘’దాత ‘’అనే వాడు అసలు ఉంటాడో ఉండడో.అంటే దాత అనే వాడు లభించటం బహు అరుదు అని భావం .సంప్రదాయపు కట్టు బాట్లను అతిక్రమించి అన్నదానం అనే పవిత్ర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు .కరువు కాటకాతో అలమటించే బీదల కాలే కడుపులకు ఇంత అన్నం పెట్టి ఆదుకొన్న మరో అన్న పూర్ణ ,శాంతానికే శోభావైభవం బాలాంబ గారు .ఎవరి మెప్పుదలా మేహర్బానీకోసం చేసిన పనికాదు .ఆత్మ సంతృప్తికోసం  బాధితుల కన్నీరు తుడవటానికోసం ఆమె గారు చేసిన ఉడతంత సాయం .అదే మహద్భాగ్యం ఆ రోజుల్లో .అందుకే ఆమె మహా దాతల శ్రేణిలో చేరారు .నిరతాన్న దానం చేస్తూ ఆత్మ సంతృప్తి పొందుతూ దారిద్ర నారాయణ సేవతో పునీతమవుతూ జీవితాన్ని ధన్యం చేసుకొంటూ  భగవద్భక్తిలో తాదాత్మ్యం చెందుతూ 95ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా  గడిపి ,కైవారం బాలాంబ గారు 12-8-1944న మన స్వాతంత్ర్యం రావటానికి సరిగ్గా ఏడాది ముందు స్వర్గస్తులయ్యారు .’’అన్న దాతా సుఖీ భవ’’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.